పంపిణీ - SKU Back   Home 
   ఈ పేజీ ని పంపండి

"ఈ సంవత్సరం మేము నాలుగు నెలలపాటు ఉంచుకుంటాము. మీ అప్పచెల్లెళ్ళు తలో రెన్నెళ్ళు తీసుకెళ్ళి ఉంచుకోండి. పూర్ణక్క ఆరోగ్యం అంత బాగోటం లేదు. వాళ్ళేమి చూసుకోగలరు అత్తయ్యగారిని, వాళ్ళ వంతు రెన్నెళ్ళూ కూడా మేమే మొత్తం నాలుగు నెలలూ చూస్తాము" ఫోన్ లో చెప్తోంది కుసుమ. అన్నీ నా ముందరే, నా భవిష్యత్తు గురించి నా ప్రమేయం లేకుండా నేను ఎక్కడ ఉండాలన్నది నిర్దేశిస్తోంది! ఎంత కరుణ! నన్ను మిగిలిన వాళ్ళ కన్నా రెండు నెలలు ఎక్కువ ఉంచుకోవటానికి ఒప్పుకుంది!

నా కొడుకు కి ఈ విషయం లో ఏమీ ప్రమేయం లేదు. ఎన్నో సార్లు నా నోటి తో నేనే అందరితో నా రెండో కోడలు ఎంతో తెలివైనది, ఎంతో సమర్థత తో నా కొడుకు ని ఒక దారికి తెచ్చింది అని అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ చెప్పాను. ఆ సమర్థత తోనే నా జీవితం ఎక్కడ తెల్లారాలన్నది ప్లాన్ చేస్తోంది.. అంతా.. నా కోసమే, నా మంచి కోసమే!

* * *

ఆరుగురు పిల్లలు మాకు. ఆయన మంచి ఉద్యోగమే చేసేవారు. మొదటి నలుగురూ ఆడపిల్లలు. మగ నలుసు కోసం ఎన్నో పూజలూ ఎన్నో వ్రతాలూ చేసాక మా పెద్దబ్బాయి జానకి రామ్ పుట్టాడు. వాడితో ఇంక సరి అనుకున్నాము. ఆ రోజుల్లో మరి ఈ అపరేషన్లు ఉండేవి కావు. పెద్దాళ్ళం అయిపోయాం ఇంక ఆ అంకం అయిపోయింది అనుకుంటున్న సమయం లో అనుకోకుండా పెద్దమ్మాయి వందన పుట్టిన పధ్నాలుగేళ్ళకి మళ్ళీ నేను నెల తప్పాను, అరవింద్ పుట్టాడు.

పిల్లలు అందరికీ తగిన సంబంధాలు చూసి ఆయన ఉండగా ఆయనే పెళ్ళిళ్ళు చేసారు. భగవంతుడి దయ వలన ఆడపిల్లలు అంతా వాళ్ళ అత్తారిళ్ళల్లో సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు. పెద్దాడి కి ఇద్దరు పిల్లలు, చిన్నాడికి ఓ కూతురు. అంతా సవ్యంగా జరుగుతుండగా చిన్నాడి కొడుకు అంటూ ఓ కుర్రాడ్ని తీసుకొని ఒకర్తి ఎవర్తో ఓ రోజు ఇంటి మీదకి వచ్చింది.

చిన్న కొడుకు అంతటి సమర్థుడు కూడా. వాడు డిప్యుటేషన్ మీద రామచంద్రాపురం లో పోస్టింగ్ అయినప్పుడు ప్రతీ రోజూ కాకినాడ రావటం కష్టం అవుతోందని కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు దానితో సంబంధం పెట్టుకున్నాట్ట! ఏనాడూ ఎవ్వరికీ తలవంచని ఈయన ఆ రోజు అరవింద్ చేసిన పని వలన తలదించుకోవలసి వచ్చింది.. ఆ ఊరు వెళ్ళి వాళ్ళ పంచాయితీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన విధం గా అన్నీ దగ్గరుండీ చేసారు. వాళ్ళు చెప్పినంతా డబ్బు పోసి మొత్తానికి దాన్ని ఒదిలించుకున్నాం.

