నిశబ్ద విప్లవం - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
"పార్వతమ్మ గారి ఇల్లు ఇదేనాండీ?" సన్నజాజి పందిరెక్కి పూలు కోస్తున్న మాలతి నిచ్చెన మీద నుంచి చూసింది వచ్చింది ఎవరా అని.

ONGC షర్ట్ వేసుకుని వున్న అతన్ని చూడగానే బావ గుర్తొచ్చాడు. బావ... బావ కబురు ఏమన్నా తెచ్చి వుంటాడని గబగబా నిచ్చెన నుంచి దిగడంలో పరికిణీ కాళ్ళకి అడ్డం పడి నిచ్చెన పక్కకి జరిగిపోయింది.

ఆ ఊపుకి పూలతో నిండిన పళ్ళెం పెద్ద శబ్దం చేస్తూ క్రింద పడింది. ఆ తర్వాత నిచ్చెన పడిపోతుంటే క్రిందకి దూకేసింది. ఇంతలో అతను వచ్చి పడబోతున్న నిచ్చెన్ని పట్టుకున్నాడు. మీకేమన్నా దెబ్బ తగిలిందా అని అడుగుతూ.

ఈ చప్పుళ్ళకి లోపల్నించి పార్వతమ్మ గారు వచ్చారు ఏమయిందా అని. అక్కడ విష్యం అర్దం అయి, "ఎన్ని సార్లు చెప్పాను మౌళీ? ఆ పరికిణీలు వెసుకుని నెచ్చెన ఎక్కద్దు అని? దెబ్బతగిలిందా?" మందలించారు మలతి కాలు మర్దనా చేస్తూ.

"బావ దగ్గర్నుంచి ఎవరో వచ్చారు అమ్మా. ఈ వారం వస్తాను అన్నాడు కదా? వచ్చాడెమో అని ఖంగారుగా దిగబోయాను. ఫాల్ కొంచెం కుట్టు ఊడింది, అది పట్టుకున్నట్టుంది!" లేస్తూ అంది మాలతి.

"రవి రాలేదండీ. లాస్ట్ మినిట్లో అతన్ని నరసాపురం బేస్ కి పంపించారు. అతని బదులు నేను వచ్చాను. నా పేరు శశాంక్" నమస్కారం చేస్తూ అన్నాడు అతను.

"అలాగా.."

గొంతులో తన నిరాశ వినిపించకపోయినా మొఖంలో కనిపించినట్టుంది..

"వచ్చే నెల ఇక్కడ చేయాల్సిన డేటా ప్రోసెసింగ్ పనికి తనే రావలి లెండి. అంత వరకూ నేను ఇక్కడ మిగిలిన పని చూస్తాను".

* * *

"మీదే ఊరు బాబూ?" కూర తరుగుతూ అడిగారు పార్వతమ్మగారు.

"కాకినాడండీ.. Kanpur లో నేనూ రవీ కలిసి చదివాము."

"మీరూ కంప్యూటర్ ఇంజినీరా?" కుతూహాలంగా అడిగింది మాలతి.

"అవును. ఇద్దరం కలిసే ONGC కి సెలక్ట్ అయాం కాంపస్ పికింగ్లో. అప్పట్నుంచీ అలా కలుస్తూనే వున్నాం. ఇపుడు నరసాపురం లో ఆయిల్ పడటం, పాశర్లపూడి లో బ్లో-అవుట్ వలన ఇక్కడ పనిచేసే అవకాశం వచ్చింది. నన్ను ఇక్కడికి పంపిస్తున్నారని తెలిసి రవే మీ ఎడ్రస్ ఇచ్చాడు, మిమ్మల్ని కలవమని. మాలతిగారికి లెటర్ ఒకటి పంపాడు. బేక్ పాక్ లోంచి ఒక కవర్ తీసి మాలతికి అందించాడు.

"మరి తెలిసిన వాళ్ళు ఎవరయినా వున్నారా బాబూ?" పార్వతమ్మగారు అడిగారు.

"అప్పనపల్లి లో మా చుట్టాలు ఎవరో వున్నారండీ, కానీ రోజూ అక్కడనుంచి రావటం కష్టం. మా వాళ్ళు ఇచ్చిన రూం సైట్ ప్రక్కనే, 24 గంటలూ అ శబ్దాలు విసుగ్గా ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలాగూ తప్పదు. మీరుండగా ఇక్కడ ఇబ్బంది పడద్దు, మిమ్మల్ని అడిగితే, మీకు తెల్సిన ఎవరి ఇంట్లో అయినా ఒక గది ఇప్పించ గలరు అని రవి చెప్పాడు."

