సుబ్బమ్మ గారి హోటెల్ (ఒంగోలు కధలు - 5): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

ఈ మధ్య సినిమాలు రిలీజ్ అవుతున్న తీరు చూస్తుంటే నాకు ఎందుకో మా ఊర్లో సుబ్బమ్మ గారి హోటల్ గుర్తుకొస్తోంది. దానికీ, దీనికీ పొత్తు ఎలా కుదిరింది అనేగా మీ సందేహం? వస్తున్నా అక్కడికే.

అప్పుడు మేము ఉన్న ఊరు, ప్రకాశం జిల్లా లో ఓ గ్రామ పంచాయితీ. ఓ రెండు టూరింగ్ టాకీస్ లు, ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఒక ధర్మాసుపత్రి ఇవి ఆ నగరం లో అత్యుత్తమ కట్టడాలు. ట్రాన్సిస్టర్ చెవి లో పెట్టుకుని క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళని అమర్థ్య సేన్ లానో, అబ్దుల్ కలాం లానో చూసే రోజులు. ఇక, మంచం కోళ్ళ తో బాట్లూ, వేడి నీళ్ళు కోసం బాయిలర్ లో వేసే కట్టె ముక్కల తో వికెట్స్ చేసి ఆడే మా పిల్ల గాంగ్ ని చూసి, "నెక్స్ట్ జెనెరేషన్" కిడ్స్ అనుకునే "పచ్చి" పల్లె వాతావరణం అది.

అలాంటి ఊళ్ళో ఉన్న ఒక చిన్న కాకా హోటల్ సుబ్బమ్మ గారిది. ఆ ఊళ్ళో, అప్పట్లో, చాలా వరకూ, చద్దన్నాలు "బ్రేక్ ఫాస్ట్" గా తినే కుటుంబాలే ఎక్కువ మాతో సహా. టిఫిన్ లు అంటే, ఏ ఆదివారం మధ్యాహ్నమో మూడు గంటలకి "విజయవాడ" స్టేషన్ లో వచ్చే నాటిక వింటూ, వేసుకుని తినడమే. టిఫిన్ లు కాక హోటల్ కి outsource చెయ్యడం అనే కాన్సెప్ట్ అంతగా క్లిక్ అవలా. అయినా సుబ్బమ్మ గారి కాకా హోటల్ తో సహా ఇంకా రెండో మూడో ఉండేవి. అప్పుడప్పుడు, హోటల్ నుండి పార్సెల్ తెచ్చుకోవటం రివాజు.

విషయానికి వస్తే, చిన్నాడ్ని కాబట్టి నన్ను తోలేవారు ఇడ్లీలు, గట్రా కట్టించుకురమ్మని. పైగా ఒక స్టీల్ బొచ్చె చేతిలో పెట్టేవారు దాని నిండా చట్నీ పోయించుకురమ్మని. నాకేమో ఆ స్టీల్ బొచ్చె తో మా classmates ఇంటి ముందు నుండి నడిచి వెళ్ళాలంటే నిజం చెప్పొద్దూ పిచ్చ సిగ్గేసేది. "అర్హత లేనివాడికి అవార్డ్ ఇస్తే" తీసుకునేటప్పుడు వాడికెంత ఇబ్బంది ఉంటుందో, ఆ గిన్నె చూపించి చట్నీ అడగటానికి నాకు అలానే ఉండేది.

పోతే, సుబ్బమ్మగారి ఫేమిలీ వెనుక రెండు గదుల్లో కాపురం ఉంటూ, వసారా, మధ్య గది లో 4,5 చెక్క టేబుల్స్ వేసి హోటల్ నడిపే వాళ్ళు. ఆవిడ chief cook, వాళ్ళాయన, ఆవిడ తమ్ముడు, వాళ్ళ పిల్లలూ మిగిలిన స్టాఫ్. వీళ్ళు "జ్యోతిచిత్ర, సితార తెప్పించక పోయినా:, వీళ్ళ హోటల్ కి గిరాకీ ఎక్కువగా ఉండేది. కారణం quality. ఆవిడ చేతి మహత్యం ఏమో గానీ, పొయ్యి మీద ఉండగానే ఫలహారాలు నోరు ఊరించేవి. "హీరో ఉన్న తరువాత, విలన్ తప్పడన్నట్టు" ఎదురుగుండా పోటీకి వచ్చింది రెడ్డి హోటల్. ఒకటీ రెండు ప్లాస్టిక్ కుర్చీలూ, జ్యోతిచిత్ర, సితార అన్నీ తెప్పించేవాడు. పైగా టేప్ రికార్డర్ పెట్టి "రంభా హో.. హో.. హో" అనీ "తు పాన్" అంటూ Qurbaani గీతాలతో మెహర్బానీ చేసేవాడు, కానీ, ఇడ్లీ దోశ దగ్గర కొచ్చేసరికి పప్పులుడికేవి కావు. నాణ్యత విషయం వచ్చేసరికి గురుడు గింగిరాలు తిరిగేవాడు.

