"బావా బావా పన్నీరు, బ్యాంక్ లో ఒకటే ఖంగారు.." (ఒంగోలు కధలు - 6): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

ఇది మా బావ (శివ) గాడి బ్యాంక్ గోల. పొరుగూరి లో ఉండి చదవటం వల్ల, పిల్లాడు ఇబ్బంది పడతాడేమో అని వాళ్ళ నాన్నగారు ఒక జాతీయ బ్యంక్ లో వీడి పేరు మీద ఖాతా తెరిచి, అతిగా ఖర్చుపెట్టావో వాత పెడతా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. మరో కారణం ఏమిటంటే, ప్రతి నెలా పంపే DD ని మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది అన్న ఉద్దేశ్యం తో కూడా. వీడికి బేసిక్ ఆపరేషన్స్ నేర్పి ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు.

ఆయన బస్ ఎక్కిన మరుక్షణమే ఖాతా లో సొమ్ము కి కార్లు వచ్చేవి. మళ్ళీ DD లేక మనీ ఆర్డర్ వచ్చేదాకా, "కేబుల్ TV లేని కొంప లా" బోసిపోయి ఉండేది బ్యాంక్ ఖాతా. మా బావగాడు నెలకి ఒకసారి ఉత్తరం రాసేవాడు ఇంటికి "ఇంత" పంపండి అని. ఆ నెల లో కట్టాల్సిన ట్యూషన్ ఫీజ్ లూ, పని పట్టల్సిన సినిమాలూ, తినిపెట్టల్సిన హోటల్స్ దృష్టి లో పెట్టుకుని. వాడికీ, వాళ్ళ నాన్నగారికీ, "సూపర్ స్టార్ కృష్ణ కీ ఆయన ఫాన్స్ కీ మధ్య ఉన్నంత" చక్కటీ అవగాహన ఉండేది. అందువల్ల, వీడు "అంకె" వేయకుండా, "రంకె" వేసేవాడు ఇంత కావాలని. అ "రంకె" ఎలాంటిదంటే, స్వర్గీయ జంధ్యాల గారి "చంటబ్బాయ్" లో చిరంజీవి, సుత్తివేలు కీ "కోడ్ వర్డ్" తో లెటర్ రాసినట్టు. మా వాడు ఉపయోగించే ప్రారంభ కొటేషన్ తోనే మావయ్య గారికి అర్థమై పోతుండేది ఎంత పంపించాలో. వాళ్ళిద్దరి మధ్యా ఆ చారిత్రాత్మక ఒప్పందం చూస్తుంటే, "కాశ్మీర్" సమస్య ఒక సమస్యేనా అనిపించేది.

మామూలుగా నెలకి పంపే 600 రూపాయలే కావల్సి వస్తే, "నాన్నగారికి" అని మొదలుపెట్టేవాడు లెటర్, ఇంకో రెండు మూడు వందలు ఎక్కువ కావలసివస్తే, "పూజ్యులైన" వచ్చి ముందు చేరిపోయేది. వెయ్యికి పైగా దులపాల్సి వస్తే, సడన్ గా "మహారాజశ్రీ" అయిపోయేవారు నాన్నగారు.

ఇలా, "గౌరవనీయులైన" అనో, "శ్రీ శ్రీ రాజ మార్తండ" అనో పెంచుకుంటూ పోతుండేవాడు. "అవసరాన్ని" బట్టి. అందుకే ఒకటో తారీఖు వస్తోంది అనగా మేము సరదాగా ఏడిపించే వాళ్ళం వాడిని "ఏరా, ఈ నెల మీ నాన్నగారు, ఉత్త నాన్నగారేనా లేక రాజమార్తాండా?" అని. అలా వచ్చిన డబ్బులతో, వాడు "మలబార్ బేకరీ' లో కోన్ కేక్ లూ, "అల్లూరయ్య" స్వీట్ షాప్ లో మైసూర్ పాక్ లూ లాగిస్తూ ఆనందం గా ఉండేవాడు బిడ్డ.

సరే, కవర్ అందగానే, హీరో జెట్ సైకిల్ మీద "యమకింకరుడు" లో చిరంజీవి హోండా నడిపినంత స్పీడ్ గా, స్టయిల్ గా వెళ్ళే వాడు డిపాజిట్ చెయ్యడానికి. వాడితో పాటు నన్నో, బాబాయ్ గాడినో లాక్కెళ్ళేవాడు. DD వచ్చిన రోజు సాయంత్రం "కల్యాణి ఫాస్ట్ ఫుడ్ సెంటర్" లో స్నాక్స్ + సెగలు కక్కే కమ్మని బ్రూ కాఫీ, ఫస్ట్ షో సినిమా, హోటల్ "మౌర్య" లో డిన్నర్ ఇదీ ప్రోగ్రాం ఎవరి ఇంటి నుండి డబ్బులు వచ్చినా. అ ఒక్క రోజూ వైభోగం "చిరంజీవి ఇంట్లో పెళ్ళి సందడి" అంత అయితే, రెండో రోజు నుండీ, ఒకే సారి 3 ముదనష్టపు సినిమాలు తీసి మూతులు కాల్చుకున్న నిర్మాతలా ముడుచుకు కూర్చునేవాళ్ళం.

