ఇంటర్నెట్ పరిచయం - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
రాత్రి పదకొండున్నర అవుతోంది. రేపు సోమవారం, ఆఫీస్ లో బోల్డు పని వుంది. TV కట్టేసి బెడ్ రూం లోకి నడిచాను. మంచి నీళ్ళు తీసుకోవటం మర్చిపోయాను అని గుర్తుకు వచ్చి వంటింట్లోకి నడిచేసరికి ఫోన్ మ్రోగింది. "ఇంత రాత్రి ఎవరబ్బా?" అనుకున్నాను. సాధారణం గా నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను త్వరగా నిద్ర పోయే టైపు అని. అయినా ఫోన్ చేసారంటే ఎదో ముఖ్యమైన విషయం అవుతుంది. కాలర్ ID చూస్తే, శరత్!

"చెప్పు" అన్నాను వంటింట్లో ఫోన్ తీసుకుంటూ.

"షరీఫ్.. ఐ నీడ్ టు టాక్ టు యూ" అన్నాడు అటు వైపు నుండి సీరియస్ గా.

"ఏరా? ఎక్కడ నుండి? ఎలా వుంది డెట్రాయిట్?" వాడికి అటు వైపు కనపడకపోయినా తను వెళ్ళిన కారణం తలచుకొని కన్నుకొడుతూ అన్నాను.

"నా చెప్పు ఇచ్చి కొట్టించుకొని వున్నాను." అన్నాడు శరత్. కంఠం కొంచెం వొణుకు వినిపించింది. ఎదో సీరియస్ మేటర్ అని అర్థం అయింది. "వుండు కార్డ్ లెస్ తీసుకుంటా" చెప్పి వేరే ఫోన్ తీసుకొని మంచినీళ్ళతో పాటియో లోకి నడిచాను.

* * *


శరత్ ఆరేళ్ళ క్రితం ఇక్కడకి వచ్చాడు. వచ్చిన కొంచెం ఇంచుమించు అదే టైము లో నేను కూడా ఇక్కడకి వచ్చాను. US వచ్చిన కొత్తల్లో ఇద్దరం ఒకే ఇంట్లో వుండేవాళ్ళం. మా రూం' మేట్ రవీంద్ర కి తను ఎదో చుట్టం అవుతాడు. నాకు అప్పటికి పెళ్ళి అవలేదు. శరత్ కి పెళ్ళి అయింది. ఎదో మిషన్ మీద వచ్చిన మనిషి లాగ వుండేవాడు ఎవరికో తనని తాను నిరూపించుకోవాలన్నట్టు కష్టపడేవాడు. అతని కష్టపడే తత్వం, ఇతరుల విషయాలలో అనవసరం గా జోక్యం కలిగించుకోని మనఃస్థత్వం నాకు నచ్చాయి. కొంచెం మా అభిరుచులు కూడా కలవటం తో ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాము. ఇండియా లో సంవత్సరం వయసు వున్న పాప వుందట. ఎవో తేడాలు రావటం తో ఆమె డైవోర్స్ కి ఫైల్ చేసారు, ఆ తరువాత తిను ఇక్కడకి వచ్చాడు.

ఒక్కడూ ఇంక వేరే ఏమీ లైఫ్ లేనట్టు కష్టపడేవాడు. ఆరు సంవత్సరాల కాలం లో తనకంటూ బోస్టన్ లో ఒక మంచి బిజినెస్, హోదా సంపాదించుకున్నాడు.

సంసారం లేని వాడు కూడా అయ్యాడు. అదే, అతని భార్య పెట్టుకున్న విడాకుల అర్జీ ని కోర్ట్ ఆమోదించింది. ఈ లోగా నేను కూడా పెళ్ళి చేసుకొని, ఇల్లు కొనుక్కుని వేరే వెళ్ళిపోయాను. మా ఇంకో రూమ్మేట్ రవీంద్ర కొలరాడో లో ఉద్యోగం వచ్చి అక్కడకి వెళ్ళిపోయాడు.

