నేను - నాగార్జున ఫాన్స్ (ఒంగోలు కధలు - 9) : పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

మొన్నీ మధ్య ఒక యువ హీరో కి సంబంధించిన వెబ్ సైట్ లో, అ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం తాలూకు లైవ్ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు ఆ హీరో ఫాన్స్ వారు అ వెబ్ సైట్ వార్షికోత్సవం సందర్భం గా జరిపిన వేడుకలు, దిగిన ఫోటోలూ, చేసిన హడావిడి చూసి నేను నాగార్జున అభిమని గా ఉన్నప్పటి రోజులు గుర్తొచ్చి ఇది రాయాలనిపించింది.

అప్పట్లో, నేను, నాతో పాటు బోసు, సారధి, సతీష్, శ్రీ రామ్, రవీంద్ర, "దూద్ పేడా" శీనుగాడు నాగార్జున ఫాన్స్. ఇందులో బోస్ గారిదీ, సారధి కీ ప్రత్యేక పాత్రలు! వాళ్ళు "రిజిస్టర్డ్" ఫాన్స్.

కాస్త విపులం గా చెపుతాను.

ఒంగోలు కి దగ్గరగా ఉన్న ఒక ఊరిలో స్థాపించబడిన నాగార్జున అభిమాన సంఘం లో వాళ్ళది శాశ్వత సభ్యత్వం, వాజ్ పేయ్, అద్వానీల BJP సభ్యత్వం లా! సారధిగాడు బాగా డబ్బున్న యువ వ్యాపారవేత్త. ఒక్క బోసు గారిని మినహాయిస్తే, మిగిలిన వారెవ్వరికీ అక్కినేని వారి మీద అసలు ఎలాంటి అనురాగం లేదు, కేవలం నాగార్జున మీద అభిమానం తప్ప. ఈయన "ప్రేమనగర్" చూసి వీర ఫాన్ అయ్యా అని చెపుతుంటారు. సరే, విషయానికి వస్తే, ఆ ఏడు, పార్టీ ఎన్నికలలో బోసు గారిని "జనరల్ సెక్రెటరీ & కరస్పాండెంట్" గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవం గా! ఆయనకి "అక్కినేని" వంశం మీద, "అన్నపూర్ణా" సంస్థ మీదా ఉన్న అపారమైన అవగాహన ఆ పదవిని తెచ్చిపెట్టాయి. పార్టీ ఫండ్ కి ఢోకా ఉండదని సారధి గాడిని ప్రెసిడెంట్ ని చేసేసారు. ఇంకా ఏవేవో పోస్ట్ లు, వాటికి తగ్గ ప్రతినిధులని ఎన్నుకోవడం అయిపోయింది. నాకేదో కట్టబెట్టాలని ప్రయత్నించారు (అడ్వయిజరీ కమిటీ లో సభ్యుడుగాట) సున్నితం గా తిరస్కరించాల్సి వచ్చింది, ఇంట్లోంచి ఖచ్చితం గా తోయించుకోవటం ఇష్టం లేక!

BJP జెనరల్ సెక్రటరీ ఏమైనా కూసంత ఖాళీ గా ఉండేవాడేమో గానీ, సదరు సెక్రటరీ బోసుగారు మాత్రం సినిమా రిలీజ్ అవుతుంటే తెగ బిజీ గా ఉండేవారు. పార్టీ కార్యాలయం లో కూర్చుని, కట్టలకి కట్టలు కార్డ్ లు రాసి, రాష్ట్ర నలుమూలలా ఉన్న నాగార్జున అభిమాన సంఘాలకి పోస్ట్ చేసే వాళ్ళు. నాగార్జున కొత్త సినిమా, ఒంగోలు లో, ఏ ధియేటర్ లో రిలీజ్ అవుతోంది? ఆ ధియేటర్ కెపాసిటీ ఎంత? ఆ ధియేటర్ లో ఇంతకు ముందు ప్రదర్సింపబడిన నాగార్జున చిత్రాలు ఎన్ని? (వీలుంటే ANR వి కూడా), అందులో ఎన్ని 2 వారం పోస్టర్ కి కూడా నోచుకోలేదు? ఎన్ని 50 రోజుల తరువాత తీసేసారు? ఎన్ని 100 రోజులు ఆడాయి? ఎన్ని రోజులు DCR (Daily Collection Report, ఇది ధియేటర్ వాళ్ళు maintain చేస్తారు, దీనిని బట్టే టాక్స్ లెక్కలు చేసే వాళ్ళు) తో ఫుల్ అయ్యాయి? ఎన్ని సినిమాల బెనిఫిట్ షో లకి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు? ఈ డేటా మొత్తం శ్రద్ధ గా సేకరించి, కుదురుగా కూర్చుని, గుండ్రం గా రాసేవాడు కార్డ్ల మీద. డాటా-వేర్ హౌసింగ్ టూల్స్ లో కూడా అంత అనలైజింగ్, అంత రిపోర్టింగ్ కేపబిలిటీస్ ఉండి ఉండవ్!