"ఎన్నాళ్ళయిందీ మీరు వచ్చి?" మాలతి అడిగింది.

"నాలుగు రోజులు అయింది. కొంచెం పని ఎక్కువ వుండటం వలన రాలేదు ఇన్నాళ్ళూ."

"ఎక్కడో ఎందుకు? మా డాబా మీద గది ఖాళీ గానే ఉంది. అందులో వుండు. మళ్ళీ నువ్వు భోజనానికి హోటల్స్ కి వెళ్ళటం దేనికి? మా ఇంట్లో నే చేసేయి. నువు ఎప్పుడయినా వచ్చి వెళ్ళచ్చు. కానీ మందు మాత్రం తాగొద్దు." ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా పర్వతమ్మ గారు అన్నారు.

* * *

ఆదివారం అవటంతో లేటుగా నిద్ర లేచి బద్దకంగా డాబా మీదకి వచ్చాడు శశి. మామిడి చెట్టు క్రింద ఉయ్యాలలో కూర్చుని ఎండిపోయున బంతి పూల నుంచి విత్తనాలు తీస్తూ మౌళి కనపడింది.

"ఈ అమ్మాయికి పూలు తప్ప వేరే థ్యాస లేదనుకుంటా!" నవ్వుకున్నాడు.

"రవి నిజంగా లక్కీ ఫెలో! ఈ అమ్మాయి చాలా బావుంది! ముఖ్యంగా తెలుగుతనం అరుదయి పోతున్న ఈ రోజులలో ఈమెని పరికిణీ, ఓణీ, బారెడు జడ, పిడికెడు నడుము, చెంపకి చారెడేసి కళ్ళు, వాటికి కాటుక మెరుగు, ఇలా చూడటం, ఛ.. తప్పు అలా పరాయి ఆడపిల్లని గమనించకూడదు!" అనుకుంటూ వెనక్కి తిరిగాడు.

"లేచారా!? క్రిందకి రండి. మీకు ఇష్టమని గోధుమరవ్వ ఉప్మా చేసింది అమ్మ"

మౌళీ పలకరింపు విని "10 మినిట్స్.." గది లోకి నడుస్తూ చెప్పాడు.

స్నానం చేసి బట్టలు వేసుకుని క్రిందకి వెళ్ళబోతున్నంతలో తనే వచ్చింది పైకి ఉప్మా ప్లేట్, ఇంకొక డబ్బా తీసుకుని.

"ఏంటీ ఇంతసేపు? అమ్మ ఉప్మా చల్లారిపోతే చప్పగా అయిపోతుంది అంటూ ఒకటే చంపుడు."

"సారీ. ఆదివారం కదా, తీరిగ్గా స్నానం చేసాను. అ డబ్బా ఏమిటి?"

"పూతరేకులు. ఇష్టమేనా?"

"ఇష్టమా!? ప్రాణం! ఎన్నిరోజులయిందో తిని! మా ఊరు ఖండవిల్లి వెళ్ళినపుడు మా రైతు భార్య చేసేవారు. ఇంట్లో కాచిన నెయ్యితో, అబ్బా! చాలా బాగుండేవి!"

"ఇవి కూడా ఇంట్లో నెయ్యితో చేసినవే. మా మావయ్యకి పాడి వుంది. అప్పనపల్లి నుంచి వచ్చినపుడల్లా తెస్తాడు. కూరలు, నెయ్యి, అన్నీ. అయ్యో! ముందు ఉప్మా తినండి.. స్వీట్ తింటే ఇంక ఉప్మా తినరు..." అతను పూతరేకులు తినబోతుంటే వారింపుగా అంది.

"మీకు అయితే పల్లెటూర్లు అలవాటేనా?"