ఇక, సుబ్బమ్మగారు వాళ్ళాయనకి వ్యాపార సూత్రలు చాలా బాగా తెలుసు. అందులో మొదటిది wait చేయించడం. ఇది వినటానికి వింతగా ఉండొచ్చు. "మోహన్‌బాబు ని జమైకా లో సన్మానించినట్టు" ఆయనకి బాగా తెలుసు ఎవరెవరు చచ్చినట్టు వాళ్ళ హోటల్ లోనే కొంటారో, రెడ్డి దగ్గరకెళ్ళకుండా. అది వాడుకునేవాడు. లేట్ అయ్యేట్టు ఉంటే, అటు వెడదాం అనుకునే గాంగ్ ని మొదట పట్టుకునేవాడు. వాళ్ళకి ముందుగా అందేలా చేసేవాడు. విసుగెత్తి మనం "ఇందాకటి నుంచీ ఈ బొచ్చె పట్టుకుని ఉన్నా నాకివ్వవేం?" అంటే, తెలివిగా చెప్పేవాడు "ఇందాకటి వాయ లో పప్పు సరిగా పడలా అందుకే మీకు పార్సెల్ కట్టలా అనో లేదా, వాళ్ళకి అడుగూ బొడుగున ఉన్న చట్నీ వేసా, ఫ్రెష్ చట్నీ ఇప్పుడే వచ్చింది లోపల నుంచి అందుకు ఆపా" అనో ఏదో చెప్పేవాడు. ఆయన కి తెలుసు వెయిట్ చేస్తారు వీళ్ళు అని. మా లాంటి వాళ్ళం అలానే వెయిట్ చేసేవాళ్ళం పక్కోడి ప్లేట్ ల వంక చూసి చప్పరిస్తూ.

ఇప్పుడు "అభిమానుల" దీ అదే పరిస్థితి. సదరు ప్రొడ్యూసర్ గారు డేట్ ఇచ్చినప్పటి నుండీ మొదలు అవుతుంది "వెయిటింగ్". ఇక విడుదలవుతుంది, సినిమా కాదు "తదుపరి స్టేట్ మెంట్". "ఈ నెల 8th నుండి 16 కి వాయిదా వేసాం సరి అయిన ధియేటర్లు దొరకని కారణం గా" అంటాడు "కధ మీద నమ్మకం లేని ఓ కనకయ్య". మళ్ళీ వెయిటింగ్ మొదలు. ఆ రోజు దగ్గరకొచ్చేసరికి ఇంకోటి "ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ సింగర్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాం ఓ ఐటెమ్ సాంగ్ కి. అందువల్ల లేట్" అంటాడు జయమాలిని పాటల్తో పైకొచ్చిన ఓ పరంధామయ్య. ఈ క్రమం లో మనకి అనేక బూతులు వినిపిస్తాయి "సంగీత దర్శకుడి హార్మోనియం పెట్టే పాడయిపోయింది" అనో, "గ్రాఫిక్స్ కోసం ఫీనిక్స్ వెళ్ళామనో" ఇలా.

మొత్తానికి రిలీజ్ రోజు వస్తుంది. ఇక అసలు "వెయిటింగ్" అక్కడ మొదలవుతుంది. online లోనే, ఎడ్వాన్స్ బుకింగ్ లోనూ టికెట్స్ వచ్చేస్తుంటాయి కానీ లాబ్స్ నుండి ప్రింట్స్ మాత్రం రావు! ధియేటర్ దగ్గరకు చేరుకుని తలకు రిబ్బన్ లూ బనియన్ మీద ఫోటోలూ ముద్రించుకున్న ప్రతినిధి వర్గం సదరు డిస్ట్రిబ్యూటర్ ని నిలదీయడం తో communication వ్యవస్థ స్థంభించిపోతుంది కాసేపు ప్రపంచ వ్యాప్తం గా. ఇవతల, website ల వాళ్ళు ఊదరగొట్టేస్తుంటారు 24x7 ప్రొడక్షన్ సపోర్ట్ తో, "ఇప్పుడే కడప ప్రింట్లు, కర్నూల్ వెళ్ళాయిట", "నంద్యాల లో వచ్చిన ఒక్క రీలూ వేసారుట, ఇంట్రడక్షన్ సాంగ్ నభూతోనభవిష్యతి ట.." అని వాతావరణాన్ని ఇంకా వేడెక్కించేస్తారు. ఇక ఈ రోజు కి ఆటలు అన్నీ రద్దు చెయ్యటం అయింది, మీకు ఎలాగూ పని లేదు కాబట్టి, మీరంతా మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చేయండి ప్రింట్లు వస్తే వేస్తాం అని చెప్పడం తో పిల్లా పీచులతో వచ్చినోళ్లంతా, "సచ్చినోళ్ళలారా" అని సదరు డిస్ట్రిబ్యూటర్ నీ, దర్శక నిర్మాతలనీ దుమ్మెత్తిపోస్తూ, "రేపైనా guarantee యా?" అంటారు అశ చావక!

"సదరు ప్రొడ్యూసర్ గారు వివరణ ఇచ్చుకుంటారు మర్నాడు. పాతుకుపోయిన ప్రొడ్యూసర్ అయితే, DTS mixing TCS వాళ్ళు ఆఖరి నిమిషం లో చెయ్యటం వల్ల" అంటాడు, సన్నకారు ప్రొడ్యూసర్ ఏమో "financial problems" వల్ల అని తెలుగు సినిమా భాగోతం బయట పెడతాడు. నాకు ప్రొడ్యూసర్స్ లో సుబ్బమ్మ గారి ఆయన కనిపిస్తున్నాడు. తేడా అల్లా ఒక్కటే, అంత ఫైటింగ్ తర్వాత కూడా ఆ ఇడ్లీ, చట్నీ రుచి అమోఘమే. ఇంత వెయిట్ చేసిన తరువాత, సదరు సినిమా మాత్రం...

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.