తొలిప్రేమ - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
ఎదురింట్లోకి ఎవరో కొత్తగా దిగుతున్నారు.. నా వయసువాళ్ళు ఎవరైనా ఉన్నారెమో చూద్దామని కుతూహలంగా చూసిన నాకు యిద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కనిపించారు. వాళ్ళలో ఒకబ్బాయి నా కన్నా పెద్దవాడయి వుంటాడు. ఒకబ్బాయి చిన్నతను. వాళ్ళిద్దరూ కాక యింకొక అమ్మాయి వుంది. ఎఋఋఅ పూల పరికిణీ వేసుకున్న ఆమె కొంచెం యించుమించు నా వయసే వుంటుంది. వాళ్ళలో చిన్నబ్బాయిని ఎదో అడుగుతోంది. అతను ఎదో అన్నాడు దురుసుగా. కొంచెం చిన్నబుచ్చుకుంది. తనకి జరిగిన అవమానానికి ప్రేక్షకులు వుండటం చూసి!

నేను తొమ్మిదో తరగతి లో వున్నాను. నా కిద్దరు తమ్ముళ్ళు వున్నారు. ఎదురింట్లో వాళ్ళ అబ్బాయిల్లో పెద్దతని పేరు రాజు, పదో తరగతి లో చేరాడు, రెండో అతను రవి, కొంచెం దురుశు మనిషి, అతను ఆరో తరగతిలో చేరాడు. ఆ అమ్మాయి పేరు రాధిక, ఎనిమిదో తరగతి లో చేరింది. వాళ్ళు కూడా మా స్కూల్లోనే చేరారు. ఆ యింట్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే పిల్లలకీ, పెద్దవాళ్ళకీ స్నేహాలయ్యాయి. నా తమ్ముళ్ళు 7, 6 చదువుతున్నారు. మేమంతా కలిసి కిన్నెరసాని ఒడ్డున ఈతలు కొట్టెవాళ్ళం, స్కూలుకి కలిసి వెళ్ళేవాళ్ళం. రాత్రి భోజనాలు అయ్యాక పెద్దవాళ్ళు అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, పిల్లలంతా మా డాబా మీదో లేకపోతే వాళ్ళ డాబా మీదో చేరి కబుర్లు, ఆటలు ఆడుకుంటూ, మా పెద్దవాళ్ళు యింక పడుకోండి అని కేకలు వేసేవరకూ గడిపేవాళ్ళం.

రాజు చాలా నెమ్మది అయిన అబ్బాయి. మా అందరిలోకీ అతనే పెద్దవాడయినా, మా అందరిలోనూ నా మాటకే విలువ ఎక్కువ. రవి అప్పుడప్పుడు అది కాదు, యిది కాదు అంటూ నా మాటకి అడ్డు వచ్చేవాడు. కానీ రాధి నన్ను వెనకేసుకుని వచ్చేది. నేను కూడా రాధిని అతను సతాయిస్తుంటే, అడ్డు వెళ్ళేవాడిని. ఎంత దెబ్బలాడుకున్నా, రాత్రి అయ్యేసరికి అంతా ఒక దగ్గర చేరే వాళ్ళం.

మా స్నేహం యిలా పెరుగుతుండగా, మా ప్రక్క యింట్లోకి స్వామి వాళ్ళు వచ్చారు. స్వామి పదవ తరగతి, రాజు క్లాసులో చేరాడు. అతను మంచి మాటకారి. అతను కూడా మా గాంగ్ లో కలిసాడు.

అతని రాకతో నా గాంగ్ లీడర్ పీఠం కదిలింది. రవి ప్రతీ దానికీ స్వామి జెట్టు కట్టడం మొదలు పెట్టాడు. రాధి, రాజు, నా చిన్న తమ్ముడు నా జెట్టు వుండే వారు. కానీ స్వామి సినిమా కధలు చెప్తున్నపుడు మాత్రం రాధి తో సహా అంతా ఆ జట్టు లోకి వెళ్ళిపోయేవారు. నేనూ చేసేది లేక వాళ్ళతో కలిసిపోయేవాడిని. యిలా కాదు అని, నేను కూడా కధలు చెప్పడం కోసం చందమామ, బొమ్మరిల్లు పుస్తకాలు చదవటం మొదలు పెట్టాను. నేను చెప్పే ఆ రాజకుమారుడి కధల కోసం త్వరలోనే వాళ్ళంతా నా దగ్గరకి రావటం మొదలు పెట్టారు.

