"సినీ రిపోర్టర్" సుబ్బారావ్ - పార్థు Back     Home  
ఈ పేజీ ని పంపండి
సుబ్బారావ్ ఒక కోరిక ఫలించింది...అతని కి "సిల్వర్ జూబిలీ" అనే సినీ వారపత్రిక లో రిపోర్టర్ గా వుద్యోగం వచ్చింది.

చిన్నప్పటి నుండి రావ్ ఎన్నో కలలుకనేవాడు దీని గురించి. ఎంచక్కా వెళ్ళి అందరు హీరోలను కలవచ్చు అని, షూటింగులు గట్రా చూసెయ్యొచ్చు అని.

జాయిన్ అయిన మూడో రోజులకి ఎడిటర్ నుండి పిలుపొచ్చింది. "నిన్ను, సినిమా రివ్యూ సెక్షన్ లో వెయ్యమన్నాను". చెప్పాడు

"బంపర్ హిట్" పత్రిక సెంటర్ పేజి తిరేగేస్తూ. "మొదటి షాటే స్మశానం లో సమాధుల మీద తియ్యాల్సొచ్చిన" కొత్త దర్శకుడి లా డీలాపడిపోయాడు సుబ్బారావ్.

"అయ్యా! తమరు కనికరించాలి." అన్నాడు గొంతు పెగుల్చుకుని. అలాంటి వాక్యాలు విని చాల కాలం అయిన ఎడిటర్ "అంటే, నేనేం చెయ్యాలి?" అన్నాడు.

సుబ్బారావ్ తన చిరకాల వాంఛల చిట్టా విప్పాడు.

తిడతాడేమో అనుకున్న ఎడిటర్ ఆనందంతో, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస మూర్తి కి కబురంపాడు.

"ఇదిగోనయ్యా మూర్తి! ఎన్నాళ్ళనుంచో అడుగుతున్నవ్ కదా రీప్లేస్ మెంట్ కావాలని, ఇతను ముచ్చటపడుతున్నాడు ఇంటర్వ్యూ లు చెయ్యాలని, వీలైనంత త్వరగా నేర్పించి వేరే సెక్షన్ తీసికో" అన్నాడు.

ఎందుకు తన వంక అంత జాలిగా చూశాడో మూర్తి అర్ధంకాలా సుబ్బడికి.

అతని ఇంకో కోరిక ఫలించేరోజు రానే వచ్చింది. ప్రఖ్యాత హీరో "నటపిశాచి" ని కలిసి ఇంటర్వ్యూ తీసికోబోతున్నాడు ఆరోజు.

నటపిశాచి అలాంటి, ఇలాంటి నటుడు కాదాయే మరి? "పైశాచిక పిశాచి" అన్న చిత్రం లో అతని భీభత్స, భయానక నటనతో సినిమా ని బాక్సాఫీస్ వద్ద సంచలనచిత్రం గా నిలపటం తో, అన్ని వర్గాల వారు ఆ బిరుదు ని అతనికి ధారాదత్తం చెయ్యటం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో ఆ తర్వాత, "పిశాచంతో పోరాటం, పిశాచానికిదే నా సవాల్", "కర్ణపిశాచి", "బలిపిశాచి", లాంటి ఎన్నో వైవిధ్యభరిత సినిమాలతో, సూపర్ హిట్లతో, తన స్థానాన్ని సుస్థిరం చేసికున్నాడు. లెక్కలేన్ని రికార్డులు, అభిమానసంఘాలు సంపాదించుకున్నాడు.

మీరు, మిగతా అగ్ర హీరోలతో కలిసి నటిస్తారా?
నిరభ్యంతరం గా. అలాంటి సబ్జెక్ట్ కుదిరితే తప్పకుండా చేస్తా.

మీరు ఈ మధ్య చేసిన సినిమాల లో అసలు సబ్జెక్టేమి వుండటం లేదు అనే విమర్శకుల నోళ్ళు ఎలా మూయిస్తారు?
మేం ఎవరి నోళ్ళళ్ళో వేలు పెట్టం, మూయించం. డబ్బులొచ్చాయా? రాలేదా? అవే ముఖ్యం ఇక్కడ.

నంబర్ 1 పై మీ అభిప్రాయం?
చాల మంచి పత్రిక, నా చేతుల మీదే ప్రారంభం అయింది, 25,000 కి పైగ కాపీలు అమ్ముడుపోతున్నయని విన్నాను.

చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ పొందటం ఎలాంటి అనుభూతినిస్తోంది?
ఎలాంటి అనుభూతినిస్తోంది అంటే ఏం చెపుతాం? ఐ యాం హ్యాపి.

మీకు బాగా నచ్చిన నటుడెవరు?
ఇంకెవరు మా నాన్నగారే.

బహుశా, మీరు ఇంకెవరివీ చూసే వారు కారనుకుంటా?
ఎలా కనిపెట్టారు? కూర్చోపెట్టి మరీ ఆయనవే చూపించే వారు చెప్తున్నా వినకుండా.

ఎక్స్ పరిమెంట్లు చేస్తారా మును ముందు?
ఇప్పుడు నేను అభిమానులని చూసుకోవాలి, వాళ్ళకి నచ్చినవే చెయ్యాలి, ముందుళ్ళలో లాగా, ఎక్స్ పరిమెంట్లు, పిప్పర్మెంట్లు అంటే కుదరదు. అభిమానులే మాకు దేవుళ్ళు.

చాల రోజుల తర్వాత ఓ ఘనవిజయం మీ సొంతమయ్యింది, ఎలా ఆస్వాదిస్తున్నారు?
నిజం చెప్పాలంటే, బంతి ఎంత ఎత్తు నుండి కింద పడుతుండో, మళ్ళీ అంటే ఎత్తుకు ఎగురుతుంది, జయాపజయాలు సహజం. అభిమానులు ఆనందం గా వున్నారు అది చాలు.

ఫలాన పాత్రలో మీరు జీవించారు అన్న ప్రశంసలకి మీ సమాధానం?
మా రక్తం లో హిమోగ్లోబినో, ప్లాస్మా, LCD లో లేవు, నటన ఒక్కటే వుంది. అది BP పెరగకపోయిన మరిగిపోతూనే వుంటుంది.

భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు వెయ్యాలనుకుంటున్నారు?
ఒక్క నిర్మాత పాత్ర తప్ప ఏదైనా.

అటు పూర్తి మహిళా హీరో గా, ఇటు మాస్ కథానాయకుడి, ఎలా వుంది రెండు పడవల ప్రయాణం?
ఆర్టిస్ట్ అన్న వాడు తొక్క లో అరటిపండు లాంటి వాడు, ఏ నొట్లో పెడితే ఆ నొట్లోకి కి జారిపోవాలి, అప్పుడే ప్రేక్షకుడు జుర్రుకో గలుగుతాడు.

జయాపజాయలు ఎలా స్వీకరిస్తారు?
నేను అవి అంతగా పట్టించుకోను. చెయ్యటం తో నా పని అయిపోయింది అని భావిస్తాను, మిగిలినవి ఏవన్నా వుంటే, మా వాళ్ళు చూసుకుంటారు. అయినా మన చేతుల్లో ఏముంటుంది.

ఏంటి ఇంత వేదాంతిలా చెపుతున్నారు?
చూడండి, ఈ జీవితం, ఈ సినిమా లు ఇవన్నీ మిధ్య. "చివరకి మిగిలేది?" సినిమా చూడలేదా మీరు? నా వరకు సక్సస్ వెలుగుతున్న సిగరెట్ లాంటిది అయితే, ఫెయిల్యూర్ మాడిపోయిన మూకుడు లాంటిది. రెండింటినుంచి వచ్చేది పొగే.

మరి సేవా కార్యక్రమాలు అవి ఇవీ?
సాటి మనిషిని ఆదుకున్నప్పుడు కలిగే ఆనందం ముందు ఈ కోటి రూపాయల షేర్లు, శతకోటి రికార్డ్ లు బలాదూర్ అనిపించింది.

మీరు శతదినోత్సవ సభల కి, విజయయాత్రలకి దూరం గా వుంటారెందుకు?
నాకు చిన్నప్పటినుండి బస్ లలో, రైళ్ళలో ఎక్కువసేపు తిరగాలంటే భయం. తీర్ధయాత్రలు చెయ్యటాని కి నేను రెడీ. విజయ యాత్రలు నా వల్ల కాదు.

చివరి గా ఒక ప్రశ్న, రాజకీయాలోకి ఎపుడు వస్తారు?
ఆ చెపుతారేంటి? నేనింకా చేరవలసిన మైలురాళ్ళు కొన్నివున్నాయ్, ఆ సర్వే కొలతలు గట్రా అన్నీ అయిన తర్వాత నా శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయిస్తాను.

