"20 లో 20 వచ్చింది.." (ఒంగోలు కధలు - 8): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

24 గంటల కేబుల్ TV ప్రసారాల్లా, సినిమాలూ, పాటలూ, క్రికెట్, రాజకీయాలూ, ఆరోగ్యం అంత బాలేనప్పుడు క్లాస్ లో ఏ అమ్మాయి బావుంటుందీ అన్నవి మా మధ్య హాట్ టాపిక్స్, పరీక్షలకి తయారీకి మొదలుపెట్టే వరకూ.

క్రికెట్ విషయానికి వస్తే, అప్పట్లో నేను గవాస్కర్, వెంగ్ సర్కార్ లకి వీర ఫాన్ ని (తరువాత టెండూల్కర్ తో స్థిరపడిపోయాను) బాబాయ్ గాడు, శివ గాడు కపిల్ దేవ్ ఫాన్స్. పాతబడిపోయిన అత్తా-కోడళ్ళు అరచుకున్నంత చండాళం గా నోరు పారేసుకునేవాళ్ళం మా వాడు గ్రేట్ అంటే మా వాడు గ్రేట్ అని! పైగా దానికి ముద్దుగా పెట్టుకున్న పేరు "స్టాటిస్టికల్ అనాలసిస్".

పైగా ఈ so-called healthy discussion లు పక్క వాటా లో పిల్లలు చదువుకుంటున్నప్పుడో, ముందు వాటా ముసలి వాళ్ళు నిద్ర పట్టక తన్నుకుంటున్నప్పుడో పెట్టేవాళ్ళం, "టీ" లుతాగి మరీ వచ్చి! "టీ" తాగొచ్చాక ఇరగ దీస్తా ఫిజిక్స్ అని విర్రవీగే "దూద్ పేడా" శీను గాడు అరగంట కే "background music" (గురక) వాయిస్తుండేవాడు దుప్పటి ముసుగేసి.

అ రోజు గొడవ తారాస్థాయికి చేరుకుని, నా చేత, శివ గాడి చేత చెరో 20 రూపాయలు పందెం కట్టించింది. ఈ గొడవ కి కారణం గవాస్కర్ బాట్ పనితనం! ఒక రోజు మాచ్ లో మనోడు వేసే "తెడ్డు" గురించి, మెస్ లో "ఫుడ్డు" దగ్గర మొదలైన చర్చ, గవాస్కర్ ఏ one day మేచ్ లో ఎంత కొట్టిందీ, ఎవరి మీద ఎంత కొట్టిందీ, ఎవరు గవాస్కర్ ని కొట్టిందీ (కుళ్ళిపోయిన టోమేటోలతో) ఇలా ఎన్నో విషయాలు దొర్లుతుండగా, రసాభస అయ్యింది. బావగాడు ఇదిగో ఈ పాయింటు బయటపెట్టడం తో.

అప్పటిదాకా ఏదో విధం గా, వాడిని, వాడు "Huryana hurricane" లా విసురుతున్న స్టేట్ మెంట్స్ ని డక్కా మొక్కీలు తిని ఎదుర్కొంటూ, గవాస్కర్ పరువు "గంగూలీ" లా కాకుండా కాపాడుకొస్తున్న నాకు, ఈ సమస్య ని ఎలా డిఫెన్స్ చెయ్యాలో మా గవాస్కర్ నేర్పలా!?

ఎలా నెగ్గుకొస్తాడా అని చూస్తున్న శ్రీ రామ్, రవీంద్ర, శీను వాళ్ళ ముందు ఓడిపోవడం ఇష్టం లేక, ప్రెస్టీజ్ అడ్డం వచ్చేసి, ఎలాగో ఏదో ఒకటి అడ్డం వచ్చేసింది కదా అని "అడ్డం" గా వాదించడం మొదలుపెట్టా. "అలా జరిగి ఉండదని", విసిగెత్తిన శివగాడు, "సరే, ఇన్ని మాటలు ఎందుకు దమ్ముంటే పందెం కాయ్" అన్నాడు.