నేను చాలా బాగా చదివే వాడిని. స్వామి చదువులో మొద్దే! కనుక, స్కూల్లో అంతా నన్ను ఎప్పుడూ మెచ్చుకునేవారు. మంచి కధలు చెప్పడం కూడా అలవాటు చేసుకున్నాను కనుక అతి త్వరలోనే, స్వామికి తో సహా అందరికీ మళ్ళీ నేనే గురువుని అయిపోయాను..

నేను ఏమి చేసినా ఏమి మాట్లాడినా, అందరూ తూ.చా. తప్పకుడా పాటించేవారు. నేను ఆ కధలు చెప్తుంటే, యింకా చెప్పమని గొడవ చేసేవారు. వాళ్ళకి చెప్పడం కోసం నేను ఒకోసారి ఆటలు కూడా మానేసి కధల పుస్తకాలు చదివేవాడిని.

ఒకోసారి.. వాళ్ళు ఎంత బ్రతిమాలినా, యింక కధ గుర్తు రావట్లేదనో, లేకపోతే యింకొకటో వంక పెట్టి బెట్టు చేసేవాడిని. కానీ రాధి చెప్పమని అడిగితే మాత్రం కధ గుర్తు రాకపోతే, ఎదో ఒకటి కల్పించి అయినాసరే చెప్పేవాడిని. అది గమనించి, నా తమ్ముళ్ళు రాధిని బ్రతిమాలేవారు, నన్ను కధ చెప్పమని అడగమని. నా కధలు, కబుర్లు కోసం, నేనేమి చెప్పితే అది చేసేవారు. మొత్తానికి వాళ్ళంతా నా అనుచర గణం లా నా వెంటే ఎప్పుడూ తిరుగుతుండే వారు.

* * *

స్వామి, రాజు కాలేజ్ లో చేరారు. వాళ్ళు ప్రస్తుతం మాతో కలిసి నా కబుర్లు వినటం లేదు. దాంతో మా గాంగ్ లీడర్ గా నేను మకుటం లేని మహారాజు అయ్యాను. నా తమ్ముళ్ళకీ, రాధికీ, రవికీ నేను హోం వర్క్ లో సాయం అదీ చేసేవాడిని. వాళ్ళ నాన్నగారిని పాఠాలలో ఎమైనా సందేహాలు అడిగితే తన ప్రశ్నలతో ఊదరగొట్టేవారు, వీళ్ళు సమాధానం చెప్పకపోతే చితక తన్నేవారు. అందుకని వాళ్ళిద్దరూ కూడా నా దగ్గరకే వచ్చి తమ సందేహాలు తీర్చుకునేవారు.

నేను 10 th మా స్కూల్ ఫస్ట్ వచ్చాను. శలవుల్లో ఒక రోజు రవి చెప్పాడు, రాధి పెద్దమనిషి అయ్యిందనీ, తనని చూడతానికి బోల్డు మంది వస్తున్నారనీ! విని నా చిన్న తమ్ముడు అడిగాడు, అంటే ఏమిటని. నాకూ అంతగా తెలియక పోయినా, వాళ్ళ గురువుగా, వాళ్ళ సందేహం తీర్చాల్సిన బాధ్యత వుంది కనుక నాకు తెలిసింది చెప్పాను.

"చదువుకోవటం మానేసి యింక పెళ్ళి చేసుకుంటుంది." నా ఫ్రెండ్ కృష్ణం రాజు వాళ్ళ అక్క పెద్దదయినప్పుడు జరిగినది చూసిన అనుభవంతో చెప్పాను.

"మా అక్క చదువు మానేయదు. మా నాన్నగారు తనని బాగా చదివించి డాక్టరు చేసాకే పెళ్ళి చేస్తానన్నారు. నేను మా నాన్నగారిని అడిగాను." ఆ సాయంత్రం రవి మా సమావేశంలో చెప్పాడు.

