మెస్ లో చేసిన మెస్సప్ - పార్థు Back     Home  
ఈ పేజీ ని పంపండి

బావ గాడు మా యువరాజ్యానికి (అప్పట్లో) "భోజ(న) రాజు". భోజనాలు ఏ మెస్ లో బాగుంటాయో వాడికి తెలిసినంత మాకెవ్వరికీ తెలియదు, "కూరలో వేసిన కరివేపాకు సైజుని బట్టీ, అరుగు మీద పరిచిన అరిటాకు చిరుగును బట్టీ చెప్పేసేవాడు ఏ మెస్ ఎలాంటిదో.

పంతులు గాడు "ఆర్య భవన్ లో అరటికాయ కూర బావుంటుంది అక్కడ తిందాం రా అంటే", కాదు "వాడు కూర పెరట్లో, నీరు ప్లేట్లో వేస్తాడు, అదే విజయదుర్గా వాడైతే "కూర చారెడేసినా చారు బారెడు పోస్తాడు అదే మనకి అన్నపూర్ణ, నిర్మలమ్మ" అని ఎవేవో కబుర్లు చెప్పి అందర్నీ అక్కడ చేర్పించాడు.

"నేను ముందే చెపుతున్నా నచ్చకపోతే నారయ్య మెస్ కి వెళ్ళిపోతా", హెచ్చరించాడు రవీంద్ర.

వై.కా.పా టికెట్టు పై పోటాపోటీ ఎన్నికలో బొటాబొటీ మెజారిటీ తో గెలిచిన బోడి లింగయ్య గాడిలా.

"గుడ్డు పెట్టనంత మాత్రాన మంచి ఫుడ్ నొదులుకుంటావురా?" అన్నాడు బావగాడు.

"ఇంకో అప్పడం వెయ్యలేదనే కదరా ఆర్య భవన్ వాడి చేత సూర్య నమస్కారాలు చేయించావ్ మొన్న అప్పుడే మర్చిపోయావా?" గుర్తుచేసాడు బాబాయ్.

"అది అప్పడం కోసం కాదురా, అప్పు కోసం జరిగిన గొడవ" అన్నాడు వాడు.

"నిజం నిప్పు లాంటిది" అన్నాడు బాబాయిగాడు.

"నిప్పులాంటి నిజమేమో" సవరించా సినీ పరిజ్ణానం ఎక్కువైన నేను.

"అది ఎలాంటి నిజమైనా, నేను నిప్పుని, నివురు గప్పిన నిప్పుని" అన్నాడు బావగాడు మళ్ళీ నా సినిమా సాహిత్యం వినే సాహసం చేయలేక.

"సరే ఈ గోలంతా కాదు కానీ, ఓ నెల రోజులు చూద్దాం. బాలేకపోతే, ద్రవిడులు దాడి చేసినట్టు మళ్ళీ ఆర్యభవన్ మీద పడిపోవడమే, అన్నాడు పంతులుగాడు.

అలా అడుగెట్టాం విజయడుర్గా మెస్ లో ఓ విజయదశమి శుభముహుర్తం చూసుకుని.

* * *

ఓనర్ ది బహు దొడ్డమనసు, గడ్డ పెరుగులు వెయ్యకపోయినా. బిడ్డల్లానే చూసుకున్నాడు మమ్మల్ని.

బావగాడికి వాళ్ళ నాన్నగారు పంపే DD లేట్ గా వచ్చినా ఫుడ్ కి అడ్డు వుండేది కాదు. అలా అని ఆయన పద్దులు రాయలేదు, అంతా నోటి లెక్కలే, కాదు.. కాదు.. నొసటి లెక్కలే.

"మొన్నటి తో మూడండి" అనేవాడు వీడు తడబడుతూ, "నాలుగు అనుకుంటానేమో బాబూ" అనేవారు ఆయన రాబడుతూ,

"శ్రావణ శుక్రవారం అండీ నిన్న ఒక్కపొద్దు వున్నా, అందుకే మూడేనండి" అని వీడు,

"ఒక్క పొద్దా! శ్రావణ శుక్రవారం, అత్తయ్య (వరసకి) వాళ్ళింటికెళ్ళాను, ముప్పొద్దులా తింటోనే వున్నాను అని చెప్పావ్ కదరా" పక్క నుండి బాబయిగాడు.

"నీకు పోయింది మిడిమిడి జ్ణానం కాదురా.. వినికిడి జ్ణానం, నువ్వాగు" కసిరాడు వాడు.