ఈ గొడవ మొదలయిన వెంటనే పెట్టే బేడా సర్దుకొని వాళ్ళ పుట్టింటికి పోకుండా వాడిని దారికి తీసుకువస్తాం అని ఈయన ఇచ్చిన మాట ని మన్నించి మా ఇంట్లోనే ఉంది కుసుమ, అదే మా చిన్నాడి పెళ్ళాం. నేనూ ఆడదాన్నే, నాకూ తెలుసు మొగుడు వేరే దాని వెనకాల తిరుగుతున్నాడంటే, "నువ్వేం తక్కువ చేశావో!?" అనే తరహా వెటకారం చూపులూ పై పై జాలి మాటలూ, కూపీలు లాగాలని చూసే ఆరా మాటలూ. ఎన్నో రోజులు ఏడ్చింది, నేను ఏడుస్తున్నప్పుడు నన్ను ఓదార్చింది. ఇంక ఈయన కూడా పైకి ఏమీ చెప్పక పోయినా ఇంత బతుకూ బతికి మూలనున్న ముసిల్దాని చేతిలో చచ్చినట్టు ఎవ్వరికీ తల వంచకుండా బతికి, ఆఖరికి చిన్న కొడుకు చేసిన నిర్వాకం వలన అడ్డమైన వాళ్ళ కాళ్ళా వేళ్ళా పడాల్సి వస్తోంది అని ఎంతో కుమిలి పోయారు. ఆ బాధ తోనే అది వాళ్ళ కులం వాళ్ళని తీసుకొచ్చి పంచాయితీ పెట్టించి ఎక్కడెక్కడి గొంతెమ్మ కోర్కెలూ అడిగి, ఎంత బతిమాలినా కొండ దిగి రానని భీష్మించుకుని కూర్చుంటే మాగాణీ పక్కన సామాన్లు పెట్టడానికి గుడెసె వేద్దామని ఉంచిన చెక్క అమ్మేసారు. ఎన్ని అవసరాలు వచ్చినా, కనీసం ఆడపిల్లల పెళ్ళిళ్ళప్పుడు అవసరం వచ్చినా, "నీ పుట్టింటి వాళ్ళు పసుపూ కుంకుమ గా ఇచ్చిన భూమి, నేను దానిని ముట్టుకోను. దాన్ని ఏం చేస్తావో ఎవరికి ఇస్తావో నీష్టం" అనేవారు. అలాంటిది ఇలాంటి పరిస్థితి లో అమ్మేయాల్సి వచ్చింది.

ఇలా చేయటం వలన చిన్నకొడుకూ కోడలూ మాట ఏమో కానీ, పెద్ద కొడుకూ, కోడలుకి గిట్టని వాళ్ళం అయ్యాం. ఇది జరిగిన పదిహేను రోజులకి కొంచెం తెరిపిన పడ్డాం అని ఊపిరి పీల్చుకుంటుండగా, నెత్తి మీద గుదిబండ వేసినట్టు చెప్పాడు పెద్ద కొడుకు.. "నాన్నా, చౌడిపల్లి రాజు గారి అల్లుడు కైనెటిక్ హోండా అమ్మేస్తున్నాడుట.. మంచి రేటు కి వస్తోంది. ఒక పది వేలు నా దగ్గర ఉన్నాయి. మిగిలినది కొంచెం సర్దండి మళ్ళీ ఇలాంటి బేరం రాదు."

"నా దగ్గర మాత్రం ఎక్కడిదిరా డబ్బు?" అసహాయం గా, అయోమయం గా అడిగారు ఆయన.

"గుండిగేలు లో చెక్క అమ్మేసిన డబ్బు అంతా అయిపోయిందా?" తెలిసినా తెలీనట్టు అమాయకత్వం నటించాడు. వాడికి మాత్రం తెలీదా? డబ్బు అంతా అయిపోయింది అని? మా నోటెంట అంత డబ్బూ ఖర్చు అయిపోయింది, అదీ చిన్న కొడుకు ఇంటి మీదకి తెచ్చిన గొడవ వదిలించుకునేందుకు అని చెప్పించటం కాకపోతే?

వాడి కోసం మిగిలిన దానిని కుదవ పెట్టవలసి వచ్చింది. లేకపోతే, చిన్నాడికి తన కన్నా ఎక్కువ పెట్టేసాం అని వాడు ఏడ్చినా ఏడవకపోయినా, ఈ ఆడ పీనుగలు ఒదిలిపెట్టరు!

