ఉద్యోగం పురుష లక్షణం (ఒంగోలు కధలు - 14): పార్థూ Back   Home 
రెండవ భాగం      ఈ పేజీ ని పంపండి

ఈ కధ కీ ఒంగోలు కీ ఎలాంటి సంబంధమూ లేదు, అయినా ఆ జ్ఞాపకాల దొంతర లోనే దీన్నీ ఇరికించాలని ఇక్కడ జరిగింది.

కధలోకి వస్తే, 1995 నాటి మాట. ఇంకో నెల రోజుల్లో ప్రోజెక్ట్ చెయ్యటానికి ఎక్కడో చోట చేరాలి అన్నప్పటి నుండి మొదలయ్యాయి ఆరాలు, ఆదుర్దాలు.

"వరప్రసాద్ కి CMC లో వచ్చేసిందిట, వాళ్ళ మావయ్యవల్ల. ప్రోజెక్ట్ అయిపోవటం తోనే జాబ్ లోకి కూడా తీసేసుకుంటారుట" మోసుకొచ్చాడు ప్రతాప్ గాడు.

"స్టార్టింగ్ 6 వేలు అంట.." మంట కూడా పెట్టాడు.

మాకు ప్రోజెక్ట్ రాలేదన్న కసి కన్నా, వాడికి ఏకంగా జాబ్ వచ్చింది అన్న న్యూసే బాధించటం మొదలెట్టింది.

"మా బాబాయి గారికి చెప్పా. ECIL లో చూస్తున్నారు. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే" చెప్పా.

"నాకు సిటీస్ లో ఎవరూ లేరు, అర్థం కావడం లా, ఏం చెయ్యాలో" వాపోయాడు రాధా గాడు.

"ఒక పని చేస్తే, మా బావ ఫ్రెండ్ (మల్లిఖార్జున) శ్రీవెన్ లో పని చేస్తున్నాడు, అతని ద్వారా ప్రయత్నిద్దామా?" ఉప్పందించాడు ప్రతాప్ గాడు.

"సరే, అయితే అందరం హైదరాబాద్ వెళ్ళి, 2,3 రోజులు తిరిగైనా ఏదో ఒకటి సెటిల్ చేసికొద్దాం రా" అన్నాడు రామయ్య గాడు.

"ఏరా! నిజం గా ప్రోజెక్ట్ కోసమేనా?" నిలదీసా వాడ్ని.

"పుణ్యం, పురుషార్థం, రెండూను, వినటమే కానీ ఎప్పుడూ చూడలేదురా RTC X roads.." చెప్పాడు చిన్నగా.

"ఎవరైనా టాంక్ బండో, బిర్లా మందిరో చూడాలని తపిస్తారు ఈ RTC గోలేంట్రా బాబు" అన్నాడు విషయం తెలియని అశ్విన్.

"మరి అక్కడే కదా దేవి ఉంది" అన్నాడు వీడు.

"మీ అత్త కూతురా, పాత లవరా?" మళ్ళీ అడిగాడు విషయం తెలియని సన్నాసి.

"వాళ్ళే కాదు, సుదర్శన్, సంధ్య కూడా ఉన్నారు" మరింత క్లూ ఇచ్చాడు వీడు.

అస్సాం లాంటి అటవీ ప్రాంతం నుండి వచ్చిన అశ్విన్ కి అర్థం కాలా.

"అవి ధియేటర్లు రా.. " చెప్పాడు వేణుగోపాల్ గాడు.

"ఏంటి, అక్కడ కూడా చెయ్యొచ్చా MCA వాళ్ళు ప్రోజెక్ట్ లు?" ఉత్సాహం కనపరచాడు అశ్విన్.

"MCA, MS అన్న పట్టా పట్టింపులు లేకుండా అందరికీ ఒకే రకం గా పట్టం కట్టేది అక్కడే" చెప్పాడు చేతి మీద వెంట్రుకలు బలం గా పీక్కుంటూ రామయ్య గాడు.

"నోరు మూసుకుని కూర్చోండి, ఇవతల నేను ప్లాన్ వేస్తున్నా" అరిచాడు ప్రతాప్.

ప్లాన్ చెప్పడం పూర్తి అయింది...

* * *

అందరం పెట్టెలుచ్చుకుని హైదరాబాద్ లో దిగాం.

"ఈవెనింగ్ 3pm కి మళ్ళీ లకడీకాపూల్ బస్ స్టాప్ లో కలవాలి, 5pm కల్లా మల్లి బయటకొస్తా అన్నాడు ఆఫీస్ అయిపోయి" చెప్పాడు ప్రతాప్.

ఎవరి చుట్టాలిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. రాధా గాడు, రామయ్య లాడ్జ్ తీసుకున్నారు.