తన అభిరుచి కి తగ్గ అమ్మాయి ని తనే వెతుక్కోవాలని రవీంద్ర ఒక మేట్రిమోనియల్ సైట్ లో రిజిస్టర్ అయ్యాడు. అక్కడ రిజిస్టర్ అయిన కొద్ది కాలం లోనే తన మనసుకి నచ్చిన అమ్మాయి తారసపడింది. పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఆ విషయం చెప్పి, శరత్ ని కూడా బలవంతం గా ఆ సైట్ లో రిజిస్టర్ చేయించాడు రవీంద్ర. మా స్నేహం స్వవిషయాలు మాట్లాడుకునేంత చిక్కపడింది. ముగ్గురం రెగ్యులర్ గా ఫోన్ లేకపోతే ఈ-మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ లో వుంటాం కనుక ఒకళ్ళ విషయాలు ఒకళ్ళం నిరభ్యంతరం గా చర్చించుకుంటూ, సూచనలు ఇచ్చుకుంటూ మా స్నేహాన్ని కొనసాగిస్తున్నాం.

* * *


పోరటం రవీంద్ర వంతు అయినప్పటికీ శరత్ కూడా ఒంటరితనం తో విసిగిపోయాడన్నది వాస్తవం. తనకీ ఒక తోడు కావాలన్న వుద్దేశం, ఒక జీవిత భాగస్వామి దొరుకుతుందని ఆశ తోనే ఆ సైట్ లో తను కూడా రిజిస్టర్ అయ్యాడు. కానీ ఒకసారి దెబ్బ తిని వుండటం తో కొంచెం వచ్చే అమ్మాయి తననీ తన విడాకులకి దారి తీసిన పరిస్థితులనీ, ముందు భార్యతో తనకి వున్న పాప నీ అంగీకరిస్తుందో లేదో అని అనుమానం మాత్రం వదల్లేదు శరత్. ఏదో దైవం పంపినట్టు ఒక అమ్మాయి అతని జీవితం లోకి ప్రవేశించింది.

కిరణ్మయి ఆ అమ్మాయి పేరు. వీడు మాత్రం ముద్దు గా ఆమెని కిరణ్ అని పిలిచేవాడు మాతో ఆమె ముచ్చట్లు చెప్పేప్పుడు కూడా ఆమెని కిరణ్ అనే ప్రస్తావించేవాడు. ఈ కిరణ్ డెట్రాయిట్ లో పని చేస్తోంది. ఆమె ఫొటొ ని మాకు పంపించినప్పుడు "అదేమిటిరా విషయం కొంచెం ముందుకి వెళ్ళనీ అప్పుడు అందరికీ ఈ విషయం చెపుదువుగాని. ఈ లోగా ఆ అమ్మాయి ఫొటో ని ఇలా నలుగురికీ చూపించి తరువాత విషయం తేడా అయితే అభాసుపాలు అవుతావు" అని చెప్పాను. శరత్ తో అలాంటి విషయం చెప్పగల చనువు వుంది కనుక చెప్పాను. రవీంద్ర మటుకు కొంచెం అటు-ఇటూ గా "ఒరేయ్! నీ విషయాలు అన్నీ విప్పి చెప్పటమే కాదు, ఆ అమ్మాయి విషయాలు అన్నీ ముందే తెలుసుకో.. ఇంటర్నెట్ కాలం లో ఎవరు ఎలాంటి వాళ్ళో అంచనా వెయ్యటం కొంచెం ట్రికీ బిజినెస్" అని హెచ్చరించాడు.

వీటికి శరత్ జవాబు మాత్రం, "చా.. లేదురా ఆ అమ్మాయి చాలా మంచిది. మీరే చెప్తారు ఆ మాట. నేను తనని July 4 లాంగ్ వీకెండ్ కి ఇక్కడకి రమ్మన్నాను. రవీంద్ర ఎలాగూ ఇటు వైపు వస్తున్నాడు. షరీఫ్, నువ్వు కూడా ఇటు వైపు ఆ టైము కి ప్లాన్ చెయ్యి" ఆర్డర్ వేసాడు.

