ఒంగోలు కధలు: గురువంటే? - పార్థు Back     Home  
ఈ పేజీ ని పంపండి
ఇది పదవ తరగతిలో జరిగిన యుద్ధకాండ.

నేను, లెక్కల మాస్టారి శీను గాడు, రమేష్, దేశముదురు శీను గాడు, ట్యూషన్ కూడా ఒకటే. లెక్కల మాస్టారి శీను వాళ్ళ నాన్న గారు లెక్కలకి, ఇంకో ఆయన సైన్స్ కి వుండేవారు. మొత్తం ఓ 20-25 మంది దాకా వుండే వాళ్ళం 9, 10వ తరగతులు కలిపి. మాదే ఫస్ట్ బాచ్. క్లాస్ లో 4,5 గురు ఆడపిల్లలు వుండేవాళ్ళు. అందులో, పద్మజ చదువులో మాకు బాగా పొటీగా వుండేది. మేం ఆంధ్రజ్యోతి పేపర్ లో అడవిదొంగ,అపూర్వసహోదరులు లాంటి స్టిల్స్ అట్టలేసికుంటుంటే, ఆ పిల్ల ఆల్జిబ్రా తో కుస్తీ పడుతుండేది. స్టిక్స్ పెట్టి సిక్స్ కొట్టేవాళ్ళలా ఫోజులిస్తుంటే, స్టాటిస్టిక్స్ మేసేసేది. అంతెందుకు, ఒక్కముక్క లో కక్కాలంటే, పుస్తకాలు (చ) దువ్వుతూనే వుంటుంది పగలు, రాత్రి.

అన్నగారు కొత్తరూల్ పెట్టి బళ్ళో మాస్టర్ లు, వీధుల్లో ట్యూషన్ లు చెప్పకూడదనటం తో, కథ మలుపు తిరిగింది.

సినిమాలో హీరో లకి డూప్ లాగా, వికెట్ల మధ్య పరిగెత్తలేని బాట్స్ మాన్ కి బై-రన్నర్ లా, "రామక్రిష్ణ" అనే ఇంకో పాత్ర ని ప్రవేశపెట్టి తమ స్కూలేంటో అన్నగారి కి చూపించారు మాస్టర్ లు. పైపెచ్చు, మేం అంతకు ముందే, ఒకటి, రెండు సంధర్భాలలో, "పరాయి భాష" మీద చూపించిన పోరాట పటిమ కు "ఇహ లాభం లేదు! ఇంగ్లీష్ మాస్టరి ని పెట్టాల్సిందే" అని గట్టిగా నిర్ధారించుకోవడంతో కూడా.

ఈయన కుర్రాడు, P.G ప్రైవేట్ గా చేస్తుండేవాడు.

"వున్న టీం కాదు, కొత్త కోచే అడ్జస్ట్ అవ్వాలన్న" సూత్రాన్ని విస్మరించడం అప్పటినుండే చూశాం. అనుకున్నట్టుగానే టీం లో లుకలుకలు మొదలయ్యాయి.సందు దొరికినప్పుడల్లా నిరశన ప్రకటిస్తుండేవాళ్ళం.

ఈ కొత్త కోచ్ మగబౄందాని కి నచ్చలా.

"ఆర్య సమాజం శ్రీజ-శిరీష్ లని ఆదరించినట్టు, నేరసమాజం అబూసలేం-మోనికా లని అక్కున చేర్చుకున్నట్టు", ఆయన ఆడపిల్లల వైపు కొమ్ముకాశాడు అనిపించింది. మమ్మల్నో వెధవల్లా చూస్తున్నాడన్న నమ్మకం రోజురోజు కి బలపడసాగింది. వాళ్ళనే ఎక్కువుగా అప్పచెప్పించుకోవడం, శని,ఆది వారాల్లో ఎలాగూ ఈ క్రికెట్ మూక రారని తెలిసి, పునాది కోసం పునరాభ్యాసాలు చేయించడం, మోడల్ పేపర్ లు, ఇన్స్టెంట్ ఆన్సర్ లు, ఇలా, ఎన్నో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాల ప్రసారం ప్రారంభమయాయి ఈయన హయాం లో.

