నా చదువు కధ - SKU
ఈ పేజీ ని పంపండి

"చదువంటే నాకు మహా బోర్"

నేను చదువుని నిర్లక్ష్యం చేస్తున్నానని మా అమ్మగారు నన్ను ఎప్పుడూ తెగ సాధిస్తూ వుండేవారు. నాకున్న తెలివితేటల మీద మా అమ్మగారికీ, నాన్నగారికీ అదేమిటో మహా గొప్ప గురి!

"కాకి పిల్ల కాకి కి ముద్దు అని ఊరికే అన్నారా?!"

వాళ్ళకి నమ్మకం వుండటం ఏమో కానీ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడల్లా అది నా ప్రాణం మీదకి వచ్చేది. అవును మరి.. నాకా ఎప్పుడూ "C" గ్రేడ్, పరీక్షల్లో కొంచెం ప్రక్కనున్న వాళ్ళు "తెలివైన" వాళ్ళు అయితే "B" గ్రేడు వచ్చేవి. మా నాన్నగారికి A తరువాత అక్షరాలని గుర్తించాలంటే గొప్ప బాధ! నాకున్న కష్టాలకి తోడు నా ఫ్రెండ్స్ అంతా మహా మేతావులు! (స్పెల్లింగ్ మిస్టేకు కాదు.. కావాలనే మేతావులు అన్నాను!)

ఈ భయం తో కొన్ని విద్యలు నేర్చుకున్నాను. అదే.. ఫోర్జరీలు, అమ్మకి మస్కా కొట్టడం, అతి త్వరగా సంతకాలు చేయించుకోవటం వగైరా. నాన్నగారు మంచి పని లో వుండగా కార్డు ని తీసుకెళ్ళటం, లేకపోతే, నాన్నగారు ఆఫీసు కి వెళ్ళిపోయాక అమ్మ దగ్గరకి తీసుకెళ్ళి దాన్ని సంతకం చేయమనటం లాంటివి. అమ్మ ఎంతైనా మమ్మల్ని కన్న అమ్మ కదా.. నా కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివినది.. సంతకాల జోలికి మాత్రం ససేమీరా అనేది. నేను "ఇవాళ్టికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి నాలుగు రోజులు అయింది.. తిరిగి ఇవాళ తీసుకెళ్ళకపోతే, స్కూలు నుంచి తరిమేస్తారు" అని గోలెత్తినా దిగి వచ్చేది కాదు.

ఇంక నాన్నగారితో మరొక పెద్ద తంటా. మా ట్రిక్ లు తెలుసు కనుక ఆయన ఎక్కడికన్నా వెళ్ళే ఖంగారు లో వుండగా ప్రోగ్రెస్ కార్డు తీసికెళ్ళితే "సాయంత్రం చూపించు" అని cool గా అనేవారు. సాయంత్రం, చక్కగా శుష్టు గా భోంచేసి, మేం ఇంక నిద్ర పోవటానికి పక్కలు సర్దుతుంటే.. "ఎదీ ఆ ప్రోగ్రెస్ కార్డు పట్రా" అని మొదలెట్టేవారు.

జ్ఞాన బోధలూ, చదువు మానేయి అనే బెదిరింపులూ, గొడ్లు కాచుకుంటూ (మా పాలబ్బాయి నాగేశ్వర రావు కి తనే రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాననేవారు), అంట్లు తోముకుంటూ (ఇంట్లో పని చేసే సత్యవతి ని Lay off చేసేసి ఆ ఉద్యోగం లోకి తీసుకుంటామని ప్రామిసు) వగైరా అవతారాలలో మమ్మల్ని చూపించే భవిష్య దర్శనం కార్యక్రమాలు అయ్యాక ఒక వారం, పది రోజుల పాటు grilling వుండేది.

