స్నేహం - అరుణ బీరకాయల
ఈ పేజీ ని పంపండి

"ఏంటే తల్లీ ఇంత లేట్.. ఏమన్నాడు ప్రొఫెసర్? అంతా OK నేనా?" అంటూ యూనివర్శిటీ బయట అరుగు మీద కూర్చుని subway పొట్లాలు విప్పుతూ అడిగింది శ్రద్ధ రాధి ని.

"ఆ మొత్తానికి అయ్యింది అనిపించాడు బాబూ.. నా పని పూర్తిగా అయిపోయింది ఈ యూనివర్శిటీ లో" అంది రాధి.

"ఆకలి బాబో.. ఆకలి.. త్వరగా.." అనుకుంటూ ఆవురావురుమని యూనివర్శిటీ గట్టు మీద చక్కగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తినటం మొదలెట్టారు.

ఇది వాళ్ళకి అలవాటే. ఎప్పుడైనా ఇంటి తిండి మొహమ్మొత్తితే ఏదైనా తెచ్చుకుని అలా ఆరుబయట తింటారు. ఎవరు ఏమనుకున్నా వాళ్ళకి ఖతరా లేదు. మంచి స్నేహితులు. మొదట్లో వేరే ఉన్నా, ఒకే డిపార్ట్ మెంట్, బేచ్ అవటం తో బాగా క్లోజ్ అయి, ఉంటున్న ఇళ్ళల్లో కొన్ని సంఘటనలు నచ్చక తీవ్రం గా ఆలోచించి ఇద్దరూ కలిసి బయటకు వచ్చి వేరే ఉంటున్నారు. శ్రద్ధ కి ఉద్యోగం వచ్చింది. రాధి ఇంక apply చేస్తోంది. బేచ్ లో మిగతా మిత్రులు ఉద్యోగ రీత్యా వేరే ఊర్లు వెళ్ళిపోయారు. మిగిలింది వీళ్ళే. ఒకరి లైఫ్ లో ఒకరు జోక్యం అవ్వరు అలా అని, ఏవీ పట్టనట్టు కూడా ఉండరు. ఎంతవరకూ అవసరమో అంతవరకూ జోక్యం చేసుకుంటారు. మిగిలిన విషయాలు ఇష్టం అయితే చెప్పుకుంటారు లేదా చెప్పకపోయినా ఏమీ అనుకోరు. ఇవన్నీ ముందే ఒప్పందం పడి ఒకే ఇంట్లో ఉందాం అని అనుకున్నారు. లేకపోతే ఇద్దరి మధ్యా బేధాలు వస్తాయి అని భయం!

ఇలా కొన్నాళ్ళు సాగింది. రాధి కి పెళ్ళి కుదిరింది. అబ్బాయిది అదే ఊరు. పేరు సుధీర్. ఇంకో నాలుగు నెలల్లో పెళ్ళి. శ్రద్ధ కి ఇంకా సంబంధాలు చూస్తున్నారు. సుధీర్ రాకపోకలు, ఫోన్ లో కబుర్లూ మొదలయ్యాయి.

రెండు వారాలు బాగుంది. కానీ శ్రద్ధ కి మనసులో ఏదో బాధ. తన స్నేహితురాలు తనతో ఇదివరకట్లా ఎక్కువ సమయం గడపట్లేదు అని. ఎందుకు గడుపుతుంది? కాబోయే భర్తకు కదా ఇవ్వాలి ప్రాముఖ్యత! తన తప్పు ఏమీ లేదు ఏమో అని ఎప్పటికప్పుడు సమాధానం వెతుక్కున్నా ఉండి ఉండి చాలా బాధ వేసేది.

పగలు శ్రద్ధ ఉద్యోగం కి వెళ్ళిపోతుంది రాధి స్కూలు కి వెళ్ళిపోతుంది. ఉద్యోగం వెతుక్కోవటానికి. సాయంత్రం శ్రద్ధ వచ్చేసరికి రాధి కూడా స్కూల్ నుండి వచ్చేసేది. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళడమో, లేదా మిగతా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కబుర్లు చెప్పడమో చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య రాధి రాత్రులు సుధీర్ తో ఫోన్ లో మాట్లాడి లేట్ గా పడుకుంటోంది. అందువలన లేట్ గా స్కూల్ కి వెళ్ళి, శ్రద్ధ వచ్చే టైము కి రాలేకపోతోంది.

శ్రద్ధ కి హఠార్తుగా ఇంత తేడా తీసుకోలేక, రాధి వచ్చి చక్కగా మాట్లాడుతుంటే, తన పని వేగిరం చేసుకొని చెయ్యవలసిన వాళ్ళకి ఫోన్ చేసి పడుకునేది. కొన్నాళ్ళు పోయాక శ్రద్ధ కూడా ఆఫీస్ లో ఏదో పని ఉంది అని ఇంటికి లేట్ గా రావడం, వచ్చీ రాగానే కొంచెం సేపు మెలకొని పడుకోవడం చేసింది. ఉన్నంతసేపూ మనసులో ఏమీ లేనట్టు నటించి రాధి తో చక్కగానే మాట్లాడేది.