నాకు తెలుసు తనతో "కాదు" అని నేను చెప్పలేను. తనకి ఇక్కడ స్నేహితులు అంటే మేము ఇద్దరమే. అలాగే, మాకు అవసరం వున్న రోజుల్లో తన పనులు మానుకొని మరీ మా ముందు వాలిపోయిన మనిషి శరత్. తన కోసం లాంగ్ వీకెండ్ ఒకటి కేటాయించలేనా!?

* * *


కిరణ్ కోసం తనే Merriott Hotel లో గది రిజర్వ్ చేసాడు. ఆమెతో రొమాంటిక్ డిన్నర్, మేము అందరం కలిసినప్పుడు తను ఏమీ ఇబ్బంది ఫీల్ అవకుండా ఒక పిక్నిక్ వగైరా ప్లాన్ చేసి ఇంకా ఒక రోజు ఆమె అభిరుచులకి తగ్గట్టు ప్లాన్ చేయటానికి ఖాళీ గా వదిలాడు. చెప్పాలంటే వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహం, పరిచయం తరువాతి దశ ని చేరటానికి అణువైన వాతావరణాన్ని సృష్టించాడు.

అందరం ముందు రోజు కి బోస్టన్ చేరుకున్నాము. లాంగ్ వీకెండ్ తనని వదిలేసి బోస్టన్ వెళ్తున్నందుకు నా భార్య నసిగినా మా స్నేహం సంగతి తెలుసు కనుక పెద్దగా సౌండ్ చెయ్యలేదు.

* * *


ఏ మాటకామాటే చెప్పాలి. కిరణ్ చాలా అందగత్తె, మంచి చొరవైన మనిషి, మాటకారి. కలిసిన కొద్ది క్షణాల్లో అందరితో ఇట్టే కలిసిపోయింది. కాకినాడ నుండి వచ్చిన రవీంద్ర తో కాకినాడ కబుర్లు ఎంత తేలిగ్గా చెప్పిందో హైదరాబాదు లో పెరగటం వలన హైదరాబాద్ నివాసి ని అయిన నాతో అంతే తేలిగ్గా మా బాష లో జోక్స్ వేసింది. శరత్ అయితే చెప్పనక్కర్లేదు.. కళ్ళని ఆమె నుండి తప్పించకుండా ఆమె మాట్లాడే ప్రతీ మాటకీ చేసే ప్రతీ చర్య కీ అబ్బురపడిపోతూ ఆ ఆనందం అంతా మొఖం లో చూపిస్తూ గడిపాడు. ఆమె కూడా శరత్ అంటే ఇష్టపడినట్టే అనిపించింది. శరత్ తన మత్తు లో మమైకం అవుతున్నాడని గ్రహించి అతన్ని సరదాగా ఉడికిస్తూ, వాడిని మా దగ్గర టీజ్ చేస్తూ మొత్తానికి మా ఆంతరంగిక వర్గం లో చేరగలను అని నిరూపించుకుంది.

మా ఎదురుగా జరగలేదు కానీ, శరత్ ఆమె కోసం ఏర్పాటు చేసిన surprise రొమాంటిక్ డిన్నర్ ఏర్పాట్లు చూసి ఆనందం, ఆశ్చర్యం తో కన్నీరు పెట్టుకుందట. మగవాడి మనసు కర్పూరం లా కరగటానికి అంతకన్నా వేరే ఏం చేయాలి? వీడు ఆమె మీద ప్రేమ తో (లేక ఆకర్షణ తో) హృదయం ఉప్పొంగిపోతుంటే "నువ్వు నాకు బాగా నచ్చేసావు" అని డిక్లేర్ చేసేసాడు.

* * *


మొత్తానికి ఆమె, శరత్ ల అన్యోన్యత ని ఆనందం గా మేము చూస్తుండగానే వీకెండ్ అయిపోయింది. Airport లో మమ్మల్ని plane ఎక్కించటానికి వచ్చినప్పుడు శరత్ చెప్పాడు ఆమెని పెళ్ళి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాను అని.

మాకు కూడా ఆమె అతనికి తగిన వ్యక్తి అని అనిపించినప్పటికీ, వాడు వున్నంత మత్తు లో మేము లేము కనుక వాడిని కొంచెం భూమి మీదకి తేవటానికి ప్రయత్నించాము.