ఇక సభ్యులంతా, సాయంత్రం టైము కి సారధి వాళ్ళ షాప్ మీద ఉన్న చిన్న రూమ్ లో సమావేశం అయ్యేవాళ్ళు. అది ఫాన్స్ కి కార్యాలయం కాదు, ఓ దేవాలయం! అక్కడ నిరంతరం నాగార్జున భజనలు, ANR స్తోత్రాలూ, అమల అర్చనలూ లాంటివి జరుగుతుండేవి. బోసు, సారధి pre-release హంగామా కి శ్రీకారం చుట్టేవాళ్ళు. సంస్థ అవలంబించవలసిన మౌలిక సూత్రాలు దగ్గర నుంచి, పెట్టుబడులు వరకూ సుదీర్ఘ చర్చలు జరిగేవి. పైన చెప్పిన ఎడ్వైజరీ కమిటీ ఇచ్చిన సూచనలూ, సలహాల మేరకు చేయాల్సిన పనుల లిస్ట్ తయారుచేసేవాళ్ళు.

దాని ముందు, మన ప్రోజెక్ట్ ప్లాన్స్ కూడా బలాదూర్, అంత పకడ్బందీ గా ఉండేవి. రిసోర్స్ ఎలొకేషన్, ఖర్చుల ఎస్టిమేట్లూ, scheduling రిపోర్టింగ్ మెకానిజం తో సహా! కొన్ని ముఖ్యమైన టాస్క్ ల వివరాలు చూడండి.

1. కరపత్రాల ముద్రణ - మేటర్ తయారీ:

దీనికి ఒక ఉప-కమిటీ. క్లాస్ నీ, మాస్ నీ ఆకర్షించే విధం గా ఉండాలి కాబట్టి flyers, మేటర్ కోసం, "content management group" ని సంప్రదించే వాళ్ళు. ఈ గ్రూప్ సభ్యులు కొత్త కొత్త బిరుదులు ఇవ్వడం లో నిష్ణాతులు. ఉదాహరణ కి లాస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు "అంధ్రా అమితాబ్" అని వాడారు అనుకోండి, ఈ కొత్త సినిమా వచ్చేసరికి నాగార్జున సడెన్ గా South India Supreme లేక Wing Commander అయిపోయేవాడు. ఇంక, "కోస్తా కింగ్" అనో, "చిత్తూరు చిరుత" అనో ఏవేవో కనిపెట్టేవాళ్ళు. కాబట్టి వీళ్ళు "క్రియేటీవ్" సెక్షన్ కిందకి వచ్చేవాళ్ళు. కనీస అర్హత కింద Intermediate Single sitting అన్నది సెట్ చేసారు. అలానే, ఇక రికార్డ్లకి సంబంధించిన మేటర్ వేరే ఉంటుంది. అ బాష అర్థం చేసుకుని, నేర్పించడం NIIT, APTECH, Genesis లాంటి వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. సినిమాలలో మునిగి తేలేవాడికి తప్ప, ఇంకెవడికీ ఆ బాష అర్థం కాదు.

ఉదహరణ కి, "ఖమ్మం లో, ఒకే సంవత్సరం లో విడుదలై, మినిమమ్ 2 వారాలు, రోజూ 4 ఆటలతో, 6 ధియేటర్లలో ప్రదర్శింపబడి, మెయిన్ ధియేటర్ లో 9 రోజులు, 5 సైడ్ ధియేటర్ లలో 4 రోజులు DCR తో continuous fulls అయిన 3 చిత్రాలు గల ఏకైక హీరో, స్లాబ్ సిస్టం లో, మా "నైజం నవాబ్" నాగార్జున అని రాసేవాళ్ళు (అది చదివి, ఇంక నైజాం లో నవాబుల పరిపాలన, రజాకర్ల అల్లర్లు సాగుతున్నాయ అని ఆవేశపడిపోయే అమాయక ప్రాణులు కూడా కొన్ని ఉంటాయి) అలా ఉండేవి ఆ రికార్డులు.