"అలవాటు అంటే పెద్దగా లేదు. కానీ ఎపుడెపుడు మా ఊరు వెళ్ళతానా అని ఎదురు చూస్తాను. మాకు ఖండవల్లి లో పొలాలు వున్నాయి. నాన్నగారికి జబ్బు చేసినపుడు వాటిని అమ్మేస్తాను అన్నారు మా రైతుకే. కానీ నాకు ఇష్టం లేదు. అది ఒక పాత లెగసీ అనిపిస్తుంది. మా నాన్నగారు ఒక్కరే తన భాగం అమ్మలేదు. మిగిలిన అన్నదమ్ములు అంతా వాళ్ళ వాళ్ళ భాగాలు అమ్మేసారు. ఇపుడు వాళ్ళు మళ్ళీ కొనాలన్నా అక్కడ అమ్మేవాళ్ళు లేరు."

"అయితే మీకు పొలం పనులు వచ్చా?"

"అంత అవకాశం రాలేదు. మా రైతుకి కౌలుకి ఇచ్చాం. కనుక పొలం పనులు అన్నీ అతనే చేస్తాడు. మేము ఒట్టి గట్టుపెత్తనం అంతే! ట్రాక్టర్ నడపడం వచ్చు. అక్కడకి వెళ్ళేది నేను ముఖ్యంగా ఆ ప్రశాంతత కోసం. జనవరి లో పంట నూర్పిడులు అప్పుడు అస్సలు మిస్ అవను సాధ్యమయినంత వరకూ. ఎక్కడ చూసినా తెలుగుతనం, పచ్చదనం, ముగ్ధమనోహారత్వం! వేకువనే వాకిలిలో ఏ గడప చూసినా రంగురంగుల తివాసీలని తలదన్నే ముగ్గులు, బాపూ బొమ్మల లాంటి ఆడపిల్లలు, మహాలక్ష్ముల్లా వాళ్ళ అమ్మలు, పంచె-కండువా లలో మగవాళ్ళూ, సింధూరం సినిమాలో రవితేజ లాగ షొకిల్లా కుర్రాళ్ళూ, గొబ్బెమ్మలు, వాటి చుట్టూ గిర్రున తిరుగుతూ పాడే గొబ్బెమ్మ పాటలు, ముఖ్యంగా మొగలీ పువ్వంటీ.. అంటూ పాట మధ్య లో మొగుడు కావాలీ అని సిగ్గువిడిచి అడగలేక వాళ్ళు ఒలకపోసే సిగ్గులూ, అబ్బా పల్లెటూర్ల గురించి అన్నీ ఇష్టమే. ఎక్కడ కనిపిస్తుంది మన ఈ కోనసీమ అందం!? కానీ ఇప్పుడు అక్కడ కూడా జనాలు సిటీల్లో లాగా ఆ పరుగుల కోసం తహాతహలాడుతూ తమకి ఉన్న సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారు."

"మా బావ మీకు సరీగ్గా వ్యతిరేకం. తనకి అస్సలు ఇక్కడికి వస్తే ముళ్ళ మీద వున్నట్టు వుంటాడు. పల్లెటురికి సంబంధించినది ఏదీ తనకి నచ్చదు. ఇప్పుడు అత్తయ్యకు ఇష్టం లేదు కదా, అసలు రావటం మానేసాడు 5 సంవత్సరాల నుంచీ."

"ఆ.. చెప్పాడు రవి. ఆంటీకి ఈ పెళ్ళి ఇష్టం లేదట కదా? ఏం? ఎందుకు?"

"నాన్నగారు పోయినప్పుడు పొలం గొడవలు ఏవో. అ కోపంలో అత్తయ్య వెంటనే వెళ్ళిపోయింది. పెళ్ళి కాన్సిల్ అంది. మేము ఈ పెళ్ళి ఖాయం అనుకుని నాకు వచ్చిన సంబంధాలు అన్నీ కాదన్నారు. ఇప్పుడు నాన్నగారూ పోయారు, వెతికే వాళ్ళు లేరు. ఒకవేళ వెతికినా, వంద ప్రశ్నలకి సమాధానాలు చెప్పలి! ఎలాగా.. అని అమ్మ బెంగెట్టుకుంది. అంతలో రవి బావ వచ్చి పెప్పాడు. తనకి ఉద్యోగం రాగానే అత్తయ్యని ఒప్పించి నన్నే పెళ్ళి చేసుకుంటానని, ఈ లోపు అత్తయ్య కూడా మారచ్చు అని. నేనంటే చాలా ఇష్టం అత్తయ్యకి. అమ్మంటేనే కోపం. బావకి ఉద్యోగం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పటినుంచీ బావ హైదరాబాదు వెళ్ళినపుడల్లా అత్తయ్యని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నాడు.