రాధి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోదు అన్న వార్త మా అందరికీ ఎంతో సంతోషాన్ని యిచ్చింది. కానీ ఆ తర్వాత, కొత్తగా, పరికిణీ, ఓణీ, బారు జడలతో తిరగడం మొదలెట్టిన రాధి ని చూస్తే, ఏదో సిగ్గు! తనతో మాట్లాడాలన్నా, అదివరకులా చనువుగా వుండాలన్నా, తనుకూడా అదివరకులా నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడటం మానేసింది. క్రొత్తగా సిగ్గు పడటం, వాలు చూపులు చూడటం, సినిమాల్లో అమ్మాయిల్లా అందంగా వుండటం, అలా తయారవటం మొదలెట్టింది.

తను అలా బాగున్నా, ఎప్పుడూ రాధిని పట్టించుకోని స్వామి తనకి పనివాడిలాగ వెనక్కాల వెనక్కాల తిరగడం, ఆమెకి పుస్తకాలవీ తెచ్చివ్వడం, అతనితో రాధి నవ్వుతూ మాట్లాడటం, నేను అక్కడ వున్నా, నన్ను ఒదిలేసి అందరితో మాట్లాడటం నాకు పిచ్చ కోపం వచ్చేది. ఎందుకు మాట్లాడటంలేదు నాతో అని అడుగుదామనుకుని కూడా, ఆ, తను మాట్లాడకపోతే, నాకేమన్నా నష్టమా? నేనూ మాట్లాడను అనుకునేవాడిని.

ఎంత బెట్టుగా వుందామన్నా, తను ఎప్పుడైనా, 5, 6 రోజులకి ఒకసారి నన్ను పలకరిస్తే, ఆ కోపం అంతా మర్చిపోయేవాడిని. నా తమ్ముళ్ళూ, స్వామి, మా అమ్మ, నాన్నగారు.. అందరితో అదివరకులాగానే మాట్లాడేది. నాతో మాత్రం మాట్లాడేది కాదు! చిన్న నవ్వు నవ్వి యింక నేనక్కడ వున్నా నన్ను పట్టించుకునేది కాదు.

కాలేజ్ లో చేరాను. క్రొత్తగా అయిన ఫ్రెండ్స్ తో నేను కొంచెం బిజీ అయ్యాను. ఒకరోజు మా యింటికి నా క్లాస్ మేట్ రమణ వచ్చాడు. ఎదో పని మీద మా యింట్లోకి వెళ్ళుతున్న రాధిని చూసి అడిగాడు..

"ఎవరురా ఆ అమ్మాయి?"

"నా ఫ్రెండ్" చెప్పాను..

"గర్ల్ ఫ్రెండా? చాలా బాగుంది" అడిగాడు మా అమ్మ తో మాట్లాడుతున్న రాధి ని కిటికీ లోంచి చూస్తూ

రాధి గురించి రమణ అలా మాట్లాడటం నాకిష్టం లేదని అతనికి ఖచ్చితంగా చెప్పాను.

"నువ్వు ఆ అమ్మాయిని యిష్టపడుతుంటే సరే, లేకపోతే నేను ట్రై చేసుకుంటాను. నేను కాకపోతే, మీ పక్కింట్లోని స్వామి ట్రై చేస్తాడు. బావగారివో, బావమరిదివో నువు అవ్వక తప్పదు" నాకు హితబోధ చేశాడు.

* * *

నేనూ గమనించాను రాధి గురించి స్వామి ప్రయత్నించడం. కానీ నేను కూడా వాడిలాగా ప్రయత్నించి చీప్ అయిపోకూడదు. తనే నన్ను కావాలని కోరుకోవాలి. ఎలా? కావాలనే రాధి ని పట్టించుకోనట్టు నటించేవాడిని. తను వున్నా లేనట్టు ఆమెని అస్సలు గమనించనట్టు వుండేవాడిని. ఆమె పలకరించినా అడిగిన దానికి సమాధానం చెప్పేవాడిని. మళ్ళీ ఆమె ఉనికినే మర్చిపోయినట్టు వుండేవాడిని.

