స్వామి (మొదటి భాగం)- SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
రెండవ భాగం
మనం చేసే, చెప్పే కొన్ని మాటలు ఒకోసారి మనం అనుకోని విధం గా ఇతరుల మీద ప్రభావం చూపుతుంటాయి. ఇటువంటి ఒక సంఘటన గురించి చెపుతాను చదవండి.

* * *

"స్వప్న గారు పంపించారు.. ఏదో ఫ్లాపీ ఇస్తానన్నారుట కదా?"

స్వామి ని నేను చూడటం అదే మొదటిసారి. "మా ఆఫీస్ బిల్డింగ్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఏవో రెపేర్స్ చేస్తున్నారు. అర్జెంట్ కొటేషన్ ఒకటి పంపించాలి. ఏం చేయాలో తెలియట్లేదు" అని ప్రక్క బిల్డింగ్ లో పని చేస్తున్న నా ఫ్రెండ్ స్వప్న కి చెపితే తను వాళ్ళ ఆఫీస్ బోయ్ ని పంపుతాను, అతనికి ఇచ్చి ఆ ఫ్లాపీ పంపితే తను ప్రింట్ చేస్తానని చెప్పింది. అది తీసుకోవటానికి స్వామి వచ్చాడు.

అపుడు అతని మీద ఏదయినా అభిప్రాయం ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు నాకు. నేను అసలు అతన్ని సరిగ్గా గమనించలేదు కూడా.

తరువాత 2,3 వారాల కి స్వప్న పెళ్ళి కుదిరింది. తను రెజైన్ చేస్తుంటే వాళ్ళ బాస్ ఎవరినయినా రికమెండ్ చేసి, వాళ్ళని ఒక 15 రోజులు వుండి ట్రైన్ చేసి వెళ్ళమని రెక్వెస్ట్ చేసారు. తను నేచురల్ గా నన్ను రికమెండ్ చేసింది. నాకూ, నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం అంత ఎక్సైటింగ్ గా అనిపించటంలేదు. ఆ ఉద్యోగం మంచిది, కనుక వెంటనే ఒప్పుకున్నాను. ఆ తరువాత నెల నుండి నా ట్రైనింగ్ మొదలయింది.

నేను చేరిన మొదటి రోజున అక్కడ అంతా ఒక ఫేమిలీ లాగ కలిసి మెలిసి పని చేసుకోవటం చాలా బాగుంది అనుకున్నాను. స్వప్న ని స్వామి "అక్కా" అని పిలవటం గమనించాను. నన్ను కూడా "అక్కా" అని పిలిచాడు.

వెంటనే నేను చెప్పాను.. "నాకు నా స్వంత బంధువులు తప్ప బయటవాళ్ళు ఇలా వరుసలు కలిపి పిలవటం నచ్చదు. నేను అలా ఎవరినీ వరుసలు కలిపి పిలవను."

నేను కొంచెం కటువుగా అన్నానో ఏమో.. అతను చిన్నబుచ్చుకున్నాడు. అది గమనించి, అతనికి సర్ది చెపుదామని మళ్ళీ చెప్పాను..

"అది కాదు స్వామీ.. ఫ్రెండ్స్ అయితే పేరు పెట్టి పిలుచుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి అంటే గారు అనో మీరు అనో తోక తగిలించి పిలవాలి. అంతే కానీ వరుసలు పెట్టి పిలుచుకున్నంత మాత్రాన ఆత్మీయులు అయిపోతారా? ప్రక్కింటాయన్ని అన్నయ్యగారూ అని పిలవటం, వేరే రకం గా కుదరదు అనుకున్నప్పుడు అబ్బాయిలని అన్నయ్యా అని పిలవటం, వాళ్ళు వీళ్ళని చెల్లెమ్మా అంటూ మెలోడ్రామాలు పోవటం.. నాకు నవ్వు వస్తుంది. hypocricy అనిపిస్తుంది."

మధ్యలో కలుగచేసుకుని స్వప్న.. "అతనికి అలా లెక్చర్స్ ఇవ్వకు. క్షమించేయిలే." అని నాతో అని స్వామి తో..

"తను అంతేలే.. అన్నీ వితండవాదాలు."

