ఒంగోలు కధలు: ఉద్యోగం పురుష లక్షణం.. (రెండవ భాగం) - పార్థు Back     Home  
మొదటి భాగం       ఈ పేజీ ని పంపండి
ప్రాజెక్ట్ లు మొదలుపెట్టిన రెండు రోజులకే ఇంకో చిక్కొచ్చి పడింది.

నేనున్న డివిజన్ "ఫింగర్ ప్రింటింగ్స్" ప్రాజెక్ట్ మీద చేస్తుండేవాళ్ళు. రాధా, రామయ్య లకి వచ్చింది PO, బిల్లింగ్ అప్లికేషన్స్, ఒరాకిల్ ఫారంస్ 3.0, డేటాబేస్ 6.0 లో. ప్రతాప్ ది ఒరాకిల్ ప్రాజెక్టే కాకపొతే వేరే డివిజన్ లో.

ఒక రోజు లంచ్ అవర్ లో ఇంకో తెలుసున్నోడు కనిపించాడు. "ఈరోజుల్లో ఇంకా C లో ప్రాజెక్ట్ చెయ్యడమేమిటీ, ఫ్యూచర్ లేని దాన్ని పట్టుకు వేలాడితే, నీకు మిగిలేది మెంటల్ టార్చరే. ఇప్పుడు అంతా డేటాబేస్, GUI ల విప్లవం, నువ్వు బావి లో కప్ప లా వుండిపోకూడదు అంటే, బెక బెక గెంతుకుంటూ త్వరగా బయటకు రావాలి లేదా చకచక మునిగిపోతావ్" అని భయపెట్టివెళ్ళాడు.

ఏరా! వాడిది రిక్వెస్టా, సజెషనా?" అని అడిగా.

"వార్నింగ్" చెప్పాడు వంగి బెల్టు సర్దుకుంటూ రామయ్య గాడు.

దీని కి తోడు, నన్ను మరింత భయపెట్టదానికన్నట్టు,

మేము తార్నాక బ్రిడ్జ్ మీదుగా మౌలాలి సైడ్ వస్తుంటే, పెద్ద పెద్ద బోర్డింగ్స్ కనిపించేవి, SQL Star వాడివి, SonaaTa, Aptech, NIIT, Frontier, SSIL లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లవి. అన్నిటి సారాంశం ఒకటే, "నేర్చుకోండి ఒరాకిల్, ఎగిరిపోండి విదేశాలకు" అంటూ విమానం బొమ్మలేసి కనిపిస్తుండేవి. వీళ్ళు ముగ్గురు చంకలు గుద్దేసుకునేవాళ్ళు. తార్నాక ఫ్లై-ఓవర్ కే గోల్డెన్ గేట్ ఎక్కేసినంత ఆనందపడిపోయే వాళ్ళు.

పైపెచ్చు, లంచ్ అవర్ లో వీళ్ళ బోడి వర్ణనలు.

"అబ్బ ఎంత బావుందో! అసలు మనమేం కోడ్ రాయక్కర్లా, అంతా అదే రాసేస్తుంది బుజ్జిముండ,మనం టే తాగుతూ కబుర్లు చెప్పుకోవటమే కాళ్ళు బార్లా జాపి" అన్నంత ఈజీ గా చెప్పే వాళ్ళు. నాకు కళ్ళ ముందు నా నల్ల స్క్రీన్ కనిపిస్తుండేది. పైపెచ్చు, అది ఫింగర్ ప్రింట్ ప్రాజెక్టేమో, హస్తం గుర్తు కి వోటెయ్యండి అన్నట్టు స్క్రీన్ అంతా అరచేతి చుక్కలు కనిపించేవి. ఆ గుండ్రటి రింగులు చూస్తుంటే, BV Pattabhiram దగ్గర కి హిప్నాటైజ్ చేయించుకోడాని కో, హస్తసాముద్రిక వాడి దగ్గర కి జాతకం చెప్పించుకోడానికో వచ్చినట్టు వుండేది. వాళ్ళ డేటా ఎంట్రీ స్క్రీన్ లన్నీ మాత్రం అప్పట్లో రామోజీ ఫిల్మ్ సిటీ లా వెలిగిపొతుండేవి.

ఇహ ఈ మనోవ్యధ తట్టుకోలేక, వీళ్ళ గ్రూప్ లోనే చేరాలని నిర్ణయించుకున్నాను.

