|
ఈ మధ్య టెలివిజన్ లో వస్తున్న సినిమాలు చూస్తుంటే ఒకోసారి పిల్లల తలితండ్రులు చాలా
ఇబ్బందులని ఎదుర్కోవలసి వస్తూ వుంటుంది. ఆ కార్యక్రమాలలో వచ్చే అశ్లీల దృశ్యాలు
పిల్లలు చూడటానికి తగవని తెలుసు. అలాగని వారి కోసం తామూ చూడటం మానుకోలేరు.. మరి
ఏమిటి దారి?? విదేశీ కార్యక్రమాలూ, సినిమాలూ అయితే ఇక చెప్పనక్కరలేదు. వాటిలో ఈ
అశ్లీల దృశ్యాల పాలు కొంచెం ఎక్కువే (మన భారతీయులకి).
నాకు తెలిసిన ఒక కుటుంబం వుంది. వారికి ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి టీనేజ్ లోకి
ఇప్పుడే వచ్చింది. ఆవిడ పిల్లలని సాధ్యమైనంత కంట్రోల్ లో పెట్టాలని
ప్రయత్నిస్తూవుంటారు. టెలివిజన్ లో పైన చెప్పుకున్న వంటి scenes వచ్చినప్పుడు ఆవిడ
పిల్లల వైపు ఉరిమి చూసి..
"ఊఁ.. తిరుగటు!" అంటారు.
వెంటనే పిల్లలిద్దరూ టెలివిజన్ నుంచి మొఖం తిప్పుకోవాలి. ఆవిడ ఆ సీన్ చూసి, లేక మరీ
శృతి మించినదైతే (అంటే sex scene అయితే) చానెల్ మార్చి, అది అయిపోయాక వాళ్ళని
టెలివిజన్ చూడనిస్తారు. పిల్లలిద్దరూ సాధారణంగా ఆవిడ చెప్పినట్టు చేస్తారు.. కానీ
వాళ్ళిద్దరూ వాళ్ళలో వాళ్ళు తగవులాడుకుంటే రెండోవాళ్ళ మీద తమ కసి తీర్చుకోవటానికి
"అమ్మా! చూస్తోందమ్మా!!" అని పితూరీలు చెప్తూవుంటారు. ఈ సంఘటన బయటవాళ్ళకి తమాషాగా
వున్నా, పాపం ఆవిడ బాధ అర్థం చేసుకోతగ్గదే!
* * *
మా చిన్నప్పుడు వచ్చిన సినిమాల్లో మరీ సినిమాలు ఇంత ఆబ్వియస్ గా వుండేవి కావు. పాపం
కిస్ చేయాలన్నా చెట్ల చాటుకి వెళ్ళిపోయేవారు పాత్రధారులు. వాళ్ళ ముందున్న ఆ
చెట్టునో.. లేక బుడగల గుత్తినో (చెట్లకి రీప్లేస్మెంట్!!) గట్టిగా కదిపేసి దాని
వెనుక వాళ్ళెదో ఘనకార్యం చేస్తున్నారన్న అభిప్రాయం మనకి మన దర్శకులు కలిగించేవారు.
మేము ముగ్గురు అక్కచెల్లెళ్ళం వెర్రోళ్ళం! మా అమ్మగారు సినిమా చూసొచ్చి కధ బాగా
చెప్పేవారు. సినిమా చూడటం కన్నా మా ముగ్గురికీ మా అమ్మగారు, నాన్నగారూ (ఆయన మా
అమ్మగారు మర్చిపోయిన పాయింట్లు ఆమెకి గుర్తు చేసేవారు!) చెప్పే కధల బాగా నచ్చేవి.
