"దూద్ పేడా" (ఒంగోలు కధలు - 4): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

అవి నేను ఇంటర్ పరీక్షలు రాసి, నెల్లూరు "నారాయణ" కి EAMCET షార్ట్-టెర్మ్ కోచింగ్ కి వెళుతున్న రోజులు. అసలే, ఇల్లు ఒదిలి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు (శలవల్లో అనకాపల్లి తప్ప), పైగా పల్లెటూరు లో పెరిగి, ఒక్కసారిగా "నెల్లూరు" అంత పెద్ద సిటీ కి వెడుతున్నామనే సరికి "TV లో సింగిల్ ఎపిసోడ్ కూడా డైరెక్ట్ చేయని వాడికి మెగాస్టార్ సినిమా డైరెక్ట్ చేస్తున్నంత" ఖంగారు. ఒక పక్క ఖంగారు గానే ఉన్నా, మరో పక్క 30, 40 రోజులు "టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్" లా గడపొచ్చు అనే సంతోషం! మన ఇష్టమొచ్చిన సినిమాలు చూడొచ్చు, మన ఇష్టమొచ్చినట్టు ఖర్చుపెట్టొచ్చు, మన ఇష్టమొచ్చినట్టు తినొచ్చు అన్న ఆనందం లో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, పరీక్ష కి అనే విషయం మాత్రం అటకెక్కేసింది "ఆర్భాటం గా మొదలై ఆగిపోయిన" సినిమా లా.

మొత్తానికి నేను, రెడ్డి గాడు, మురళి, శీను గాడు, రాంకీ అందరం బయలుదేరాం. మాతో పాటే, నాన్నగార్లూ! ఎడ్మిషన్స్ అయినతరువాత, రూమ్ లు వెతికి, ఒక చోట పడేసారు అందరినీ. మెస్సు అదీ మాట్లాడి, చెప్పాల్సిన జాగర్తలు అన్నీ చెప్పి, మర్నాడు తిరుగు బస్ ఎక్కారు.

ఇక "కిష్కిండ కాండ" మొదలైంది.

ఏదో అక్కడికి విహార యాత్ర కి వచ్చినట్టు, అ కోచింగ్ సెంటర్ లో చాలా వరకూ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న తాపత్రయం ఎలా ఉన్న, ఊరిని చుట్టేయాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. మన కన్నా ముందే అక్కడ ఆల్రెడీ తిష్ట వేసిన బేచ్, అంటే, ఏళ్ల కు ఏళ్ళు పాతుకుపోయి, లాంగ్-టెర్మ్ కోచింగ్ ల పేరిట, కొంపలు ఆర్పుతున్న బేచ్, నెల్లూరు ని ఆమూలాగ్రం కుశాగ్ర బుద్ధి తో పరిశీలించి, తయారు చేసిన "నగరం లో 40 రోజులు" అన్న గైడ్ ని బట్టి, ఈ క్రిందివి obligatory places అయిపోయాయి దాదాపు గా అందరికీ ఆ టైము లో.

1. కృష్ణ, కావేరి, కల్యాణి ధియేటర్ కాంప్లెక్స్ లో సినిమా చూడటం
2. సండే మార్కెట్ లో సండే ఈవెనింగ్ జల్సా చేయటం
3. మురళీ కృష్ణ హోటల్ లో లంచ్ లేదా డిన్నర్
4. "చందమామ", "వెన్నెల" పార్లర్ లో specialities సేవించటం
5. అర్చనా 70mm, నర్తకి 70mm ధియేటర్ లు కూడా కవర్ చెయ్యటం
6. కోచింగ్ ముగుస్తుంది అనగా, రంగనాధ స్వామి ఆలయం దర్శించి, రాంకుల కోసం సాముహిక ప్రార్థనలు చేయటం.

ఇవి ప్రతివాడికీ కామన్ అయిపోయాయి. మా గాంగ్ ఇందుకు మినహాయింపు కాదు. అన్నీ కవర్ చేసాం.