మర్నాడు లంచ్ అవర్ లో...విషయం చెప్పా.

"ఒరేయ్! నీ ముందున్నవి రెండు" అన్నాడు రామయ్య గాడు.

"ఎక్కడ ఒకటే కదరా?" అన్నాడు రాధా గాడు నా ప్లేట్ వంక చూస్తూ.

"నేను చెప్పింది ప్లేట్ లో వేసిన పూరి ల గురించి కాదురా, వాడు పూర్తి చెయ్యాల్సిన పనుల గురించి" చెప్పాడు వాడు.

"నువ్వాగరా అని వాడ్ని కసిరి, ఏంటో చెప్పరా?" అన్నా.

"ముందు మా మానేజర్ దగ్గర వొప్పించాలి ఎంటర్ అవ్వడాని కి, రెండు మీ మానేజర్ ని వొప్పించాలి గెంటించుకోడానికి. ఏది ముందు చేస్తావ్?" అన్నాడు వాడు.

"గెంటించుకోడాని కి వీడేం చెయ్యక్కర్లా ప్రత్యేకించి నెక్స్ట్ వీక్ ఒక డెలివరబెల్ వుంది అది చాలు" అన్నాడు సందు దొరికింది కదా అని రాధా గాడు.

"కడుపుమంట తీర్చుకోవడాని కి ఇది రా సమయం?" అన్నాడు కూర కలుపుకుంటూ రామయ్య గాడు.

"అందుకే కదరా లంచ్ బ్రేక్ ఇచ్చింది?" అన్నాడు పచ్చడి పిసుకుతూ రాధా గాడు

టాపిక్ డైవర్ట్ అవుతోందని గ్రహించి, "నేను ఎలావొలా వొదిలించుకుంటా రా ఆయన్ని, మీరు కంఫర్మ్ చెయ్యండి చాలు" అన్నా.

"మొన్న మాస్టర్ స్క్రీన్స్ ఏవో కొత్తవచ్చాయ్ అన్నాడు గా, వీడు చేస్తాడు అని చెపుదాం లేరా" అన్నాడు రాధా గాడు.

"ఏవి? ID , Description ఎంటర్ చేసి save చెయ్యటం, ID ఎంటర్ చేసి, Description Display చేసి Delete చెయ్యటం, ఇవేగా? మొన్న మీరు చేసినవి కొన్ని చూశాలేరా" అన్నా.

"Design చెయ్యటాని కి అవతల డేటాబేస్ లేదు కాని, డెవలప్ చెయ్యడాని కి డేటా ఎంట్రీ స్క్రీన్ లు కావాలి అన్నాట్ట వెనుకటికెవడో" అన్నాడు రాధా గాడు.

"లేకపొతే Transaction స్క్రీన్స్ మీకూను, తొట్టి లో స్క్రీన్స్ నాకునా కుదరదు" అన్నా.

"మీ ఇద్దరి వాదన చూస్తుంటే, Design టైం లో డిస్కస్ చెయ్యాల్సిన దానికి Testing టైం లో తలబద్దలకొట్టుకున్నట్టు వుంది" అన్నాడు రామయ్య గాడు.

"నువ్వు చెప్పింది నాకేం అర్ధం కాలా" అన్నా.

"డబ్బింగ్ సినిమాల్లో అలానే చెపుతుంటారు ఒకోసారి"

"అయితే, ఇప్పుడు ఏమంటావ్?" అన్నా.

"నువ్వు ముందు రారా టేం లోకి మిగిలినవి అన్నీ అవే వస్తాయ్ ఆటోమాటిక్ గా" అన్నాడు వాడు.

నా గోల ఇలా వుటే..,

రాధా గాడు, ప్రతాప్ ల మధ్య పొటీ వేరే లా వుండేది.

ప్రొఫెషనల్ ప్లేయర్స్ పెద్ద పెద్ద బ్యాగులు తగిలించుకు తిరిగినట్టు , వాడు మాకు కనిపించిన ప్రతి సారి పెద్ద పెద్ద చార్ట్ లు పట్టుకుని హడావిడి గా తిరుగుతుండే వాడు కేవలం వీడ్ని భయపెట్టడాని కే అన్నట్టు.

వీడి కి కుతూహలం పెరిగి పోయి "ఏంట్రా అవి, ఏం చేస్తున్నారు మీ ప్రాజెక్టులో?" అనేవాడు.

