రూపాయి - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
పొద్దుట 7 గంటల shift అంటే చాలా చిరాకు శివకి. యివాళ వున్నది morning shift, అదీ ఆదివారం.. అంతా హాయిగా నిద్రపోతుంటే.. తను పని చేయాల్సిరావటం, రాత్రి నిద్ర చాలలేదు, పనికెళ్ళాటానికి తను పొద్దుటే లేవాల్సిరావటం, జేబులో డబ్బులు లేవు, మొదటి తారీఖు యింకా 5 రోజులు వుండటం ... చిరాకు పడటానికి చాలానే కారణాలు వున్నాయి శివకి. అతను ఒక చిన్న ఫాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.

బీడీ తీసి వెలిగిద్దామని చూస్తే అగ్గిపెట్టె లోని ఆఖరు పుల్ల విరిగి క్రింద నీళ్ళలో పడిపోయింది. "నీ యబ్బ!" అనుకుని అటూ, యిటూ చూశాడు అగ్గిపెట్టె యిచ్చేవాళ్ళ కోసం. నాలుగు అడుగుల ముందు ఒకతను పోతున్నాడు.

"అన్నా.. అగ్గిపెట్టే వుందా?" వడి వడి గా నడచి అతని ప్రక్కకి వెళ్ళి అడిగాడు.

అతను మాట్లాడకుండా జేబులోంచి అగ్గిపెట్టె తీసి యిచ్చాడు.

Thanks అన్నట్టు ఒక చిరునవ్వుతో అగ్గిపెట్టె అతనికి తిరిగి యిచ్చాడు. కానీ అతను శివ thanks ని receive చేసుకునే mood లో లేడు. ఎందుకో మరి.. ఆందోళనగా వుంది అతని మొఖం. గబా గబా అతను శివని దాటుకుని వెళ్ళిపోయాడు.

యింకో నాలుగు అడుగులు ముందుకెళ్ళాక జేబులోంచి ఎదో తీసాడు అతను. ఆ తీయటంలో అతని జేబులోంచి ఎదో క్రింద పడింది. కొంత ముందుకెళ్ళి చూస్తే రూపాయి నాణెం. అతన్ని పిలిచి యిద్దామనుకుని మళ్ళీ ఆగిపోయాడు శివ.

"సరేలే.. అసలే నెలాఖరు రోజులు.. కనీసం బీడీలకయినా వస్తుంది." అనుకుని దాన్ని తీసి జేబులో వేసుకున్నాడు.

* * *

ఒంటి మామిడి జంక్షన్ దగ్గర బస్ ఎక్కుతున్నపుడు అతనూ అదే బస్ ఎక్కడం గమనించి కొంచెం యిబ్బంది feel అయాడు శివ. ప్రొద్దుటే, అదీ ఆదివారం కావటంతో బస్ లో ఎక్కువ మంది లేరు. బస్ లో చివరికంటా వెళ్ళి కూర్చున్నాడు. అతను తనకి రెండు సీట్లు ముందు కూర్చున్నాడు.

కండెక్టర్ వచ్చాడు అతని దగ్గరికి టికెట్ కోసం.

"పెద్దాసుపత్రికి ఒక టికెట్" చెప్పాడు అతను.

"యింకొక పావలా యివ్వండి" అడిగాడు కండెక్టర్.

"ఏంటీ? 2.25 చేసేసారా?" అంటూ మళ్ళీ జేబులో చేయి పెట్టాడతను డబ్బులు తీయటానికి. యింక డబ్బులు లేనట్టున్నాయి.. రెండు జేబులూ.. ఆ రూపాయి కోసమే అనుకుంటా వెతకడం మొదలుపెట్టాడు.

ఓపికగా నుంచున్న కండెక్టర్ అన్నాడు కొంచెం విసుగ్గా "ఏమయింది?"

"యింకో రూపాయి వుండాలి. ఎక్కడో పడిపోయినట్టుంది. రెండ్రూపాయల టికెట్టు లేదా?"

"రామారావు పేట సెకండ్ జమ్కన్ తర్వాత 2.25" చెప్పాడు కండక్టర్.

"అయ్యో అక్కడనుంచి చాలా దూరమే అసుపత్రికి! వంద నోటుకి చిల్లర వుందా?" అడిగాడు పై జేబులోంచి ఎదో తీస్తూ.

"పాపం అతనికి ఆ రూపాయి యిచ్చేయవలసింది. ఆసుపత్రికి అంటున్నాడు.. ఎవరికో సుస్తీ చేసినట్టుంది. యిటువంటప్పుడు యిలా చేయటం తప్పు." శివలో సంఘర్షణ మొదలయింది.

"పావలా కోసం వంద రూపాయల చిల్లరా?! రెండ్రూపాయల టికెట్ తీసుకోండి." చెప్పాడు కండెక్టర్.

"అదేందయ్యా అలా అంటావు? ఎన్నిసార్లు చిల్లర లేదని పావలా వుంచేసుకోలేదు? 2.25 టికెట్టిచ్చేయి" అతను కొంచెం సముదాయిస్తున్నట్టు అన్నాడు.

ఈ మాటకి కండెక్టర్ కి ఒళ్ళుమండినట్టుంది..

"సరేలే, యిలా అయితే బస్సులు నడపడం ఎందుకూ? ప్రజాసేవ బోర్డు పెట్టుకుని, తిరిగుతాం. మా ఓనరు నెత్తిమీద చెంగేసుకుని పోతాడు." వెటకారంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

దానికి అతను ఎదో సమాధానం చెప్పాడు.. వాళ్ళు అలా వాదులాడుకుంటున్నారు.

శివలో తప్పుచేసిన ఫీలింగ్ యింతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోసాగింది. తన వల్లే పాపం అతనికి ఈ యిబ్బంది అని.

"తీసుకుంటే పూర్తి డబ్బులు యిచ్చి 2.25 టికెట్టు తీసుకో లేకపోతే 2.00 టికెట్ తీసుకో" ఆఖరి మాట చెప్పాడు కండక్టర్.

"సరే, 2.00 టికెట్ యివ్వు. అక్కడ visiting time అయే లోపు చేరతానో లేదో!" చేసేదేమీ లేక అన్నాడతను.

"ఆగండి.. యిందాక మీ జేబులోంచి పడింది మీదే ఈ రూపాయి. మీరు చూసుకోలేదు. నేనూ.. రూపాయే కదా ఎంఅవుతుందిలే అని యివ్వలేదు." అతని చేతిలో ఆ రూపాయి పెడుతూ అన్నాడు శివ.

"ఒంటి మామిడి చెట్టు దగ్గర ఎక్కాను. యివిగో నా టికెట్ డబ్బులు" అని కండక్టర్ చేతిలో తన టికెట్ డబ్బులు పెట్టి, బస్ దిగిపోయఆడు శివ యింక అతని మొఖం చుడలేక, తన stop యింకా రాకపోయినా, తేలికయిన మనసు తో.

* * End * *

ఈ కధ నా మొదటి publish అయిన కధ. ఆ magazine పేరు గుర్తు లేదు, అరుణ అనుకుంటా. మా అమ్మగారు నేను నా కధలని పత్రికలకి పంపను అని మొండిగా అంటుంటే తనే బలవంతం గా ఒప్పించి, fair చేసి ఆ పత్రిక కి పంపారు. కానీ publish అయిన కధ ని ఆ పత్రిక ఎడిటర్ బాగా మార్చేసి, రెండు పేజీల కధ చేసి publish చేసారు. ఇది నేను రాసిన version.

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.