ఇంతలో ఈయన పని చేసే కో-ఆపరేటీవ్ బాంక్ ఏదో ఫ్రాడ్ చేసి బోర్డు తిప్పేసింది. ఏదో గుంభనం గా జరిగిపోతున్న మా బతుకులు తలకిందులు అయిపోయాయి దానితో. నిన్నటి దాకా పిల్లలందరికీ స్థిరమైన ఉద్యోగాలు, జీవితాలు సమకూర్చాం అని సంతృప్తి పడ్డాం. అంతలోకే ఈ బాంక్ గొడవ వచ్చేసరికి అదే పిల్లలు ఎవరి సంసారం లో వాళ్ళు కొట్టుకుంటున్నారు, మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరూ లేరు అన్నట్టు అయింది. కో-అపరేటీవ్ బాంక్ కి శఠగోపం పెట్టి చైర్మెన్ ఎక్కడికో చెక్కేసాడు. మిగిలిన ఏమీ తెలియని మా లాంటి మధ్య తరగతి ఉద్యోగుల బతుకులు చితికిపోయాయి.

ఉద్యోగం పోవటం, ఎదిగి వచ్చారు అనుకున్న కొడుకులు ఎటువంటి ఆసరా ఇవ్వకపోవటం, అల్లుళ్ళ ముందు చెయ్యి చాచడానికి అభిమానం అడ్డురావటం ఇలా ఎన్నో విషయాలు ఆయనని లోపల్లోపల కుంగిపోయేలా చేసి చివరికి ప్రాణం మీదకి వచ్చింది. బెంగ, దిగులు తో నిద్ర కి పోయి, మరి తిరిగి లేవలేదు. నేను ఇక్కడ ఒక్కదాన్నీ మిగిలాను.

* * *

ఆయన పోయిన వార్త తెలుస్తూనే పిల్లలు అంతా వచ్చారు. అమ్మ నగలు ఎన్ని కాసులు చేస్తాయి, అందులో రాళ్ళు విలువ ఎంత చేస్తాయి, నాన్న పెన్షన్ డబ్బు ఎంత వస్తుంది, పెన్షన్ ఎకౌంటు ఎక్కడ బాంక్ లో ఉంటే డబ్బులు తేలిగ్గా చేతికి వస్తాయి.. ఇవే మాటలు. ఒక్కళ్ళూ ఆయన లేరు, రేపటి నుండీ అమ్మ పరిస్థితి ఏమిటీ అనే దిగులు కానీ బాధ కానీ కనీసం నటించను కూడ నటించటం లేదు.

ధర్మోదకాలకి వచ్చినప్పుడు ఆయన చెల్లెలు తన దగ్గర ఉన్న ఇందిరా వికాశ పత్రాలు గురించి ప్రస్థావించినప్పుడు ఏవో ఒకట్రెండు ముక్కలు రెండో కోడలు కుసుమ చెవిన పడ్డాయి. "ఏంటత్తయ్యా వికాశ పత్రాలు.. ఎన్నున్నాయేమిటి? ఎవరి పేరున ఉన్నాయేమిటి? అక్కడ ఎందుకు ఉన్నాయి? మాకు చెప్పకుండా రహస్యమా?!" ఇలా నా దగ్గర నెమ్మదిగా గుసగుసలు పోయి, ఆఖరికి అందరి ముందూ నన్ను నిలదీసే పరిస్థితి తీసుకొచ్చింది.

ఏం చెప్పను? ఉన్నవి రెండు మాత్రమే అని చెప్పినా కొడుకులు కానీ కూతుళ్ళు కానీ నమ్మలేదు. వాళ్ళకి తెలియకుండా అక్కడ ఎక్కడో వాటిని ఉంచటం పెద్ద మహాపరాధం అయిపోయింది. ఆయన నా మంచి కోసం తనకి ఏమన్నా అయితే ఉంటాయి అని కొన్న వికాశ పత్రాలు నా నాశన కారులు అయ్యేట్టు అయ్యాయి!

దానితో, ఇష్టం లేకపోయినా, ఆయన ఆత్మ ఘోషిస్తుంది అని తెలిసినా వాటి కాగితాలు తెచ్చి అందరి పంచాయితీ ముందూ తెచ్చి నా కొడుకుల చేతుల్లో పెట్టాల్సి వచ్చింది. ఈయన మాసికాలకి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి ఎంత మందిని పిలవటం అవుతుంది, ఇంట్లో ఉన్న ఇత్తడి సమాను ఎక్కడ అమ్మాలీ ఇవే మాటలు. అన్నీ డబ్బు చుట్టూ తిరిగే మాటలు. అటు కొడుకులకి కానీ కూతుళ్ళకి కానీ, పోయినది తమ తండ్రి అనీ, ఆయన తో ఇన్నేళ్ళు గడిపిన నా ఎదురుగా ఆయన పోవటం కి సంబంధిచిన లెక్కలూ డొక్కలూ వేస్తే నా గుండె బాధ తో పగిలిపోతుంది అని కానీ, నన్ను ఒక ప్రాణం లేని వస్తువుని కదిపినట్టు వాళ్ళు చేసే పంపకాలతో నా మనసు ఏమి కోరుకుంటుందో ఒక్కళ్ళకీ పట్టడం లేదు.