నోటికి చిక్కాక కప్ప ను వదుల్తుందా కట్లపాము?.

"ఇవా! DFD లు రా, ఇవాళ ఈవినింగ్ ER డయాగ్రం లు గీస్తున్నా, రేపు ఫ్రై డే flow chart లేస్తున్నా, నాలుగు రోజుల్లో normalization మొత్తం నేనే చేస్తున్నా" అనేవాడు.

వీడి లో భయం తాలుకూ క్రీనీడలు స్పష్టం గా గోచరించేవి.

"వాడు అప్పుడే, నామరూపాల్లేకుండా డేటాబేస్ అంతా నార్మలైజేషన్ చేసిపారేస్తున్నాడు, మనం ఇంకా ఆర్గనైజేషన్ ని అండర్ స్టాండింగ్ చేసికునే స్టేజ్ లొనే వున్నామే" అని తెగ కుమిలిపోయి మరింత కమిలిపొయేవాడు.

వాడేమో పై ఫ్లోర్ లో బిల్డింగ్ లు కి ప్లాన్ గీస్తున్న ఇంజినీరు లా, మేమంతా లోయర్ లెవల్ లో రాళ్ళెత్తుతున్న కూలీల్లా ఊహించుకునేవాడు.

బిల్ల్ గేట్స్ ముందు వీడి కే ఎక్కడ చేసేస్తాడో H1B అన్నట్టు హైరానా పడిపొయేవాడు.

అలా వుండేది అక్కడ గోల.

ఇలాంటి అనారోగ్య పరిస్థుతుల మధ్య ఎట్టకేలకు, చిట్టచివరకి నేను C ని sea లో కలిపేసి, ఒరాకిల్ ocean లో మునిగిపొయా మా మానేజర్ కి ఆ మాట, ఈ మాట చెప్పి (అప్పట్నించే ఇంకా బాగా అలవాటయ్యాయి "కబుర్లు" చెప్పటం). అదే గ్రూప్ లో సినీ నటుడు జెన్నీ వుండేవారు. "చెల్లి కి మళ్ళీ పెళ్ళా?"...జెన్నీ. సెక్షన్ ఆఫీసర్ అనుకుంటా.

ఇహ ప్రాజెక్టు "3 ఇన్ పుట్ లు 6 అవుట్ పుట్" లా ఎంతో ఆహ్లాదకరం గా సాగిపోయింది.

ఆ తర్వాత ఎప్పుడూ, తార్నాక బ్రిడ్జ్ నన్ను భయపెట్టలా.

అలా ప్రాజెక్టు చేసి, ముప్పూటలా అన్నం పెట్టిన ECIL నుండి గెంటివేయబడటం తో..రామయ్య గాడు కనిపెట్టిన " సుందరకాండ" సూత్రం ప్రకారం, మగవాడి కి ప్రాజెక్ట్ పూర్తి అవగానే 75 మార్కులు, వుద్యోగం రాగానే 100 మర్కులు అని, ఇహ ఆ 100 తెచ్చుకొడాని కి తంటాలు మొదలయ్యాయి ఇంకో రకం గా.

* * *

vacation లు, convacation లు లాంటివి పూర్తి అయిన తర్వాత

ఒక శుభముహూర్తాన, viceroy హోటల్ నుడి ఊరేగింపుగా మొదలెట్టాం వేట.

మొదట 1, 2 interview లు "వాడేం చెపుతున్నడో వీడి కి తెలీదు-వీడేం చెపుతున్నడో వాడి కి తెలీదు" అన్న విభాగం లఒ కొట్టుకు పొయాయి.

"ఎవడ్రా! మొన్న సబ్జెక్ట్ వుంటే చాలు, ప్రెడికేట్ అక్కర్లేదు అంది" అన్నాడు గుంపు నుద్దేసించి రామయ్య గాడు.

"ముందు మనం communication మీద concentrate చెయ్యాల్రా" అన్నాడు రాధా గాడు

"ఇలా కాదు కాని, రేపటి నుండి Walt-Disney నవలలు చదివైనా సరే రెచ్చిపోతా" అన్నడు రామయ్య గాడు

"walt disney నవలలు రాయరురా, సినిమాలు తీస్తారు, " సరిచేసాడు వేణు గాడు

"మరి ఆ Disney ఎవరు?" గుర్తుచేసికోవడాని కి తెగ ప్రయత్నించాడు.