"hypocricy అంటే ఏమిటండీ?" స్వామి అడిగాడు.

"డవుట్లు అడగకు.. ఇంక మళ్ళీ మొదలెడుతుంది." మా సంభాషణ కి తెర దించింది స్వప్న.

* * *

స్వామి తో పనిచేసేటప్పుడు నాకేమీ ఇబ్బంది లేదు కానీ ఒకోసారి అతను మరీ పొసెసీవ్ గా మాట్లాడేవాడు. నాకు ఇబ్బంది అనిపించేది. నాకన్నా చిన్నబ్బాయి.. అన్నీ సవ్యం గా జరిగి వుంటే.. చదువుకోవలసినవాడు.. ఇంటర్ తప్పడం తో వాళ్ళ నాన్నగారికి సాయం గా ఉద్యోగం లో చేరాడు. మా ఆఫీస్ లో మంచి పేరే వచ్చింది. మా బాస్ అతనికి ప్రైవేట్ గా చదువుకో.. నెమ్మదిగా మా కంపెనీ లోనే మంచి ఉద్యోగం లోకి తీసుకుంటామని చెప్పేవారు. కానీ అతనికి చదువు మీద శ్రద్ధ లేదు. నేను అక్కా అని పిలవద్దని చెప్పటాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ అదే మాట అతనికి వేరే ఆలోచనలు రేపిందేమో మరి నాకు ఇప్పటికీ తెలియదు.

మా ఆఫీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ తోనూ హార్డ్ వేర్ ఇంజినీర్స్ తోనూ కలిసి పనిచేటప్పుడు కొంత మంది సరదాగా ఫ్లిర్ట్ చేసేవారు. నేనూ వాళ్ళకి తగు సమాధానం చెప్పేదాన్ని. వాళ్ళు నాతో అట్లా మాట్లాడితే స్వామి చాలా చిత్రం గా రియాక్ట్ అయేవాడు. నేను అది గమనించాను. ఒకటి రెండు సార్లు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించాను. అతనితో కూడా సరదాగా మాట్లాడేదాన్ని. అతను వాళ్ళ ఇంటి ప్రక్కన ఎవరో అమ్మాయి వుందనీ తనంటే చాలా ఇష్టమనీ చెప్పేవాడు. నాకు అతను ఆ చిన్న వయసు లో అలా ఆలోచించటం వింతగా అనిపించేది. అతని ఆలోచనలు ఆమెని పెళ్ళి చేసుకోవటం అలా వుండేవి. మరి అవి జరగటానికి తను తన పరిస్థితి మెరుగు పరుచుకోవాలని బాగా స్థిరపడకపోతే ఏ అమ్మాయి పెళ్ళి సిద్ధపడదని చెప్పేదాన్ని.

ఒకసారి మా ఆఫీస్ లో అంతా కూర్చుని వున్నాం. ఏదో పెళ్ళిళ్ళ టాపిక్ వచ్చింది. అంతా ఎవరు ఎలాంటి వాళ్ళని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామో చెప్తున్నాం. నేనూ చెప్పాను. నాకు డబ్బు అక్కర్లేదు. నన్ను ఇష్టపడితే చాలు. నేను అన్నిటికీ సర్దుకుపోగలను. ఇలా నా జీవితభాగస్వామి గురించి నా ఆశలు వివరించాను.

మర్నాటి నుండీ స్వామి నన్ను సంధ్యా అని పేరు పెట్టి పిలవటం మొదలెట్టాడు. నేను నన్ను ఆఫీస్ లో పేరు పెట్టి పిలవద్దు అది ప్రొఫెషనల్ గా వుండదు. కనీసం నా పొజిషన్ ని గౌరవించాలి అని చెప్పాను. అతను చిన్నబుచ్చుకోవటం గమనించి "పోనీ వర్కింగ్ అవర్స్ లో అయినా నన్ను మేడం అని పిలువ్" అని చెప్పాను.