ఇలా ఉండగా, ఒకసారి DD/MO బదులుగా ఆయన చెక్ పంపారు. నిజం చెప్పొద్దూ, బ్యాంక్ లో కార్యకలాపాల మీద వాడికి గానీ, మాకు గానీ అవగాహన అప్పట్లో చాలా తక్కువ. వాడిది ఏ టైపు ఎకౌంటో, అ టైప్ కీ, మిగతా టైప్స్ కీ తేడా ఏమిటో ఎందుకు అన్నేసి రంగు కాగితాలు (ఫారం లు) అక్కడ పెడతారో? డబ్బులు వెయ్యాలంటే ఒక రంగు కాగితం, తియ్యటనికి ఒక రంగు, DD తెస్తే ఒక రంగూ, వేరేది ఇస్తే ఇంకో రంగూ, పిచ్చెక్కిపోయేది అంటే నమ్మండి!

అడగాలి అంటే "డిగ్రీ" చదువుతున్నారు అ మాత్రం తెలియదా అంటారు. payments అనే కౌంటర్ చూస్తే, వెళ్ళి నుంచోవాలో, వద్దో అని భయపడి చచ్చేవాళ్ళం. ఎందుకంటే, అ కౌంటర్ ముందు బ్యాంక్ వాళ్ళు, మనకి పే చేస్తుంటే (withdraw) నుంచోవాలా లేక మనం వాళ్ళకి పే చేస్తుంటే (bills paying) నుంచోవాలా అని తెలియక. "ధమనులు, సిరలు కి మధ్య గాని, కుంభాకార, పుటాకార దర్పణాల మధ్య కానీ, పరావర్తన, అతి పరావర్తన, నీలలోహిత కిరణాల మధ్య" తేడాలైనా కష్టపడి అర్థం చేసుకున్నమేమో కానీ, DD కీ, చెక్ కీ, చలాన్ కీ over draft మధ్య తేడా మాత్రం తెలిసి చచ్చేది కాదు.

సరే, ఈ గోలంతా ఎందుకంటే, ఈ సరి DD కి బదులుగా చెక్ రావడం తో, భయపడుతూ వెళ్ళిన మాకు, అనుకున్నట్టుగానే, బ్యాంక్ లో "పెళ్ళయి, పిల్లలున్న ఓ పండు (45-50 ఏళ్ళు ఉంటయేమో) ప్రసాద్" గారి చేతిలో పరాభవం జరిగింది.

గురుడు కి బాస్ చేతిలో ముందే వాయింపు కార్యక్రమం అయ్యిందో ఏమో, "అదేదో' రంగు ఫారం లో ఇష్టమొచ్చిన చోటల్లా వాడి పేరు, వాళ్ళ నాన్నగారి పేరూ, ఊరి పేరూ రాసి, చెక్ పెట్టి చేతికి ఇచ్చిన వీడిని, "ఈ దుర్యోధన దుశ్శాశన" పాట లో విజయశాంతి చూసినంత కఠోరం గా చూసాడు ఆయన ఆ ఫారం పూరింపబడిన విధానం చూసి.

"నీకు ఇంటర్ లో మార్కులెంత?" అన్న దగ్గర నుండి మొదలుపెట్టి, "మా కాలం లో చదువులు.." అంటూ, ఈ రోజుల్లో "వానాకలం" చదువులని ఎండకట్టి, వాడినీ, వాడితో పాటు వచ్చి వాజమ్మల్లా నుంచున్న నన్నూ, బాబాయ్ గాడినీ, మాకు చదువుచెప్పే మాస్టార్లనీ, తిట్టీ తిట్టీ ఫారం ఎలా నింపాలో చూపించి, అందరి ముందూ పరువు తీసేసాడు. "అసలు యూత్ ఎలా ఉండలీ?" అన్నదాని మీద అప్పుడే పుస్తకం రాసి, పబ్లిష్ చేసిన వ్యక్తి లా కనిపించాడు ఆయన!

జరిగిన ప్రాభవానికి మా బావగాడికి కోపం వచ్చేసింది. ఉడుకు రక్తం కదా! అప్పటికి ఇంకా ఈ "మీసం తిప్పే, తొడ గొట్టే" సినిమాలు రాకపోయి ఉండటం చేత, పిడికిలి బిగించి, అరచేత్తో సైకిల్ సీట్ మీద గట్టిగా గుద్దుతూ, "మంచికి మంచి, పంచ్ కి పంచ్" లా బాలకృష్ణ లేటెస్ట్ సినిమా "వీరభద్ర" టాగ్ లైన్ లాంటివి ఏవో గుర్తు తెచ్చుకుని "మనం ఎలా అయినా ఆయన్ని ఏడిపించలి రా" అన్నాడు.