"పందెం కాయడానికి ఉండాల్సింది దమ్ము కాదు డబ్బులు" అంతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాను.

"అయితే మరెందుకాలస్యం, తియ్యండి డబ్బులు" అన్నారు చుట్టూ మూగిన "బెట్టింగ్ బుకీలు", కోడి పందేలకి అలవాటుపద్ద కారంపూడి కాపురస్తుల్లా!

సరే, సుపారి "20కి" కుదిరించాడు రవీంద్ర "రాంప్యారీ పాన్" తింటూ.

వచ్చిన టాక్స్ రిటర్న్ లో సగభాగం HR block కి కట్టినట్టు, పందెం లో గెలిచిన వాడు, లాభం లో సగం (10 రూపాయలు) స్నేహబృందానికి విందు (టీ లూ, మిరపకాయ బజ్జీలు) గా ఖర్చు పెట్టలని నిర్ణయించారు.

సరే, ఇంతకీ తేలాల్సింది ఏమిటంటే, మా బావ చెప్పినట్టు "86-87 కాలం లో, రోహన్ గవాస్కర్ (6,7 ఏళ్ళు ఉంటాయేమో) ఒక పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ రోజు జరగబోతున్న ఒక one day మేచ్ గురించి వాళ్ళ నాన్నగారిని ఉద్దేసిస్తూ "నాన్నా! ఆడితే పరుగులు వచ్చేలా ఆడు, లేకపోతే, పరుగున వచ్చేలా (డక్-అవుట్ అయి వెనక్కి వెళ్ళేలా ఆడు" అన్నాడట.

"ఇది ఈనాడు పేపర్ లో వచ్చింది, పందెం" అంటాడు శివగాడు.

"కన్న కొడుకు, కట్టుకున్న భార్యే కాళ్ళు ఇరగ్గొడతాం క్రీజు లోంచి కదలకపోతే, అంటుంటే ఇంకా మీరు చెప్పేదేంట్రా?" అంటూ మా గవాస్కర్ ఫాన్స్ ని తీసిపారేసాడు వాడు, బాబాయ్ గాడూ.

"సినిమా కి కలెక్షన్స్ ఎంత ముఖ్యమో, discussion కి ప్రూఫ్ అంత ముఖ్యమమ్మా? ఏదీ చూపించు ప్రూఫ్?" అని నేను.

అదీ గోల. ఎప్పటిదో 86-87 లోది కదా ఇప్పుడు (1991) ఎక్కడ తెస్తాడ్లే అన్న ధీమా తో (అది పొగరు అని తరువాత అర్థమయ్యింది).

ఇక, సంయుక్తా మూవీస్ వారి "వేట" మొదలైంది.

మా బావగాడు "తెహల్కా" రిపోర్టర్స్ టైపు, సాక్ష్యం చూపించందే నిద్రపోడు. వాడి అపరాధ పరిశోధన ఒంగోలు జిల్లా గ్రంధలయం లో ప్రారంభమయింది. మూకుమ్మడిగా వెళ్ళాం అందరం అక్కడికి. స్టాఫ్ మెంబర్ ఒకాయనని అడిగితే, archives section head ని పట్టుకోవాలి స్టోర్ రూమ్ ఓపెన్ చెయ్యలంటే అన్నారు. అంతే కాదు, "వాలీడ్ రీజన్ ఉండాలి అది తెరుచుకోవాలంటే" అంటూ పాతాళబైరవి లాజిక్ చెప్పారు. మనం ఇలా "కపిల్ దేవ్ బొమ్మ కావాలి, అట్టేసుకోవడానికి అడవి దొంగ సినిమా పోస్టర్ కావాలి, ఆంధ్రజ్యోతి లోది అంటే, కట్టేసి కొడతారేమోరా" అన్నాం భయం గా మేమంతా.

వాడు మాత్రం మత్స్య యంత్రాన్ని కొట్టడానికి నిశ్చయించుకున్న అర్జనుడిలా, "నేను మేనేజ్ చేస్తాగా" అన్నాడు.

ఒక అబద్ధం చెప్పాడు అంతే!