ఒకదాని వెనుక ఒకటి ఇలా చిన్న చిన్న ఇబ్బందులు రావటం మొదలయ్యాయి. నేను ఆఫీస్ లో ఇంకెవరితో అయినా సరదాగా మాట్లాడితే చాలా రూడ్ గా బిహేవ్ చేయటం మొదలెట్టేవాడు. నేను కంప్లయింట్ చేస్తే ముందు మా బాస్ అతన్ని ఉద్యోగం లోంచి తీసేస్తారు. అనవసరం గా అతని కుటుంబం మొత్తం బాధపడాలి. నేనే ఎక్కడో తప్పు చేసాను. అతనికి ఇంత చనువు ఇచ్చి వుండకూడదు అని మధన పడేదాన్ని.

అతన్ని discourage చేయటానికి నేనే అందరితో కొంచెం మాట్లాడించటం తగ్గించేసాను. నాకు చాలా ఇబ్బంది గా వుండేది అతని ప్రవర్తన. ఎందుకు అతనికి కోపం తెప్పించి మళ్ళీ అతను ఆ పిచ్చి లో ఏదో అనటం, నేను అందరి దృష్టి లో పడటం? ఒకోసారి చాలా కోపం వచ్చేది. ఎందుకు అతనికి నేను భయపడి నా ప్రవర్తన ని మార్చుకోవాలి అని.

మా అమ్మగారికి చెప్పాను. నేను తప్పు చేసానా అని అడిగాను. మా అమ్మగారు "నేనే నీకు చెపుదాం అనుకుని మళ్ళీ ఎందుకులే నువ్వూ అన్నీ తెలిసిన దానివి చిన్నపిల్లవి కావు. తెలుసుకుంటావు. నేను చెపితే, మళ్ళీ బాధ పడతావు అని ఊరుకున్నాను. ఎందుకు వచ్చిన బాధ .. శుభ్రం గా ఈ ఉద్యోగం మానేసి చదువుకో" అన్నారు.

నాకు ఈ సలహా నచ్చలేదు. అతనికి భయపడి నేను ఉద్యోగం ఎందుకు మానేయాలి? "After all.. చిన్న కుర్రాడు. నన్నేం బెదిరించగలడు?" అని మరింత మొండితనం వచ్చింది.

* * *

ఆ రోజు ఎందుకో మ ఆఫీస్ లో నేనూ మ ఇంకొక కొలీగ్ చిన్న విషయానికి వాదులాడుకున్నాం. ఏదో విషయం మీద నేను అతన్ని ప్రశ్నించటం అతనికి నచ్చలేదు. కనుక అతను నా మీద కోపం గా ఏదో అన్నాడు. నేనూ అతనికి తగిన రీతి లో సమాధానం చెప్పాను. అతను మా బాస్ కి నా మీద కంప్లయింట్ చేసాడు. దానికి మా బాస్ మా ఇద్దరికీ సర్ది చెప్పి, "చక్కటి ఫ్రెండ్స్.. చిన్నపిల్లల్లా ఇదేమిటీ? ఇద్దరూ ఒకరికొకరు co-operate చేసుకోవాలి కానీ ఇదేమిటీ?" అని ఇద్దరినీ మందలించారు.

నేను అప్పుడు బాగా childish గా వుండేదాన్ని. ఆ issue మీద మా బాస్ డెఫినిటీవ్ గా నా పక్షం వహించకపోవటం తో కోపం, అవమానం ఫీల్ అయి ఉద్యోగానికి రిజైన్ చేస్తాను అని చెప్పాను. దానికి మా బాస్ ఒప్పుకోలేదు. ఇది అంతా స్వామి ఎదురుగానే జరిగింది.

తరువాత నేనూ కూల్ అయ్యాను. ఆ సాయంత్రం నేను ఇంటికి వెళ్ళటానికి నా బైక్ స్టార్ట్ చేస్తుంటే స్వామి నా దగ్గరకి వచ్చి ఒక లెటర్ ఇచ్చాడు. "ఏమిటిది" అని నేను దాన్ని తెరిచి చూడబోతుంటే.. "వద్దు.. ఇంటికి వెళ్ళి చూడండి" అన్నాడు.

నేను ఆ రోజు అప్పటికే జరిగిన గొడవ తో చాలా upset అయి వున్నాను. ఇంక మళ్ళీ ఇతనితో పడలేను. మారుమాట్లాడకుండా దానిని నా bag లో పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళి చూస్తే అది love letter.. స్వామి నాకు రాసినది!