"అప్పుడే కాదు. ఒకటి రెండు సార్లు కలుసుకున్నాక ఆమె గురించి అన్నీ తెలుసుకున్నాక అప్పుడు పెళ్ళి గురించి ఆలోచించు" రవీంద్ర అన్నాడు.

"నేను ఏమన్నా ఇక్కడకి వచ్చి ఖాళీ గా వుండి ఇంట్లో వాళ్ళు సరి అయిన కట్నం ఇవ్వగల అమ్మాయిని వెతికే లోపు Time-pass చెయ్యటానికి చూస్తున్నానా? నాకు ఇంకో రెండేళ్ళలో నలభై ఏళ్ళు వస్తాయి. నాది ఇంకా evaluations చేసే వయసా?" కొంచెం దురుసు గా అన్నాడు శరత్.

"లేదు శరత్.. నువ్వు ఒకసారి వెళ్ళి ఆమె ఎలా వుంటుంది, ఆమె స్నేహితులనీ చూడు. నువ్వు ఆమెకి నీ స్నేహితులని పరిచయం చేసావు. అంటే, ఆమె నీకు ముఖ్యమైన వ్యక్తి అని చెప్పావు. మరి ఆ అమ్మాయి నిన్ను ఎలా చూస్తుందో కూడా చూడాలి కదా? డెట్రాయిట్ ట్రిప్ ప్లాన్ చెయ్యి. ఆమె తన వాళ్ళకి నువ్వు ఆమెని నీ వాళ్ళకి పరిచయం చేసినంత సంతోషం గా పరిచయం చేస్తుందో లేదో చూడు. ఆ విషయం లోనే నువ్వు ఆమెకి ఎంత ముఖ్యమైన వ్యక్తి వో అర్థం అవుతుంది." కొంచెం నచ్చచెప్పబోయాను.

తన ఉద్దేశాన్నే నేను బలపరవటం చూసి రవీంద్ర అన్నాడు. "శరత్ తొందర పడకురా. నిన్నేమీ సంవత్సరాల పాటు ఆమెతో కులాసా చేయమని అనటం లేదు. ఒకసారి ఆమె పరిస్థితులు ఏమిటో కూడా వెళ్ళి చూడు. నీకు ఇక్కడ అన్నీ వాకబు చెయ్యటానికి మీ వాళ్ళు లేరు. నువ్వే ఆ బాధ్యత కూడా నెత్తిన వేసుకోవాలి. లేదంటే చెప్పు, మేము చేస్తాం."

మొత్తానికి అసహనం గానే మా ఆలోచనకి తలూపాడు శరత్.

* * *


నిన్న శనివారం డెట్రాయిట్ వెళ్ళాడు. ఇంకా అక్కడే వుండి వుండాలి. ప్రస్తుతం ఫోన్ డెట్రాయిట్ నుండి!

* * *


"ఏమైందిరా?" ఫోన్ లో అడిగాను కుర్చీ లో కూర్చుంటూ.

"తనకి రెండు సార్లు పెళ్ళి అయింది. నేను మూడోవాడిని అయ్యేవాడిని"

"అదేమిటి ఆమెకి పెళ్ళి కాలేదన్నావ్?" ఆశ్చర్యం గా అడిగాను.

"అవును. తన profile లో అలానే వుంది. కానీ క్రితం సారి బోస్టన్ తను వచ్చినప్పుడు తనకి పెళ్ళి అయింది, విడాకులు కూడా అయ్యాయి అని చెప్పింది."

"ఇదెప్పుడు? నువ్వు ఆ విషయం ఏమీ మాకు చెప్పలేదు?" సాధ్యమైనంత సున్నితం గా అడిగాను.

