ఎలక్షన్ 2009 - పార్థు Back     Home  
ఈ పేజీ ని పంపండి
ఎలక్షన్ 2009 ..ఇదీ మాకు ఆ మధ్య లంచ్ టాపిక్.

రమేష్ , నేను, నారాయణన్ మిత్రత్రయం ఈ సమావేశాలకి.రమేష్ కాంగ్రెస్ కొమ్ము కాస్తే, నారాయణన్ BJP దమ్ము గురుంచి మాట్లాడేవాడు. పక్కా తమిళియన్ అయినప్పటికిని,ఆంధ్ర రాజకీయాలంటే, తమిళ్ డైరెక్టర్ కి తెలుగు ప్రేక్షకుల మీద వున్నంత పట్టు వుండేది. ఇహ కాంగ్రెస్ మీద కడుపుమంట కొద్దీ బాబు ని ఎత్తుకుని హత్తుకునే నేను, ఈ సారి మా మెగా స్టార్ రంగం లోకి రై అని కూత పెట్టుకుంటూ రావడం తో, జెండా ఎత్తేశా. పెరాలసిస్ పేషంట్ వణికినట్టు, అనాలిసిస్ పేరు తో అరుచుకోవడం మా దినచర్య లంచ్ లో.

* * *

"కాంగ్రెస్ కే ఎందుకు కి వొటేయ్యాలి? ఏం చూసి వోటెయ్యాలి?" అడిగాడు ఆవకాయ కలుపుకుంటూ నారాయణన్

"కాంగ్రెస్ ని చూసి కాదు, రాజశేఖర్ ని చూసి" చెప్పాడు రమేష్

"రాజశేఖర్ ని, జీవిత ని చూసి వేసేటట్ట్లయితే..మెగాస్టార్ కి మెజారిటి సీట్స్ రావాలి" చెప్పా నేను

"రాజశేఖర్ వల్లే రాస్ట్రం వెలిగిపోతోంది..." చెప్పాడు రమేష్, వేడి అన్నం వూదుకుంటూ.

"వెలిగిపోతుందా?రగిలిపోతుందా? .....అవినీతి తో" ఆరా తీశాడు నారాయణ్.

"అది కేవలం అంధ్రజ్యోతి,ఈనాడు అనేమాట" చెప్పాడు రమేష్.

"మరి ఆంధ్రా జనాలో?" అడిగా నేను.

"రాజశేఖర్, రియల్ స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అన్నడు వీరాభిమాని రమేష్.

"రియల్ స్టార్ అంటే శ్రీహరి వూరుకోడేమో అలోచించు" అన్నా సినీ పరిజ్ఞానం కాస్త ఎక్కువున్న నేను

"రియల్ స్టారా!రియల్ ఎస్టేట్ స్టారా?" చెణుకు విసిరాడు నారాయణుడు.

"మీరెన్నైనా అనండి, He is the true star" అన్నాడు పరవశం తో రమేష్

"అదేం కాదు, ఆంధ్రా జనాలు అంతకు ముందే twinkle twinkle little star, chiranjeevi megaastar అన్నారు తెలుసా" అన్నా ఇంద్ర వోపినింగ్ షో హంగామా గుర్తు చేసికుంటూ.

"ఇదంతా ఎందుకు కాని, రాజశేఖర్ రాష్ట్రాని కి చేసిన రెండంటే రెండు మంచి పనులు చెప్పు" అడిగాడు నారాయణుడు.

"ఎత్తిపోతల, పులిచింతల..." పూర్తికాకముందే అడ్డుపడ్డాడు అసెంబ్లీ లో బాబు లా , "ఈ పులిచింతల గురుంచి, పులివెందుల గురించి వినీ వినీ విసిగెత్తింది, ఇంకెమన్నా చెప్పు" అన్నాడు నారాయణుడు.

"ఆరోగ్యశ్రీ..,పేదల పెన్నిధి. పేదోళ్ళ కళ్ళళ్ళో వెలుగులు నింపిన విజయశ్రీ" చెప్పాడు రమేష్ తడిబారిన కన్నులతో.

"భాగ్యశ్రీ, రమ్యశ్రీ తెలుసుకానీ, ఎవరీ ఆరోగ్యశ్రీ?" అడిగాడు నర నారాయణుడు కొంచెం టెంప్ట్ అవుతూ.