"పోనీలే నాయనా, వ్రతం బాగా జరిగింది కదా! రేయ్ నాయరూ, బాబుకి స్పెషల్ మీల్స్ పెట్టు" అని ఈయన.

అలా వుండేవి వాళ్ళ లెక్కలు.

కొన్ని సార్లు సింగిల్ గా కాక, మాలో ఎవరో ఒకరితో వున్నప్పుడు, వాళ్ళ కార్డ్ ని గార్డు గా చేసికునేవాడు." లంచ్ వీడికీ, పంచ్ వాళ్ళకీ". తర్వాత తమాషా లెక్కలు మామూలే పంతులు కి, వీడి కీ, నాకూ మధ్య.

"మొన్నటి తో 3 బొక్కలు (పంచ్ లు) ఇవ్వాలి నీకు" అని వీడు, "పంతులుగాడికి నేను రెండు బాకీ, ఆ రెండూ కలిపి 5 నువ్విచ్చేయ్" అని నేను

"మొన్న తీసికెళ్ళిన జైత్రయాత్ర సినిమా కి ఇవ్వాల్సిన టికెట్ కి 2 బొక్కలు చెల్లేస్కో" రవీంద్ర గాడు సలహా ఇచ్చాడు.

"ఆ సినిమాకెళ్ళటమే పెద్ద బొక్క, మళ్ళీ దానికి దీనితో లెక్కలొకటా" అరిచాడు పంతులు గాడు.

"నాగార్జున నెక్స్ట్ సినిమా ఎలాగూ తీర్ధయాత్రే కదా దానికి తీసికెడతాడు లేరా, చెల్లుకుచెల్లు" అన్నాడు పక్క నుండి బాబాయిగాడు.

"మీ కరువు (తిండి) గొడవల్లోకి మధ్యలో మావాడిని (నాగ్ ని) ఎందుకు లాగుతారు?" అని కయ్యిన లేచాడు శ్రీరాం గాడు.

"ఎందుకంటే, వాడూ కరువు కోరల్లోనే వున్నాడు కదరా హిట్ కి మొహం వాచి మూడేళ్ళ నుండి" అన్నాడు బాబాయిగాడు.

"ఈ గోల అంతా ఎందుకులే సామి! నేను ఓనర్ కి 1.5 బొక్కలు బాకీ వున్నాను, అదేదో నువ్వే నీ లెక్కలో అడ్జస్ట్ చేసి మిగిలినవి నాకీయ్" అన్నాడు పంతులు గాడు ఫైనల్ గా.

"మధ్యలో ఈ 1/2 బొక్క ఏంట్రా? సగం తిని లేచిపోయావా ఏంటి?" అడిగాడు బావ గాడు అర్ధం గాక.

"అవన్నీ నీకనవసరం.. నా తిండి నా ఇష్టం" అన్నాడు పంతులుగాడు " నా మొగుడు నాకే సొంతం" పోస్టర్ లో వాణీ విశ్వనాథ్ వంక కసి గా చూస్తూ.

అలా, అటుతిరిగి-ఇటుతిరిగి ఓనర్ లెక్కల కి వచ్చేవి బొక్కలు. కొన్ని పంచ్ లు మిస్ అయ్యేవి పంపకాలలో తేడా జరిగి. మేము భలేగా గార్డ్ చేసికుంటున్నాం అనుకున్నాం కాని, ఆయన స్వతహాగా "గాడ్" అవటం వల్ల అలా జరిగిపోతుండేది. అది ఆయనకొక్కడికే తెలుసు అప్పుడు.

ఈ మెస్ బావుంది అని మా మిత్రబృందం మురిసిపోయాం.

రోజులు బానే గడుస్తున్నాయ్. పంతులుగాడికి మెంతుల పులుసూ నచ్చింది, రవీంద్రకి పక్క కిళ్ళీ షాప్ కాంతం కలుపుగోలుతనం నచ్చింది. నాకు, శ్రీరాం గాడికీ ఎదురుగ్గా శ్రీ సౌండ్ ఆడియో వాసన మరిపిస్తే, బావగాడికి బల్ల మీద పెట్టిన ఆవకాయ నుండి ఆనపకాయ పొట్టు వరకు అంతా అదుర్శ్. వెరసి, అందరూ హ్యాపీస్.

ఇలాంటి సమయం లో వూడిపడ్డాడు ఓనర్ కొడుకు శేషు - వర్మ హారర్ సినిమా లో కార్నర్ నుండి జారిపడే కెమేరా లా.