మాస్ ని అలరించడనికి, సరికొత్త పద ప్రయోగలు కూడా చేసేవాళ్ళు ఈ విభాగం లో. "కోస్తా ఆంధ్రా లో collections వర్షం సృష్టించి, తన సైకిల్ చైన్ పవర్ ఏమిటో చూపించి, ఎడ తెగని వర్షాలను సైతం లెక్క చెయ్యకుండా, వైజాగ్, శరత్-సంగమ్ లో విడుదలైన మొదటి రోజు ప్రదర్శింపబడిన మొత్తం 12 ఆటలూ, house-fulls అయి, 1,72,342.89/- షేర్ వసూలు చేసి, non-A/c డబల్ ధియేటర్ కాంప్లెక్స్ లలో, స్టేట్ వైడ్ రికార్డ్ నెలకొల్పి, మిగిలిన హీరోల రికార్డ్ లన్నీ "ఎత్తికొట్టి ఏట్లో పడేసిన" చిత్రం మా "ఫలానా" చిత్రం అంటూ ఏవేవో రాసేవాళ్ళు. నాకయితే వెదర్ రిపోర్ట్ లా అనిపించేవి.

దీని కింద ఒక గమనిక కూడా ఏడ్చేది.

"దురభిమానులకి హెచ్చరిక!!"

మాదీ రికార్డ్, మాదీ రికార్డ్ అని కొందరు అగ్రహీరోల అభిమానులు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు, వారికిదే మా "విక్కీ దాదా" చేసే "ఆఖరిపోరాటం"! మీ వాళ్ళ రికార్డ్ ని భూస్థాపితం చేసి, ధియేటర్ పునాదులు కదిలించేలా మా "కధనాయకుడు" కండబలం దెబ్బ మరో సారి చూపించాము. మేము రికార్డ్ లు క్రియేట్ చేస్తాము, బద్దలు కొడతాం అంటూ మా రోరింగ్ లయన్ "xxx" ఫాన్స్ తరుఫున చేస్తున్న బస్తీ మే సవాల్ ఇదే. "any center, any day, any show.. ఇదే మా రియల్ చాలెంజ్" అంటూ గమ్మత్తుగా సాగిపోయేవి.

మేటర్ ప్రిపరేషన్ అయిన తరువాత, ఒక సర్వసభ్య సమావేశం జరిగి, అందరికీ వినిపించి, 3 ఇంట 2 వంతుల మెజారిటీ గెలుచుకున్న తరువాత, ప్రింటింగ్ పనులపై దృష్టి సారించేవాళ్ళు.

2. ప్రింటింగ్:

ఇక ప్రింటింగ్, మన "ప్రోజెక్ట్ ప్రొపోజల్స్" ఫేస్ లాంటిదే. "prefered vendors" ఉండేవాళ్ళు, కేవలం వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మిగిలిన ప్రెస్ లలో వేరే హీరో అభిమానులు కొట్టిస్తుండేవాళ్ళు. కాబట్టి మేటర్ లీక్ అయ్యే అవకాశం ఉంది అని. ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది preferred vendors ఉండటం వెనుక కూడా బలమైన కారణం ఉంది. అదే, మన "BCP- Business Contingency Plan". పెళ్ళిళ్ళ సీజన్ లోనో, ఎలెక్షన్స్ సీజన్ లోనో, తెగ బిజీగా ఉండేవాళ్ళు preferred vendors కనుక ముందు జాగర్త కోసం. అలానే నిధులు బాగా ఉన్నప్పుడు, లేదా మేటర్ అదిరింది అనుకున్నప్పుడు, లేదా సినిమాపై విపరీతమైన expectations ఉన్నప్పుడు (అంతం, శాంతి-క్రాంతి) high-quality పేపర్, కలర్ ప్రింటింగ్ కోసం జిల్లా హెడ్ క్వార్టర్స్ కి పరిగెత్తేవాళ్ళు No.1 vendor కోసం.