ఇంత చాన్స్ ఇస్తే వూరుకుంటుందా టైగర్ పద్మజ? మొన్నటిదాక 25 కి, 20, 21 దగ్గర మాతో పాటే ఫిక్స్ అయిపోయిన తన మార్కులు, "సడన్ గా లేచిన స్టాక్ మార్కెట్ లా" 23, 23న్నర తాకటం మొదలెట్టాయ్. మగ ఇన్ వెస్టర్లలో ఆందోళన ప్రస్పుటంగా గోచరించసాగింది.

"అసలేం జరుగుతోంది, నాకంతా తెలియాలి?" అడిగాడు రమేష్ గాడు గ్లోవ్స్ పీక్కుంటూ, అప్పట్లోనే సీతయ్య లెవెల్లో, ముక్కు మీద మొటిమ గీక్కుంటూ, "మనం, అట్టలేసుకోవడం, బాట్ లు భుజానేసికోవడం లాంటి కార్యక్రమాలు తగ్గించుకోవాలనుకుంటా?" చెప్పడు దేశ ముదురు గాడు. "ఎన్ని అట్టలేశాం లెక్కల బుక్కుకి, ఎన్ని కట్టలు కట్టాం మైన్ ఆన్సర్ షీట్ కి?" అన్నది కాదురా ప్రశ్న, నశిగాడు రమేష్ గాడు.మాకు రానివి, వాళ్ళకెలా వస్తున్నాయ్? అని మేం బాట్ లు బద్దలుకొట్టుకుంటుంటే, ఇంకోరోజు జరిగిన ఘటన, బంతి ని బౌండరి దాటించింది.

హంతకులే కాదు, హీరోలు కూడా చిన్నచిన్న తప్పులు చేసి, విలన్ లకి దొరికిపోతుంటారు. అలానే, ఆయన దొరికిపోయారు ఒకరోజు."ప్రశ్నలు-జవాబులు" కార్యక్రమలో, అదేపని గా మాట్లాడుతున్న రమేష్ గాడ్ని లేపి, ఏదో వాక్యం ఇచ్చి, "ఆక్టివ్ వాయిస్ లోంచి, పాసివ్ వాయిస్ లోకి" మార్చమన్నాడు. సడన్ గా అప్పటికప్పుడు అంత పెద్ద సమాసం పూరించమనేసరి కి, మావాడికి బేసిక్ గా వాయిస్ మిస్స్ అయ్యింది. చెప్పనందుకు ఆయనకి కోపం ఏమీ రాకపోయిన, "ప్రాబ్లెం సాల్వ్ చేసేప్పుడు మాటలెందుకు, అడిగితే చెప్పలేకపోవటం ఎందుకు?" అన్నాడాయన. దాంతో వీడు రోషగాడు లో చిరంజీవి లెక్కన, "అసలు ప్రాబ్లెం అంటే ఏంటి సార్?అసలెందుకు సాల్వ్ చెయ్యాలి?" అన్నాడు వళ్ళుతెలియని ఆవేశం లో. మేమంతా వాడి వంక భయంగా చూశాం."మాటలు తడబడి అలా మాట్లాడుతున్నాడా? పొరబడి మాట్లాడాడా?" అని కంఫర్మ్ చేసికుందాం అనేలోపే, "ప్రాబ్లెం అంటేనే నువ్వు రా.." అని ఆయన వీడి తాటతీసే ఎపిసోడ్ కి శ్రీకారం చుట్టాడు.

20-20 లో బాదుడికి బాల్ కి పెచ్చురేగిపొయినట్టు, వాడి అరచేయి చీరుకుపొయినంత పని అయ్యింది.