అక్కడ మొదలైంది మా బావ కీ, మా బాచ్ కీ భజంత్రీలు. క్లుప్తంగా చెప్పాలంటే, వంటిట్లోకి వెళ్ళనీకుండా ఆంక్షలు, వాకిట్లో నుంచొని వాణిలనీ, రాణీలనీ చూడాలన్న కాంక్షలకి కోతలు, అప్పు మీద బోజనాలకి ముప్పులు, అప్పుడప్పుడు లేట్ గా వస్తే (ఫస్టు షో నుండి), పెట్టీ పెట్టకుండా తిప్పలు, ఇలా సాగిపోయాయి మా కష్టాలు "క్యాపిటలెక్కడో తెలియని స్టేట్ కి ఎంత క్యాపిటల్ పెట్టి బిజినెస్ మొదలెట్టాలో తెలియని రియల్ ఎస్టేట్ కంపెనీ లా".

ఎందుకనో అతనికి మేం నచ్చలా, KCR కి ఆంధ్రోళ్ళు అంటే ఒళ్ళు మండినట్టు.

"ఏంట్రా వాడు! ఈ ఆకు బాలేదు ఇంకో ఆకేయ్ అంటే, "నువ్వు ఆకుని తింటావా, అన్నం తింటావా అంటాడు?", ఇలా అయితే నే ఆర్యభవనుకే పోతా" అన్నాడు పంతులుగాడు ఒకరోజు భోరుస్తూ.

"ఇంకా నయం, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని అడుగలేదు సంతోషించు" అన్నాడు శ్రీరాం గాడు

"ఎట్లా అంటాండ్రా పెట్టేదే వాడయితే... అదే అన్నం, గడ్డి కాదు" అన్నాడు బాబయ్ గాడు వివరణ ఇచ్చుకుంటూ కోపంగా చూస్తున్న రవీంద్ర వంక

"నేనప్పుడే చెప్పాను గుడ్డు పెట్టని కోడి, ఫుడ్డు వెయ్యని మెస్సు రెండూ గాడిద గుడ్డుతో సమానం అని" నేను నారయ్య మెస్ కే పోతా, అని రాజీనామా డ్రామాకి తెర తీశాడు రవీంద్ర గాడు.

"పోండిరా అందరూ తలా చోటికి పొండి. నువ్వు నారయ్య దగ్గరకు పో, వాడు ఆర్యభవన్ కి పోతాడు, వీడు సూర్య IPS కి పోతాడు" బావగాడు అరిచినంత పని చేస్తు.

"దానికి నేనెందుకెళతాను, అర్ధంకాకపొయినా శాంతి-క్రాంతి సినిమానే ఇంకోసారి చూస్తా" చెప్పా సావధానం గా అలోచించుకుని, శ్రీరాం గాడు సినిమాకి డబ్బులు పెడతా అని సైగ చెయ్యటంతో.

"అరే! అపాయం లో ఉపాయం అలోచించాలి కాని, ఈ పలాయనవాదం ఏంట్రా, పదండి కల్యాణిలో కూర్చుని కాఫీ కొడుతూ ఆలోచిద్దాం" అన్నాడు శ్రీరాం గాడు.

కాఫీ చిక్కగా వుంది, వాతావరణం చక్కగా వుంది. స్పీకర్ లోంచి సన్న గా పాట..."ఎపుడెపుడని అడిగిన వయసు కి కల్యాణ యోగం.."

అప్పుడొచ్చింది బావగాడికి ఓ అయిడియా- "బేల్స్ ని బాల్ తోనే తియ్యాలని", చెప్పాడు కప్పుని దూరం గా నెడుతూ, "ఎదుటివాడి బలం వాడికి వరం అయితే బలహీనత మనకి భరోసా ఇవ్వాలి".

"సూటిగా చెప్పు" అన్నాడు రవీంద్ర అడ్డం పడుతూ.

"సరే వుండు కుర్చీ అటేసుకుంటా" అన్నాడు వాడు లేస్తూ.

"నువ్వు ఎటూ వేసుకో అక్కరలేదు, చెప్పి తగలడు" అన్నాడు బాబయ్ గాడు కప్పు ని సాసర్ లో కోపంగా దించుతూ.

