మంత్రాలకి మార్కులు రాలుతాయా? (ఒంగోలు కధలు - 3): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

ఇది నిక్కర్లు కూడ సరిగ్గా వేసుకోవడం రాని రోజుల్లో జరిగిన ఓ సరదా (మాకు) సంఘటన.

అప్పుడే అయిదవ తరగతి లోకి వచ్చాం. నేను, రాంకీ "ప్రేమదేశం" లో అబ్బాస్-వినీత్ లా మొదట కొట్టుకున్నా, ఆ తరువాత మా రెండు కుంటుంబాలూ బాగా కలసిపోవడం వల్ల, ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ అయిపోయాం. "చదివేది చారెడు, చేసేది బారెడు" అని, కంబైన్డ్ స్టడీ పేరిట చేసే అల్లరే ఎక్కువ. కాలనీ లో మా ఇద్దర్నీ "జంట కవులు" అనేవారు. ప్రత్యర్థులు మాత్రం "లంబు-జంబు" అని కసి తీర్చుకునేవారు. ప్రత్యర్థులు అంటే, ఫాక్షన్ సినిమా లో కనిపించే విలన్స్ లాంటి వాళ్ళు కారు, కవిత, శైలజ అని ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళకి మనం పడకపోవడానికి కారణం నేను క్లాస్ కి SPL (Student leader) వాడు ASPL అవడం వల్ల! ఈ అమ్మాయిలిద్దరి పప్పులూ ఉడికేవి కావు. పైగా క్లాస్ లో 1st, 2nd రాంకులు మా నలుగురి మధ్యే ఎప్పుడూ దోబూచులాడుతుండేవి. అది సగం అక్కసు! అందువల్ల సహజం గానే మా రెండు గ్రూప్ ల మధ్యా "కర్పూరం వేస్తే కస్సు" మనేది. సరే, మన కధ కీ ఇద్దరు పాత్రలకీ ఇంత కన్నా బిల్డప్ అనవసరం!

ఓ రోజు, క్లాస్ లో ఒక కొత్త పిల్లాడు చేరాడు. చాలా అమాయకం గా అంటే, "చంటి లో వెంకటేష్" లా కనిపించాడు (కానీ ఇంట్లో "తుంటరేష్" అని తర్వాత తెలిసింది). వాళ్ళ నాన్నగారు కూడా మా నాన్నగారి ఆఫీస్ కే ట్రాన్స్ ఫర్ అవటం వల్ల వచ్చారుట. లోకల్ హీరోలం మనం కాబట్టి, వాడే వచ్చి మనతో మాట్లాడతాడు అని మేమిద్దరం వాడిని పట్టించుకోలా. వాడు మమ్మల్ని అంతకన్నా పట్టించుకోలా. "కూరాకు లో పురుగాకు లా" తీసిపారేసాడు. ధుర్యోధనుడికి మయసభ లో జరిగిన అవమానం కన్నా ఎక్కువ ఇది అని ఫీల్ అయిపోయాము. వస్తుండేవాడు, పోతుండేవాడు, ఇంటర్వెల్ లో ఒక్కడే "నూగు జేడి, గొట్టాలు" కొనేసుకుని, మొత్తం ఒక్కడే తినేస్తుండేవాడు SPL కీ, ASPL కీ పెట్టకుండా. కానీ ఎందుకో మనిషి చాలా నెమ్మదిగా, అమాయకం గా ఉండేవాడు.

కొన్ని రీళ్ళు తిరిగినతరువాత క్లాస్ లో మా ఇద్దరికీ ఉన్న ఇమేజ్ నచ్చిందో (1st, 2nd రాంక్ ల వల్ల) లేదా రోజూ మేం చెట్టెక్కి ఆడుకునే "కోతీ కొమ్మచ్చీ" నచ్చిందో కానీ, మొత్తానికి ఓ రోజు మేము బెచ్చాలాట ఆడుకుంటుంటే వచ్చాడు ఈ కొత్త బచ్చాగాడు నేనూ మీతో ఆడుకుంటా అని. సరే అని లూప్ లోకి లాగాము.