ఇది చాలు, బాట్స్ మన్ ని అవుట్ చేయించడానికి అని, అంపైర్ లకి అప్పీల్ చేశాం. అసలు గురువులు ఈయన్ని పిలిచి, "పదో తరగతి కుర్రాళ్ళు, పైగా ఫస్ట్ బాచ్. "వాయిస్ ఇప్పుడు మార్చలేకపొతే, పెద్దయ్యాక మిమిక్రీ నేర్చుకుని మారుస్తాడులే, అంతమాత్రానికే, ఇలా బాదేస్తామా? చిన్నగా చెప్పుకోవాలి" అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆయన కి నాటవుట్ ఇచ్చారు.

అప్పటికి అది సద్దుమణిగింది.

ఆయన మాత్రం తక్కువ తిన్నాడా! "ఇహ నుంచి, మిమ్మల్ని కత్తులతో కాదు కంటిచూపుతో చంపేస్తా" అన్నాడు. మొదటి రెండురోజులు మాకు అర్ధం కాలా. మూడోరోజుకి తెలిసొచ్చింది.

ఆయన 20-20 ఫార్మాట్ మార్చాడు.

"ఇహ నుండి కొట్టను" అంటే సంబరపడ్డాం, "కొట్టిస్తా" అన్నాడు. ప్రతి జవాబు చెప్పని ప్రశ్న కి, చెప్పినవాళ్ళచేత "చెంపదెబ్బ" అన్నాడు. ఇంతగొప్ప వినూత్న పధకం ఆయన ఎందుకు ప్రకటించాడో గ్రహించి, వద్దు అని వారించేలోపే, ఒక ప్రశ్నకి నేను జవాబు చెప్పలేకపోవడం, ఎదురుగుండా, ఇకటాట్టహాశాలు చేస్తూ, "కొరడారాణి లో విజయలలిత లా", క్రూరంగా చూస్తూ, మా టైగర్ పద్మజ, నిజంగానే ఆకలిగొన్న పులి లా దూకటం చూసి కళ్ళుమూసుకున్నా,

తెరిచి చూసేసరి కి, ఆయన రంగస్థల నాటకం లో రెండోకౄష్ణుడు లా నవ్వుతూ కనిపించాడు.

యుద్ధం ముగిసింది అన్నట్టు గా. ఆయన పంతం నెరవేరింది.

పద్మజ చేతి లో నా చెంప పగిలింది.

ఒక్క క్షణం నిశ్శబ్దం. జయలలిత చేతిలో కరుణానిధి కి జరిగినంత ఘోర అవమానం.

అంతే, "మున్నేట్ర కజఘం" ముష్కర మూకలు విజౄభించాయ్. విజయలలిత కొట్టినందుకు కాదు, నాగభూషణం నవ్వినందుకు.

ట్యూషన్ రెండు చెక్కలయ్యింది. రామకౄష్ణ వ్యతిరేక వర్గం ఒకటి, సానుభూతి వర్గం ఒకటి. మళ్ళీ అప్పీల్ చేశాం. ఈసారి శ్రీశాంత్ లెవెల్లో. మొదటినుండి మగజాతి కి జరిగిన అవమానాలు ఏకరువు పెట్టాం. అన్నగారి రాజ్యంలో ఆడపడుచులకి ఆదరణే కానీ, బావమరుదులకి భజంత్రీలే అని విన్నవించాం. లెక్కల మాస్టారి శీను ఇంట్లో కొంత వత్తిడి తీసుకురావడంతో సహజంగానే మాకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ 5,6 నెలల కాలం లో, అన్నగారి రూలు కూడా అంత ఎఫెక్టివ్ గా లేకపోవడంతో, మాస్టర్లు మళ్ళీ సొంతంగా లాగించెయ్యలని నిర్ణయించుకోడంతో కూడా.