రావ్ కి అప్పటికే రంగు పడింది.

ఓ రెండు రోజుల అనంతరం, బాగా వెలిగి, ఆరిపోయిన సంగీత దర్శకుడి దగ్గరకెళ్ళాడు.

ఆ మధ్య చిత్రాల సంఖ్య తగ్గిందే?
ఆపుడు పక్క రాస్ట్రం లో పొడిచేస్తున్నాను, తీరికలేదు ఇక్కడ చెయ్యడానికి.

ఈ మధ్య అక్కడ కూడా తగ్గినట్టుంది ఏం చేద్దామనుకుంటున్నారు?
"సింఫనీ.." చప్పున వచ్చింది సమాధానం.

"సింఫనీ అంటే, ఇప్పటికిప్పుడు......?
ఆగండాగండి! మీరేం అడగబోతున్నారో అర్ధమయ్యింది. ఏజీ యో కాదు తెలియదు కాని, అదొక్కటే మిగిలిపోయింది, అది చేసేస్తే ఓ పని అయిపొతుంది అని.

"బాలివుడ్ వెళ్ళే ఆలోచన లేదా?"
అక్కడ వారి పోకడలు, అభిరుచులు నాకంతగా నచ్చవ్. హాలివుడ్ నుండి 2 ఆఫర్ లున్నాయ్, వివరాలు 2, 3 ఏళ్ళలో ప్రకటిస్తాను అప్పటికి మీ పత్రిక, ఆ కంపెనీ రెండూ వుంటే.

శ్రోతలని దౄష్టి లో పెట్టుకు కంపోజ్ చేస్తుంటారా? సాహిత్యం మనసులో పెట్టుకుని కంపోజ్ చేస్తారా?
రెండు కాదు. దర్శకుడ్ని పక్కన పెట్టుకుని.

ఈ మధ్య విడుదలైన "తోట రాముడు.....తాట తీస్తాడు తోటకెళితే" కి శ్రోతల రెస్పాన్స్ ఎలా వుంది?
చాల బాగుంది, ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుదామంటే, స్కేర్సిటి వల్ల , రెండే దొరికాయట, మూడోది దొరికేదాక వాయిదా వేసారు నిర్మాత. ఆడియో సేల్స్ అదిరిపోతున్నయ్ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్ లంతా.

ఫాన్స్ నుండి ఎలాంటి ఉత్తరాలు, స్పందనలు వస్తుంటాయ్?
మొన్న విజయవాడ లో జరిగిన విజయోత్సవ సభ లో ఓ బామ్మ వచ్చి, " సుసర్ల వారి కాలం నుండి వింటున్నాను. ఈ మధ్య నువ్వు క్రూరవాణి రాగం లో చేసిన " తోట కొస్తావా, మా పేటకొస్తావా నా లస్కుటపా, తోటకొస్తే కౌగిలిస్తా, పేటకొస్తే ప్రేమిస్తా.. ఇంతకన్న ఎవడేమిస్తాడో చూస్తా, సై అంటే సెకనుకో హెడ్డు తీసికెళతా...ఒసోసి లస్కు టపా?" అంటూ చేసి, మెలోడీ ఈ రోజుల్లొ కూడా బతికేవుందని నిరూపించావ్ బాబు అని దీవించి చేతికి స్వర్ణకంకణం తొడిగింది "ముసలిముతకా కళావాహిని" వారి ఆధ్వర్యం లో. ఇంతకన్నా ఓ గొప్ప సంగీత దర్శకుడి గా నాకు కావల్సింది ఏముంటుంది చెప్పండి?

బంప్ తిన్న సుబ్బరావ్ అప్పటికే జంప్. చెప్పడానికి ఏడక్కడ ?


ఓ వారం గడిచిన తర్వాత, ఇంకో దర్శకుడి దగ్గరకెళ్ళాడు. ఆయన చిన్న హీరో లతో పెద్ద హిట్లు ఇచ్చి, పెద్ద హీరో లతో తిట్లు తిన్నాడు.

మీరు ఆ అగ్ర హీరో తో తీసిన చిత్రాల పరాజయం కి కారణం?
అగ్ర హీరో ల సినిమాలు అనగానే సహజం గా ఈక్వేషస్ మారిపోతుంది.మనకి పూర్తి స్వేచ్చ లభించడం చాల అరుదుగా జరుగుతుంటుంది , నేను పేపర్ మీద అనుకున్నది ఒకటి, తీయాల్సొచ్చింది ఇంకోకటి. అందరూ తల దూరిస్తే దర్శకుడు స్వేచ్చ కోల్పోతాడు.