"నేను ప్లాన్ చేసిన డిన్నర్ చూసి తను ఏడ్చింది అని చెప్పాను కదా. అప్పుడు చెప్పింది. తన జీవితం లో ఇంతగా ప్రేమని ఎప్పుడూ అనుభవించలేదు అని. నా లాంటి ప్రేమించే వ్యక్తి కోసమే తను చూస్తున్నానని. ఆమె కాలేజ్ లో వుండగానే తనకి వాళ్ళ వాళ్ళు పెళ్ళి కుదిర్చి చేసేసారుట. కానీ వాళ్ళాయన పెద్ద శాడిస్ట్ అట. ఈమె ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా అనుమానం తో వేధించి కొట్టేవాడుట. అతనితో రోజూ నరకమే ఎవరితో ఏం అంటే అతనికి ఎక్కడ కాలుతుందో అని ఎవరి వైపూ కన్నెత్తి కూడా చూడకుండా బతికాను" అని చెప్పి ఏడ్చింది.

నాకు వెంటనే కళ్ళ ముందు అందరితో ఉలుకుతూ పలుకుతూ తిరిగిన కిరణ్ మెదిలింది. ఆమెని ఆ పరిస్థితి లో ఊహించుకోవటమే కష్టం అనిపించింది. కానీ ఆమె ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసిందో ఇప్పుడు ఊహించటం కష్టం. ఏదైనా స్వయం గా చూస్తే కానీ నిర్ధారించకూడదు. ఆలోచనల్లోంచి తల విదిల్చి, శరత్ చెప్పే మాటల మీద శ్రద్ధ పెట్టాను.

"మొదట తను తన profile లో అబద్ధం చెప్పినందుకు కోపం వచ్చినా, మా పరిచయం ముందడుగు వెయ్యకుండా అంతా చెప్పినందుకు ఆమె మీద నమ్మకం కలిగింది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు అని తను అడగటం తో నేను మీకు కూడా ఆ విషయం చెప్పలేదు."

"సరే మరి ఇప్పుడు ఏమయింది? ఆ రెండో పెళ్ళి ఏమిటీ?"

"అదే, నిన్న airport కి నన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చింది. చెయ్యి ఊపింది బయటకి వస్తున్న నన్ను చూసి. కానీ Lamhe లో శ్రీదేవి లా నా దగ్గరకి వస్తుంది అని చేతులు చాపిన నన్ను దాటుకొని నా వెనకాల వస్తున్న వ్యక్తి ని పలకరించింది." అంత బాధ లో కూడా తన సినిమా పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న శరత్ ని తలచుకొని నవ్వు వచ్చింది.

"ఎవరతను? మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ నుండి మాట్లాడుతున్నావ్?"

"డెట్రాయిట్ లోనే వున్నాను హొటల్ నుంచి. ఇంకో నాలుగు గంటల్లో నా బోస్టన్ flight"

"సరే, ఇంతకీ ఎవరతను?"

"తన రెండో భర్త ట!"

"నీకెలా తెలుసు?"

"నాకేం తెలుసు? ఆమె అతన్ని చూడగానే నన్ను పట్టించుకోనట్టు అతని దగ్గరకి వెళ్ళిపోయేసరికి, ఏ అన్నయ్యో లేక చుట్టమో, మా సంగతి తెలియని వ్యక్తి అయి వుంటాడు, అతని ముందు నాతో మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడని నన్ను చూడనట్టు వెళ్ళిపోయింది అనుకున్నాను. వెళ్తూ వెనక్కి తిరిగి చూసి ఫోన్ చేస్తాను అని సైగ చేసింది. అతన్ని సాగనంపి మళ్ళి వెనక్కి వస్తుందేమో అని అక్కడే వెర్రి వాడిలాగ ఓ కుర్చీ లో కూర్చుని తను వెళ్ళిన వైపే చూడటం మొదలెట్టాను. నా ఫోన్ మోగేదాకా"

"ఆ ఫోన్ rest room లోంచి చేసిందట. హడావిడిగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తన రెండో పెళ్ళి విషయం చెప్పింది."

* * *


"అతను తన పాత కంపెనీ లో తనతో కలిసి పని చేసేవాడుట. తినకి విడాకులు అవగానే అతనికి close అయిందిట. అతను ప్రపోజ్ చెయ్యగానే ఇంకేమీ ఆలోచించకుండా, ఇంక వేరే ఎవరూ దొరకరేమో అని భయం తో పెళ్ళి కి ఒప్పేసుకుందట. కానీ పెళ్ళి అయిన రెండు నెలల్లోనే గొడవలు మొదలయ్యాయిట. మనీ సినిమా లో కోట శ్రీనివాస రావు కి మల్లే."