"Disney కాదు రా, Sidney Shelton " చెప్పాడు వేణు గాడు.

"ఆ అదే, సిడ్నీ షెల్టనో, కిడ్నీ క్లింటనో, వాళ్ళు రాసినవన్నీ చదివేస్తా, ఇరగదీస్తా" అన్నాడు రెట్టించిన ఉత్సాహం తో.

"ముందు నువ్వు హిందూ లో హెడ్ లైన్స్ ఒకటి తిన్న గా చదవరా, తర్వాత అవి చదువుదువ్ కాని" అన్నాడు ప్రతాప్ గాడు.

"అలాగే అనండ్రా, బ్రహ్మాండం గా నేర్చుకుంటా, 30 రోజుల్లో ఇంగ్లీష్ బాష ని తిరగ రాస్తా" అన్నాడు కొంచెం కోపం గా.

"నువ్వు కంగారుపడి అలా రాసేస్తే మరో ఉర్దూ లా అవుతుందేమో రా " అన్నాడు రాధ గాడు భయం నటిస్తూ.

"నవ్వండ్రా, నవ్విన నాపచేను పండుతుంది" అన్నాడు వాడు.

"వినటానికి ఓల్డ్ గా వుంది, ఇంకోటి చెప్పు" అన్నాడు వేణు గాడు.

"చిన్న సినిమానే ఒకోసారి పెద్ద హిట్ అవుతుంది" తనకిష్టమైన భాష లో చెప్పాడు వాడు.

* * *

కొద్దో, గొప్పో నోరు తిరగడం మొదలెట్టే సరికి, ఇంటర్వ్యూలు "పాటర్న్" తెలీక పోవడం మొదలెట్టాయ్.

"రాత్రంతా CJ Date లో డేటాబేస్ కాన్సెప్ట్స్, RS Pressman Software Engineering పై నుండి కింద దాక చదువుకొస్తే, వాడేంట్రా "కింద రూం లో 3 నల్ల పిల్లులు, పై రూం లో 2 ఎర్ర పిల్లులు వుంతే, మధ్య రూం లో 1 తెల్ల పిల్లి వుండే సంబావ్యత ఎంత అంటాడు" ? అన్నడు రామయ్య గాడు బయటకొచ్చి.

"నీది ఇంకా నయం ప్రాబబిలిటి question, ఏదో ఒకటి ఊహించి చెప్పొచ్చు, వేణు గాడి ది మరీ ఘోరం రెలటివిటీ question, నీటి సాపేక్ష సాంద్రత ఎంత అన్నాడట? ఎవరు చెపుతారా ఆస్సరు అని ఇందాకటి నుండి ఆపేక్ష గా చూస్తున్నాడు అందరి వంక" చెప్పాడు రాధా గాడు

అలా కొన్ని పొయేవి.

సబ్జెక్టు, కమ్యూనికేషన్ ఒక్కటే కాదురా, లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువ అడుగుతున్నరువీళ్ళు, మనం మళ్ళీ GMAT/GRE టైపు లో ప్రిపేర్ అవ్వలిరా అనుకున్నాం

కట్ చేస్తే ....

కోటి ఫుట్ పాత్ ల మీద సెకండ్ హాండ్ లొ చవకగా దొరికిన రీజనింగ్, ఆప్టిట్యూడ్, న్యూమెరికల్ అనాలిసిస్ బుక్ లన్నీ హోల్సేల్ లో కొనిపడేసాం.

మళ్ళీ మొదలైంది ఇంకో డైరెక్షన్ లో దండయాత్ర.

"రేయ్!, నేర్చుకోవాల్సిన లిస్ట్ పెరిగిపోతుందే కాని, చేర్చుకునే కంపనీ నే కనపడ్దం లేదురా " చెప్పాడు చిన్న గా రామయ్య గాడు.

"కాలమే అన్నిటి కి సమాధానం చెపుతుంది" అన్నాడు వేణు

"అంటే మనం గోడ మీద గడియారం వంక చూడాలా ప్రతి question కి?" మొహం పెద్దది చేసికుని అడిగాడు రామయ్య గాడు

"మీరు ఇలాంటి తిక్క తిక్క వాటి మీద దౄష్టి పెట్టబట్టే పక్క పక్క వాళ్ళందరి కి వస్తున్నాయ్, శేఖర్ కి విప్రో లొ వచ్చిందంట తెలుసా" చెప్పాడు ప్రతాప్

"వాడు ALIT లొ 40 వేలు కట్టి MF ట్రైనింగ్ తీసుకున్నాడమ్మా!.." సమర్ధించుకున్నాం.