సర్లెండి, మా గొడవ ఎందుకు, ఏం చేస్తున్నారు ఇవాళ?"

"ఏం లేదు. ఏదయినా పుస్తకం చదవాలి. కానీ తెచ్చుకున్న పుస్తకలు అన్నీ అయిపోయాయి. మళ్ళీ లైబ్రరీకి వెళ్ళలి."

"ఏంటీ..తెలుగు నవలలు చదువుతారా? అవయితే నా దగ్గర కొన్ని వున్నాయి. క్రిందకి వచ్చి చూసుకుని మీకు కావల్సినవి తీసుకోండి."

* * *

గంట తర్వాత క్రిందకి వెళ్ళేసరికి మౌళీ రోకలి దగ్గర మినప్పప్పు, గిన్నెలో నీళ్ళూ, పీట అన్నీ సిద్దం చేస్తోంది.

"ఏంటీ పిండివంట ఏదో చేస్తున్నట్టున్నారు!" కాస్త పప్పు తీసి నోట్లో వేసుకుంటూ అడిగాడు శశి.

"పిండివంటా ఏమన్నానా! ఇవాళ ఆదివారం కదా, అమ్మకి వారం. ఇంకొంత సేపట్లో మావయ్య, పిల్లలూ వస్తారు. గిన్నెరోట్టె వేయాలి అందుకని. అదేంటీ!? ఏం చేస్తున్నారూ?" పీట మీద కూర్చుంటున్న శశి ని చూస్తూ అడిగింది.

"నేను రుబ్బుతాను. నాకు సరదా. మీరు చేసే టైము కి సగం టైము లో చేస్తాను. గిన్నె రొట్టె లోకి పట్టు తేనె వుంటే బాగుంటుంది."

"వుంది లెండి" అంటూ శశి కోసం ఇంకొక పీట తెచ్చి వేసింది మౌళి.

"అయ్యో అదేమిటి శశీ? నీకు అప్పగించిందా?" పార్వతమ్మగారు అడిగారు వంటింటి కిటికీ లోంచి.

"లేదు. నేనే చేస్తానన్నాను." రుబ్బటం మొదలుపెడుతూ జవాబిచ్చాడు.

"మా బావ ఒకసారి ఇలాగే, పిండి రుబ్బుతానని మొదలుపెట్టి స్పీడ్ గా పొత్రం ని తిప్పి పిండి అంతా చిందేసాడు."

"నేను అలా చేయనులెండి. మా అమ్మగారికి ఎప్పుడైనా రుబ్బిపెట్టేవాడిని. ఈ గ్రైండర్లు వచ్చాక దానిలో చేయటం మొదలుపెట్టారు కానీ, రోట్లో రుబ్బిన పిండి బాగా ఉరుము అవుతుంది, ఆ రుచి కూడా బాగుంటుంది."

"బావ నన్ను గుర్తు తెచ్చుకుంటాడా అసలు?" గొంతు తగ్గించి అడిగింది.

"రవికి మేము Mr.మౌళి అని పేరు పెట్టాము తెలుసా!? నోరు విప్పితే మీ కబుర్లే. అంత స్పెషల్ అమ్మాయి ఎవరో చూడాలని ఎపుడూ అనుకునే వాడిని. నిజంగా వాడు అదృష్టవంతుడు."

"మరి ఎందుకు ఈ మధ్య లెటర్స్ రాయటం లేదు?" ఉక్రోషంగా అడిగింది.

"ఏదీ, అస్సలు ఒకచోట వుంటే లెటర్ రాస్తాడు. తను రాసిన దగ్గర్నుంచీ మీ జవాబు గురించి ఎదురు చూడాలి. తను అక్కడ లేకపోతే ఎక్కడ మిస్ అవుతుందో అని ఆందోళన పడాలి. అంతకన్నా వీలు చూసుకుని తనే వద్దామని అనుకుని వుంటాడు. పోనీ ఫోను చేద్దామంటే మీకు ఫోను లేదు."

"మీరు బావని బాగా వెనకేసుకుని వస్తారు." పిండిని లోపలికి తోస్తూ అంది.

"మీకు మీ బావ గురించి మంచి మాటలు వినటం ఇష్టం. మీకు మాత్రం తెలీదా అతని ఇబ్బంది?"