వాడు చెప్పటం మొదలెట్టాడు..... ఈసారి స్పీకర్ లోంచి పాట తీవ్రస్థాయిలో వినిపిస్తోంది.. "బూర్జువాలకూ, భూస్వాములకూ బూజు దులపకా తప్పదురా, తప్పదురా"

ప్లాన్ నచ్చింది. అందరం సరే అన్నాం. కాని, తెలియలేదప్పుడు మాకు అది శేషు జీవితాన్నే మార్చేస్తుంది అని, వాడిని "విశేషుడ్ని" చేస్తుంది అని.

* * *

శేషుకి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. వినడం, చూడ్డమే గాని ఆడ్డం రాని అర్భకుడు. తనకున్న సర్కిల్ లో అంతా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, యవ్వారాలు నడిపే వాళ్ళే కాని, తీరిగ్గా కూర్చుని, సారీ, నుంచుని క్రికెట్ అడేవాళ్ళు లేరు. కాని వీడికి వయిట్ పాంటు షర్టూ వేసుకుని డే అండ్ నయిట్ ఆడేయ్యాలని ఒకటే దురద..సారీ, సరదా.

"ఎలా?" అన్నదే వాడి సమస్య. అదే బావ గాడు ఇచ్చిన సొల్యూషన్ మా ప్రాబ్లెం కి. ఎలాగైనా సరే శేషుగాడి కి క్రికెట్ నేర్పించి, ఒక టీం లో పడేస్తే వాడు మన జోలికి రాడు "కృతజ్ణతతో", మన "అన్నదోచు" పధకం ఆటంకం లేకుండా సాగుతుంది, ఇదీ మాకొచ్చిన ఆలోచన.

మర్నాడే కాలేజీలో, క్రికెట్ అంటే చెవులూ, ముక్కులూ కోసుకునే శేషు గాడికి, తన సూపర్ ఫాస్ట్ బౌలింగ్ తో, పక్క వాళ్ళ కాళ్ళూ చేతులూ విరిచేసే "సంపత్" గాడే కరెక్టు అని వాడిని కలిసాం గ్రౌండ్ లో.

వాడు ఎప్పటిమాదిరే తన బౌలింగ్ ధాటీకి తుక్కు తుక్కు అయిన శేఖర్ గాడి ముక్కుకి ప్లాస్టర్ లేసే పనిలో బిజీగా వున్నాడు.

పక్కకి లాగి, వచ్చిన పనేంటో చెప్పాం.

"ఏంచేస్తావో తెలీదు గాని, వాడిని రోజూ మన కాలేజ్ గ్రౌండ్ లో మీతో పాటు ఏదో ఒక టీం లో ఆడించాలి, వాడికి నేర్పించాలి, వాడికి మెస్ మీద కన్నా, మాచ్ మీద మోజు పెంచాలి, వంటగది చూస్తేనే మంటెంత్తిపోయేలా చెయ్యాలి, నీ సాయం కావాలి" అన్నాడు బావగాడు.

"నీ బాట్ కావాలి అన్నంత ఈజీగా అడిగావ్ కదరా, చాలా కష్టం" అన్నాడు సంపత్ గాడు

"అడిగింది కాలేజ్ లో సీట్ కాదురా, టీం లో చోటు" అన్నాడు శ్రీరాం గాడు.

"మొన్న, లూనా ఈయరా స్టేషన్ దాకా వెళ్ళొస్తా అంటే, నీకిస్తే దాని బతుకు బస్టాండే అన్నావ్ కదరా, మర్చిపోయావా అప్పుడే?" అడిగాడు శ్రీరాం గాడ్ని.

"రేయ్, వీడి చేత అడిగినప్పుడు లూనా ఇప్పిచ్చే బాధ్యత నాది, పూనా నే వెడతావో, పొన్నూరే పోతావో నీ ఇష్టం, ఈ పని మాత్రం అయ్యేట్టు చూడరా" అన్నాడు బావగాడు వేడుకోలుగా

"సరే, రేపటి నుంచి రమ్మను, లూనాయే కాదురోయ్, అప్పుడప్పుడు మెస్ లో ఫుడ్ కూడా" అన్నాడు పూటకి గుడ్ బై చెపుతూ

"వాడు ఈ ప్లాన్ కి ఫినీష్ అవుతాడో లేదో కాని, మనం వీడి దెబ్బకి మటాష్ అయ్యేట్టు వున్నాం" అన్నాడు పంతులుగాడు.