"చా ఏమిటిరా ఈ సమయం లో జోక్స్" మందలించాను.

"జోక్సా.. తలచుకుంటే నేను ఎంత వెర్రివాడినో అని నవ్వు వస్తోంది. నాకేమీ బాధ లేదు." తేలిగ్గా అన్నాడు.

"సరే, కధ విను.. నేను ఇంకా నాలుగు గంటలు గడపాలి.. నీకు అయ్యాక రవీంద్ర కి మళ్ళీ మొత్తం కధ చెప్పాలి" కసిరాడు.

"గొడవలు వచ్చిన వెంటనే తిను అతని ఇంట్లోంచి వచ్చేసి వేరే apartment తీసుకుందట. ఆ సమయం లో నేను పరిచయం అయ్యాను."

"మరి ఈ విషయాలు నీకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడగకపోయావ్?"

"అడగటానికి టైము ఎక్కడా? అతన్ని డైవోర్స్ అడుగుతోందట. అతను ఇవ్వను అంటున్నాడట. ఇప్పుడు నాతో కనపడితే పెద్ద గొడవ చేస్తాడు అని నన్ను పలకరించకుండా వెళ్ళిపోయిందట. నేను ఏదో ఒక హోటల్లో దిగి వివరాలు తనకి ఈ-మైల్ చేస్తే వచ్చి కలుస్తుందట. ఫోన్ చేసినా అతను వుండటం వలన చూసుకోకపోవచ్చుట. అసలు తను ఆ flight కి వస్తున్నాడని ఈమెకి ఎలా తెలుసు అని అప్పటికే యక్ష్య ప్రశ్నలు వేస్తున్నాడట. సరే వుంటాను. కలుద్దాం." అని ఫోన్ పెట్టేసింది.

"మరి ఇప్పుడు నువ్వు ఆమెకి నువ్వెక్కడ దిగావో వివరాలు పంపించి ఆమె కోసం వెయిట్ చేస్తున్నావా?" వ్యంగ్యం గా అంటున్నట్టు అనిపించకుండా అడిగాను.

"మరీ అంత వెర్రి వాడిని కాను. ఎప్పుడయితే తను ఆ రెండో పెళ్ళి గురించి చెప్పిందో అప్పుడే నా మనసు విరిగిపోయింది. తన తప్పు ఇందులో ఏమీ లేకపోయి వుండచ్చు. కానీ ఆ విషయం ఇప్పటివరకూ చెప్పకుండా తను నన్ను మోసం చేసింది. ఇప్పుడయినా ఇద్దరం ఒకే flight లో దిగాము కనుక చెప్పింది. ఈ మనిషి పద్ధతి చూస్తే, మా మొదటి రాత్రి మధ్య లో అన్నట్టు చెప్పటం మర్చిపోయాను అంటూ ఇంకో మూడో పెళ్ళి గురించి కూడా చెప్తుందేమో.. నాకు ఆ టెన్షన్ భరించే ఓపిక లేదు. ఏదో ప్రశాంతం గా గడపటానికి ఒక తోడు కావాలనుకున్నాను కానీ ఇలాంటీ వైకుంఠపాళీ ని కోరుకోలేదు."

"శరత్.. are you OK?" అడిగాను.

"I am better than OK. ఏం ఖంగారు పడకు. కొంచెం మందు కొట్టాను. రెండు రోజులు కోపం గా వుంటాను. ఆమె మీద కాదు.. ఇంత తేలిగ్గా ఒక మనిషి ని ఇంతలా నమ్మిన నా మీద. రేపు monday.. అంతా బిజీ.. నేనూ Take it easy అనుకొని .. ఏముందీ మళ్ళీ మామూలే!"

ఏం చెప్పాలో తోచక అలా మౌనంగా రిసీవర్ పట్టుకొని చీకట్లో చూస్తూ ఉండిపోయాను.

* * End * *

ఈ కధ కి అయిడియా ఇచ్చిన ప్రియమైన మితృనికి కృతజ్ఞతలు.

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.