రామకౄష్ణ రన్ అవుట్ అయ్యారు. ట్యూషన్ ఆయనతో అనుబంధం తెంచేసుకుంది.

DMK ఘనవిజయం సాధించింది.

* * *

అనే అనుకున్నాం చాలా రోజులు వరకు.

తండ్రి చిరుద్యోగి కావడంతో, ప్రైవేట్ గా చదువుతూ, పదో,పరకో, ఈవిధం గా సంపాదించుకుంటున్నాడని, అలాంటివాడు అల్లరిపాలయ్యాడని,చిన్నదైన ఆ వూరు, చిన్న విషయాన్ని చిలవలుపలవు గా చేసి చెప్పటంతో, చిన్నబుచ్చుకుని, ఇంక ట్యూషన్ లు వద్దనుకుని, వేరే వుద్యోగప్రయత్నాలు చేసికుంటున్నాడని, మా చిన్ని బుర్రలకి, చుట్టుపక్కల వాళ్ళు, కూర్చోపెట్టిచెప్పడంతో, తను ఎదురుపడ్డప్పుడల్లా, ఏదో తప్పు చేశామన్న ఫీలింగు.

పదవ తరగతి రిజల్ట్స్ రోజు పండగలా తిరుగుతున్న మా బాచ్ కి ఎదురుపడి, సైకిల్ దిగి, "కంగ్రాట్స్" అని పేరుపేరున పలకరించి,"ఇప్ప్డు మీరు నిజంగా పెద్దవాళ్ళు, మేము ఇంక, ఏరా!, రారా! అనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. ఇంటర్ కెరీర్ కి దిక్సూచి లాంటిది, పట్టుకుని రైట్ డైరెక్షన్ లో వెళ్ళారో, ఇంక లైF లో సెటిల్ అయినట్లే" అని ఉపదేశిస్తుంటే ఏదో భాధ లోలోపల.

ఎప్పుడో చిన్నప్పుడు చదివిన, మధ్యమధ్య వింటున్నా, అప్పుడే చూశాం తొలిసారిగా., తడిబారిన కనుల వెనుక "గురువంటే గుండ్రాయి కాదు...గురుబ్రహ్మే!" అని .

అలా, ఒకసారి గెలిచి ఓడిన మేము, ఇంటర్ రెండవ సంవత్సరం చివర్లో మళ్ళీ వోడిపోయాం..., మా చిరకాల ప్రత్యర్ధి పద్మజ మూలంగా.

"ఇంక నేను మీక్పెపటికీ పోటీ కానులే" అంటూ నవ్వుతూ ( లోపల కొండంత భాథ తోనేమో!) చేతిలో శుభలేఖ పెట్టినప్పుడు. సంసార భాద్యతలని వదిలేసి, తాగుడే సర్వస్వం అనుకున్న తండ్రి విచ్చలవిడితనం, కుటుంబపరువు బజారుకీడుస్తుంటే, పిల్ల ఇంకా ఎక్కువ చదివేస్తే, ఆఖరికి డిగ్రీ చదివిన మేనమామ ని కూడా తీసుకురాలేనేమో అన్న భయంతో, తల్లి కుదిర్చిన పెళ్ళికి, ఎన్నో క్లిష్టమైన లెక్కల కి తలవంచని పద్మజ , ఆ RTC కండక్టర్ చేతి కి తన భవిష్యత్ నే "లెక్క" కట్టి ఇచ్చేసింది, చదువుల పుస్తకం మూసేసింది శాశ్వతంగా........ ఆ టైగర్.

"గెలిచిన సంతోషం ఓ గంటే అయితే, ఓటమి భాధ వందేళ్ళు అన్నట్టు...", ఇది గుర్తొచ్చినప్పుడల్లా, మేం మళ్ళీ వోడిపోతూనేవుంటాం.

పార్ధూ.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత పార్థు కి తెలియ చేయండి.

మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.