* * *

పధకం బాగా పనిచేస్తోంది మొదట్లో (చూశాం). బ్రహ్మాండం గా పనిచేస్తుందని మధ్యలో (విన్నాం), అఖండం గా పనిచేసింది (ట) అంతిమం గా (పట్టించుకోవటం మానేసాం అప్పటికే). ఎందుకంటే మాకు మెస్ లో అన్నీ చక్కగా అమరిపోతున్నాయ్, సంపత్ గాడికి కావల్సినవి దొరికిపోతున్నాయ్.

రోజులు దొర్లిపోతున్నాయ్. శేషు ఆ తర్వాతెప్పుడూ బుసలు కొట్టలేదు, పాపం పడగ దాచేసుకుని పుట్టలోకి వెళ్ళిపొయేవాడు. ఇహ ఆ అంకం అక్కడితో ముగిసిపోవటం తో, మేమూ మా చదువుల్లో పడిపోయాము.

కొన్ని సంవత్సరాల తర్వాత,

తిరిగి అందరం కలిశాం అక్కడ. "ఊర్వశి A/C రా, అక్కడ ఇవాళ లంచ్" అన్నాడు ప్రొగ్రాం మానేజర్ బావగాడు. లంచి అయిపోయి లాంజ్ లో కూర్చొని కబుర్లు చెపుతూ వుంటే, ఓ గుబురు గడ్డం వ్యక్తి తూలుకుంటూ దిగుతున్నాడు స్టెప్స్ మీంచి. పోల్చుకోడాని కి ఎంతో సేపు పట్టలేదు..

"సంపత్ గాడు రా" అరిచాడు బాబాయ్.

ఆనంద పడ్డాడు ..గుర్తు పట్టినందుకు కాదు, పక్కన కూర్చోపెట్టి మాటాడినందు కు.

వడ్డీ వ్యాపారం ఎలా దెబ్బ కొట్టిందీ, అన్న దమ్ముల మధ్య ఆస్థి-తగాదా ఎలా చిచ్చు పెట్టిందీ, అసలు మనసుకెమయ్యిందో చెప్పాడు మాణిక్ చంద్ నోటికి ఇస్తున్న మత్తులోంచి.

మనిషి మాటలో నిలకడ లేదు, తడుముకుంటూ, తడుముకుంటూ, తొట్రుపడుతూ, నట్టుతూ, ముద్ద ముద్ద గా...మత్తు, మత్తు గా.. తూలిపోతూ, పక్కకి వాలిపోతూ డల్లు గా....

ఒకప్పడు తన బౌలింగ్ లోని వేడి కి కాలెజ్ అంతా గులాం అయి, సలాములు కొట్టించుకున్న ఆ "ఒంగోల్ కపిల్".

అంత మత్తులోనూ (వాడు ఏవీ మర్చిపోలేదు), లూనా సంగతి గుర్తుచేస్తూ, "బైకు కొన్నాను బాబాయ్ గొప్పకి. కానీ, మిగిలింది అప్పేలే" అన్నాడు శ్రీరాం గాడి తో బాధతో కూడిన నవ్వుతో

మాటల్లో శేషు ప్రస్తావన వచ్చింది. "వాడా! ఎందుకు గుర్తు లేదూ. ఒరేయ్, మీరు తెలిసో తెలికో ఓ మంచిపని చేశార్రా వాడ్ని మా టీం కి తీసికొచ్చి, వాడు కత్తి రా. ప్రాణం పెట్టాడురా ఆటంటే, మా టీం అంటే. ప్రాక్టికల్స్ అయినా మనం ఎగ్గొట్టేం కాని, వాడు ప్రాక్టీస్ మాచ్ కూడా మిస్ అవ్వలేదురోయ్. ఆడు ఆల్ రౌండరహే దున్నిపారేశాడు. ఇది మీకు తెలుసా ఆడు ఆతర్వాత టౌన్ లోనే టాప్ ప్లేయర్ అయ్యాడు, డిస్ట్రిక్ట్ లెవల్ టీం కి సెలెక్షన్స్ లో సెలెక్ట్ కూడా అయ్యాడు..ఆడు సూపరహే" అన్నాడు.

మాకు ఓ చిన్నపాటి గర్వంతో కూడిన ఆనందం. అంతలోనే మెలిపెట్టే బాధ సంపత్ గాడి కొసమెరుపు తో

"అనామకుడేమో ఆల్ రౌండర్ అయ్యాడు, ఈ బౌలరేమో బెగ్గర్ లాగా అయ్యాడు!" అలా మాట్లాడుతూ, మాట్లాడుతూ, మత్తు గా మా ముందే సోఫా లొ వొరిగిపోయాడు బావగాడి భుజం మీద తల ఆనించి. ఆ ఒకప్పటి చండ ప్రచండ వేగ ఫాస్ట్ బౌలర్, చెయ్యత్తే ఓపిక కూడా లేక.