ఆ టైములో మా అమ్మగారు పొద్దుటే నాలుగు గంటలకి మమ్మల్ని (తప్పు ఎవరిదైనా ఈ కార్యక్రమం లో ముగ్గురినీ ఇరికించేవారు) నిద్ర లేపి కూర్చోపెట్టేవారు. మాకు కాపలా వుండేందుకు తను ముందే లైబ్రరీ కి వెళ్ళి చదవటానికి పుస్తకాలు తెచ్చుకోవటమో, ఏదైనా అల్లటం మొదలెట్టడమో, లేకపోతే మాకు బట్టలు కుట్టడమో చేసేవారు. పాపం తను మంచి పనిమంతురాలు లెండి. చక్కగా తన పని చేసుకునేది, మేము ఎంచక్కగా నిద్ర పోయేవాళ్ళం.

ఇంట్లో ఇలా వుంటే స్కూలు లో పరిస్థితి మరొక రకంగా వుండేది. సాధారణం గా స్కూలు లో మాస్టార్లకి బాగా చదివేవాళ్ళు గుర్తు వుంటారు, శుద్ధ మొద్దులు గుర్తు వుంటారు. రెండింటికీ కాక మధ్యరకంగా వుండే నాలాంటి వాళ్ళు కేవలం నెంబర్లు.. అంతే. మా చిన్నప్పుడు నాలుగో క్లాసో, ఐదో క్లాసు లోనో "పట్నాయక్" అనే టీచర్ వుండేవారు. ఆవిడ పెద్దావిడ. ఇంగ్లీషు చెప్పేవారు. నాకా చదివింది ఇంగ్లీష్ మీడియం స్కూలు అయినా ఇంగ్లీషు లో మాట్లాడాలంటే భయం. ఆవిడ చక్కగా మాట్లాడేస్తుంటే మా మేతావులు బహుచక్కగా జవాబులు ఇచ్చేవారు. నేను, నాలాంటి మధ్యస్థం కేసులూ నోరు వెళ్ళబెట్టుకొని వాళ్ళని అబ్బురపాటుగా చూసేవాళ్ళం.

ఇంగ్లీషు లో ఎప్పుడూ అత్తెసరు మార్కులే నాకు. నేను ఎదో అల్లరి పని చేయటం వలన చిన్న పనిష్మెంట్ తో పట్నాయక్ గారు "చదువు ఆవశ్యకత" గురించి నాకు ఒకసారి క్లాసు పీకారు. అప్పుడు కొంచెం సిగ్గు లాంటిది వేసింది. "Quarterly లో చూపిస్తా నా తడాఖా" అని సూరమ్మ (సుర్యకుమారి చేసుకున్న శపధం కదా!) శపధం చేసుకున్నా.

ఈ లోగా, మా పట్నాయక్ గారిని ఉద్యోగం లోంచి తీసేసారో, లేక తెలుగు మీడియం స్కూలు కి బదిలీ చేశారో మొత్తానికి అవిడ మాకు రావటం మానేసారు. నేను అతి కష్టం మీద ఆ సంవత్సరం Quarterly లో "A" గ్రేడు తెప్పించుకున్నా. కానీ నా విజయం పంచుకొనేందుకు పట్నాయక్ గారు లేరు. తరువాత కొద్ది రోజులకి ఆవిడ ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ కనబడ్డారు. వెంటనే ఆవిడ దగ్గరకి పరిగెత్తుకు వెళ్ళి నాకు "A" గ్రేడు వచ్చిన సంగతి చెప్పాను. కానీ అప్పటికి ఆవిడ స్మృతి నుంచి నా మొఖం చెరిగిపోయినట్టుంది.. ప్రశ్నార్థకంగా మొఖం పెట్టి నన్ను అభినందించారు.

తరువాత "సుభద్ర" అని ఒక టీచర్ వచ్చేవారు మాకు. ఆవిడ నేచురల్ సైన్సు చెప్పేవారు. చాలా మృదు స్వభావి. నాలాంటి కొరకరాని కొయ్యల్ని కూడా ఒంచారు ఆవిడ. నాకు ఆవిడంతే తెగ ఇష్టం గా వుండేది. ఆవిడ మాకు నేచురల్ సైన్సు చెప్పటం మొదలెట్టాక నాకు ఎప్పుడూ 80% మార్కులకి తక్కువ రాలేదు.