వాడి పేరు "హుస్సేన్". చిన్నగా అలవాటు పడ్డాడు మాతో. వాడు మా ఇద్దరికీ యూనిట్ టెస్ట్ లూ, క్వార్టర్లీ, హాఫ్-ఇయర్లీ లో వచ్చే మార్కులు చూసి తెగ ఉబలాటపడిపోయేవాడు అన్నెన్ని ఎలా వచ్చేస్తున్నాయా తమిళ డబ్బింగ్ సినిమాల్లా అని. వాడికి పాపం అత్తెసరు మార్కులు వచ్చేవి. "ఎలా వస్తాయి రా మీ ఇద్దరికీ?" అని అడిగితే, మాకు "మంత్రాలు" వచ్చు అని చెప్పాము. వాడు నమ్మకపోయేసరికి, మా తుంటరి చేష్టలతో ముందుగా బాగా ప్రిపేర్ అయి, వాడు నమ్మేలా కొన్ని చిన్న చిన్న మేజిక్ లు చేసి చూపించాం. పాపం అమాయకుడు అవటం చేత నమ్మాడు. మా ఇద్దరికీ "మంత్రాలు" వచ్చు అని.

సరిగ్గా, ఇక్కడ మొదలైంది అసలు కధ.

వాళ్ళ నాన్నగారు ఇచ్చుకునే కోటింగులకి భయపడి, వాడు మమ్మల్ని సతాయించేవాడు నాకూ మార్కులు తెప్పించడ్రా ఆ మంత్రాలేవో చదివి అని. అది తెలిసి చేసామో, తెలియక చేసామో కానీ, వాడి అమాయకత్వాన్ని కేష్ చేసుకోవాలని మాలో ఓ తుంటరి అలోచన మొదలయ్యింది. సరే, నీకు మంత్రలు నేర్పిస్తాం, కాకపోతే, రోజుకి "పావలా" ఖర్చవుతుంది అన్నం. సరే, అన్నాడు. ఇంకో కండీషన్ కూడా పెట్టాం. మంత్రాలు అన్నీ వచ్చి సరిగ్గా చెప్పగలిగేంత వరకూ ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు. చెపితే, దాని ప్రభావం ఉండదు అని (అంతా బి.విఠలాచార్య, చందమామ "బేతాళ కధ" ల స్పూర్తి, ఏం చేస్తాం?)

వాళ్ళ నాన్నగారి మెప్పు ఎలాగైనా పొందెయ్యాలన్న తొందర లో, ఏం చేస్తున్నాడో వాడికే తెలియని పసి వయసులో వాడు yes అనేసాడు. వాడికి ఓ పేపర్ మీద నోటికి వచ్చిన మంత్రాలు "ఓం, హ్రీం క్రీం" అంటూ ఓ రెండు మూడు లైన్లు రాసి రోజు కి రెండు పూట్లా గుట్టు చప్పుడు కాకుండా చదువుకోమని చెప్పాం.

అక్కడ నుండీ మనకి రోజూ ఇంటర్వెల్ లో గొట్టాలూ, పాల అయిస్ లూ, నేతి బిస్కట్లూ ఒకటేమిటీ, నా సామి రంగా, "2000 సంవత్సరం లో Mainframe కోర్స్ నేర్పించే institute లా ఓ వెలుగు వెలిగిపోయాం" వాడి "పావలా" ల తోటి.