అనుకున్న సమయానికి మల్లి బయటకొచ్చాడు.. విషయాన్ని విన్నవించాం మరోసారి.

దగ్గరలో ఉన్న ఇరానీ హోటెల్ కి తీసుకెళ్ళాడు. కప్పు పక్కన పెడుతూ, చిన్నగా దగ్గి, గొంతు సవరించుకున్నాడు.

"ఓస్ ఇంతేనా!! ఈ మాత్రం దానికే మీరు గోదావరి ఈదుకుంటూ (జెనరల్ లో వచ్చాం లెండి) వచ్చేయాలా? మా మేనేజర్ తో చెప్పి మీ అందరికీ సాయంత్రం కల్లా ప్రోజెక్టు లేం ఖర్మ, ఏకం గా ఉద్యోగాలే ఇప్పించేస్తా.. " అని చెపుతాడేమో అని మేమంతా ఆశ గా చూసాము.

ఒక్క క్షణం నిశ్శబ్దం..

"మీరందరూ ముందు మంచి షూలు కొనుక్కోవాలి" చెప్పాడు, మా అందరి కాళ్ళ వంకా కంపరం గా చూస్తూ.

"పోజెక్టు కీ, చెప్పులకీ ఏంటి సార్ సంబంధం? అయినా ఇవి షోలాపూర్ చెప్పులు సార్, మా అమలాపురం తిరనాళ్ళలో కొన్నాను." నిలేసాడు నిస్సంకోచం గా వేణు గాడు.

"ఇంకా అయిపోలేదు ఆగు. టైలు కొనుక్కుని, టిప్ టాప్ గా తయారవ్వాలి లేదా మైత్రీవనం లో మొక్కల్లాగే మిగిలిపోతారు" భయపెట్టాడు చిక్కడపల్లి మల్లి.

"మేము ఆల్రెడీ వచ్చేసాం.. కాబట్టి నువ్వు చచ్చినట్టు ఇచ్చి తీరాల్సిందే నీ కంపెనీ లో ప్రోజెక్ట్" అని ఇలా కమాండింగ్ గా రాయకూడదు, ఇక్కడ రెజ్యూమ్ అంటారు. ఫార్మాట్ ఇస్తాను. అలా ప్రిపేర్ చేయించుకొని, ఓ 10 కాపీలు పైన పట్టుకొని రేప్పొద్దున్నే రండి" చెప్పాడు టీ జుర్రుకుని, బస్సెక్కి జారుకుని.

* * *

"అంటే.. ఇదే మేటర్ ని మీ అందరి ఊర్లూ పేర్లూ మార్చి టైపు చెయ్యాలా?" అడిగాడు అనుమానం గా కంప్యూటర్ సెంటర్ ఓనరు ఖైరతాబాదు లో.

"నే చెప్పానా, ఇలాంటి మతలబులు ఇక్కడ చాలా ఈజీ గా చేసేస్తారు అని" పని అయినందుకు ఆనందపడిపోతూ ప్రతాప్.

"నా దగ్గర మామూలు పేపర్ లు లేవు. బాండ్ షీట్లే ఉన్నాయి. రేట్ ఎక్కువ అవుతుంది" చెప్పాడు తన అంచనా నిజమైన సంబడం లో షాప్ వాడు.

"ఆరు వేల ఉద్యోగం రావాలంటే ఈ మాత్రం తప్పదు.." షాప్ ఆఖరి మెట్టు అంచున దిగి నుంచున్న మాకు సర్ది చెప్పాడు ప్రతాప్ గాడు.

"పోనీలేరా! ఒకసారి బ్లాక్ లో కొన్నాం అనుకుందాం టికెట్లు" వత్తి అందించాడు రామయ్యగాడు.

అలా మొదటి రెజ్యూమ్ తయ్యారయ్యింది. దాన్ని రెండు వైపులా తృప్తిగా తడిమి చూసుకున్నారు అందరూ.

"దీనికే ఇంత ఆనందపడిపోతున్నాడు, రేపు ఏ Optima వాడో IMR వాడో ఆఫర్ ఇస్తే టపా కట్టేస్తాడేమో" చెప్పాడు రాధా గురించి రామయ్యగాడు.

"రేయ్! పదండ్రా ఇంకా టైలు, షూలు కొనాలి కొంత మంది. టైము లేదు." అంటూ తొందర పెట్టాడు టీమ్ లీడ్ ప్రతాప్ గాడు.

* * *

"ఎవరు మీరు?" బాండ్ మేళం లా, అంతా ఒకే రకం టైలు, షూలు కట్టుకుని ఎదురుగా నిలబడ్డ మమ్మల్ని ప్రశ్నించాడు ఒక ఆఫీసు ముందు గేట్ కీపర్.