నేను కాళ్ళూ చేతులూ బానే ఆడుతున్నదానిని కనుక అప్పట్లో నన్ను ఉంచుకోవటం పెద్ద సమస్య అవలేదు ఎవరికీ. నేను ఎదో వాళ్ళకి సేవలు చేస్తాను అని ఎవరూ అనుకోలేదు కానీ నాకు సేవలు చెయ్యక్కర్లేదు కనుక నాలుగు ముద్దలు పడేయటానికి ఎవరికీ అభ్యంతరం అనిపించలేదు.

కానీ అల్లుళ్ళ సంపాదన మీద తిని కూర్చునే సంప్రదాయమా మనది!? వాళ్ళకి ఏ బాధ లేకపోయినా నాకు మొహమాటం గా ఉండదూ? అది అర్థం కాదు ఎవరికీ. వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం నేను సంవత్సరం మొత్తం ఈ ఇంటి నుండి ఆ ఇంటికీ ఆ ఇంటి నుండి ఈ ఇంటికీ యాయవారం చేసుకునే బ్రాహ్మడి లా పెట్టె పుచ్చుకుని పోవలసిందే. ఈ ప్రకారం నేను బ్రతికున్నంత కాలం జరగాల్సిందే! కూతుళ్ళ దగ్గర ఉండాల్సొచ్చినప్పుడు ప్రాణం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. నా కోడళ్ళకి నా అవసరం ఏదో వచ్చి, ఈ సారి కూతుళ్ళ దగ్గరకి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నా జీవితం నా ఆధీనం లో లేదు. ఆయన పోతూ పోతూ దానిని నా పిల్లల నిర్ణయలకి వదిలేసారు.

* * *

ఇవాళ శుక్రవారం. నా కోసం కొద్దిగా ఉప్పుడు పిండి చేసుకొని, దానిలోకి వంకాయ పచ్చడి కోసం వంకాయలు కుంపట్లో కాలుస్తుండగా వీధిలోంచి కోడలు కుసుమ పిలిచింది. "అత్తయ్యగారూ, గుడికట వెళదాం వస్తారా అని అడుగుతున్నారు రామలక్ష్మి గారు".

"నాకు ఇంకా ఒక పది పదిహేను నిమిషాల పని ఉంది. పచ్చడి నూరాలి" అంటూ చూసేసరికి వచ్చి వెనకే నుల్చుంది కోడలు.

"ఆ పచ్చడేదో నేను పూర్తి చేస్తాను. మీరు వెళ్ళండి. అయినా మీరు ఆ పచ్చట్లో నశాళానికి అంటేట్టు ఖారం పోసేస్తారు." నా మీద ప్రేమో, నేను చేసే పచ్చడంటే వెగటో నన్ను విడుదల చేసింది.

* * *

రామలక్ష్మి గారు మా ఎదురింట్లో ఉంటుంది. కొంచెం ఇంచుమించు నా బతుకే ఆవిడదీ. కాకపోతే ఒక్కర్తీ ఉంటుంది. వారానికి తల్లిని చూడటానికి వచ్చినట్టు వచ్చి దొడ్లో ఉన్న చెట్లూ చేమలూ అన్నీ దులపరించేసుకొని పోతాడు పక్కూర్లో ఉన్న కొడుకు. వాడు సంవత్సరం పొడవునా ఎంత తిన్నాడో లెక్కలు కట్టి అంతా తనకి ముడుతోందో లేదో అణాపైసలతో లెక్కలు వేసి మరీ పట్టుకెళుతుంది సంవత్సరానికి ఓ సారి వచ్చే కూతురు. వాళ్ళాయన ఆరేడేళ్ళ క్రితం పోయారు.

నా మీద కోడలు కేకలు వేయటం, నేను జవాబులు ఇవ్వడం ఎప్పుడన్నా చెవిన పడితే, "ఈ గోల అంతా భరించలేకే కష్టమైనా, దిక్కులేని దానిలాగ ఒక్కర్తినే ఉంటున్నా" అంటుంది. కానీ తనకీ వయసైపోతోంది. కళ్ళ చూపు మందగించింది. ఒక్కర్తీ పెరట్లోకి వెళ్ళలాన్నా రాత్రిపూట భయం వేస్తోంది అని తన దూరం బంధువు ఒకాయన వృద్ధాశ్రమం ఏదో నడుపుతున్నాడు అక్కడకి పోయి ఉందామా అని ఆలోచిస్తున్నాను అని ఆ మధ్య చెప్పింది.