"గట్టిగా అడిగితే, చెక్ కీ, చెక్ బుక్ కీ తేడా తెలియని వాళ్ళం, ఎలా సాధ్యం రా?" అన్నం.

"యువత సాధించలేనిది ఏమీ లేదు.." అన్నాడు, "ఛాలెంజ్" సినిమా పోస్టర్ గుర్తు తెచ్చుకుని.

బాగా అలోచించి, బృహత్ ప్రణళిక రూపొందించాడు.

సెప్టెంబర్-అక్టోబర్ లో కాలేజ్ కి దాదాపు నెల రోజులు శలవలు వచ్చేవి. ఎలక్షన్స్ అనీ, పరీక్షలు అనీ, పండగలు అనీ రకరకాల కారణల చేత. ట్యూషన్స్ ఉండటం తో ఊరు వెళ్లకుండా అక్కడే ఉండిపోయేవాళ్ళం. ఇక రోజూ పదిన్నర గంటలప్పుడు బ్యాంక్ కి వెళ్లడం, వంద రూపాయలు withdraw చెయ్యడం, గాంధీ రోడ్ లో చిల్లర నోట్లు, చిరిగిపోయిన నోట్లూ తీసుకునే చిన్న షాప్ ఉండేది, వాళ్ళు చిల్లర బాగా మైంటెయిన్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఒక రూపాయి, రెండు రూపాయి నోట్లు బాగా నలిగిపోయినవి తీసుకునేవాడు ఈ వంద మార్చి. ఆ కట్ట అంతా పట్టుకుని, మళ్ళీ పన్నెండు గంటలకి బ్యాంక్ కి వెళ్ళి ఆ వంద రూపాయలు డిపోజిట్ చెయ్యడం, ఆయన ఆ కట్ట అంతా లెక్క పెట్టే వాడు వంద సరిగ్గా ఉన్నాయో లేవో అని. పైగా పెద్దవారు అవటం చేత మరీ కొంత చాదస్తం తో చేసేవారు ఆ పని. అవి అసలే నలిగిపోయి ఉండటం చేత, లెక్క కి సరిగా చేతికి వచ్చేవి కావు. ఒంటి గంట కి మళ్ళీ వెళ్ళి withdraw చెయ్యటం, రెండున్నర కి మళ్ళీ డిపాజిట్ చెయ్యడం.

ఇలా దాదాపు వారం రోజులు వరుసగా ఇదే కార్యక్రమం.

అప్పుడు అంతా manual operations అవటం చేత, ఆయన ఎంట్రీలు రెండు, మూడు చోట్ల ఎక్కించాల్సి వచ్చేది. పైగ ఈ లెక్క పెట్టుడు కార్యక్రమం ఒకటీ. ఆయనకి దాదాపు గా అర్థమయ్యింది వీడు ఇదంతా కావాలని చేస్తున్నాడు అని.

ఓ రెండు రోజుల తరువాత, యాదృశ్చికం గా జరిగి డ్యూటీ నిజం గానే మారిందో లేక ఈయనే చెప్పి మార్పించుకున్నాడో తెలియదు కానీ, కొత్తాయన కనిపించారు కౌంటర్ లో. ఈయన వేరే సెక్షన్ లో ఉన్నారు.

ఆయన్ని విసిగించాలి, అది వాడి ధ్యేయం. విసిగించాడు. మళ్ళీ ఆయన కౌంటర్ లో ఉండగా కూడా ఆ పని మేము ఇక చెయ్యలేదు.

ఇది జరిగి పదహారు ఏళ్ళు. ఆయన రిటైర్ అయి ప్రశాంతం గా జీవితం గడుపుతూ ఉండి ఉంటారు. ఆ మధ్య (2003 లో) నేనూ, బాబాయ్ గాడూ ఒంగోలు లో కలిసినప్పుడు మాటల్లో వస్తే, "ఎలా ఏడిపించాం రా పెద్దాయన్ని పట్టుకుని అంత ఘోరం గా?! ఆయన టైము వేస్ట్ చేసాం, physical గా ఇబ్బంది పెట్టాం. మిగిలిన కస్టమర్స్ కి ఇబ్బంది కలిగించాము" అని వాడు అన్నప్పుడు, "చా!" అని మాకు మేము నిందించుకున్నప్పుడు, మా మధ్య ఒక క్షణం చోటు చేసుకున్న నిశబ్దం గమనించినప్పుడు.. అప్పుడు మళ్ళీ అర్థమయింది.. "వయసు పెరిగితే, బుద్ధి ఎందుకు పెరుగుతుందో! ఇది మంచి, ఇది చెడు అని పెద్ద వాళ్ళు ఎందుకు అనుభవపూర్వకం గా చెపుతారో".

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.