మా శీనుగాడు కాస్త తిండి ప్రియుడు అవటం తో, వెన్నెల / చందమామ పార్లర్ మరో సారి దర్శించుకునే భాగ్యం కలిగింది. కానీ మిగిలిన గాంగ్ "మేము రాము" అనడం తో, వాడు, నేనే బయలుదేరాము. పుణుగులు, పచ్చి మిరప బజ్జీలూ, చేగోడీలు, చక్రాలు, అరిశలూ, గనిని గడ్డలూ (చిలకడ దుంపలు అనికూడ అంటారు రెడ్ పొటాటోస్) లాంటివి వినడం, తినడమే తప్ప pastry లూ పఫ్ లూ, కోన్ కేక్ లూ, బ్లాక్ కసాటా లూ లాంటివి హాలీవుడ్ సినిమా లా అనిపించేవి. చాలా వాటి పేర్లు కూడా సరిగా తెలిసేవి కావు. తెలియలేదు అంటే పక్కనోడు మనల్ని "కాంతారావ్ కాలం" నాటివాడు అంటారని తెలిసినట్టు ఫోజు లు కొట్టేవాళ్ళం.

ఇలాంటి అయోమయ స్థితి లో ఆ నోట, ఈ నోటా విని ఉండటం చేత, మా శీను గాడికి "దూద్ పేడా" అనే పేరు నచ్చి, అది తినాలనిపించింది. "అదేంట్రా, ఎలా ఉంటుంది?" అని అడిగా వాడు క్లోజ్ అవటం చేత.

"దా, నీకెందుకు, తిన్నావంటే, వదలవ్" అన్నాడు వాడూ లోపల భయపడుతూనే.

"ఎంత అవుతుందో!?" అన్నా బక్క చిక్కిన రూపాయి ఒంక చూస్తూ.

"నీకెందుకూ నేను మేనేజ్ చేస్తాగా" అన్నాడు వాడు.

సరే తిందామని బయలుదేరి వెళ్ళాం. కానీ రేట్ ఎంత ఉంటుందో తెలియదు, అడగాలి అంటే మొహమాటం. ఈ తర్జన, భర్జన లో మనోడికి అద్దాల్లోంచి నోరూరిస్తూ ఒకటి, రెండు వెరైటీ ఐటెమ్స్ కనిపించాయి, లడ్డూ, మైసూర్ పాక్ లాంటివి కాకుండా, ముందు వాటి పని పడదాం అని, వాటి వంక చేయి చూపిస్తూ, "అవి రెండు" అన్నాడు.

షాప్ వాడు చెరొకటీ ప్లేట్ లో పెట్టి ఇచ్చాడు. చిన్నగా కొరుకుతూ, "నల్ల కుక్క మెడ కి తెల్ల బెల్ట్ కట్టి తోలుకొస్తూ నిల్చున్న నాగార్జున విక్కీ దాదా పోస్టర్" వంక రెప్ప వేయకుండా చూస్తూ ఆస్వాదించేసాం రెండు. (అప్పుడు నాగ్ భయ్యా కి వీర ఫాన్స్ మి లెండి)

"ఇంకేంటి?" అన్న షాప్ వాడి పిలుపు లో మమకారం కన్నా, "ఇంకెంత సేపు తింటారు?" అన్న వెటకారమే కనిపించింది నాకయితే, మనం ఎలాంటి intellectual customers మో వీడికి తెలియాలి అన్న ఆవేశం తో మా వాడు, "దూద్ పేడా" ఉందా మీ దగ్గరా?" అని షాప్ వాడిని స్టయిలిష్ గా అడిగి, "గీతోపదేశ సమయాన కృష్ణుడు అర్జనుడి వంక అభయహస్తుడై, మందస్మితదరహాసుడై చూసినట్టు గా నా ఒంక చూసాడు. "చూడు, చూసి నేర్చుకో" అని "పెళ్ళి పుస్తకం" లో రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి కి చెప్పినట్టు. "చూడు, మన లెవెల్ చెక్క వడల్ నుండి దూద్ పేడల్ వరకూ ఎలా పెంచేసానో!" అన్నట్టు గా.

ఈ షాక్ నుండి నేను తేరుకునేలోగా ఇంకో షాక్ అంతే షార్ప్ గా వచ్చింది షాప్ వాడి నుండి, "మీరు ఇప్పటి వరకూ తిన్నది అదే" అని.

M.Sc., B.Ed., చేసి, గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా, ఒంగోలు దగ్గర ఉంటున్నాడు శీను ప్రస్తుతం.

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.