నా ప్రవర్తన ఫలితాలు యివ్వటం మొదలెట్టింది. అంతవరకూ నాకు దూరం దూరంగా తిరిగిన రాధి నన్ను గమనించడం గమనించాను. నా తమ్ముళ్ళని నా గురించి అడగడం, మా అమ్మని యధాలాపంగా అడిగినట్టు నా గురించి ఆరా తీయటం చూసి నాలో నేనే నవ్వుకున్నాను. మా ఈ దొంగాట దాదాపు ఒక సంవత్సరం నడిచింది. మా అమ్మ కూడా 1,2 సార్లు అడిగారు నన్ను "అదేమిటీ రాధి తో ఏమయినా దెబ్బలాడావా? అస్సలు మాట్లాడటం లేదట?" అని. "అబ్బే అదేం లేదు" అని దాటేసే వాడిని.

నేను ఇంటర్ రెండో సంవత్సరం లోకి వచ్చాను.. రాధి ఇంటర్ లో చేరింది. ఆమెని ఎవరైనా అబ్బాయిలు వెంట పడి యింటి వరకూ వచ్చి ఏడిపిస్తుంటే నా రక్తం మరిగి పోయేది. కానీ ఎప్పుడూ తొందర పడి ఏమీ అనలేదు. ఆమె యింకా వచ్చి మా తమ్ముళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పేది. రోజూ నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి వాళ్ళంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వుండే వారు. నేను ఒకోసారి వాళ్ళ వంక కూడా చూడకుండా లోపలికి వచ్చేసేవాడిని. ఒక్కోసారి అస్సలు ఎవరికీ కనిపించకుండా, నా గదిలో కూర్చుని చదువుకుంటూ వుండే వాడిని.

కానీ ఈ ఆటలో నేను కూడా చాలా బాధ పడ్డాను. ఆమె నన్ను చూసిన రోజు ఎంతో సంతోషంగా, లేని రోజు దిగులుగా! అసలు ఎందుకు రాధి తో వెళ్ళి చనువుగా మాట్లాడలేక పోతున్నాను? ప్రేమిస్తున్నానా ఏమిటి కొంపదీసి?

వచ్చే పిచ్చి ఆలోచనల్ని మళ్ళించడానికి చదువు మీద శ్రద్ధ పెట్టేవాడిని. చదువులో నేనెప్పుడూ ఫస్టే. ఎంత రాధి గురించి ఆలోచనలు నన్ను వేధిస్తున్నా చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. కాకినాడ JNTU లో ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవాలన్న పట్టుదలతో చదివేవాడిని.

నా ఈ మౌనంలో స్వామి రాధి మనసు గెలుచుకునేందుకు దూసుకుని వెళ్ళిపోవటం గమనించక పోలేదు. వాడికీ ఆమెతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేదు. చూద్దాం ఏమవుతుందో! అసలు రాధిని చూస్తే నా మీద ఇంట్రెస్ట్ వున్నట్టు అనిపిస్తుంది! నాతో మాట్లాడదు! స్వామితో మాట్లాడుతుంది! వాడు వేసే కుళ్ళు జోకులకి నవ్వుతుంది. వాడు తెచ్చి యిచ్చే పుస్తకాలూ అవీ తీసుకుంటుంది. ఏమిటి? అర్ధం కావటంలేదు!

ఆమె ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవాలి. కానీ ఎలా? ఆలోచిస్తున్న నాకు తట్టింది ఒక కత్తి లాంటి అయిడియా.

ఒక రోజు స్వామి తో ఒంటరిగా వున్నపుడు వాడిని అడిగాను..

"నీకు రాధి అంటే యిష్టమా?"

"యిష్టమే" యధాలాపంగా చెప్పాడు స్వామి.

"ఆ యిష్టం కాదు. తనని ప్రేమిస్తున్నావా? ఏం లేదులే, నీవీమధ్య తన attention కోసం పడుతున్న పాట్లు గమనించాను. అందుకనీ.."

నేనంత blunt గా అడిగేసరికి వాడికి ఏం చెప్పాలో తెలియలేదు. కాస్సేపు నీళ్ళు నమిలి ఆఖరికి "అవును, ప్రేమిస్తున్నాను" అని చెప్పాడు.