"మీరు ఆరోగ్యమే చూస్తున్నారు..మేం పథకం లోంచి పుడుతున్న అనారోగ్యం గురించి చెపుతున్నాం" అన్నాను పధకం ప్రకారం ముందే అలోచించుకుని.

"మంచివున్న చోటే చెడూ వుంటుంది" అన్నాడు తీసిపారేస్తూ రమేష్.

"హిట్ వున్నచోటే ఫ్లాప్ వున్నట్టా?" అన్నాను మెగాస్టార్ బిగ్ బాస్ మదిలో మెదులుతుండగా.

"అర్ధం కాల?" ఫేస్ మార్చాడు తమిళ తంబి.

"గ్లామర్ వున్నచోటే రూమర్ వున్నట్టు" చెప్పా.

"మా సంగతి సరే, ఇంతకీ మీ బాబేం చేసాడు?" అడిగాడు రమేష్.

"తప్పు, తండ్రులను అలా అగౌరవపరచకూడదు"

"నేనన్నది మీ అభిమాన బాబు గురించి" మార్చాడు రమేష్

"బాబు ఎవరికైన బాబే.... ఎలక్షన్ ల పుణ్యమా అని, ఈ మధ్య బాబాయి కూడా అందరికి బాబాయి అయినట్టున్నాడు." చెప్పా.

"నా గోల చంద్ర బాబు గురుంచి.." అరిచాడు రమేష్.

"ఆయినకేం, దేశం ఎటుపోతున్నా, తెలుగుదేశం ఆయనతోనే వుంది" గంభీరం ప్రదర్శించా.

"తెలుగుదేశం ఆయనతో వుందా లేక ఆయనొక్కడే తెలుగుదేశం లో వున్నాడా? వెటకారం గా నవ్వి అన్నాడు రమేష్.

"అసలు బాబు గొప్పేంటి?" తమిళ తంబి సూటి ప్రశ్న.

"ఆయనది విజన్ 2020" చెప్పా.

"Lasik ఏమన్నా చేయించుకున్నాడా?" అడిగాడు రమేష్ గ్లాస్ పక్కన పెడుతూ.

"అయినా విజన్2020 ది అయితే, ఇప్పటి నుండే ఎందుకు పోటీ చెయ్యడం, అప్పటికి రావొచ్చు గా" ఇంతలోనే మళ్ళీ వెటకారం.

"ఇప్పుడు మాకు ఇహ బాబుల తో పని లేదు...అన్నయ్యతోనే, he is the only boss..bigboss" చెప్పా కసి గా కూర పిసుకుతూ.

"ఆయన బిగ్ బాస్ కాదు కదా...బిగ్ ఫార్స్...ఒక పక్క ఎజెండా సరిగా లేదు అని మీడియా గోలెడుతుంటే, సరి అయిన జెండా లేదు అని ఈయన గోల"

"మరి ఇంతాకీ ఆయన పార్టీ పెట్టింది ఎందుకు?" ప్రశ్నించాడు నారాయణ్.

"బావ కళ్ళళ్ళో ఆనందం కోసం" చెప్పాడు రమేష్ చిన్నగా దగ్గి.

"ఓ వంద సీట్లోస్తాయా?" అడిగాడు దినకరన్ ప్రభాకరన్.

"కలెక్షన్స్స్ అయితే గ్యారంటీ వుండేది..ఎలెక్షన్స్స్ కదా అంత సీన్ లేదు, మహా వస్తే ఒకటో,రెండో వస్తాయ్, మీ విజయకాంత్ టైపే" బాక్స్ సర్ది చెప్పాడు రమేష్.

"40 నుండి 60 గ్యారంటీ..." చెప్పా నేను మెతుకులేరుకుంటూ డబ్బా లోకి.

అదిగో అప్పుడే మొదలైంది...... అసలు పందెం.

* * *

"కాంగ్రెస్ ఫుల్ స్వీప్ అని, 200 కి పైగా వస్తాయని...చిరంజీవి పాలకొల్లు లో, తిరుపతి లో వోడిపోతాడని" రమేష్,

"40 నుండి 60 దాకా వస్తాయని , చిరంజీవి రెండు చోట్లా గెలుస్తాడని...పాలకొల్లు లో 20 నుండి 30 వేల మెజారిటీ తో గెలుస్తాడని" చెప్పా నేను ఇంద్ర విజయవాడ విజయోత్సవ సభ ని, కుప్పం క్లైమాక్ష్ సీన్ ని దౄస్టి లో పెట్టుకుని.