మనసులో మాత్రం, "ఎందుకు రాధి ఇలా చేస్తోంది? నేను తన మంచి స్నేహితురాలు అనుకున్నా. ఇంతకు ముందులాగ నాతో తన ఇంటి విషయాలు, టెన్షన్ లూ చెప్పుకోవట్లేదు, నాతో ఎక్కువ గడపట్లేదు! ఏం చెయ్యాలి?" అని ప్రశ్నలు మిగిలిపోయేవి శ్రద్ధకి.

ఇంతలో శ్రద్ధ కి కూడా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి New Jersey లో ఉంటాడు. జాతకాలు అన్నీ కుదిరాక అ అబ్బాయి శ్రద్ధ ని చూడడానికి వచ్చి వెళ్ళాడు.

ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. మంచి మహూర్తాలు చూసి, సరిగ్గా రాధి పెళ్ళి కి వారం ముందు శ్రద్ధ కీ పెళ్ళి ముహూర్తం కుదిరింది.

రాధి కి పట్టలేనంత ఆనందం వచ్చింది. ఇన్నాళ్ళూ శ్రద్ధ కి శలవ దొరుకుతుందో లేదో తన పెళ్ళి కి అనుకుంది. ఇప్పుడు అప్పటికి శ్రద్ధ కూడా ఇండియా వస్తుంది. తన పెళ్ళికి ఉంటుంది అన్న వార్త విన్నాక చాలా సంతోషపడింది. ఈ పెళ్ళి మాటల హడావిడి శ్రద్ధ మనసులో ఇదివరకు ఉన్న ఆలోచనలకు తోవ లేకుండా చేసింది. మంచికే అయినా, కొన్నాళ్ళకు శ్రద్ధ తనకు తెలీకుండానే ఎక్కువ సమయం తన would-be విహారి తో గడపసాగింది. దూరం గా ఉంటారు కాబట్టి ఫోన్లూ వీడియో కాన్ఫరెన్స్ లూ మెసెంజర్ లో చాట్లూ ఎక్కువ అయ్యాయి. ఉద్యోగం చేసుకొని వచ్చి వీటి తో అసలు సమయమే తెలీటం లేదు. ఇలా నెలన్నర గడిచింది.

పాపం వీళ్ళ పిచ్చి కానీ ఎన్నాళ్ళు అలా అంటిపెట్టుకొని ఉంటారు ఈ అబ్బాయిలు చెప్పండి? అమ్మాయి చిక్కేవరకూ ఫోన్ ల మీద ఫోన్ లు చేస్తూ ఉంటారు. అమ్మాయిలు ఒక్కసారి ఇష్టపడుతున్నారని తెలిసాక, మళ్ళీ కంప్యూటల మీదే గడిపేస్తారు ఈ సాఫ్ట్ వేర్ పెళ్ళికొడుకులు! ఆ ఘడియ కాస్తావచ్చింది వీళ్ళిద్దరికీ. ఇంతకు ముందులాగ ఆ సుధీర్, విహారి లు ఫోన్ లు చేయటం లేదు. ఏదో రెండ్రోజులకి ఒకసారి చెయ్యసాగారు. ఒకాయన అదే మన శ్రద్ధ వాళ్ళ కాబోయే ఆయన, వారం వరకూ చెయ్యలేదు. Yahoo లో మెసేజ్ లు పెట్టింది. ఇంటి ఫోన్ కి మెసేజ్ లు పెట్టింది. ఏమీ లాభం లేకపోయింది. ఎక్కడలేని ఖంగారూ వచ్చింది ఆ అమ్మాయికి. మొత్తానికి దొరగారు చిక్కారు.

"ఏం నాయనా ఫోన్ లేదు ఎంత ఖంగారు పడ్డానో తెలుసా?" అంటే "అబ్బా.. రిలీజ్ ఉండింది మాకు. కనుక ఆఫీస్ లో చాలా బిజీ గా ఉన్నా. ఇంటికి వచ్చిందే తక్కువ సార్లు! వచ్చి నీకు ఫోన్ చేసే ఓపిక లేకపోయేది. ఇదిగో ఈ రెండు రోజులూ కొంచెం ఊపిరి పీల్చుకున్నాక మళ్ళీ ఇంకో రిలీజ్ ఉంది. కొంచెం అర్థం చేసుకో.. అ ఇంకేమిటీ విశేషాలు? సరే అయితే నేను పడుకుంటా చాలా tired గా ఉంది. మళ్ళీ మాట్లాడతాను. ఫోన్ చెయ్యకపోతే ఖంగారు పడకు. వర్క్ లో బిజీ గా ఉంటాను కదా కొంచెం అర్థం చేసుకో. మొన్న రాసినట్లు అలాంటి సెంటీ emails రాయకు నీ పుణ్యం ఉంటుంది. అంత లేదు ఇక్కడ! సరేనా? bye" అని చెప్పి ఫోన్ పెట్టేసారు.