నేను వయసు లో తన కన్నా పెద్దదాన్ని అయినా.. అతని కళ్ళకి చిన్నపిల్ల లాగ అనిపిస్తాను అనీ, నాకు తనలాంటి మానసికంగా ఎదిగిన మనిషి తోడు కావాలనీ.. తనయితే నన్ను నేను కలలు కన్న విధం గా చూసుకుంటాననీ, నేను లేకపోతే తను బ్రతకలేననీ, నన్ను ఉద్యోగం మానవద్దనీ.. నేనంటే తనకి ఎంత ప్రేమో రకరకాల ఉపమానాలతో వివరిస్తూ రాసాడు.

నాకు దాన్ని చదివి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకు ఇంతవరకూ వచ్చింది ఇది? ఎందుకు అతనికి ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాదు? అసలు ఏమిటనుకుంటున్నాడు? నేనేమీ ఆదర్శాలు వల్లించేదాన్ని కాదు. నేనేమీ అంత ఆదర్శవంతురాలిని కాదు. నాకు తలితండ్రులనీ, కట్టుబాట్లానీ ఎదిరించే ధైర్యం లేదు. అంతకన్నా ముందు అతను రాసిన ప్రేమలేఖని చూడగానే ధ్రిల్లైపోయే వయసు కాదు నాది.

అంతెందుకూ నాకు అతనంటే ఎటువంటి ఫీలింగ్ లేదు. అతను కేవలం ఒక కొలీగ్. అంతే! ఆఫీస్ దాటి బయట అడుగు పెడితే నేను అతన్ని ఒక్క క్షణం కూడా మిస్ అవుతూ అతని గురించి ఆలోచించను. ఎక్కడ నేను అతనికి రాంగ్ సిగ్నల్స్ ఇచ్చాను? ఇంట్లో చెపితే ముందు ఉద్యోగం మానేయమంటారు. నాకు మానాలని లేదు. ఎందుకు మానాలి? నా తప్పు ఏమీలేనప్పుడు?

ఏం చేయాలి అని రాత్రంతా ఆలోచించాను.

* * *

మర్నాడు నాకు స్వామి వల్ల వస్తున్న ఇబ్బందులని గమనించి నన్ను ఒకసారి హెచ్చరించిన మా ఇంకొక కొలీగ్ రాజశేఖర్ కి ఈ విషయం చెప్పాను. అతనంటే స్వామి కి బాగా ఇష్టం. అతను చెపితే ఏమన్నా వింటాడని ఆశ. నాకు అనవసరం గా గొడవ చేసుకోవటం ఇష్టం లేదు.

అతనికి ఆ ఉత్తరం చూపించాను. "నేను ఈ బాధలన్నీ పడలేను. ఉద్యోగం మానేస్తాను" అని చెప్పాను. అతను కూడా నేను ఎందుకు ఉద్యోగం మానేయాలి? వద్దు. అని చెప్పారు.

రాజశేఖర్ ఈ విషయం మా బాస్ కి చెప్పారు. ఇదంతా మా బాస్ కి చెప్పటానికి నా సందిగ్ధం, నేను ఉద్యోగం మానేయలని చేస్తున్న ఆలోచన, మా ఇంట్లో వాళ్ళ ఉద్దేశం అన్నీ చెప్పారు.

మా బాస్ స్వామి ని పిలిచి అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా పని చేయకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తాను అని చెప్పారు. ఇది నా ముందు జరగలేదు.

స్వామి మర్నాటినుంచీ నాతో అందరూ ఉన్నపుడు అతి వినయం గా, ఎవరూ లేనపుడు నేను ఏదయినా అవసరం వచ్చి పిలిచినా తనని కానట్టు తను విననట్టు ఉండటం మొదలెట్టాడు. నాకు కోపం వచ్చినా, చిన్న పిల్లాడు.. తెలియని తనం.. రాజశేఖర్ ఏదో క్లాస్ తీసుకుని వుంటారు అందుకే కొంచెం చిన్నబుచ్చుకుని వుంటాడు, అనవసరం గా ఈ చెత్త సినిమాలు చూసి పిల్లలు పాడయిపోతున్నారు అని పెద్ద ఆరిందా లా అనుకున్నాను.