3. Transportation / Advance Booking:

ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని మరో గ్రూప్ నిర్వహించేది. ఎంత మంది సభ్యులు రిలీజ్ రోజు చూడటానికి వస్తున్నారో ట్రాక్ డవున్ చెయ్యటం, వారి దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం. జీప్ లేదా మెటడోర్ వాన్ మాట్లాడటం (అప్పట్లో, కేవలం ఒంగోలు, చీరాలలోనే ఉండేది రిలీజ్) head count ని బట్టి. జీప్ కి ముందు తగిలించడానికి బేనర్స్, అరటి లేదా కొబ్బరి చెట్లు సేకరించడం loud speakers + నాగార్జున / ANR కేసెట్లు తెచ్చి పెట్టడం జీప్ లో (ఒంగోలు చేరేవరకూ కాలక్షేపం ఉండాలి కదా!)

ఇక, అఫీషియల్ హెడ్ కౌంట్ వచ్చిన తరువాత, మన సెక్రటరీ గారు ఒంగోలు District wide fans association కి లెటర్ రాయడమో లేదా టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు ఇన్ని టికెట్స్ రిజర్వ్ చెయ్యండి అని. బయలుదేరే రోజు సభ్యులంతా ఎక్కడ కలవాలి, ఎన్నింటికి కలవాలి అనే schedules, tickets confirm అయిన న్యూస్ రాగానే డెసైడ్ అయిపోయేది.

4. on the big day: (అదేనండీ, మన ప్రోజెక్ట్ ల go-live డేట్ లా!)

షో ఇంక 3,4 గంటలు ఉంది అనగా (లిటరల్ గా చెప్పాలంటే, తెల్లవారుఝామున 4:30 - 5:00 మధ్యలో), NSS కార్యకర్తలంతా (నాగార్జున శివసేన అని ముద్దు గా పిలుచుకునేవాళ్ళం) గుమిగూడి, జీప్ ముందు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. బెనిఫిట్ షో కి వెళ్ళలేని సభ్యులు, వెళ్తున్న వారిని కౌగలించుకుని ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ సాదరం గా వీడ్కోలు పలికేవాళ్ళు. మనోళ్ళేదో దేశాన్ని రక్షించడానికి వెడుతున్న రక్షకభటులైనట్టు. ఇక, జిల్లా కేంద్రం లో ధియేటర్ దగ్గర అన్ని ఏర్పాట్లనీ క్షుణ్ణం గా పరిశీలించడానికి సారధి గాడు, బోసు గారు ముందు రోజు రాత్రే వెళ్ళిపోయేవాళ్ళు. గాంగ్ వచ్చేసరికి టికెట్స్ తో సహా ధియేటర్ దగ్గర రిసీవ్ చేసుకోవడనికి.

ఇక అసలు రచ్చ అక్కడ మొదలయ్యేది. అన్ని గ్రామ, మండల, తాలూక అభిమాన సంఘల వాళ్ళూ ఒకరినొకరు పరిచయలు చేసుకోవడం, రంగులు కొట్టుకోవడం, తలకు రిబ్బన్ లు, కొంత మంది వీర ఫాన్ లు గళ్ళ లుంగీలతో, నోట్లో బీడీలతో, ఇలా అప్పటి తెలుగు సినిమాల్లో "కుర్ర హీరో" ల తీరున ఉండేవాళ్ళు. మరి కొంత మంది "ఫాన్స్" విశ్వనాధ్ సినిమాలో హీరో లా, బుద్ధి గా దూరం నుంచే చూసి ఆనందిస్తుండేవాళ్ళు (so called డిగ్నిటీ అడ్డొచ్చో, ఇంట్లో తెలిస్తే తంతారని భయం వేసో). వీళ్ళు A class ఫాన్స్ ట. బాక్స్ వచ్చింది అనగానే "crackers" కాల్చటం మొదలయ్యేది. ఆ హడావిడి చూడటానికి రెండు కళ్ళు చాలవ్! నాకు నయాగరా చూసినప్పుడు కూడా అంత అనందం కలుగలేదు.