"పొనీ మనం కూడా ఆ పని చేస్తే?" చెప్పాడు వేణు గాడు

"ఇప్పుడెళ్ళి ఇంట్లో 40,000 అడిగితే నరుకుతారు పల్నాడు లో వోడిపోయిన పందెంకోళ్ళని నరికినట్టు" చెప్పాడు రామయ్య గాడు.

ఆ ఆలోచనకి స్వస్తి చెప్పి మళ్ళీ హిందు, డెక్కన్ క్రానికల్ మీద దౄష్టి పెంచాం.

* * *

ఇది ఇలా వున్నా, ఇంటర్వ్యూ పేర్లు చెప్పుకుని ఇంటర్నేషనల్ హోటెల్స్ లో గడపడం మాత్రం భలే ఆనందం ఇచ్చేది.

కొంతకాలాని కి తాజ్ బంజారా లోనో, క్రిష్ణా ఒబరాయ్ లోనో గడపడం మామూలైపొయింది. ఎవర్నైనఆ కలవాలంటే "తాజ్" కొచ్చెయ్యరా అక్కడ కలుద్దాం అనేవాళ్ళం. టిప్పు టాప్ గా వచ్చేవాడు గేటు వరకు ప్రతి ఒక్కడు. అక్కడ నుండి మొదలయ్యేది అసలు వణుకు.

"పాయింటర్స్ మీద అడిగాడా? ఔటర్ జాయిన్స్ కూడా అడిగాడా" అని ఒక వర్గం కంగారుపడుతుంటే,

Ad సరిగ్గా చూసుకోకుండా ఆటో లోంచి దిగిన ఇంకో వర్గం "ఏంటి గురూ, వీడి కి 2 ఏళ్ళ ది కావాలా?, 4 ఏళ్ళది కావాల?" అంటూ backpack లొ భద్రపరచిన నిధినిక్షేపాలు బయటకి తీసేవాళ్ళు.

అంత కోలాహలం గా వుండేది వాతావరణం.. ఒకసారి

"ట్రిగ్గర్స్ మీద కూడా అడిగాడా?" బయటకొచ్చిన రాధ గాడ్ని ప్రశ్నించాడు లోపలికెడుతూ రామయ్య గాడు

"బెగ్గర్స్ గురించి అడగడాని కి వాడేమన్నా లోపల అన్నదానాలు చేస్తున్నాడా? చురకేసాడు వేణు గాడు

"pass by value, pass by reference అంటే తెలీదని చెప్పావా?" అన్నాడు కొద్ది పాటి హేళన గా ప్రతాప్ గాడు

"నీకు తెలిసింది లేరా పెద్ద! MCA మొదటి రోజు లాబ్ లో రకరకాల షేప్ లో వున్న CPU లు చూసి, అడ్డం గా పడుకోబెడితే DOS, నిలువుగా నించోబెడితే UNIX ఆ అనలా?" గుర్తు చేసాడు రాధ గాడు

"అది వేరు, ఇది వేరు రా.." అన్నాడు తొట్రు పడుతూ ప్రతాప్ గాడు

"రెండూ ఒకటే రా... మిడిమిడి జ్ఞానం..." అన్నాడు రాధా గాడు ఈజీ గా తీసికుంటూ

"అజ్ఞానమేమో? ఎందుకైన మంచిది మరొక్క సారి ఆలోచించకూడదు" భుజం మీద చెయ్యేసి చెప్పాడు వేణు గాడు చిన్న గా నవ్వుతూ.

అలా సాగాయ్ మొదటి 2,3 నెలలు...

ఈ మధ్య లో చుట్టుపక్కల వాళ్ళ సానుభూతి మరో అనుభూతి.

"మా తెలిసున్న వాళ్ళ పిల్లాడు MCA యేనే, రేపు సింగపూర్ వెడుతున్నాడు, అదేంటమ్మా కంపనీ! భలే గమ్మత్తు గా వుంటుంది బురిడీ నో, గారడీ నో "

"SquareD బామ్మ" పక్కనుండి మనవడి అందింపు.

