క్షణక్షణం.. (ఒంగోలు కధలు - 2): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

"శివ" తరువాత వచ్చిన రామ్‌గోపాల్ వర్మ "క్షణక్షణం" రిలీజ్ కి ముందు ఎంత హడావిడి సృష్టించిందో అందరికీ తెలిసినదే. రిలీజ్ తరువాత అంతగా చప్పుడు చెయ్యలేకపోయినా ఈ చిత్రం మాత్రం మా ఫ్రెండ్స్ మధ్య పెద్ద దుమారం లేపింది. అదెలా అంటే, ఫైనల్ ఇయర్ లో ఉండగా (1991) "శేఖర్" అని, వేరే కాలేజ్ నుండి ట్రాన్స్ ఫర్ అయి, మా కాలేజ్ లో చేరాడు. (ఫైనల్ ఇయర్ లో ఎందుకు ట్రాన్స్ ఫర్ అయి వచ్చాడు అని అడక్కండి, ఏమో వచ్చాడు అంతే!).

మొదట దోస్తీ కుదిరింది శ్రీరామ్ తో. రూమ్ నీ, మేట్ నీ వెతుక్కోవటం లో భాగం గా మా బావ (శివ) గాడికి తగిలాడు. అప్పటికి బావగాడు "సెక్రటరీ" సినిమా లో ANR లా "మా రూము లో చోటున్నది ఒక్కరికే.." అంటూ రామకృష్ణ గొంతేసుకుని తిరుగుతుండటం తో, శ్రీరామ్ వీడిని (శేఖర్) చూపించాడు.

అంతే, రూమ్ లో దూరిపోయాడు, గ్రూప్ లో కలిసిపోయాడు, శేఖర్. అది అక్టోబర్, 1991. శ్రీరామ్ పుట్టినరోజు వచ్చింది. మనోడు ఉత్సాహం గా గాంగ్ అందర్నీ హోటల్, ఆపై సినిమా కి తీసుకెడతా అనడం తో కుర్రాళ్ళంతా ఖుషీ ఖుషీ గా చాలా రోజుల తరువాత సీరీస్ గెల్చిన ఇండియా టీమ్ లా ఉన్నారు.

హోటల్, మెనూ etc బుక్ చేసే బాధ్యత శివ గాడిని, బాబయ్ నీ చూసుకోమని, నేను, శ్రీరామ్ గాడు సినిమా కీ, ట్రాన్స్ పోర్టేషన్ కీ సంబంధించిన శాఖలు తీసుకున్నాం. (ట్రాన్స్ పోర్టేషన్ అంటే ఏవేవో ఊహించేసుకోకండి. లూనా మీద ఎక్కే వాళ్ళు ఎవరు, ఎన్ని ట్రిప్పులు వెయ్యాలి, సైకిల్ ఉన్న వాళ్ళు, వాటి మీద వచ్చే శాల్తీలు వివరాలు, మిగిలిన వాళ్ళ కోసం ఒక రిక్ష ఏర్పాటు చెయ్యడం, రిక్షా రానూ, పోనూ చార్జీలు మాట్లాడటం - అప్పటికి ఇంకా "ఆటో" లు రాలా ఒంగోలుకి, సైకిల్ కి ధియేటర్ దగ్గర స్టాండ్ లో డబ్బులు కట్టడం, అడ్వాన్స్ బుకింగ్ తీసుకోవటం, అన్నీ లెక్కలు ఫైనల్ గా అప్పచెప్పడం.. అవీ ప్రధాన పనులు).

సరే, మొత్తం పది, పన్నెండు మంది లెక్క తేలారు. సాయంత్రం 6:30 షో. నేను, శ్రీరామ్ గాడు 4:30 కి ఇచ్చే అడ్వాన్స్ బుకింగ్ (విజయ దుర్గా ధియేటర్, క్షణక్షణం సినిమా) కి వెళ్ళాలి అని తీర్మానించుకున్నాం. పిక్ చేసుకోవడానికి 4pm కల్లా వస్తా అన్నాడు కదా అని నేను రెడీ అవుతుంటే తలుపు చప్పుడు అయింది. చూద్దును కదా, కొత్త వ్యక్తి కనిపించాడు. చాలా అలసిపోయినట్టు, అప్పుడే, తమిళం నుండి తెలుగు లోకి డబ్ అయి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా, మాట్నీ చూసి వచ్చిన వాడి లా, వాడిపోయి, వడలి పోయి కనిపించాడు.

మొహం లో ఏదో తెలియని ఆత్రుత, ఆశ్చర్యం రెండూ black-white TV లా కనిపిస్తున్నాయి క్రిస్టల్ క్లియర్ గా. నేను అతన్ని కలవడం అదే మొదటి సారి. మా మధ్య సంభాషణ ఇలా సాగింది.