"మరి తను? అసలు రాధి కి చెప్పావా? నువ్వు తనని యిష్టపడుతున్నావని?"

"లేదు. తనని అడగాలంటే భయం వేస్తుంది. తన ఉద్దేశ్యం ఏమీ తెలియట్లేదు." తన బాధ చెప్పుకున్నాడు.

"యిలా ఆమె వెనక్కాల తిరిగితే ఏమొస్తుంది? మనసులో మాట ఖచ్చితంగా అడిగేయాలి గానీ! ఒక పని చేయి, చూడు, తను ఒక్కర్తీ అక్కడ ముగ్గు వేసుకుంటోంది. వెళ్ళి అడిగేసేయి." క్రింద ఎదురుగుండా గుమ్మంలో ముగ్గు వేస్తున్న రాధి ని చూపిస్తూ అన్నాను. "యిష్టం లేదని అందనుకో, మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చేసేయి. నీకీ టెన్షన్ తప్పుతుంది కదా!?" వాడిని ఊదరగొట్టాను.

"అమ్మో! వాళ్ళ నాన్నగారికి చెప్పిందంటే, మా నాన్నగారికి చెప్తారు. పెద్ద గొడవ అయిపోతుంది." భయపడ్డాడు

"ఏమీ చెప్పదు. మనం అంతా friends కదా. చెపితే నిన్ను మీ నాన్నగారు తిడతారని తనకి మాత్రం తెలీదా? అయినా నువ్వేమీ అల్లరి చేయట్లేదు కదా తనని. ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా చెప్పద్దు. నువ్వంటే చాలా యిష్టం. నీ అభిప్రాయం ఏమిటి అని అడుగు."

నేనిచ్చిన ధైర్యం తో స్వామి అప్పుడే వెళ్ళాడు రాధి దగ్గరకి. నేనూ టెన్షన్ గా చూడసాగాను. అక్కడ ఏమవుతుందో అని. నా ప్రశ్నలకీ సమాధానం దొరుకుతుంది కదా! ఒక 10 నిమిషాలు మాట్లాడాడు రాధితో. చుట్టుప్రక్కల ఎవరూ లేరు. వున్నా వాడు అడుగుతున్నది యిదని ఎవ్వరూ అనుమానించరు. రాధి నవ్వుతూ మాట్లాడుతోంది. కోపగించు కోలేదు. అంటే?? అలా అని సిగ్గూ పడటం లేదు! ఏం చెప్తోంది? సస్పెన్స్ లో ఒక అరగంట గడిపి, యింక భరించలేక, స్వామి వాళ్ళ యింటికి వెళ్ళాను. ఏమయిందో కనుక్కునేందుకు.

"నన్ను ప్రేమించటం లేదని చెప్పింది రా. తనకి అలాంటి ఆలోచనలు లేవట. చదువుకొని డాక్టర్ అవ్వాలట! నా మీద కోపం లేదంది. వాళ్ళ నాన్నగారికి చెప్పనంది." నిరాశా, రిలీఫ్ కలగలిసిన వదనంతో చెప్పాడు స్వామి.

నాకు ఒకేసారి ఆనందం దిగులూ రెండూ వేసాయి. అయితే, వాడిని ప్రేమించటం లేదు. మరి నన్ను? నేనడిగినా యిదే సమాధానం చెప్తుంది! యిలా ప్రేమావేశం లో పిచ్చి గంతులు వేస్తున్న మనసు ఊరుకుంటుందా? నేనేం చేయాలి?

* * *

ఇంతవరకూ నేను తనని నిర్లక్ష్యం చేసినట్టు నటిస్తే తను నా కోసం వస్తుంది అనుకున్నాను. యిప్పుడు, అసలు ఏం చేయాలో తోచటం లేదు!

ఎప్పటిలాగానే, నా గది లోకి వెళ్ళి ముసురుకొని వస్తున్న ఆలోచనల్ని ఒక కవిత గా రాసాను. ఆ విధంగా రాధి పైన నా కున్న ప్రేమ నాచేత రచనలు కూడా చేయించింది. వాటిని పత్రికలకి పంపే వాడిని. వాటిని చదివైనా తను నన్నూ, నా ప్రేమనీ గుర్తిస్తుందెమో అన్న ఆశ తో. వాటికి పత్రికల వాళ్ళు యిచ్చిన బహుమతులు వచ్చాయి కానీ నా ప్రియ సఖి దగ్గర నుంచి నాకు కావల్సిన బహుమతి మాత్రం రాలేదు.