"కాంగ్రెస్ విజయం కష్టమే అని, సోనియా వచ్చిన, సానియా వచ్చిన వొరిగేదేం లేదని, చిల్లర పార్టీలన్ని చీల్చడం గ్యారంటీ" అని నారాయణన్.

ఇహ అసలు టెన్షన్ అక్కడ నుండి మొదలు....

ఎవరి పార్టీ గురించి వాళ్ళకి లోపల చెప్పలేనంత దిగులు. పేపర్ విప్పాలంటే భయం...రోజుకో రకమైన న్యూస్...ఫలానా పార్టీ ఫలానా వాడ్ని లేయాఫ్ చేసింది అని...ఫలానా వాడు పార్టీనే లేపేసి టీ పార్టీ ఇచ్చాడని..ఇలా ఎన్నో.. ఇవాళ కింగ్ అన్న ఆయన రెండో రోజుకి డంగైపోయి..నేను మేకర్ ని మాత్రమే అనేవాడు...ఇంకో ఆయన, ఈ స్టార్లు నన్నేమి చెయ్యలేరు అంటూనే, మర్నాడు మరికొందరు స్టార్ల కి ఫైవ్ స్టార్ వరాలిచ్చేస్తూ వెంపర్లాడిపోయేవాడు గ్లామర్ కోసం...తొలుత తమ్ముళ్ళే గెలిపిస్తారు అని నమ్మకం గా వున్న ఒక బాబు గారు, చివరాఖరికి తప్పదు ఇహ అబ్బాయి, బాబాయి ల తొడలు, జబ్బలు వాచిపోతే తప్ప బయటపడటం కష్టం అని గ్రహించేసారు. అలాంటి అవమానకర స్థితి లో, నా పరిస్థితి మరీ దారుణం, మెజారిటి సంగతి మెగాస్టార్ ఎరుగు అసలు పార్టీ వుంటుందా అనిపించేంత అనుమానం. పైకి గంభీరంగా వున్నా, తన "పులి" ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పవన్ లా అయిపొయింది పరిస్థితి. రోజురోజుకి ఈక్వేషన్స్స్, కాల్క్యులేషన్స్స్ మారుతున్నప్పటికీ, ఎస్టిమేషన్స్స్ ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడే "అసాధారణ" డెవలెపర్ లా మా అంకెలకే అతుక్కుపోయాం.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంచనాలు తలకిందులవడం తెలుస్తూనే వుంది...బంధు"మిత్ర"సపరివారం గా బయటకు నడుస్తుండటం తో...60 లో 20 వస్తే చాలు అనుకునే వాడ్ని.

ఈ సంశయంలోనే ఎన్నికలు అవ్వడం, ఫలితాలు వెలువడ్డం..మేం బొక్క బోర్లాపడ్డం చకచకా జరిగిపోయాయి. "మీరూ గెలవలేదు..చిరంజీవి తిరుపతి లో గెలిచాడు, పైగా కాంగ్రెస్ కి 200 కూడా రాలేదు" అన్నా రమేష్ తో, "మీరు మరీ ఫెయిల్...పాలకొల్లు లో చిరు వోడిపొయిన తర్వాత..పార్టీ వున్నా ఒకటే, లేకపొయినా ఒకటే" అన్నాడు రమేష్.

"ఇంకా నయం, ఫ్యాన్స్ వున్నా ఒకటే, లేకపొయినా ఒకటే అన్నాడు కాదు ఈయన" అని అనుకున్న మనసులో. "% ఆఫ్ వోట్స్ ని బట్టి చూస్తే, అసలు..." అని మొదలుపెట్టిన నారయణ్ మాట పూర్తి అవ్వకముందే చెప్పాడు రమేష్, "ఇవన్ని అనవసరం..రాజశేఖర్ ..రియల్ హీరో.... చెప్పి మరీ గెలిచాడు..కుస్తా బహార్...మనం ఎవరం గెలవకపోయిన నే పార్టీ ఇస్తున్నా..మా పార్టీ పవర్ లో కి వచ్చింది కాబట్టి....జయహో రాజశేఖర్" అన్నాడు రమేష్. పార్టీ ఏది గెలిచిన... ఈ పార్టీ ఇండియన్ రెస్టారెంట్ అవడంతో ...మేము "దిగ్విజయహో" అన్నాం.

పార్ధూ.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత పార్థు కి తెలియ చేయండి.

మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.