ఒక రోజు మా ఆఫీస్ లో నేనూ స్వామి వున్నాం. నేను హాల్ కి దగ్గర్లో నా గది లో పని చేసుకుంటున్నాను. స్వామి లోపల స్టోర్ రూం లో కూర్చుని వున్నాడు. మంచిగా ఉన్న రోజుల్లో వచ్చి నా దగ్గర కూర్చుని ఆ కబురూ ఈ కబురూ చెప్పేవాడు. ఇంతలో ఎవరో client వచ్చారు. ఆయన మా బాస్ కి మంచి ఫ్రెండ్ కూడా. ఆయన ఏదో ఎడ్రస్ అడిగారు. నాకు తెలియదు. స్వామి కి ఏమయినా తెలుసేమో కనుక్కుందామని "స్వామీ.." అని పిలిచాను.

అతను పలకలేదు. మళ్ళీ 2,3 సార్లు పిలిచాను. ఖచ్చితం గా అతనికి వినిపించే వుంటుంది. నాకు కోపం ఆగలేదు. నా ఎదురుగుండా కూర్చున్న ఆయన కూడా, "ఏం చేస్తున్నాడు? నిద్ర పోతున్నాడేమో!?" అన్నారు.

నేను లేచి లోపలికి వెళ్ళి చూసాను. అతను శుభ్రం గా కూర్చుని newspaper చదువుకుంటున్నాడు.

"అదేమిటి స్వామీ.. వినిపించలేదా పిలుస్తుంటే?" కోపాన్ని బలవంతాన ఆపుకుంటూ అడిగాను.

"వినిపించింది. ఏమిటీ?" అడిగాడు చాలా నిర్లక్ష్యం గా. అతని సమాధానం బయట కూర్చున్న ఆయనకి ఖచ్చితం గా వినిపించే వుంటుంది. ఆయన్ని మళ్ళీ ఎలా ఫేస్ చేయాలి? చెప్పలేనంత అభిమానం వేసింది.. అవమానం తో. కానీ తప్పదు. ఆయన ముందు స్వామి ని గట్టిగా మందలించి మరొక సీన్ ని క్రియేట్ చేయలేను. కనుక మారు మాట్లాడకుండా బయటకి వచ్చి, "తనకీ తెలియదంటండీ" చెప్పాను.

ఆయన సరే అని వెళ్ళిపోయారు. నేను ఇంక మళ్ళీ స్వామి తో మాట్లాడలేదు. ఎందుకొచ్చిన ఉద్యోగం? సుఖాన వున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోవటం కాకపోతే అని పిచ్చి కోపం వచ్చింది. కానీ ఎవరితోనూ మాట్లాడలనిపించలేదు. మౌనం గా నా రెజిగ్నేషన్ లెటర్ ని టైప్ చేసి దాని ప్రింట్ చేసి వుంచాను.

ఇంతలో రాజశేఖర్ వచ్చారు నా రూం లోకి. టేబుల్ మీద వున్న నా రిజిగ్నేషన్ లెటర్ ని చూసి "ఏమయింది? అని అడిగారు నన్ను.

అప్పుడు స్వామి ఆఫీస్ లో లేడు. కనుక నాకు ఏడుపు ఆగలేదు.

"ఎందుకిట్లా జరుగుతోంది? నేను మంచి గా వుండటానికి ప్రయత్నిస్తే ఎందుకు ఇలా lenience గా తీసుకుంటాడు? ఎన్ని రకాలుగా అతనికి చెప్పాలి? ఉద్యోగం పోతుందని భయం కూడ లేదు. నేను భయపడుతున్నాను అతని ఉద్యోగం పోతుందని! అతను అన్నిటికీ తెగించి వున్నాడు. నేను ఇలాంటి పరిస్థితి లో ఇక్కడ పని చెయ్యలేను." చెప్పి, అతనికి ఆ రోజు జరిగిన సంఘటన గురించి చెప్పాను.

తను ఏమీ మాట్లాడలేదు. కానీ, నా దగ్గర నుండి ఆ రెజిగ్నేషన్ లెటర్ ని తీసేసుకున్నారు. తొందరపడద్దని తను ఏదొ ఒకటి చేస్తానని మాట ఇచ్చారు.