ఎదో సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా మొదలయ్యే ముందు చూపించే న్యూస్ రీల్ లో ఆ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులకి ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల బహూకరణ సమావేశం ని చూపించారు. వెర్రిదాన్ని.. ఆ టీచర్లలో మా "సుభద్ర" టీచర్ గారి కోసం చూశాను. ఆవిడకి ఆ పురస్కారం ఇచ్చి తీరుతారని అదో పిచ్చి నమ్మకం!

ఇంక మాది ప్రైవేటు స్కూలు కావటం తో రకరకాల టీచర్లు వుండేవారు.

ఒకాయన మాకు లెక్కలు చెప్పేవారు. ఆయన ఆడపిల్లల వెనకాల చేరి వాళ్ళ తలల్లో పేలు తీసేవారు. నమ్మలేకపోతున్నారు కదూ? నిజం! మరొకావిడ పువ్వులు పెట్టుకొచ్చిన వాళ్ళ తల లోంచి దండల్ని లాగి పారేసేవారు (అదీ చాలా వయొలెంట్ గా!) దానికి కారణం ఆవిడ క్రిస్టియన్ అవటం!

మరొకావిడ ఊలు తెచ్చుకొని క్లాసులో స్వెట్టర్లు అల్లుకునేవారు. బోర్డు మీద ఎదో నాలుగు ముక్కలు రాసేసి, కాస్త నోరు ఎక్కువ వున్న ఎవరినో ఒకరిని పిలిచి అది అందరిచేతా చదివించమని చెప్పి, తను ప్రక్క క్లాసు గుమ్మలోకి తన కుర్చీ జరుపుకొని, స్వెట్టరు అల్లుకుంటూ, ఆ ప్రక్క క్లాసు టీచరు తో హస్కు కొట్టేవారు. ఒకసారి మా నాన్నగారికి ఆవిడ లీలలు చెప్పాను. నాన్నగారికి చిర్రెత్తు కొచ్చింది. వెంటనే వెళ్ళి మా హెడ్ మిస్ట్రస్ కి కంప్లైంట్ చేసారు. ఆవిడ మా టీచర్ ని మందలించినట్టున్నారు. ఆవిడ నన్ను ఒక శత్రువు లా చూసారు తరువాత. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆవిడ మా వరస మావయ్య కి భార్య అయ్యారు. నాకు ఇప్పటికీ ఆవిడ (పేరు చేప్పను..) టీచరే!!

ప్రేమ పాఠాలు చెప్పే మాస్టారు ఒకరైతే, మరొకాయన విజ్ఞానం పేరు తో ఆడపిల్లల ఋతు క్రమాల గురించీ, సెక్స్ గురించీ బోధించేవారు. పిల్లలని ఎడ్యుకేట్ చేయటం తప్పు అని అనను కానీ.. ఇప్పుడు ఆ రోజుల్లో జరిగినది తలుచుకుంటుంటే ఆయన మమ్మల్ని ఎడ్యుకేట్ చేసే వుద్దేశ్యం తో ఆ మాటలు చెప్పలేదని ఖచ్చితంగా చెప్పగలను.

ఇంక కాలేజ్ కి వచ్చాక లెక్చరర్లు మరొక రకం. అప్పటికి మేమూ వయసొచ్చిన వాళ్ళం. వెకిలి వేషాలు వేసే లెక్చరర్ లని ఇట్టే పసిగట్టేవాళ్ళం.