"పొనీ గోధుమ వర్ణం వుంగరం వేలికి, కుంకుమ వర్ణం కడియం కాలికి తొడగండి, తన్నుకుంటూ వస్తాయ్"

"ఏంటి కురుపులా?" అనే వాడు రామయ్య గాడు చెపితే

అలా కొన్ని వుచిత సలహాలు, ఊరడింపులు మరో పక్క నుండి.

ప్రతి ఇంటర్వ్యూ ఒక గుణపాటం, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం, హోటల్ మెట్లు ఎక్కుతూ, ఆటో లు దిగుతూ, జ్ఞానం పెంచాం ఓ 6 నెలల్లో.

ఎవడో ఇచ్చాడు సలహా, "IQ ని ఒక్కటే నమ్ముకోకు, FAQ లు అమ్ముతారు చూడు" అని

అంతే ప్రతాప్ గాడు మాయాదర్పనం తీసాడు బయటకి.

"సెప్పవే సెప్పు, ఏడనున్నడే భేతాళుడు question bank ఎట్టుకుని?" అన్నాడు

విక్రమార్కుడు బదులు పలికాడు.

"రేయ్! ఫలాన యూనివర్సిటి క్యాంపస్ లొ వున్నాడు రా వాడు, వాడి దగ్గర అన్ని కంపనీ ల questions వున్నాయట" చెప్పాడు

"question లు అందరి దగ్గర వుంటాయ్ రా, ఆన్సర్ లే రా ముఖ్యం, ఇప్పుడు మళ్ళీ ఇంకోడి దగ్గరకెళ్ళాల వాటి కోసం? బదులు ప్రశ్నించాడు రామయ్య గాడు

కోపం గా చూస్తూ, "అవి ప్రిపేర్ అయితే చాలు రా!, సగం ఇంటర్వ్యూ దున్నేయ్యొచ్చు, మిగతా సగం ఎవరి స్వయంకౄషి వాడిది" అన్నాడు ప్రతాప్

"అంతా అనుకున్నట్టు జరిగితే భలే వుంటుంది రా" అన్నాడు అనందపడిపోతూ రాధా గాడు

"మరి వాడు చెప్పినవి రాకపోతేనో?" అన్నాడు వేణు గాడు

"ఎవడి స్వయంకౄతాపరాధం వాడిది......., కదరా?" చూసాడు ప్రతాప్ వంక రామయ్య గాడు

"సరే ముందు సంపాదించండి రా" అన్నా నేను

అవి చేతి లొ పడ్డ తర్వాత జ్ఞానం మరింత వౄద్ది చెందింది.

ఆ తర్వాత ఎంతో కాలం పట్టలా.

ఒ శుభముహుర్తాన, MNC వాడి కంట్లో కారం కొట్టి చెన్నై లో నేను, CMC నొట్లో మట్టికొట్టి HYD లో వీళ్ళు జాయిన్ అయిపోవడం తో మిగిలిన ఆ 25 మార్కులు కూడా వచ్చాయ్.

ఎవరు కనిపెట్టాడో కాని ఈ సామెత ("వుద్యోగం పురుష..") మా మెదదు మేసేసింది అలా .

ఓ...నెల రోజుల తర్వాత, ఫొన్ వొచ్చింది, రామయ్య గాడు లైన్ లో.

"రేయ్! అదేదో TaanDem మైన్ ఫ్రేం అంట్రా , ట్రైనింగ్ ఇచ్చి దానిలో పడేసారు మమ్మల్ని, పచ్చ పచ్చ గా వుంది రా అంతా" వాపొయాడు.

లోపల ఏడుస్తూ, పైకి నవ్వుతూ, "మరి నీ సంగతేంటి? " అన్నాడు.

"A/C థియేటర్ కెళ్ళినా , మూసీ కంపు తప్పలేదని, మళ్ళీ C లో రా" అన్నా.

గాస్ సిలిండర్ పేలిన శబ్దం అవతల.. నవ్వటం ఆపి అడిగాడు

"అయితే మళ్ళీ చుక్కల చిక్కులేనా నీకు?"

"చిన్న చేంజ్, చిక్కులు మనకి, ఈ సారి చుక్కలు క్లైంట్ కి" చెప్పా requirements డాక్యుమెంట్ రిఫర్ చేస్తూ.

అప్పటి నుండి మొదలైంది మరో "కిష్కిందపర్వం"..... క్లైంట్ల తో .

మరెప్పుడైనా...

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత పార్థు కి తెలియ చేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.