రోజు రోజుకీ నాలో ఈ ప్రేమ కొత్త నీరొచ్చిన గోదారి లా ఎగసెగసి పడుతోంది. తను నాతో కాక వేరెవరితో మాట్లాడుతున్నా అక్కడ నుంచి తనని లాక్కుని వచ్చి నా ఒక్కడికే నువ్వు స్వంతం. నీవు నా దానివి. అని ఆమెకి అర్ధం అయ్యేలా చెప్పాలన్న కోరిక పెరిగిపోతోంది.

ఒకరోజు నేను కాలేజ్ నుంచి యింటికి వచ్చేసరికి బయట ఉయ్యాల దగ్గర నా చిన్న తమ్ముడి తో కూర్చుని మాట్లాడుతున్న రాధి ని చూశాను. మాట్లాడకుండా లోపలికి వచ్చేసాను కానీ యిప్పుడే, ఈ క్షణమే రాధి కి నా ప్రేమని తెలియ చేయాలన్న ప్రేమావేశం లో బయటకి వెళ్ళాను. నా చిన్న తమ్ముడ్ని నాకు అర్జెంటుగా ఎదో కావాలని బయటకి పంపేశాను. తను ఒక్కర్తీ వుంది. తమ యింటికి వెళ్ళటానికన్నట్టు లేచింది.

"రాధీ నీతో కొంచెం మాట్లాడాలి. పైన డాబా మీదకి రా." చెప్పి గబ గబా మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోయాను..

నా వెనుకే మారు మాట్లాడకుండా పైకి వచ్చింది తను.

కానీ ఈ లోపులో మళ్ళీ నాలో ఆ బెరుకు, సందేహం.. తను "లేదు, నిన్ను ఒక అన్నయ్య లాగ అనుకున్నాను" అందంటే, నేను తనని చెల్లెల్లా అనుకోగలనా? ఈ conflicting ఆలోచనలతో, తను రాగానే అడగాలనుకున్నది ఒదిలేసి, "చూడూ, మనమేమీ దెబ్బలాడుకోలేదు. మరి ఎందుకు నాతో మాట్లాడటం లేదు? ఏం? నేనేమన్నా తప్పు చేసానా?" అడిగాను.

"అదేం లేదు. నువ్వు బిజీ గా వుంటున్నావు. అంత కన్నా మరేం లేదు." తను చిన్న నవ్వు నవ్వి అంది.

ఆ మాటకే నేను ice అయిపోయాను. తనతో నా ప్రేమా, దోమా అన్నీ మర్చిపోయి మళ్ళీ చిన్నప్పటి నా బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాను. తను కూడా అదే enthusiasm తో మాట్లాడింది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మేమిద్దరం, ఒంటరిగా, మాట్లాడుకునే వాళ్ళం. అదేమిటో తనతో నా ప్రేమని చెప్పాలని ఒక్కడ్నీ వున్నపుడు ఎన్ని శపధాలు చేసుకున్నా, తనతో మాట్లాడుతుంటే ఆ శపథాలన్నీ మర్చిపోయి, మామూలు జనరల్ టాపిక్స్ ని మాత్రమే మాట్లాడే వాడిని. తను కూడా ఏ రోజూ నాకు ప్రోత్సాహం యివ్వలేదు. అలా అని నా ఆశలమీద నీళ్ళూ చల్లలేదు!

నా మీద నాకే కోపం వస్తోంది. యింత చక్కనైన అమ్మాయి ప్రక్కనుంది, తనంటే చెప్పలేనంత యిష్టం వుంది, తనతో నా యిష్టాన్ని చెప్పే చొరవ వుంది. అయినా ఏమిటీ నా అనుమానం.. దేనికి ఈ సందేహం?