5. కొన్ని సంఘటనలు (ఫాన్స్-ఎసోసియేషన్స్-బెనిఫిట్ షోస్ పరం గా కొన్ని అనందకరమైన, ఇబ్బందికరమైన అనుభవాలు ఇవి)

1. "వారసుడి" తో ఇబ్బంది:

సినిమా వచ్చింది, హిట్ అనిపించుకుంది. ఎటొచ్చీ ఒంగోలు సెంటర్ లో 80 రోజుల తరువాత రన్ కి కొంచెం ఇబ్బంది అయింది. ఏం జరిగిందో తెలియదు గానీ, మా బోసుకీ సారధి గాడికీ మెసేజ్ వచ్చింది. ఫలానా తారీఖు టాప్ హెడ్స్ వస్తున్నారు head quarters నుండి పరిస్థితి సమీక్షించడానికి, మీ ఊరు ఫలానా తారీఖు అని. ఏర్పాట్లు జరిగిపోయయి, నేతలు దిగారు విడిది లో, కాఫీ, పలహారాలు అయ్యాక, వచ్చిన పని సెలవిచ్చారు. మీ సంస్థ నుండి, మీ శక్తి మేరకు విరాళం ఇవ్వాలి, పని ఉంది కాబట్టి అన్నారు. ఇక లోకల్ లీడర్స్ విజృంభించారు మీటింగ్ లో. మర్నాడు నోట్ బుక్ పట్టుకుని, తెలిసిన వాళ్ళ అందరి దగ్గరకూ చందాలకి బయలుదేరారు. నేను ఎంత unofficial member ని అయినా పార్టీ లో బోసు, సారధి, నాదీ విడదీయరని స్నేహం అవటం చేత, నువ్వు ఉండాల్సిందే ఈవెంట్ లో అన్నారు. నేను, MCA ఫస్ట్ ఇయర్ పరీక్షల తయారి కోసం ఇంటికి వచ్చి ఉన్నా. నా వల్ల కాదురా ఈ తిరుగుడు, నీకు తెలుసు కదా ఇంట్లో సంగతి అంటే వినిపించుకోలా.. లాక్కెళ్ళారు. ఎక్కిన గుమ్మం, ఎక్కినట్టే, దిగిన గుమ్మం దిగినట్టే అన్నట్టు అయ్యింది పరిస్థితి. విచిత్రమేమిటంటే, చందా ఇచ్చే ఒక్కడు కూడా, అసలు ఇలాంటి పనికి మాలిన వాటికి మేమెందుకివ్వాలి? అనకపోవడం. అదే ఇండియా అంటే మరి! సారధి గాడి పలుకుబడి మరి! చాలా ఇబ్బంది పడి,, నసపెట్టి, ఎలానో మధ్యలోంచి తప్పుకున్నా, కానీ 100th డే సెకండ్ షో మాత్రం బాగా ఎంజాయ్ చేసా.

2. "శాంతి - క్రాంతి" శబ్దాలు

రవిచంద్రన్ నిర్మించిన "ప్రేమలోకం" అనే డబ్బింగ్ సినిమా బాగా హిట్ అయి అతని మీద expectations పెంచింది. అదీ గాక, ఈ సినిమా కోట్ల రూపాయలతో, భారీ తారాగణం తో రకరకాల భాషల్లో రకరకాలుగా తీస్తుండటం ఇంకా హైప్ చేసాయి. అదే హైపూ, హంగామా flyers లో ఉండాలి అని తీర్మానించారు. అప్పుడు నాగార్జున వరుస ఫ్లాప్ లో మునిగిపోయి ఉన్నాడు. దానిని దృష్టి లో పెట్టుకుని రాసిన flyer, ఒక సంచలనం అయింది. మొత్తం గుర్తు లేదు గానీ.. కొంత పార్ట్ ఇలా ఉంటుంది.

"ఇది పెనుతుఫాను ముందు ఉండే నిశబ్ద వాతావరణం. ఈ స్థబ్ధత పది భూకంపాలకి సూచిక ఉప్పొంగే వరకూ లావా ఉబకదు, ఎగసి పడేవరకూ కెరటం ఆగదు, బాక్సాఫీస్ ప్రకృతి ని విలయ తాండవం చేయించడానికి, తాండవమాడే "శివు"నిలా, మూడో కన్ను తెరిచిన "రుద్రుని" లా, "అగ్నిపుత్రుని" లా, మసకబారిన అభిమానుల కన్నుల్లో "కాంతి" రేఖలు కురిపించడనికి, దురభిమానుల దౌర్జన్యన్ని నిలువరించే "శాంతి" కపోతమై, బూజుపట్టిన రికార్డ్ లకు చరమగీతం పాడటానికి ముందుకొస్తున్న మా "శాంతి-క్రాంతి" కి ఇదే మా ఆహ్వానం"

10 రోజులో 12 రోజులో ఆడినట్టు గుర్తు ఈ సినిమా ఒంగోలు లో!