అతను: శేఖర్ లేడా?

నేను: లేడు, తెలీదు, ఏ మెస్ లో ఫుడ్డు కొట్టి, ఎవడి రూమ్ లో పడుకున్నాడో!

అతను: మీరు రూమ్మేటా?

నేను: లేదు, నేను వేరే రూమ్, అప్పుడప్పుడు ఇక్కడ ఉంటుంటా. శివ నా ఫ్రెండ్.

అతను: ఇంతకీ రూమ్ లో వాళ్ళు ఎవరూ లేరా?

నేను: లేరు.

అతను: శేఖర్, ఎప్పుడు వస్తాడో తెలుసా?

నేను: సాయంత్రం పార్టీకీ, సినిమాకీ మాత్రం వస్తాడు తప్పకుండా ఎక్కడున్నా.

అతను: నేను అర్జంటుగా వెళ్ళిపోవాలి. నాకు ట్రైన్ కి లేట్ అవుతోంది. ఒక ముఖ్యమైన లెటర్ అతనికి మాత్రమే ఇవ్వాలి. అదే, సాధ్యమైనంత త్వరగా ఇవ్వగలరా? ఎందుకంటే, లెటర్ చూస్తే, తను తప్పక స్టేషన్ కి వచ్చి నన్ను కలుస్తాడు.

నేను అసలే అవతల ఎడ్వాన్స్ బుకింగ్ కి టైమ్ అవుతోంది, మధ్యలో ఈ గొడవ ఏమిటీ అనుకుంటూ.. "సరే, ఇస్తా" అన్నాను.

అతను వెళ్ళిపోయాడు లెటర్ ఇచ్చి.

ఈ లోపు శ్రీరామ్ రానే వచ్చాడు "టైము అయిపోతోంది.. రా" అంటూ. బయటకి వచ్చామో, లేమో శశికాంత్ అని ఇంకో ఫ్రెండ్ కనిపించాడు బయట సైకిల్ మీద వెడుతూ. శేఖర్, వీడు, ఇండస్ట్రీ లో "అచ్చిరెడ్డి - కృష్ణరెడ్డి" టైపు. వీడు కనిపించాడు అంటే, శేఖర్ దొరికినట్టే అని, వాడ్ని అడిగాము. శేఖర్ ఇప్పుడే వాళ్ళ అత్తయ్యగారింటికి వెళ్ళాడు అని చెప్పాడు. సర్లే దగ్గరే కదా అని శ్రీరామ్ తో "రేయ్! ముందు ఈ లెటర్ ఇచ్చేసి, మనం అటు వెడదాం" అన్నా.

అప్పటికే స్టోరీ అంతా వాడు వినుండటం తో, లూనా శేఖర్ వాళ్ళ అత్తయ్య ఇంటి వైపు తిరిగింది.

తలుపులు తెరిచే ఉన్నాయి, శేఖర్ ఉన్న జాడ లేమీ లేవు. ఇల్లు "ప్రేక్షకులు లేకపోయినా 100 రోజులు ఆడిస్తున్న ధియేటర్ లా" నిశబ్దం గా ఉంది. వసారా లో వాలు కుర్చీలో పడుకుని ఓ ముసలాయన కనిపించారు. లోపల ఎవరూ ఉన్నట్టు లేరు!

"ఎలాంటి సినిమా చెయ్యాలో తెలియక బుర్ర గోక్కుంటున్న జూనియర్ NTR లా ఏమీ తోచక టచ్చాడుతుంటే, శ్రీరామ్ గాడు విసుగ్గా, "అవతల టైము అయిపోతోందిరా, తొందర గా ఏదో ఒకటి తెముల్చు" అన్నాడు.

ధైర్యం చేసి, పడుకున్న ముసలాయన్ని లేపా, "ఏమండీ.. శేఖర్ ఉన్నాడా? ఇటు వచ్చాడట కదా?" అన్నా.

"అవును వచ్చి, ఇప్పుడే వాళ్ళ అత్తయ్య తో కలిసి బయటకి వెళ్ళాడు, ఒక అరగంట లో వస్తాడు" అన్నారు.

మా శ్రీరామ్‌గాడు పెట్టే తొందర లో సరే, ఏది అయితే అది అయింది అని, "ఈ లెటర్ శేఖర్ కి మాత్రమే ఇవ్వండి, చాలా అర్జంట్, అవతల శీను అనే అతను స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాడు. వీలైతే, శేఖర్ ని అర్జెంట్ గా వెళ్ళి కలవమనండి" అని చెప్పేసా.

మొత్తానికి టికెట్స్ దొరికాయి, ధియేటర్ దగ్గర ఒక్క శేఖర్ తప్ప టైము కి అందరూ పోగయ్యారు.