"రెజ్యూమ్ లా? అక్కడ బాక్స్ లో పడేసి వెళ్లండి" చెప్పిందో రెసెప్షనిస్టు.

"మేం ప్రోజెక్టు లు ఎవరికీ ఇవ్వం. ఎవరివీ చెయ్యం" చెప్పాడు చిరాగ్గా సిస్టమ్స్ కి బూజులు దులుపుతూ ఓ కో-ఆర్డినేటర్.

"అసలు ప్రోజెక్టు అంటే ఏమిటి, ఏం చెయ్యాలనుకుంటున్నారు?" కూచోపెట్టి అడిగాడు ఓ కంపెనీ MD.

"ఆటోమేట్ చేస్తాం సార్" చెప్పాం అందరం.

"డైనమేట్ పేలుస్తాం" అన్నట్టు అనిపించిందో ఏమో అంతే, "దేన్ని చేస్తారు" అడిగాడు ఆయన ఖంగారు పడి కుర్చీలోంచి లేస్తూ.

"ఇందాకటి జవాబు నచ్చినట్టు లేదు ఈయనకి" అని, "ప్రోగ్రామింగ్ చేస్తాం సార్" అని ఒకడు, "కంప్యూటరైజ్ చేస్తాం సార్" అని ఇంకోడు ఇష్టమొచ్చినట్టు అరవసాగాం.

"ఏదో చేస్తాం అంటున్నారే కానీ, వీళ్ళు ఎలాంటి అఘాయిత్యం చెయ్యబోవటం లేదు ఇప్పుడు" అన్నడి ఆయన రూడీ చేసుకున్నాక, "ఇలాంటి పరిస్థితులలో నేను ప్రోజెక్టు అయితే ఇచ్చుకోలేను గానీ, ఓ సలహా మాత్రం ఇవ్వగలను మీరు పుచ్చుకుంటానంటే" అన్నాడాయన మా వంక వేడుకోలుగా చూస్తూ.

"చెప్పండి సార్!" అన్నాట్టు తలలు ఊపాం.

"మీరు ఏమైనా చెయ్యండి, ఎక్కడైనా చెయ్యండి, ఎప్పుడైనా చెయ్యండి, కానీ మాట రాకుండా చెయ్యండి" అని చెప్పి చక్కా లేచిపోయాడు సీట్ లోంచి.

"మనల్ని తీసిపారేసాడు రా ఈయన" బాధ పడిపోయాడు ప్రతాప్ గాడు. ప్రోజెక్ట్ రాదేమో అన్నంత దిగులుగా.

"నీ మొఖం, ఏం చేసినా మాట రాకుండా చెయ్యండి అంటే, మీరు అరుస్తున్నారు గుంపు గా, అరవకుండా చెయ్యాలి ప్రోజెక్ట్ గుట్టుగా" అని అర్థం లేరా ఊరడించాడు రామయ్యగాడు.

లంచ్ బ్రేక్ లో మళ్ళీ కలిసాడు "మాయదారి" మల్లి.

"ఏం పర్లేదు, Frontier, Softstar, Softpro, Indotronix, Kemex ఇంకా చాలా ఉన్నాయ్, వచ్చేస్తుంది లే" ధైర్యం చెప్పాడు బిల్లు పే చేసి లిఫ్ట్ లోకి నడుస్తూ.

"ఏంటి వచ్చేది? గ్రౌండ్ ఫ్లోరా?" గొణిగాడు వేణు గాడు.

"అన్ని కంపెనీలు గురిచి చెపుతాడు గానీ శ్రీవెన్ సంగతి మాత్రం తేల్చడు చూడు" సణిగాడు చెవిలో రామయ్యగాడు.

కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సల ఆపరేషన్ కు పాంప్లెట్ లు పంచినట్టు, ప్రతి గుమ్మం ఎక్కుతూ, దిగుతూ రెజ్యూమ్ లు పంచిపెట్టాం తర్వాత. దయగల ధర్మప్రభువులు ఒకళ్ళిద్దరు లోపలకి పిలిచి కొన్ని ప్రశ్నలు వేసి పంపించారు కనీసం.

"ఏంటి రామయ్యా! దీర్ఘం గా ఆలోచిస్తున్నావ్? ప్రోజెక్టు కీ, ఉద్యోగానికీ ఏం మంత్రం వేద్దామనా? కాస్త హుషారు చేద్దమని అడిగాడు వేణు గాడు.

"ఇక్కడ నుండి ఎంత త్వరగా బయటపడదామా అని" చెప్పాడు వీడు.

"ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈసారి లోపలకెళ్ళకుండా ఉంటే సరి" అన్నాడు వాడు.

"బాగా చెప్పావ్! రేయ్, నేను OUT! కావల్సొస్తే మీరు వెళ్లండి" అన్నాడు వీడు.