ఒకాయన ఎదో ప్రైవేటు క్లాసు గురించి చెప్పటానికి ప్రక్కనున్న సందు లోకి రమ్మని కుర్రాళ్ళ తో పాటు లెక్చరర్ లని కూడా వెర్రెత్తించే అందం వున్న ఒక అమ్మాయి ని అడిగితే ఆ అమ్మాయి మొఖం మీద కొట్టినట్టు అడిగింది.."ఏం సార్.. మీకు చీకటి గా వుండే ఆ సందులో తప్ప నోరు పెగలదా?" అని!

కాలేజీ లోకి వచ్చాక మాలో అల్లరి పాలు కూడా పెరిగింది. తామెదో పెద్ద మేధావులమన్నట్టు ఫీల్ అయిపోయే మేతావులని చూస్తే తిక్క రేగేది. వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టి వాళ్ళ వెనక్కాల నవ్వుకునేవాళ్ళం.

నేను ఇంటర్ నుంచి డిగ్రీ వరకు Idle.. oops! Ideal కాలేజ్ లో చదివాను. ఒకసారి ఎదో మీటింగ్ అని మా కాలేజ్ విద్యార్థులందరినీ పిలిచారు మా ప్రిన్సిపాల్. వాయిస్తున్న లెక్చరర్స్ ని వేళాకోళం చేసుకుంటూ నేను, నా ఫ్రెండ్స్ అంతా ఆఖరి బెంచీ లో కూర్చున్నాం. నా చేతిలో పెన్సిల్ వుంది. చెయ్యి ఊరుకోక డెస్క్ మీద మూడు కోతుల వంటి చిత్రాలు వేశాను. (పాపం కళాఖండాల్లానే వేద్దామనుకున్నా.. కానీ కోతుల మాదిరి వస్తే అది నా తప్పటండీ? మనం ఎన్ని సార్లు గోడల మీద శ్రీ దేవినీ, చిరంజీవి నీ రూపు రేఖలు మార్చేసి బొమ్మల్లా వేస్తే సరిపెట్టేసుకొని పోలేదు?) ఆ రోజుల్లో Tridev సినిమా తెగ ఆడేస్తోంది. కనుక వాటికి "Tridev of Ideal College" అని రాసి, ఆ ముగ్గురి లెక్చరర్ల పేర్లు రాసాను. ప్రక్కన కూర్చున్న మా అరుణ "by Final MPC students" అని రాసింది.

కధ అక్కడకి మిగియలేదు. మర్నాడు లెక్చరర్ల కి ఎదో మీటింగ్ జరిగింది. అది మా ఖర్మ కాలి ఆ గది లోనే జరిగింది, ఈ ముగ్గురు త్రిమూర్తులూ వెళ్ళి ఆ టేబిల్ దగ్గర కూర్చున్నారుట! నా చిత్రకళా ప్రావీణ్యం చూసారు. అగ్గి రాముళ్ళు అయ్యారు. అందులో ఒకాయన మరీ సురేకారం లా మండిపోయారు. కానీ పాపం ఆ పని చేసింది ఎవరో అబ్బాయిలే అనుకున్నారు.

మర్నాడు క్లాస్ కి వచ్చినప్పుడు అబ్బాయిల ఒంక తిరిగి.. "ఎవడో చదువూ, సందెలు లేని సన్నాసి గాడు రూం' నెం. 10 లో బల్ల మీద తన కళాఖండాలు వేసి, వాటికి నామకరణం కూడా చేశాడు. చేసిన గొప్పపని మళ్ళీ ఇంకెవరన్నా చేసారని అనుకుంటారని క్రింద "by Final MPC students" అని సంతకం ఒకటీ! మీకు చదువు చెప్పే మేమంటే వున్న గౌరవం ఇదా? ఎవడు ఈ పని చేసాడో వచ్చి మర్యాదగా చెప్పేంత వరకూ నేను క్లాసులు తీసుకోను" అని శపధం చేసారు.