అప్పట్లో "ఆంధ్రజ్యోతి", "ఉదయం" లలో మోడల్ పేపర్స్ వేసే వాళ్ళు polytechnic ఎంట్రన్స్ వీ, EAMCET వీ, APPSCవీ, RRB వీ అలా. వాటి కోసం అన్నాడు. ఉన్న క్లాస్ పుస్తకాలే చదవలేక చతికిలపడే కుర్రాళ్ళు ఉన్న ఈ రోజుల్లో, ఇలా పాత సంచికల నుండి విషయం సేకరించదలుచుకున్న వీడిని చూస్తే ఆయనకి ముచ్చటేసి, స్టోర్ రూమ్ ఓపెన్ చేయించారు సకల మర్యాదలతో.

ఇక బావగాడు రెచ్చిపోయాడు, నేను దొరికిపోయా!

ఎప్పుడూ నురగలు కక్కుతూ పరవళ్ళు తొక్కే గోదావరి లా ఉండే మస్తాన్ హోటల్ కాఫీ ఆ సాయంత్రం ఎందుకో నీరు ఉన్నా, లేనట్టుండే పెన్నా లా కనపడసాగింది, మనసంతా పోగొట్టుకున్న 20 పైనే ఉండటంతో! "డబ్బులతో పందెం కాయడం, టలీవుడ్ టప్ హీరోలతో సినిమా తియ్యడం" ఎంత తప్పో అప్పుడే తెలిసొచ్చింది.

పాడలేనమ్మ పి.సుశీల మీద పడ్డట్టు, ఆ తరువాత, గవాస్కర్ నీ 60 ఓవర్ లు పూర్తిగా ఆడి 36 పరుగులే చేసినా అవుట్ చెయ్యలేకపోయిన ఆ విదేశీ బౌలర్ ల అసమర్థతనీ, నాకు పేటెంట్ రైట్స్ కింద మా గ్రాండ్ పేరెంట్స్ వంశపారంపర్యం గా ఇచ్చిన బూతుల్ని (అప్రాచ్యుడా, దౌర్భాగ్యుడా, కుంక, తలమాసిన వెధవ వగైరా) ఇంప్రొవైజ్ చేసి వాడి మరీ నా కసి తీర్చుకున్నాను. నా 20 రూపాయలకి న్యాయం చేయలేకపోయినందుకు!

ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి, "జై చిరజీవ" బాక్సుల్లా చెల్లాచెదురు అయిపోయేప్పుడు, అందరిలానే వాడి దగ్గరా autograph తీసుకుంటున్న నాకు, చేతికి తగిలి, బుక్ మధ్య లో రెప రెపలాడుతూ కనిపించింది కొత్త 20 రూపాయల నోటు, "ప్రేమ తో శివ" అనే చిన్న సంతకం తో!

మా స్నేహానికి 20 ఏళ్ళు నిండొస్తున్నాయి (1989).. అ నోటు ఇప్పుడు హైదరాబాదు లో మ ఇంట్లో ఇనుప బీరువా లో ఎలాంటి దీనస్థితి లో ఉందో! నల్లులు ఉంటే వాటి మధ్య నలుగుతూ, కలరా ఉండల మధ్య కంపుగొడుతోందేమో!

సారీ బావా! అమెరికా వచ్చేప్పుడు, పోపుల పెట్టె పట్టకుండా అడ్డం వస్తుంటేనూ, తీసేయించింది మీ చెల్లి! ఎలాగూ చెల్లని నోటే కదా అని! అడిగితే, "అవకాయ జాడీ కన్నా ముఖ్యమా autograph బుక్?" అంది!

మరి నువ్వేగా, పెళ్ళప్పుడు, "ష్! గప్ చుప్" లో కోట శ్రీనివాసరావు, భానుప్రియ ని పట్టుకొని, "మా బందరు అమ్మాయా?" అన్నంత డ్రమెటిక్ గా, "మా విజయవాడ అమ్మాయా? ఓహో! ఆహో!" అన్నావ్? అనుభవించు మరి!

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.