"రారా! ఏ కంపెనీ లో ఏ ప్రోజెక్టు ఉందో ఎవరికి తెలుసు?" అన్నాడు రాధ గాడు.

"ఏ ధియేటర్ లో ఏ సినిమా ఉందో చెప్పొచ్చు కానీ ఇది కష్టం రా, ఇలా లాభం లేదు కానీ, మా ఊరి MLA చేత రికమండేషన్ తెప్పించైనా సరే, CMC లోనో ECIL లోనో, BHEL లోనో సంపాదిస్తా, వస్తా" అంటూ వెళ్ళిపోయాడు వడివడిగా అడుగులేసుకుంటూ విసుగెత్తిన రామయ్యగాడు.

"వస్తా అని ఇటు వెళ్ళాడేమిటి?" అడిగాడు అర్థం కాని అశ్విన్.

"RTC X రోడ్స్ వైపు", చెప్పా వాడి అంతిమ ధ్యేయం తెలిసిన నేను.

ఇక లాభం లేదని అందరం ఎవరి దారి వారు చూసుకున్నాం.

* * *

ఒక నెల తరువాత..

వేణుగాడికీ, అశ్విన్ కీ ప్రోజెక్ట్ లు CMC, DRDL లో దొరికినట్టు కబురందటం తో కలకలం మొదలయ్యింది.

"రేయ్! బాబాయ్ గారు ఫోన్ చేసారు, ECIL లో కన్ఫర్మ్ అయిందిట ప్రోజెక్ట్" చెప్పారు నాన్నగారు.

"నాకు ఇంకా రాలేదురా, బెంగుళూరు లో ట్రయ్ చేసుకుంటా, ప్రతాప్ గాడు వెళ్ళాడుగా ఆల్రెడీ Novasoft లోనో, IMR లోనో చాన్స్ ఉంది అని, చూస్తా ఏమన్నా వస్తుందేమో" అని రాధా వెళ్ళాడు.

హైదరాబాదు చేరి పిన్నీ వాళ్ళింట్లో ఉంటున్న నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది.. రామయ్య లైన్ లో..

"MLA నా మజాకానా? నేను వస్తున్నారా రేపటి నుండి.." అన్నాడు ఆనందం గా.

చేరాం ఇద్దరం ECIL లొ, కాకపోతే చెరో గ్రూప్.

రాధా కి బెంగుళూరు లో కూడా పని అవ్వక హైదరాబాదు చేరుకున్నాడు మళ్ళీ. ఎవరో తెలిసిన వాళ్ళు NRSI లో ఇప్పిస్తాం అన్నారుట. అలా దాని కోసం వెళితే, అక్కడ ఇప్పించలేకపోయినందుకు ఆ తెలుసున్నాయన అష్టకష్టాలు పడి ECIL లో ఇప్పించాడు.

ఉడికించటానికి రామయ్యగాడు "ఏరా! ఇది ECIL అనుకుంటున్నారా, అమితాబ్ బచ్చన్ ABCL అనుకుంటున్నారా, ప్రతోడు వచ్చేయ్యటమేనా?" అనేవాడు.

ఓ నాలుగైదు రోజులు గడ్చిన తరువాత..

"ఏరా! వీడు సీట్లో లేడు ఎక్కడకెళ్ళాడు?" అడిగా

"గేట్లోంచి కాల్ వచ్చింది. చూడ్డానికి వెళ్ళాడు." చెప్పాడు రామయ్యగాడు.

"అదేదో పెద్ద బిల్ గేట్స్ నుండి వచ్చినట్టు చెప్పావే, ECIL గేట్ కే అంత బిల్డప్పా, పద చూసొద్దాం" అన్నా.

ఎదురుగుండా "కోఠీ లో కొన్న టోపీ తో, బేగంపేట లో బేరమాడి కొన్న బూట్లతో, తూట్లు పొడిచేసినా, లేచి ఫైట్లు చేసే తెలుగు సినిమా హీరో లా నవ్వుతూ కనిపించాడు ప్రతాప్ గాడు.

చేతిలో మెర మెర మెరుస్తూ నీలి రంగు ఫైలు "భారత ప్రభుత్వ అంతరంగ.." అర్థమైపోయింది.

"రంగ రంగా! వీడూ ఇక్కడికే దాపురించాడా?" నవ్వుతూ ఎదురెళ్ళాడు రామయ్యగాడు.

డబ్బులు ఎదురు కట్టి మరీ ప్రోజెక్టు చేసుకునే సౌకర్యం కూడా ఉంది అన్న వార్త ఆధారం చేసుకుని కోట లోకి జొరబడ్డాడు వాడు కూడా.

ఇహ, అక్కడనుండీ మొదలయ్యాయి సిసలు కష్టాలు అసలు ఉద్యోగానికి.

వచ్చేవారం...

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.