నేనెందుకు ఉద్యోగం మానేయాలన్న మొండితనం మళ్ళీ నాలో ప్రవేశించింది. కనుక రాజశేఖర్ పరిష్కారానికై వెయిట్ చేయటానికే నిర్ణయించుకున్నాను.

* * *

మర్నాడు మా బాస్ నన్ను పిలిచి చెప్పారు. నేను కొంత మెచ్యూర్ అవ్వాలనీ, ప్రతీ దానికీ ఉద్యోగం మానేస్తాను అంటే, అది చాలా un-professional అనీ నాకు ఏమైనా సమస్యలు వుంటే ఎవరివల్ల అయినా సరే, తనకి చెప్తే తను చెయ్యాల్సినది చేస్తాననీ, కొన్ని సార్లు కంపెనీ సవ్యం గా నడవటానికి ఉద్యోగస్తులు క్రమశిక్షణ తో లేనపుడు తను కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుందనీ అందుకు భయపడి ఆఫీస్ లో జరుగుతున్న విషయాలు తనకి రిపోర్ట్ చేయటం మానేయటం చాలా తప్పనీ.. వగైరా .. వగైరా

ఇవన్నీ చెప్పి, స్వామి ని ఉద్యోగం లోంచి తీసేసాను అని చెప్పారు. "ఇంక ఆ ఇష్యూ అయిపోయింది. కనుక దాని గురించి ఆలొచించకండి. పని మీద శ్రద్ధ పెట్టండి." చెప్పి ఇంక నేను వెళ్ళచ్చు అన్నట్టు తన పేపర్లు చూసుకోవటం మొదలెట్టారు.

నేను ఏం మాట్లాడతాను? నేను చెప్పబోయినా తనకి జరుగుతున్న విషయాలన్నీ తెలుసనీ మళ్ళీ నన్ను చెప్పనీయలేదు. నేనూ పోనీలే, నాకు మరోసారి embarrassment తప్పింది అనుకున్నాను.

"ఎందుకొచ్చిన ఉద్యోగం అమ్మా.. శుభ్రం గా చదువుకో. ఏ బాంక్ టెస్ట్ లకో ప్రిపేర్ అవు. ఎందుకు నీకీ తలనొప్పులన్నీ? రేపు అతను నీమీద కోపం తో ఏమైనా చేసాడనుకో.. ఎందుకు మనకీ ఈ గొడవలన్ని?" నాన్నగారి మెత్తని చివాట్లు.

"నన్ను ఉద్యోగం మానేయమంటారెందుకు నాన్నగారూ? నేను ఏం తప్పు చేసాను? అతనికి భయపడి మంచి ఉద్యోగం నేను అస్సలు మానను." ఖచ్చితం గా చెప్పాను నాన్నగారికి.

* * *

రెండు రోజులు గడిచాయి. మళ్ళీ స్వామి నాకు కనిపించలేదు. హమ్మయ్య! అతని గొడవ ఒదిలింది. అనుకున్నాను.

కానీ అయ్యో.. నా వల్ల అతని ఉద్యోగం పోయిందే అని బాధ పడ్డాను. నేనే ఎక్కడో ఏదో రాంగ్ సిగ్నల్ ఇచ్చాను అతనికి. తెలీనితనం.. చెప్పినా అర్థం చేసుకోలేని వయసు! ఇప్పుడు చేజేతులారా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అతను మళ్ళీ ఎక్కడైనా ఉద్యోగం చేసినా, ఇంక ఎప్పటికీ నన్ను ఒక దోషి లా చూస్తాడు!

ఎవరయినా మన గురించి చెడు గా ఫీల్ అవుతున్నారని తెలిస్తే ఒక రకమైన ఇబ్బంది, ఒక బాధా వుంటుంది. ఆ రకమైన బాధ తాలూకు ఫీలింగ్, ఏదో తప్పు చేసిన భావం నన్ను వెంటాడుతోంది.

"నన్ను మళ్ళీ అతనికి ఎదురు పడేలా చేయకు. అతనికి ఈ సంఘటన వలన మంచే జరిగేలా చూడు" అని ఆ సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడిని ప్రార్థించాను. * * *

రెండవ భాగం