చక్కగా మాకు భోజనాలు పెడుతూ మా అమ్మగారు కధ చెప్పేవారు. మేమూ చూస్తే ఇంక కధ
చెప్పేవారు కాదు. అయినా ఒకోసారి మాకు అర్థం కాలేదంటూ చూసిన సినిమా కధనే మా
అమ్మగారిచేత మళ్ళీ చెప్పించుకొని వినేవాళ్ళం. ఈ కధల కోసం సినిమాకి రమ్మన్నా రాము
అనేవాళ్ళం. ఇది టెలివిజన్ లేని క్రితం. ఏమైనా రేప్ ట్విస్ట్లు కధలో వుంటే మా
అమ్మగారు కన్వీనియంట్ గా వాటిని చెప్పటం తప్పించేవారు. తరువాత మేము పెద్దయ్యాక తను
కధలు చెప్పిన సినిమాలు చూసినప్పుడు ఎంతో నవ్వు వచ్చేది. కధకి సాధారణంగా ముఖ్యమైన ఈ
ట్విస్ట్ లు చెప్పకపోవటం వలన మాకు కధ కన్విన్సింగ్ గా అనిపించేది కాదు.. ముగ్గురం
మా వాళ్ళని ప్రశ్నలతో తెగ యిబ్బంది పెట్టేవాళ్ళం!
మా ఫ్రెండ్ ఒకమ్మాయి వుండేది. ఇద్దరమూ స్కూల్ నుంచి కాలేజ్ వరకూ కలిసే చదివాము. తను
మేము డిగ్రీ కి వచ్చేవరకూ ఒక్క సినిమా కూడా చూడలేదు. దానికి కారణం ఆమె తల్లి
తండ్రులు అది చాలా చెడ్డ పని అని చెప్పటం వలన ట!! మేము friends అంతా ఎంత
బ్రతిమాలినా, బెదిరించినా.. సినిమాకి వచ్చేది కాదు. మమ్మల్ని మా ఇళ్ళల్లో అలా "ఇది
చేయద్దు".. "అది చూడద్దు" అని కట్టడి చేస్తే.. కోతి మనసు అదే చేయమంటూ గొడవ
చేస్తుంది. ఆఖరికి మేమంతా డిగ్రీ రిజల్ట్స్ వచ్చి పాస్ అయ్యామని తెలిసిన రోజు ఆమె
వ్రత భంగం చేసాం.
"తప్పదు.. మన ఫ్రెండ్ షిప్ కోసం" అని మొత్తానికి ఆమె చేత ఆ ఘోరాపరాధం చేయించేశాం!
ఏమిటీ తరువాత ఆమె సినిమాలు చూసిందా అని అడుగుతున్నారా?? ఊహించండి!! లేదు పాపం చాలా
రోజులు చూడలేదు. తను సినిమా చూసిన సంగతి ఇంట్లో చెప్పి.. వాళ్ళ అమ్మగారు తిట్టక
పోయేసరికి.. అప్పుడు చూసింది.
పాటల విష్యంలో మమ్మల్ని.. ముఖ్యంగా నన్ను కంట్రోల్ చేయటం పాపం మా అమ్మగారికీ
రాలేదు. కొన్ని పాటలు అప్పుడు నేను పాడుతుంటే మా అమ్మగారికి నిజంగా కోపం నశాళానికి
అంటేది. వాటిలో ముఖ్యమైనవి..
"నీ మీద నాకు ఇదయ్యో" (రాక్షసుడు)
"నీకు నాకు వున్న లింకు ఈడదో సెప్పలేను" (రక్షణ)
"ఏందిబే.. ఎట్టాగ వుంది ఒళ్ళు" (ఘరానా మొగుడు)
ఇంకా ఎవో వున్నాయి. కానీ అవిప్పుడు గుర్తు రావట్లేదు. ఇప్పుడు వీటిని వింటే వల్గర్
పాటలు అని చిన్నచూపు చూస్తాను!!! అప్పుడు నాకు ఈ పాటల ట్యూన్లు నచ్చాయి.. లిరిక్స్
ఎలా వుంటే నాకెందుకూ అని వాదించేదాన్ని. ఈ పాటలు పాడటం ఎక్కడ సరీగా రాదో అని..
వాటిని రాసుకొని మరీ మా అమ్మగారి సహనాన్ని పరీక్షిస్తూ పాడేదాన్ని! ఇప్పుడు ఈ పాటలు
మళ్ళీ Napster, Morpheus లలో దొరికి వాటిని మా ఫ్రెండ్స్ కి వినిపించి మా
అమ్మగారిని విసిగించిన సంగతి చెప్తే నవ్వుతారు.
ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఒక కల్చర్ పోలీస్ లాగ టెలివిజన్ పోలీస్ లాంటిది!! చిన్న
పిల్లలు ఎవరైనా టెలివిజన్ దగ్గర వుండగా టెలివిజన్ లో ఏవైనా అభ్యంతరకరమైన దృశ్యాలు
వస్తే.. గబ గబా రిమోట్ మీదకి దాడి చేసి ఛానెల్ మార్చేస్తుంది.
మా ఇంట్లో అందరికీ కూడా హారర్ సినిమాలంటే ఇష్టం. సాధారణంగా మంచి హారర్ సినిమాలు
ఇంగ్లీష్ లోనే వున్నాయి. మన తెలుగు, హిందీ లో వున్నవి (చాలా వరకు) చాలా చీప్ సెక్సీ
సీన్లతో వుండేవి. వాటిని అందరూ కలిసి చూడటం కొంచెం ఇబ్బందిగా వుండేది. మా నాన్నగారు
అటువంటి సీన్లు వచ్చినప్పుడు సిగరెట్ ఒంక తో బయటకి వెళ్ళిపోయేవారు (మా ఇంట్లో
సిగరెట్లు నిషేధం!), మా అమ్మగారికి వంటింట్లో అప్పుడే ఎదో అర్జెంట్ పని
గుర్తొచ్చేది. వాటిని ఫార్ వర్డ్ చేయలేము ఎందుకంటే.. సాధారణంగా హారర్ సినిమాలలో
ఇటువంటి ఎక్స్ ప్లోజీవ్ సీన్ అయిన వెంటనే ఎదో ఒకటి జరుగుతుంది (చాలా హారర్ సినిమాలు
చూసిన అనుభవం!) మొత్తానికి అందరం ఎదో ఒక ఒంక పెట్టుకొని అక్కడ నుంచి
తప్పుకొనేవాళ్ళం. ఎవరో ఆఖరి వ్యక్తి కూర్చొని దానిని చూసి, ఏమైనా జరిగితే.. (అబ్బే!
కధకి సంబంధించి ;-) అంతే!) బయటనుంచి తిరిగొచ్చిన వాళ్ళకి చెప్పేవాళ్ళం.
మేము పెద్దవాళ్ళం అయ్యాక పరిస్థితులు మారాయి. మేం పిల్లలం సినిమాలు ముందు చూసేసి,
మా పెద్దవాళ్ళకి నచ్చుతాయి అనిపించినవి వాళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళం. అప్పటికి మా
అమ్మగారు, నాన్నగారూ సినిమాలు చూడటం బాగా తగ్గించేసారు. ముందే చూసేసి వుండటం వలన
మాకు ముందే తెలుసు ఎప్పుడు మా అమ్మగారికి నచ్చని సీన్లు వస్తాయో. కనుక ముందే ఆమెని
వార్న్ చేసేవాళ్ళం.
"ఇప్పుడు వచ్చే సీన్ నీకు నచ్చదమ్మా!" అనో.. లేక.. "ఈ పాట బాగోదు.. ఫార్ వర్డ్
చేసేయనా?" అంటూ వాటిని తప్పించేవాళ్ళం.
ఈ మధ్య మా ఫ్రెండ్ కూతురు తో "చిత్రం" సినిమా చూశాం. అప్పుడు ఆ సినిమాలోని "ఏకాంత
వేళ" పాట వచ్చినప్పుడు ఆ పాప చేసిన రిమార్క్ మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఆ
సినిమా చూడని వాళ్ళకి -- ఈ పాట ఆ కధానాయిక గర్భవతి అయిన పరిస్థితు చూపించే
నైపధ్యంలో వచ్చే పాట. దానిని మాతో చూస్తున్న ఆ 4 ఏళ్ళ పాప..
"ఛీ.. ఈ సీన్ వచ్చిందా" అంది. అక్కడ వున్న పెద్దాళ్ళం (ఆమె తలితండ్రులతో సహా) అంతా
కొంచెం ఎంబర్రాస్ ఫీల్ అయ్యాం!! మాకెవ్వరికీ ఏం మాట్లాడాలో తోచలేదు. ఏమిటో ఈ
సినిమాలు.. వాటిలోని సీన్లు!!
|