ఈ మధ్య, మీ సోదరుడు నటిస్తున్న చిత్రం రషెష్ చూసి కొన్ని సన్నివేశాలు మళ్ళీ తియ్యమని సలహా ఇచ్చారుట దర్శకుడి కి?
అవి బెటర్మెంట్ కోసం చెప్పినవి.

మరి ఇప్పుడు చేస్తున్న హీరో తో ఎలా వుంది?
చాల కంఫర్టబుల్ గా వుంది. మా ఇద్దరి ఒడ్డు,పొడుగు బాగ కలిసాయ్. ఆయన ఏదైన నచ్చకపోతె, ఇలా చేస్తే ఎలా వుంటుంది అని అడుగుతారు, అదేంటో! ఆయన ఏం చెపుతారో అది నాకు సరిగ్గా నచ్చేస్తుంది, మా ఇద్దరి కి ఫిజిక్స్ భలే దొరికింది. చాల స్వేచ్చ నిస్తున్నారు.

అవును చూసాం. నిన్న షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరో మిమ్మల్ని కింద కి దించి రెక్కలు విప్పుతున్నారు. ఇందులో హీరో ఎలా వుంటాడు?
ఆయన పాత్రలో ఏం తేడా వుండదు కాని, ఆయన మాత్రం కొత్త గా కనిపిస్తారు. కొన్ని పాంట్లు సగమే రెడీ అవటం తో వాటి ని పైనేసుకుని, రెడీ అయినవి కిందేసుకుని విభిన్నం గా కనిపిస్తారు. అలానే, హైర్ స్టైల్స్ లో విషయం లో కూడా. ఆల్రెడీ మా సినిమా అని ఒక కార్పొరేట్ సంస్థ తీసుకొవడం, వారికి అన్ని బిజినెస్ లతోపాటు, సవరాల బిజినెస్ కూడా వుండటం తో, మా హీరో గంటకో సవరం మార్చి, కొత్త హైయిర్ స్టైల్ తో ప్రేక్షకులకి కనువిందుచేయనున్నాడు.

ప్రతి చిత్రం లో మీరు విలన్ వంశ నిర్మూనలకు హీరో కి ప్రత్యేక ఆయుధం ఇస్తుంటారు, ఈ చిత్రం లో?
ఇంతకు ముందు చిత్రాలలో హీరో కూరగాయలు కోసుకునే కత్తి, ఆవకాయ కి ముక్కలు కొట్టుకునే కత్తి ఆయుధం గా వాడాం. దీనిలో మా హీరో మొదటి భాగం లో మటన్ కొట్లో పనిచేసే వాడి లా కనిపిస్తుండటం తో, మా ఆర్ట్ డైరెక్టర్ అమితానంద సాయి గారు అత్యంత శృఅద్ధ తీసికుని చేస్తున్న మటన్ కత్తి ప్రత్యేక ఆకర్షణ కాబోతొంది.

కథ మొదటిసారి విన్నప్పుడు నటపిశాచి గారి రియాక్షన్?
"అసలు విన్నట్టే లేదు" అన్నారు.

ఇంతకీ కథ వున్నట్టా, లేనట్టా?
అంతర్లీనంగా వుంటుంది.

ప్రేక్షకుల కి వెతుక్కోవడం లో సహాయమేమైన చేస్తారా?
ఈరోజుల్లో ఏం చెప్పాము అన్నది కాదు, ఎలా చెప్పాము అన్నదే పాయింట్.

మరి 10, 12 సిట్టింగులు అయ్యాయని అన్నారు?
అది మేము హీరొయిన్ ని కంఫర్మ్ చెయ్యడానికి.

పూర్తిగా కొత్తవారితో చెయ్యబోతున్నరట, అదెలా వుంటుంది?
చాలా ప్రాఫిటబుల్ గా వుంటుంది.

ఇహ వినలేక లేచొచ్చాడు...సుబ్బారావ్.

ఓ నిర్మాత ని కలిసాడు ఓపిక తెచ్చుకుని ఓ వారం తర్వాత.