ఆవిడ చెప్పిన వృద్ధాశ్రమం విషయం విన్నాక ఆసక్తి తో "ఏమిటీ ఊరికే కొడుకులే పెట్టనిది ఎవరో వాళ్ళు మాత్రం ఎందుకు పెట్టి పోషిస్తారూ?" అని అడిగాను.

ఆ విషయాలు కనుక్కుని చెప్తూ ఒక మాట అడిగింది. నేను కూడా వస్తానంటే ఇద్దరికీ కలిపి ఒక బేరం మాట్లాడి కలిసి వెళ్ళి అక్కడ ఉండే ఏర్పాట్లు చేస్తాను అని.

భయం.. నలుగురూ ఏమనుకుంటారో అని. నా కొడుకులనీ, కూతుళ్ళన్నీ అంటే నన్ను అన్నట్టు కాదూ? అలాగని వీళ్ళకి గుదిబండ లాగ ఇక్కడ ఉండటమా? ఇవాళ కాలూ చేయీ ఆడుతోంది కనుక ఎవరికీ బాధ లేదు కానీ నేను మంచం పడితే నన్ను చూసుకొని, సేవలు చేయటానికి వాళ్ళకి మాత్రం బతుకులు లేవూ?

లేదు.. ఏదో ఒకటి ఇప్పుడే చెయ్యాలి. ఒక నిర్ణయానికి వచ్చి నా పిల్లల పేరిట ఉత్తరం రాయటం మొదలెట్టాను.

* * *

వృద్ధాశ్రమం శ్రావణి కి వచ్చి ఇవాళ్టికి వారం రోజులైంది. మాట ఇచ్చినట్టు రామలక్ష్మి గారు కూడా నాతో ఇక్కడకి వచ్చి చేరింది. పిల్లల నుండీ, మనవల నుండీ దూరం గా ఉండటం వింతగా, బాధ గా ఉంది. కానీ, వాళ్ళ జీవితాలలో అడ్డం ఏమో, వాళ్ళకి ఇబ్బంది ఏమో అనే సంకోచం ఇవాళ లేదు. నన్ను చూడాలనుకుంటే వాళ్ళు వచ్చి చూసెళ్తారు. లేదా నేనే వెళ్తాను.

ఆ రోజు...

వంతు ప్రకారం రెండో కూతురి ఇంటికి ప్రయాణం కట్టాను. కాకపోతే వెళ్ళింది కూతురు దగ్గరకి కాదు. ఇక్కడ శ్రావణికి. ఈయన పెన్షన్ డబ్బు ఇక్కడ నా అవసరాలకి సరిపోతుంది. ముందు రోజు రాత్రి రాసిన ఉత్తరం నేను ఇక్కడ శ్రావణి కి వచ్చాక చిన్న కొడుకు ఇంటికి పోస్ట్ చేసాను. అందిన వెంటనే కొందరు స్వయం గా వస్తే, కొందరు ఫోన్ చేసి నిష్టూరాలు పోయారు. కానీ, అందరికీ అర్థం అయేలా చెప్పాననే అనుకుంటున్నాను. ఆయన ఉండి ఉంటే నా నిర్ణయాన్ని తప్పక సమర్థించి ఉండేవారు. ప్రశాంతమైన వాతావరణం, నా సమవయస్కులు, తోచకపోతే చూడటానికి టెలివిజన్, చదవటానికి పుస్తకాలూ, లేకపోతే కుట్లూ, అల్లికలు లాంటి విద్యలేమైనా వస్తే వాటితో నాలుగు రాళ్ళు సంపాదించుకునే అవకాశం.

పగలంతా ఓపిక ఉన్నంత వరకూ కూరల మడి లో కలుపు మొక్కలు పీకటమో, నీళ్ళు పట్టడమో చేయటం.. సాయంత్రం పూల మొక్కల పూలు అన్నీ దండ కట్టి వచ్చే జన్మ లో అయినా ఆయన సాంగత్యం చివరి వరకూ ప్రసాదించమని దేవుడిని కోరుతూ వాటిని ఆయనకి నివేదించుకోవటం. ప్రస్తుతానికి నా బతుకు ఎవరికీ బరువు కానందుకు ఉన్నంతలో తృప్తి గా ఉంది. నా తృప్తిని చూసయినా నా పిల్లలు నాకు అన్యాయం చేసామేమో అనే బాధ నుండి విముక్తులు అవుతారు.

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.