3. "ప్రెసిడెంట్ గారి పెళ్ళాం" మిగిల్చిన విషాదం:

ధియేటర్ ముందు కట్టే బేనర్ ల మీద ప్రెసిడెంట్ ఫలానా వాడని, జాయింట్ సెక్రటరీ ఫలానా వాడనీ రాస్తుంటారు. అలా చూసుకోవాలని మా సారధిగాడికి మహా కోరిక ఎందుకంటే వాడే కదా ఆ ఏడు ప్రెసిడెంట్. వాడి ఆధ్వర్యం లో సంస్థ విభిన్న ప్రయోగలు చేసింది అని అనిపించుకోవాలన్న కోరిక కూడ. బేనర్ కి ఉండే రెగ్యులర్ ఫార్మెట్ వాడికి నచ్చలా. వెంటనే, ప్రెసిడేంట్ సారధి అనే పేరు కి ఫాంట్ సైజ్, కలర్, పొజిషన్ అన్నీ మార్చేసుకున్నాడు. ఇప్పుడు వాడి పేరు అందరి కన్నా పైన, చాలా పెద్దగా స్పష్టం గా కనిపించసాగాయి. మిగిలిన వాళ్ళు లోపల ఏమి అనుకున్నా, పైకి "ఆహా ఓహో" అన్నారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (PGP) రిలీజ్ అయి, హిట్ టాక్ తో ఓ నెల రోజులు పూర్తి చేసుకుంది అప్పటికి. అది ఆడే ధియేటర్ దగ్గరకి సాయంత్రం టైము లో వెళ్ళేవాళ్ళం. ధియేటర్ కి పక్కన చిన్న బ్రిడ్జ్ ఉండేది, అటు పక్కగా దానికి ఆనుకుని బలహీన వర్గాల వారి ఇళ్ళు ఉండేవి (క్షమించాలి అలా రాయక తప్పనందుకు!!). అంటే ధియేటర్ లో పని చేసే డైలీ లేబర్ వాళ్ళ ఇళ్ళు (పోస్టర్స్ అంటించే వాళ్ళు, advertisement బండి లాగే వాళ్ళూ) మామూలు గానే అ రోజు సాయంత్రం కూడా వాడు, నేను, బోసు, సతీష్ వెళ్ళాం. ధియేటర్ appearance లో ఏదో తేడా కనిపించింది, పెద్ద పట్టించుకోలా. కాఫీలు తెచ్చుకుని తాగుతూ ఓ బెంచ్ మీద కూర్చుని బోసు కి వేరే ఊళ్ళ నుండి సినిమా రన్నింగ్ మీద వచ్చిన రిపోర్ట్స్ చుస్తున్నాం. దూరం గా ఆ ఇళ్ళల్లో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. మళ్ళీ కబుర్ల లో పడ్డాం. ఎందుకో వాళ్ళు వేసుకున్న డ్రెస్ లు వింతగా కనిపించాయి. పరీక్షించి చూసేసరికి, మా అనుమానం నిజం అయ్యింది. ఒక కుర్రాడి లాగూ వెనుక వైపున "ప్రెసిడెంట్: సారధి" అని మా వాడు ఇష్టపడి చేయించుకున్న ఫాంట్ కలర్ తో దేదీప్యమానం గా వెలిగిపోతోంది. అలానే మిగిలిన వాళ్ళ కాళ్ళ మీద, ఒంటి మీదా మిగతా సభ్యులు వేలాడుతున్నారు. తిరిగి వెళ్ళేప్పుడు బాగా అర్థమయ్యింది "ధియేటర్ appearance" లో మార్పు ఎందుకొచ్చిందో. బేనర్లు చాలా వరకూ పీకేసారు నెల రోజులు పైన అయిపోయింది రిలీజ్ అయి అని, ధియేటర్ వాళ్ళు.