"బహుశ వాళ్ళ కజిన్ దగ్గర స్టక్ అయిపోయి ఉంటాడు అని పెద్ద పట్టించుకోలా సినిమా గొడవలో. సినిమా ఎంజాయ్ చేసి, హోటల్ లో తిండి తిని, శివ గాడి రూమ్ కి వెళ్ళాం అందరం. వెళ్ళేసరికి శేఖర్ తో పాటు శీను, ఇంకా రెండు మూడు కొత్త మొహలు కనిపించాయి. అందరూ వర్మ సినిమా లో విలన్ దగ్గర పనిచేసే గాంగ్ మెంబర్ల లా సీరియస్ మొహాలేసుకుని కూర్చున్నారు.

నేను లోపలికి రావడం తోనే, శీను కోపంగా "ఎంత పని చేసావు స్వామీ" అని అరవటం తో నాకు "క్షణక్షణం" మత్తు దిగి, NTR "చండశాసనుడు" సెకండ్ షో చూస్తున్న ఫీలింగ్ కలిగింది. చిన్నపాటి అరుపులు, పెడబొబ్బలు, క్షమాపణల పిదప కానీ నాకు విషయం పూర్తిగా బోధపడలా.

జరిగినది ఏమిటంటే, శేఖర్ కజిన్ శీను, శేఖర్ వాళ్ళ ఊర్లో ఎవరో అమ్మాయిని ప్రేమించాడు. దీన్లో శేఖర్ పాత్ర విజయ భాస్కర్ సినిమా లో త్రివిక్రం పాత్ర టైపు. ఈ విషయం ఇంకా ఇంట్లో వరకూ వెళ్ళలా. ఆ లెటర్ శీను వేరే ఊరు వెడుతూ, తన లవర్ కి శేఖర్ ద్వారా పంపుతున్న "అదేదో సీరియస్ సందేశం!" అది కాస్తా నేను తీసుకెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ నాన్న చేతిలో పెట్టాను. (అది వెళ్ళింది శీను వాళ్ళ ఇంటికేనట, తరువాత గానీ వెలగలా మన సిన్న బుర్ర కి!)

ఇక చూసుకో ముసలాయన "భారతీయుడు లో ముసలి కమల్ హాసన్" లెవల్ లో రెచ్చిపోయారుట. జరగాల్సిన టిపికల్ తండ్రి - కొడుకుల కుటుంబ కలహాల సీన్ లన్నీ జరిగిన తరువాత, అరిచి, అరిచి, ఇక్కడ కూర్చున్నారట అందరూ "నా కోసం!"

ఆ తరువాత ఇంట్లో పెద్ద గొడవలే జరిగి, శీను ని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ అన్నయ్య దగ్గరకి పంపేసారు. (నాకు "తొలిప్రేమ" లో పవన్ కల్యాణ్ ని వాళ్ళ అన్నయ్య దగ్గరకి డిల్లీ పంపే సీన్ చూస్తే, శీనే గుర్తొస్తాడు). ఫైనల్ పరీక్షలు తరువాత తను ఉద్యోగం లో స్థిరపడటం, నేను MCA చేరటం తో శేఖర్ కీ నాకూ touches తగ్గిపోయాయి.

ఉపసంహారం: శీను కి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. పంచాయితీ రాజ్ శాఖ లో ఉద్యోగం సంపాదించి, తరువాత, పెద్దవాళ్ళు పెళ్ళి చేసారు ఇతని గోల భరించలేక, "ఆ" అమ్మాయి తోనే. శేఖర్ చెప్పాడు మా పెళ్ళి రెసెప్షన్ కి వచ్చినప్పుడు.

"ఇంతకీ ఏముందిరా ఆ లెటర్ లో?" అంటే, "లేచిపోవడానికి ప్లాన్" అని మా శివగాడు ఒక వెర్షన్ చెపుతాడు, శేఖర్ నవ్వి పారేస్తాడు ఏం చెప్పకుండా. మరి శీను రియాక్షన్ చూడాలి, ఈసారి ఎప్పుడైనా నేనూ, తనూ కలవడం జరిగితే. ఇరగ కుమ్ముతాడో లేక ఆప్యాయం గా కౌగిలించుకుంటాడో "పెళ్ళి" చేయించినందుకు, (తెలిసో, తెలియకో!)

ఆ విధం గా శీను పెళ్ళి శ్రీరామ్ పార్టీ తో కుదిరింది, నా చేతకానితనం వల్ల! "క్షణక్షణం" ధియేటర్ లో మాకు ఎలా ఉన్నా నేను కనపడే వరకూ "ప్రతీక్షణం" తిట్టుకుంటూనే ఉన్నాడట శీను!

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.