* * *

శేషు ని అభినందిద్దామని బయలుదేరాం. గుమ్మం లో వుండగానే గుర్తుపట్టి వచ్చాడు. చాలా అనందపడ్డాడు గుర్తుంచుకుని వచ్చినందుకు. గర్వం గా చెప్పాడు "ప్రకాశం డిస్ట్రిక్ట్ టీం" కి ఆడుతున్నాని.

బావగాడికి స్పెషల్ థాంక్స్ అన్నాడు, మా అందరికి "నాయరూ! స్పెషల్ మీల్స్" అని అరిచాడు. కొసరి కొసరి కూరి కూరి వడ్డించాడు పంతులు గాడు వద్దంటున్నా.

ఆ వడ్డన లో ఏదో భావం. అది కృతజ్ణత లాంటిదో, ఆప్యాయతో, ఏమో, వెరసి మా కళ్ళల్లో నీటిబొట్ల కి చప్ప గా వున్నాకూడా పప్పు వుప్ప గానే అనిపించింది.

"చాలా గొప్పవాడివవుతున్నావ్ మమ్మల్ని గుర్తుపెట్టుకో శేషు" అన్నాం

"తొందర్లోనే స్టేట్ కి సెలెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నానని, కష్టమే అయినా సాధించి తీరుతానని అన్నాడు. ఇంకా అంటూ, నేను డబ్బులు తీసుకుని మీకు అన్నమే పెట్టాను, మీరు నాకు ఈ కెరీర్ భిక్ష గా పెట్టారు, ఎప్పటికీ మరువలేని సాయం ఇది" అన్నాడు వంగి వడ్డిస్తూ.

మొదటిసారి గా అతని కళ్ళలోని పోరాట పటిమని దగ్గరగా చూసాం, మా కళ్ళలోని కన్నీటిని కనబడకుండా దాచేసాం".

అలా మా శేషు క్రికెట్ లో ఖ్యాతిని అర్జించి డిస్ట్రిక్ట్ లెవల్లో వి"శేషు" డు అయ్యాడు.

అది మెస్ లో మేం చేసిన "స్వీట్" మెస్సప్.

* * *

ఉపసంహారం:

ఈ మధ్యన ఇండియా వెళ్ళినప్పుడు బావ, నేను వెళ్ళాం. అక్కడ మెస్ లేదు. పోష్ కమర్షియల్ కాంప్లెక్స్ వుంది, కోలాహలం గా వుంది, సందడి చేస్తూ.

కాంతం కిళ్ళీ షాప్ ఎక్స్ టెన్షన్ లో ఎగిరిపోతే, శ్రీసౌండ్ సైడిచ్చేసింది సెల్ ఫోన్ షాప్ కి. మా శేషు నీ కలిసాం ఆత్రుతగా, అమృతం లాంటి కబురు విందామని - "గ్రౌండ్ లో ఆటగాళ్ళతో అంటే మనం ఆడగలం గాని, బాక్ గ్రౌండ్ లో (వెన్ను) పోటుగాళ్ళతోనూ, వోటు తో గెలిచే కేటుగాళ్ళతోనూ ఆడలేకపొయా అన్నా, మన రాత ఇంత వరకే అని డిస్ట్రిక్ట్ లెవల్లోనే దుకాణం సర్దేసి, స్ట్రిక్ట్ గా బిజినెస్ చేసుకుంటున్నా షాప్ లు తెరిచి అన్నాడు తను కట్టించిన కాంప్లెక్స్ చూపిస్తూ"

అతని కళ్ళు తడిసాయి, తనకెంతో ఇస్టమైన ఆట ఆడలేక ఆపేశా అని, మా కాళ్ళు కదిలాయి వెనక్కి, వోడిపోయామని.

"కలగన్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని" స్పేకర్ లోంచి వినిపిస్తోంది పాత పాటే అయినా, మత్తుగానూ, కొత్త గానే వుంది మా మనసులకి.

కౄర రాజకీయాలకీ, క్రీడా రాజకీయాలకీ బలై భవిష్యత్ నే కోల్పోయిన మా శేషు లాంటి వర్ధమాన క్రికెటర్లు అందరికీ ఈ వ్యధ అంకితం.

పార్ధూ.



* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత పార్థు కి తెలియ చేయండి.

మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.