భారతదేశం లో పేదరికం ఎంత ఘోరం గా ఉంటున్నదో తెలుసు, మరోసారి చూసిన క్షణం అది! పిల్లలకి వంటి మీద బట్టలు కోసం ధియేటర్ ల దగ్గర బేనర్ ల మీదే ఆధారపడ్డ కుటుంబాలు కూడా ఉంటాయి అని తెలిసిన చేదు అనుభవం అది. "రుద్రవీణ" సినిమా లో చిరంజీవి వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు లేక, తల్లి-కూతుళ్ళలో, ఎవరో ఒకరే బయటకు వచ్చి మాట్లాడే సన్నివేశం చూసినప్పుడల్లా నాకు ఇదే సీన్ గుర్తొచ్చి మెలిపెడుతుంది. అది ఒక క్షణం.. మళ్ళీ మామూలే! నేను మధ్య తరగతి మనిషిని.

4. "ఖల్ నాయక్" కమామీషు

"ఖల్ నాయక్" సినిమా తెలుగు లో తీస్తున్నారు, ఓ ప్రముఖ హీరో చేయబోతున్నారు అని పేపర్ లో వచ్చిన వార్తను పట్టుకుని వీళ్ళు చేసిన హడావిడి అంతా, ఇంతా కాదు. అంత ఒడ్డు, అంత పొడుగు, అంత హెయిర్ స్టయిల్, అంత సినీ స్టయిల్ ఉన్న హీరో "భయ్యా" (నాగార్జున) కాక ఇంకెవరు అని రెచ్చిపోయి సంబరాలు చేసుకున్నారు. ఓ వారం తరువాత వినోద్ కుమార్ కి విగ్గు పెట్టి తోసేసరికి నోట మాట రాలా ఒకొక్కడికీ. ఇది అన్యాయం, అమానుషం, ఘోరం అంటూ RTC బస్ లు తగలపెట్టినంత పని చేసారు. సారధి గాడి ఆధ్వర్యం లో NSS కార్యకర్తలు.

5. "నిన్నే పెళ్ళాడుతా"

హైదరాబాదు లో ఉంటున్న నా దగ్గరకి వచ్చారు బోసు, సారధి ఒక సారి. అప్పటికి సినిమా రిలీజ్ అయి 3,4 రోజులు అయింది. నేను ఇంకా చూడలేదు. వాళ్ళు అప్పటికే చూసేసారు. సరే, "దేవి 70mm" కి వెళ్ళాం. టికెట్స్ దొరికే అవకాశం లేదు. ఇక, అప్పుడు బయట పడింది Registered Fans గొప్పతనం.

చెప్పాను కదా బోసు స్టేట్ వైడ్ associations అందరికీ లెటర్స్ రాసేవాడని. తన దగ్గర ఎప్పుడూ ఆ స్టాంప్, లెటర్ హెడ్ ఉండేవి. లక్కీ గా, పి.రవీందర్ రెడ్డి అని అప్పట్లో నాగార్జున ఫాన్స్ కి స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ దేవి ఎదురుగుండా ఉన్న "అదేదో" గేట్ ఇరనీ చాయ్ సెంటర్ లో ఉన్నాడని తెలిసింది. ఇక, ఈయన వెళ్ళడం, అప్పటికే ఉత్తరాల ద్వారా, ఫోన్ ల ద్వారా తెలిసుండటం తో, రవీందర్ మమ్మల్ని లోపలకి తీసుకెళ్ళి టికెట్స్ ఇప్పంచారు. నిజం చెప్పొద్దూ, నాకు భలే ధ్రిల్లింగ్ గా అనిపించింది. రవీందర్ కి మేనేజర్ రూమ్ లో ఇచ్చిన గౌరవం చూసి! ఆ తరువాత బోసు గారు చెప్పగా తెలిసింది, నాగార్జున తో చాలా క్లోజ్ గా ఉంటాడట. "వారసుడు" సినిమా కి క్లాప్ ఇతని చేతే కొట్టించారని. చా! ఎందుకీ సాఫ్ట్ వేర్ బతుకులు అనుకున్నాను పొద్దున్నే టీమ్ లీడ్ నేను రాసిన కోడ్ చూసి ఇచ్చిన వార్నింగ్ గుర్తు వచ్చి!