"సినిమాలు చూసే కాదు, తీసే రోజులు కూడా ఎప్పుడో పొయాయి" అన్నాడు ముందు నిర్వేదం గా, ఇంతలోనే తేరుకుని, "చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం, మా హీరో, డైరెక్టర్ లు తమ సొంత డబ్బులా భావించి, కాదు కాదు, సొంత సినిమా లా భావించి డబ్బు విచ్చలవిడిగా తగలెడుతున్నారు" అంటూ ఆవేదన తో, చివరి కి పళ్ళికిలించి , లేని నవ్వు తెచ్చుకుంటూ..అదే, "క్వాలిటి కోసం, క్వాలిటి కోసం" అంటూ తర్వాత ప్రశ్న ఏమిటా అన్నట్టు మొహంపెట్టాడు.

నిర్మాతలు జోకర్ లు గా మారుతున్నరు అని కామెంట్ వినిపిస్తోంది మీరేమంటారు?
నిజం అంటాను. సినిమా అన్నది పేకాట లాంటిది, మీకు తెలియదా జోకర్ కి ఎంత వాల్యు వుందో? హీరో కింగు అనుకుంటాడు, హీరోయిన్ క్వీన్ అనుకుంటుంది కాని, మేం లేందే ఆట కి అంత సీన్ లేదు, నెక్స్ట్.

కోట్ల కి కోట్లు పారితోషికాలు, అదుపులేని బడ్జెట్ పై మీ కామెంట్?
టైం అండి టైం. ఒకప్పుడు ఒకటో తరగతి ఫ్రీ గా చెప్పేవాళ్ళు, ఇప్పుడు అక్షరాల లక్ష అడుగుతున్నారు. మరి తలితండ్రులు వూరుకుంటున్నారా? ఇప్పుడు అన్నీ వ్యాపారమే అండి, తప్పేముంది ఇస్తే? నా అదౄస్టం కొద్దీ నా హీరో లంత నేను సెట్లు వేసి కోట్లు నష్టపోయిన చీకట్లో కలిసిపోకుండా ఇంకో సినిమా ఫ్రీ గా చేస్తూ వెలుగు చూపిస్తున్నారు. స్నేహం అంటే అంతేనండి ఒకోసారి నిమిషం సీన్ కోసం లక్షలు బూడిదచెయ్యాల్సి వస్తుంది, హిట్ దేముంది సార్ ఇవాళ కాకపోతే ఎల్లుండి వస్తుంది, భారీ సినిమా అనిపించుకోవటం కోసం తప్పదు, ఇవన్నీ అలవాటైపోయాయి మాకు. నెక్స్ట్.

ఈ రికార్డ్ లు, 100 రోజుల సెంటర్ లు ఇండస్ట్రీ ని తప్పుదోవ పట్టిస్తున్నాయని..?
అవి అభిమానులకి రెండు కళ్ళ లాంటివి. ఒక కంట్లో నలుసు పడితే వూరుకుంటారా, రెండోవాళ్ళ కంట్లో పులుసు పొయ్యకుండా? అభిమానులు బావుంటేనే హీరో పచ్చ గా వుంటాడు, హీరో అండ వుంటేనే కదా మేము అప్పుడప్పుడు 3 రాళ్ళు, 6 రప్పలు వనేకేసుకొగలిగేది. ఇవనీ మాములే.. ఇండస్ట్రీ తన పని తాను చేసుకుపోతుంటుంది.

ఆఫ్ బీట్ చిత్రాలపై మీ అభిప్రాయం...?
సినిమా అన్నది వ్యాపారాత్మక కళ. కళ తో వ్యాపారం చెయ్యాలి, వ్యాపారని కళాత్మకంగా చెయాలి. ఏదొ ఒకటే చేస్తా అంటే కుదరదు. నేను, నా సంస్థ, హార్ట్ బీట్ చిత్రాలు తీస్తామే తప్ప, ఆఫ్ బీట్ చిత్రాలు చెయ్యం.అంతెందుకు కేవలం ఆఫ్ బీట్ చిత్రాల స్టిల్స్, ఆ చిత్రాల దర్శక, నిర్మాలత ఇంటర్వ్యూలతో మీ పత్రిక నడపగలరా?

అప్పటికే హార్ట్ బ్రేక్ అయిన సుబ్బారావ్ కి ఆపై నిర్మాత ఏంచెపుతున్నాడో వినపడలా. కళ్ళ ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస మూర్తి చిద్విలాసం గా నవ్వుతున్న సీన్ ఒక్కటే కనపడసాగింది.

పార్ధూ

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత పార్థు కి తెలియ చేయండి.

మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.