ఈ రుబ్బుడు కార్యక్రమం ఎన్నో రోజులు సాగలా. ఒక రోజు హుస్సేన్ వాళ్ళ నాన్నగారు స్కూల్ కి వాడిని తన్నుకుంటూ తీసుకుని రావటం తో కధ క్లైమాక్స్ కి వచ్చింది (మాకు తెలిస్తేగా వాడు రోజూ వాళ్ళ నాన్నగారి జేబులోంచి డబ్బులు కాజేసి తెస్తున్నాడని) హెడ్ మాస్టార్ గారి దగ్గర తిన్నది అంతా కక్కటం తో "కబడ్డి.. కబడ్డి" ఫస్ట్ రౌండ్ స్కూల్ లోనే అందరి ముందూ అయింది (చీ.. చీ.. *edited* జన్మ!! కవిత, శైలజలు చూస్తుండగా పైగా), "సెకండ్ రౌండ్" ఇంటి దగ్గర మొదలైంది విషయం పెద్ద వాళ్ళ దాకా రావడం తో. అలా పెద్ద వాళ్ళ చేతుల్లో చీరుకుపోతున్న మా వీపులకి, రక్షణ కవచం లా అడ్డుపడ్డారు హుస్సేన్ నాన్నగారు పిల్లల్ని అంత అలా కొట్టకండి అంటూ.

ఆ తరువాత మార్కులు తెచ్చుకునే విధానం అది కాదు అని తెలుసుకున్న హుస్సేన్ మాతో కలిసి చదువుకోవడం మొదలుపెట్టాడు. ఈ సారి వాడికి బానే నేర్పించాం గురుదక్షిణ లేవీ తీసుకోకుండా వీపు మీద బొబ్బలు తడుముకుంటూ. ఏడో క్లాస్ మధ్య లో రాంకీ వాళ్ళ నాన్నగారికి "మిర్యాల గూడెం" ట్రాన్స్ ఫర్ అవడం తో వాళ్ళు వెళ్ళి పోయారు. నేను, హుస్సేన్ కొనసాగించాం. 7th రిజల్ట్స్ వచ్చినప్పుడు రెడ్డి హోటెల్ ముందున్న కూల్ డ్రింక్స్ షాప్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నాకు, సెకండ్ క్లాస్ లో పాస్ అయిన తన కొడుక్కీ హుస్సేన్ నాన్నగారు ఇప్పించిన "గోల్డ్ స్పాట్" నిజం గా అమృతమే!

ఆ తరువాత, నేను 8th లో ఉండగా నాన్నగారి ఆఫీస్ "వినుకొండ" కి ట్రాన్స్ ఫర్ అవటం తో హుస్సేన్, నాకు మధ్య కూడా లింక్ తెగింది. రాంకీ వాళ్ళు, మేము ఫేమిలీ ఫ్రెండ్స్ అవటం వల్ల అప్పటి నుండి ఇప్పటికీ మా మధ్య communication ఉంది.

రాంకీ, ఆ తరువాత M.Tech చేసి, తన కిష్టమైన బాంకింగ్ రంగం లో సిటీ ICICI బ్రాంచ్ హెడ్ గా North India లో స్థిరపడ్డాడు. ఒక పాప. కవిత, పోలిటెక్నిక్ / ఇంజినీరింగ్ చేసి, పెళ్ళి చేసుకుని, ఇద్దరు పిల్లల తల్లి ఇప్పుడు. హైదరాబాదు లో ఉన్నట్టు ఆ మధ్య సమాచారం. శైలజ, తెలీదు, నేను MCA చేసి, 1998 నుండీ, "అలవి గాని చోట ధికులమంటూ.."

హుస్సేన్, హింస, మత ద్వేషాలు, రక్తపాతాలతో కరడు కట్టిన ఈ ధరిత్రి లో ఎక్కడో ఒక చోట ప్రశాంత జీవనం సాగిస్తూ క్షేమం గా ఉన్నావని ఆశిస్తూ, పసితనం లో నీ అమాయకత్వం తో ఆడుకున్నందుకు మమ్మల్ని మరోసారి మన్నించమంటూ..

పార్థూ & రాంకీ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.