"అవుననుకోండి... బావంటే నాకు చాలా ఇష్టం. మీ సంగతి ఏమిటి? ఎవరినయినా ఎప్పుడయినా ప్రేమించారా?"

"ఏదీ... నాకు మీలాంటి మరదలు లేదు."

"అదే మంచిది! మా బావ పాట్లు మీకు తప్పాయి."

* * *

గులాబీ మొక్కలకి నీళ్ళు పోస్తున్న మౌళి ని చూస్తూ ఆలోచిస్తున్నాడు శశి.

ఏమిటో ఈ మధ్య తను మౌళీ గురించి మరీ ఎక్కువ అలోచిస్తున్నాడు. ఏం చేసినా ఆమె రియాక్షన్ గురించి ఆలోచిస్తున్నాడు! ఏ చిన్న సంతోషం వచ్చినా ఆమెతో పంచుకోవాలి అని చూస్తున్నాడు. ఆమె ఒక నిశ్శబ్ద విప్లవంలా తనని ఆవరించుకుంది. తను చేసిన పాపం ఏమిటి? రవి చేసుకున్న పుణ్యం ఏమిటి? అతనికే ఎందుకు మౌళి లాంటి వ్యక్తిని ఇచ్చాడు? లేక తన కోసం కూడా ఒక మౌళీని ఎక్కడో పుట్టించాడా? ఆమె గురించి ఇంత ఆలోచించడం తనని తాను బాధ పెట్టుకోవటమే. అది భావ్యం కాదని తెలుసు. కానీ అమె మనసులో తను ఒక చిన్న మూల స్థానం ఏర్పరుచుకోవాలని ఈ వెర్రి ఆశ ఏమిటి? ఇది ప్రేమా లేక అందనిది అని ఒక పట్టుదలా? లేక ఒట్టి ఆకర్షణేనా? అమె అస్సలు రోజుకి పది నిమిషాలైనా నా గురించి ఆలోచిస్తుందా? రవి లో ఏమి చూసి ప్రేమించింది అసలు? చిన్నప్పటినుంచే బావతో పెళ్ళి అన్న భావం లోంచి పుట్టుకొచ్చిన ఆత్మీయతే ప్రేమ అనుకుంటోందా? కాదే! అమె ప్రతీ మాట, ప్రతీ చర్యా అది ప్రేమే అని చెప్పక చెప్తుంది. ఇంత ప్రేమ... నాకూ రాసి పెట్టాడా ఆ భగవంతుడు?"

"ఏమయినాకానీ ఇద్దరూ చాలా ముచ్చటగా వుంటారు! రవి కూడా ఈమెని తలుచుకోని క్షణం లేదు. అప్పుడు అస్సలు నమ్మలేదు. మౌళి లాంటి మరదళ్ళు ఉంటారని!

"మా అత్తయ్యకి ఆడపిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు?" అని భగవంతుడ్ని నిలదీయాలనుంది!

"ఛా.. ఇలాకాదు.." అని శారదాంబ గుడికి బయలుదేరాడు.

"మౌళీ.. మాల కట్టేశావా? గుడికి వెళ్తున్నాను. ఇచ్చేస్తాను." మెట్లు దిగుతూ అడిగాడు.

"మీరు వెళ్ళండి. నేను తెస్తాను. ఇంకా కొన్ని పూలు మిగిలిపోయాయి." మాల కడుతూ అంది మౌళి.

* * *

రవి 3 రోజుల్లో వస్తున్నాడు. పార్వతమ్మగారు అతనికి నిక్కచ్చిగా చెప్పారు. పెళ్ళి విష్యం తేల్చమని. లేకపోతే మౌళి కి వేరే సంబంధం చూస్తామని. మరి ఏం చేస్తాడో!

గుడి కొలనులో రాళ్ళు విసురుతూ ఆలోచిస్తున్నాడు శశి.

వెనకాల సుపరిచితమయిన మువ్వల శబ్దం వినిపించింది. ప్రక్కనే వచ్చి కూర్చుంది మౌళి.