15 రోజులు ఆయన అలా భీష్మించుక్కూర్చున్నారు. మిగిలిన ఇద్దరూ కూడా క్లాసులో ఎవో డైలాగులు కొడుతున్నారు. పరీక్షలు దగ్గరకి వచ్చేస్తున్నాయి. ఆయన క్లాసులు తీసుకోవటం లేదు. మా అరుణ కి బెంగ పట్టుకుంది. తన కి భయం కొంచెం ఎక్కువ. "అనవసరం గా వేసావు ఆ బొమ్మల్ని.. వెళ్ళి ఆయనకి sorry చెప్పేస్తే బాగుంటుందెమో!" వంటి సూచనలు మొదలెట్టింది. అబ్బాయిలు కూడా "నువ్వేసావా" అంటూ అందరినీ అడుగుతున్నారు.

నాకూ పశ్చాత్తాపం మొదలయింది. నా ఒక్క దాని వల్లా 120 మందికి క్లాసులు పోవటం బాధేసింది. ఒక రోజు వీరనారి ని బయలుదేరాను. చేసిన పాపం ఒప్పుకోవటానికి! ఆయన నేనే ఆ బొమ్మ వేశాను అని చెప్పగానే చాలా ఆశ్చర్యపోయారు. ఆయన ఎవరో "మొగ వెధవ" (క్షమించాలి) ఈ పని చేశాడనుకున్నారు! "నువ్వొక్కదానివేనా.. నీతో ఇంకా ఎవరన్నా వున్నారా?" అని అడిగారు. నేను త్యాగమూర్తీ, కొవ్వొత్తీ టైపు ఫీలింగ్ కి లోనయి "ఎవరూ లేరు సార్.. నేనొక్కదాన్నే" అని చెప్పాను.

విశాల హృదయులు! నన్ను క్షమించేసా పొమ్మన్నారు. నేను దూది పింజ లా ఎగురుకుంటూ వచ్చేసాను. కానీ ఆ సంవత్సరం నాకు ప్రాక్టికల్స్ లో వచ్చిన మార్కులు చూసుకొని భోరు మన్నాను. అసలు మా కాలేజ్ లో పరీక్షకి మొఖం చూపించిన ప్రతీ వాళ్ళకీ 99% మార్కులు ఇస్తారు. మా MPC గ్రూపు వాళ్ళకి ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రాక్టికల్స్ మార్కులు చాలా అవసరం క్లాసు రావాలంటే. (ముఖ్యంగా నాలాంటోళ్ళకి!) నాకు వచ్చిన మార్కులు 35%, 35% "పాస్ చేసారు నయం!" అనుకోవటం తప్ప పైకి కిక్కురు మనక కుక్కిన పేనులా ఊరుకొన్నాను.

తరువాత ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఆ లెక్చరర్ గారు కనిపించారు. ఆయన మా పెద్దమ్మ వాళ్ళింట్లో అద్దెకి వున్నారు. నాకు ఆయన్ని చూడగానే ఒక ఆవేశం! "చెన్న కేశవ రెడ్డి" సినిమాలో "Dont care" పాట టైపు లో పవర్ ఫుల్ డైలాగులు కొడదామని వెళ్ళి ఆయన్ని పలకరించాను. ఆయన నేను ఏం చేస్తున్నానో అడుగుతాడెమో.. "ఎంత తొక్కినా.. నువ్వెంత తొక్కినా.. " టైపు పాట పాడొచ్చు అని!! నేను నిరాశ పడలేదు లెండి. ఆయన ఎంతకీ నన్ను ఆ విషయం అడగక పోయేసరికి..

"మొన్నే ఇండియా వచ్చానండి" అన్నాను.

"ఎక్కడనుంచి?" అడిగారు ఆఖరికి.

"కెనడాలో software లో ఉద్యోగం చేస్తున్నానండి" గొప్పగా చెప్పాను.. ఆయన మొఖం లో కళలు మారతాయన్న ఆశతో!

ఆశ్చర్యం తప్ప నాకు అక్కడ ఏమీ కనిపించలేదు.

అదండీ నా చదువు కధ!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.