ఒకరోజు ఎదో కవిత రాస్తూ తనకి ఒక ప్రేమ లేఖ రాయాలన్న ఆలోచన వచ్చింది. నా తపన, ఆవేదన, కవితా హృదయం, తన పైన నా ప్రేమ అన్నిటినీ రంగరించి ఒక అద్భుతమైన ప్రేమ లేఖ రాద్దామనుకున్నాను. కానీ ఎన్ని రాసినా ఒక్కటీ నాకు నచ్చలేదు. ఆఖరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని బయటకి వచ్చాను.

తను వన కన్య లాగ మల్లె పందిరి క్రింద వున్న కుర్చీలో కూర్చుని మల్లెల మాల కడుతోంది. తనని చూడగానే నాలో మళ్ళీ ఎదో భావాల పరంపర! జేబులో చేయి పెట్టాను. దేనిని వెతకడానికో!? చూసేసిన సినిమా టికెట్టు ముక్క వచ్చింది. దాని మీద రాశాను.

"నేను చెప్పాలనుకునీ చెప్పలేక పోతున్న మాట నీకు తెలిస్తే, నీ జవాబు చెప్పటానికి మీ డాబా మీదకి రా."

దానిని తనకి అందించి, వెనుతిరిగి చూడకుండా మా యింట్లోకి వెళ్ళి కిటికీ లోంచి తనని గమనించ సాగాను.

తను దానిని తెరిచి చదివి, లేచి వాళ్ళ యింట్లోకి వెళ్ళిపోయింది. రెండు క్షణాల్లో మళ్ళీ బయటకి వచ్చి నాకు కనబడేలా మా కిటికీ దగ్గర ఒక చిన్న స్లిప్ ని విసిరి వాళ్ళ డాబా మెట్ల వైపు వెళ్ళింది.

అదురుతున్న గుండెల తో వెళ్ళి దానిని తెరిచి చూశాను . అందులో..

"నాకు తెలిసినదే నువ్వు చెప్పాలనుకున్నదైతే, నాకూ యిష్టమే."

yahoo!! ఎలా వర్ణించను నా ఆనందాన్ని? పరుగు పరుగున మా డాబా మెట్లెక్కి పైకి వెళ్ళాను. తను ఎదురుగా వాళ్ళ డాబా మీద, నా కోసమే ఎదురు చూస్తూ, నేను నీ స్వంతం అన్నట్టు వరూధిని లా నుంచుని వుంది.

మీరెప్పుడైనా ప్రేమించారా? ఏ వయసులో వున్నా, తొలి ప్రేమ మధురిమ ని మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏమి సాధించినా, మరువలేరు, మరువద్దు కూడా!

* * End * *

నేను రాసిన జీవిత ఖైది కధ చదివి "ఆ అబ్బాయి మనసులోకి వెళ్ళి మరీ అతని ఆలోచనలు తెలుసుకున్నావా?" అని కొంతమంది అడిగారు అన్ను. ఈ మాటలు బాగా తలకెక్కి, నా ఫ్రెండ్ (మన కధ hero) తొలిప్రేమ గురించి తెలిసి అడిగాను. "మీ కధ రాయచ్చా?" అని. ఆయన ఒప్పుకుని ఆ వివరాలు నాకు తెలియ చేశారు. ఏ వయసులో వున్నవారైనా, మొదటిసారి ప్రేమలో పడినప్పుడు అనుభవించిన టెన్షన్, విరహ బాధ, మరెప్పుడూ అనుభవించరు. అది ఆకర్షణ అయినా, ప్రేమ అయినా, తమవరకూ అది ఒక తీయనైన అనుభవం. దాని గురించి మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, మళ్ళీ ఆనాటి తమ భావపరంపరకి మరొక్కసారి లోనౌతారు. అందుకే తొలిప్రేమ అంత మధురం! ఈ కధ చదివి ఎవరైనా చక్కటి బాపూ బొమ్మకి ఈ సంఘటనలు తమ జీవితంలో జరిగినట్టు అనిపించి, తమ చిన్నప్పటి నేస్తం ఎవరైనా గుర్తుకి వస్తే, చిన్న information! మీ కోసం మన హీరో యింకా వేయి టార్చ్ లైట్లతో వెతుకుతున్నారు!!!

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.