"ఎల్లుండి సాయంత్రం నిశ్చితార్దం. రవి టెలిగ్రాం ఇచ్చాడు. అత్తయ్య, మావయ్య కూడా వస్తున్నారు. తరువాత అత్తయ్య వాళ్ళతో కల్సి రాజమండ్రీ స్వామీజీ దగ్గరకి వెళ్తాం. ఈ లోపు బావ ఇక్కడ పని ముగించుకుని శలవు తీసుకుంటాడు. కొన్నాళ్ళు అత్తయ్య వాళ్ళదగ్గరే ఉంటాను." చెప్పింది మౌళి.

"అదేమిటీ? పెళ్ళవకుండా అత్తారింట్లో వుండచ్చా?"

"ఇప్పుడయితే రాకపోకలు అగిపోయాయి కనుక కానీ, అదివరకు అంతా లేనా? అయినా అత్తయ్య నన్ను రమ్మని అడిగింది. మళ్ళీ తను ఏమయినా అనుకుంటుందని అమ్మ కూడా ఒప్పుకుంది."

"అయితే 4 రోజులలో వెళ్ళిపోతావన్న మాట!" నీటిలో కి సూటిగా చూస్తూ అడిగాడు.

ఆమె నుంచి సమాధానం ఏదీ రాకపోయేసరికి నెమ్మదిగా ఆమె వైపు చుసాడు.

మౌళి కళ్ళనిండా నీళ్ళు!

"మీరు ఏం అనుకుంటున్నారో నాకు తెలుసు శశీ.. నేను ఏం అనుకుంటున్నానో ఇపుడు చెప్పను. ఆ భావానికి ఒక పేరు పెట్టలేను. కొంతమంది ని తల్చుకుంటే మనసంతా ఒక ఆత్మీయత తో నిండుతుంది. ఈ అనుభూతే వేరొక భావానికి పునాదులు వేస్తుంది. కానీ మన స్నేహం ఆ రెండో దశ చేరకూడదు. అది ఎవరికీ మంచిది కాదు." తను చెప్పాలనుకున్న సమాధానం వినకుండా వెళ్ళిపోయింది.

* * *

నిశ్చితార్ధం అయిపోయింది. మళ్ళీ ఇద్దరి మధ్యా అటువంటి గంభీరమయిన క్షణాలు రాలేదు. వాళ్ళు తయారు అవుతున్నారు రైలుకి వెళ్ళటానికి.

పైకి వెళ్తూ అన్నాడు శశి, "మౌళీ, పైన గులాబీ మొక్క పువ్వు పూసింది, అడిగావుగా.. మొదటి పువ్వు కావాలని, వచ్చి కోసుకో."

స్నానం చేసి వచ్చేసరికి వాళ్ళు రిక్షాలు ఎక్కుతున్నారు. వాళ్ళని సాగనంపి పైకి వచ్చేసరికి "నేను ఎక్కడికీ వెళ్ళలేదు" అన్నట్టు మౌళీ లాగే స్వచ్చంగా నవ్వుతూ కనిపించింది గులాబీ.
* * End * *

ఈ కధ కి అయిడియా ఇచ్చింది ఇండియా లో కాకినాడ లో పని చేస్తున్నప్పుడు నా కొలీగ్ కిషోర్. తను ఈ కధ పాయింట్ నాలుగు వాక్యాలలో చెప్పి "కధ రాయగలవా?" అని నన్ను చాలెంజ్ చేసారు. నేను దానికి సరే అని ఇది రాసాను. ఇంక పాశర్లపూడి, ఖండవల్లి. ఈ రెండు ఊర్లూ నాకు ఎందుకో చాలా ఇష్టం. సంక్రాంతి! ఆ రోజులని ఎలా మర్చిపోగలను? మేము మన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలని మా అమ్మగారు మా చేత చుట్టుప్రక్కల ఎవరూ పెట్టుకోకపోయినా గొబ్బెమ్మలూ, ముగ్గులూ పెట్టించేవారు. ఈ మధ్య నాతో చిన్నప్పుడు ఈ ఆటలు ఆడుకున్న ఫ్రెండ్ మా ఊరు తన భర్త ని తీసుకొనివచ్చి మేము ఆడుకున్న ఆ ఆటలు, పాడుకున్న పాటలూ వివరించి చెప్పిందని మా అమ్మగారు నాకు ఫోను లో చెప్పగానే, ఎంతో బాధ పడ్డాను. నేను అక్కడ లేనందుకు, ఆ మధుర స్మృతులు కేవలం స్మృతులుగా మిగిలిపోయినందుకు!

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.