కొసమెరుపు:

* ఇలాంటి ఎపిసోడ్స్ బానే గడిచాయి కొంతకాలం. తరువాత్తరువాత అనేక మార్పులు వచ్చాయి. అన్ని చోట్లా లానే అక్కడ సభ్యులలో విభేధలు మొదలై, చివరికి సారధి, బోసులని బయటకు తోలేసారు. కాలక్రమేణా, వారి ఆలోచన ధోరణి లో మార్పు కలిగి జీవన స్థిరత్వం మీద దృష్టి సారించారు. పెద్దలు ఇచ్చిన ఆస్థులని మరింత చేసేదిసగా సారధి కొత్త వ్యాపారాలు ఏవో పెట్టాడు, బిజీ అయ్యాడు. తన B.Sc పట్టా తో 4 చోట్లా ట్యూషన్స్ చెపుతూ, చిన్నగా లెక్చరర్ స్థాయి కి ఎదిగారు బోసు.

* వాడు ముచ్చటపడి చేయించుకున్న ఫాన్స్ association letter head ని (పేజీ సెంటర్ లో సైకిల్ చైన్ తో శివ అన్న ఎర్ర అక్షరాలతో), ఇప్పుడు సారధి వాళ్ళ అమ్మాయి A,B,C,D లు రాసుకోవడనికి, వానొస్తే పడవలు చేసివ్వడానికీ వాడుతున్నాడట! బోసు చెపుతారు నవ్వుతూ. అలానే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రివార్డ్స్ లేక అవార్డ్స్ ఇవ్వాలి మాలాంటి వాళ్ళకి అన్నన్ని వందల, వేల కార్డ్ లు, inland లెటర్స్ కొని సేల్స్ పెంచినందుకు అని కూడా అంటారు నవ్వుతూ.

* పెళ్ళి చేసుకునేప్పుడు నాగార్జున భయ్యా సినిమా లా ట్రెండ్ సెట్టర్ లా ఉండాలి పెళ్ళి కార్డు అనే వారు బోసు గారు. వధువు / వరుడు అనే రొటీన్ పేర్లు ఉండకూడదు అని, వధువు అనే చోట "గీతాంజలి", వరుడు అనే చోట "శివ" అని హెడింగ్ పెట్టించి మా పేర్లు చేసుకుంటాను అంటుండేవారు సరదాగా, సీరియస్ గా. వ్యక్తిగత కారణల వల్ల, కుటుంబ పరిస్థితుల రూపం లో, 40 కి చేరువ అవుతూ ఉన్నా ఆ ముచ్చట తీర్చుకోలేకపోయిన అయన్ను చూస్తే అదో రకం బాధ!

దారులు వేరయ్యాయి, ఎవరి జీవితం తో వాళ్ళు పరుగులు పెడుతున్నారు.

* కానీ వాళ్ళ నాగార్జున ని అభిమనించడం విషయం లో మార్పు రాలేదు. నాలాగ ఊసరవెల్లులు కాలేకపోయారు, పార్టీ మార్చలేకపోయారు. ఎటొచ్చీ, ఫాన్స్, associations, benefit show లూ లాంటి వ్యాపకాలు పోయాయి అంతే! ఇప్పటికీ అదే తన్మయత్వం, అదే మమకారం నాగార్జున అంటే.

* "రామదాసు" చూసిన వెంటనే సారధి గాడు ఫోన్ చేసి, "ఎప్పటికైనా రియల్ ట్రెండ్ సెట్టర్ అంటే మా నాగార్జునేరా" అన్నాడు "మా" అనే పదాన్ని వత్తి పలుకుతూ, నన్ను ఉడికించాలని, మెగాస్టార్ ని వెనకేసుకొస్తున్నందుకు పగ తీర్చుకోవాలని! అదో సంతృప్తి వాడికి. అవును మరి ఎలా మర్చిపోతాడు నేను చిరంజీవిని ధారుణం గా విమర్శించిన రోజులు?

మరి బోసు గారు ఎలాంటి అనందం లో ఉన్నారో "రామదాసు" విజయాన్ని ఆస్వాదిస్తూ తెలియదు. వీలు చూసుకుని మాట్లాడాలి. ఎంతైనా ఒకప్పుడు నాగార్జున ఫాన్ నే కదా.

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.