అవతల రాధి పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది.

శ్రద్ధ, రాధి టైమింగ్స్ మారిపోయాయి. కేవలం కలిసి భోజనం చేస్తారు. ఒక్కోసారి అది కూడా ఉండదు. జాబ్ టెన్షన్ లో రాధి ఉంది. తనకు అంతగా పట్టకపోయినా, శ్రద్ధ కి ఏమీ చెయ్యాలో తెలీక ఖంగారు పడుతోంది. ఇంట్లో ఉంటే ఆలోచనలతో పిచ్చి ఎక్కుతోంది అని అలా యూనివర్శిటీ వైపు నడుచుకుంటూ వెళ్ళింది.

వెళ్తండగా ఆ గట్టు కనబడింది. ఆ గట్టు మీద శ్రద్ధ, రాధి కలిసి ఎన్ని సర్లు కష్టసుఖాలు చెప్పుకొని, సరదాగా నవ్వుకొనే వాళ్ళో! కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి కానీ ఆపుకుంది. గబగబా ఆ గట్టు దగ్గరకు వెళ్ళి దాని మీద కూర్చొని ఆలోచించింది.

"అప్పుడు రాధి నాతో సరిగ్గా ఉండేది కాదు అనుకున్నా కానీ ఇన్నాళ్ళూ నేను ఏం చేసాను? నేను ఇంచుమించు అలాగే చేసాను కదా? రాధి కూడా నాలాగే బాధపడి ఉంటుంది ఏమో! నేను అస్సలు గమనించలేదు. పాపం ఒక రోజు అది బాధ లో ఉంది అని తెలిసినా నేను విహారి కాల్ లో ఉండటం వల్ల దగ్గరకు వెళ్ళి అడగలేకపోయాను. ఫోన్ అయ్యేసరికి అది వెళ్ళిపోయింది. అయ్యో నేను కూడ ఎంత తప్పు చేసను! కానీ నాకు తెలియలేదు ఏమిటీ!? పెళ్ళి ప్రయాణం కి ఇంక మూడు వారాలే మిగిలాయి. మళ్ళీ నేను, రాధి ఇంతకు ముందు లాగ ఉండలేము. చా! రాధి తో చాలా మాట్లాడాలి అని ఉంది!" అని లోపల కుమిలిపోతోంది శ్రద్ధ.

వెనక నుండి subway పేకెట్లు పట్టుకొని వచ్చి వీపు తట్టింది రాధి. గబుక్కున లేచి, చేతులోవి అందుకొంది. "హమ్మయ్యా.." అనిపించేలా మొహం పెట్టి కూర్చున్నారు ఇద్దరూ.

"సారీ రాధీ.." శ్రద్ధ మొదలుపెడుతుంటే.. "ఎందుకే బాబూ మళ్ళీ.. ఇద్దరికీ తెలిసినదే కదా ఇంక ఊరుకో! నాకు పిచ్చ పిచ్చగా ఆకలి వేస్తోంది నీతో బోలెడు చెప్పాలి. ఆ సుధీర్ గాడు.. ముందు తిను చెప్తా" అని చెప్పి ఇద్దరూ తినటం మొదలెట్టారు.

చెవులు బాగా కొరుక్కున్నాక, "ఇంక లాభం లేదే, వాళ్ళకి మనం ఇద్దరం కలిసి బుద్ధి చెప్దాం. మనకి ఉన్న ఈ మూడు వారాలూ చక్కటి స్నేహితురాళ్ళ లాగ గడుపుదాం. విహారి చేస్తే నువు లేవని చెప్తా. సుధీర్ చేస్తే నేను లేనని చెప్పు సరేనా? అప్పుడు దెబ్బకి దిగి వస్తారు" ఇన్నాళ్ళూ బేలెన్స్ లో ఉన్న కష్ట సుఖాలు చెప్పుకొని చెట్టాపట్టలేసుకొని ఇంటికి వెళ్ళారు. దగ్గర లో ఉన్న మాల్ కి వెళ్ళి, ఫోటోలు తీసుకొని, రాత్రి అయ్యాక, ఇంటికి వచ్చేసరికి, విహారి ఫోన్ వచ్చింది "శ్రద్ధ ఉందాండీ?" అని.

రాధి ఫోన్ తీసుకొని, "హలో విహారీ ఎలా ఉన్నారు? శ్రద్ధ పడుకొంది లేపొద్దు రేపు ఆఫీస్ లో ఏదో మీటింగ్ ఉంది వేగిరం వెళ్ళలి అని చెప్పింది. రేపు వీలున్నప్పుడు చెయ్యమని చెప్పనా?" అని అడిగి పెట్టేసింది. ఇద్దరూ కొంచెం సేపు నవ్వుకొని, పడుకొన్నారు.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి అరుణ బీరకాయల కి తెలియచేయండి.