పెద్దలకు మాత్రమే (ఒంగోలు కధలు-13): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

ఈ కధ చెప్పే ముందు, కొంత మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం గురించి చెప్పాలి.

మా ఇంట్లోనో లేదా కాలనీ లో పక్క వాళ్ళింట్లోనో కలిసి కూర్చుని TV/VCP లో సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని పెద్దలకు మాత్రమే సన్నివేశాలు వచ్చేవి. అలాంటి సన్నివేశాలు వచ్చేప్పుడు ఇంట్లో వాళ్ళంతా అప్పుడే ఏదో పనులు ఉన్నవాళ్లలా లేచి వంటింట్లోకో వసారా లోకో వెళ్ళేవాళ్ళు. (రిమోట్ సౌకర్యం ఉండేది కాదు కనుక చానెల్ మార్చడానికి). అది కుదరని పక్షం లో "ఈ మధ్య సుబ్బారావు పాలు సరిగ్గా పోయటం లేదండీ, నీళ్ళు ఎక్కువ కలుస్తున్నాయి" అంటూనో, "వచ్చే నెల DA ఇస్తాడుట గదా ఎంత వరకూ రావచ్చేంటి?" అనో టాపిక్ మార్చేసేవాళ్ళు.

పిల్లలమేమో "అదే పనిగా చూస్తే ఎక్కడ తగులుతాయో అని" పుస్తకాల గూడు వైపు వెళ్ళే వాళ్ళం టెంపరరీ బ్రేక్ కోసం.

మరి కొన్ని చెప్పుకోవాలంటే,

వేసవి కాలం ఆరుబయట మంచాలేసుకుని పడుకుంటే, ఆరు లోపే లేపేసి లోపలికెళ్ళి పడుకోండి అనేవాళ్ళు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. అత్తయ్యగారు, మావయ్యగారు అని పిలుస్తూనే పక్కింటి వాళ్ళని అన్నయ్యనో, అక్కయ్యనో అని పిలుచుకునేవాళ్ళం పిల్లలం.

ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ (మాసపత్రిక), విజయచిత్ర (సినిమా పత్రిక), ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి మాత్రమే అర్హత సంపాదించాయి అఫీషియల్ గా కొనడానికి, చదవడానికి అప్పట్లో. స్వాతి, మయూరి లాంటివి పక్క వాళ్ళు ఇస్తేనో, ఊరి నుండి వచ్చిన చుట్టాలు తెస్తేనో మాత్రమే చదువుకోడానికి సౌకర్యం కలుగచేసారు.

అలాంటి వాతావరణం అది.

ఇక కధ లోకి వద్దాం...

అప్పుడే మా బేచ్ యవ్వనం లోకి ప్రవేశించాము.

శీను గాడు మా బేచ్ లో దేశముదురు టైపు. వాడికి "అన్ని" విషయాల మీదా అవగాహన ఉండేది. "వజ్రాయుధం" పాట లో మా అందరి దృష్టీ కృష్ణ మీద ఉంటే, వాడు మాత్రం చప్పుడు కాకుండా "చిలకలని" చూస్తుండేవాడు (ఆ విషయం ధియేటరు బయటకు వచ్చిన తరువాత వాడే సభాముఖం గా ప్రకటించేవాడు).

మేము సితార, శివరంజని కోసం కొట్టుకు చస్తుంటే, వాడు "సినీ కమాండో", "సినీ డిటెక్టీవ్" అంటూ అవేవో పత్రికలు ఎక్కువగా చదువుతుండేవాడు. అలాగే, మేము "సామ్రాట్", "సాహస సామ్రాట్", "వీర ప్రతాప్", "కంచు కవచం", "ఉక్కు సంకెళ్ళు" లాంటి సినిమాల కోసం వెంపర్లాడే రోజుల్లోనే వాడు మాత్రం "అడవి లో ఆర్తనాదం", "అర్థరాత్రి హత్యలు", "ఇంటి నెంబరు 13", "కనుక్కో, ఏం జరిగిందో" లాంటి డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చూసేవాడు. అర్థమయి చచ్చేది కాదు ఎందుకు అవే ఎక్కువగా చూసేవాడో.

అసలు గుట్టు విప్పడం తో, మిగిలిన వాళ్ళ నోళ్ళు తెరుచుకున్నాయ్.

"ఎలా చూస్తార్రా, సిగ్గు లేకుండా?" అడిగాడు లెక్కల మాస్టారి శీను.

"సిగ్గు అక్కరలేదు, కళ్ళు ఉంటే చాలు" గీతోపదేశం చేసాడు దేశ ముదురు.

"కళ్ళే కాదు ఖలేజా కూడా ఉండాలి. తెలిస్తే తంతారు మా ఇంట్లో" చెప్పానేను.

"తెలియకుండా మేనేజ్ చేస్తే?" కొద్దిగా మెత్తబడ్డాడు రమేష్ గాడు.

"కష్టం రా" అన్నాడు దూద్ పేడా శీను గాడు.

"దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" చెప్పాడు దీర్ఘం గా ఆలోచించి దేశ ముదురుగాడు.

"మీరు స్టార్ట్ చేసిన 5, 10 నిమిషాల తరువాత వస్తారు. చీకట్లో ఎవరికీ కనపడరు" చెప్పాడు.

"ఎక్కడ కూర్చున్నావో నువ్వైనా కనపడతావా అసలు?" ఆరా తీసాడు ఆదుర్దాగా రమేష్ గాడు.

"తలుపుతెరుచుకున్న ప్రతిసారీ చూస్తుంటా, మీరు రాగానే ఎదురొస్తా" చెప్పాడు వాడు.

"మామూలు సినిమాలకెళ్ళినప్పుడే ఎన్నో సార్లు మమ్మల్ని వదిలేసావ్ మధ్యలో, ఇలాంటి చోట స్పృహ ఉంటుందా అసలు నీకు?" అడిగాడు అనుమానంగా రమేష్.

"అయినా అసహ్యం గా ఉదయం ఆట ఒక్కటే వెయ్యడమేంట్రా?" అడిగాడు లెక్కల మాస్టారి శీను.

"ధియేటరు లోకి దూరేటప్పుడు మాత్రమే, మీరు ముందు వెనుకా బాగా చూసుకుని దూరాలి. తెలిసున్నవాళ్ళు కనపడకుండా. అయినా ఆఫీసులు, కాలేజులు టైమే కాబట్టి 99% తెలిసున్నవాళ్ళు తగలరు" చెప్పాడు అనుభవం తో.

"అదృష్టం బావుండి చిన్న గల్లీ లో ఉంది. లేకపోతే ఈ మాత్రం కూడా వర్క్ అవుట్ అవదు" చెప్పాడు మళ్ళీ వాడే.

"ఇదేదో బానే ఉంది రా.." దూద్ పేడా శీను గాడికి ధైర్యం వచ్చింది.

నాకు, లెక్కల మాస్టారి శీను కి ఇంకా ధైర్యం రాలా. మలేరియా వచ్చినవాళ్లలా వణకసాగాం.

"భయమేస్తోంది రా.." అన్నాము.

"ఒకవేళ పొరపాటున దొరికిపోతే, నన్ను పిలిచుకెళ్ళడానికి వచ్చామని చెప్పండి" అంటూ ఇంకో బాణం వేసాడు.

"అన్ని రకలు గా ఆలోచించాం కాబట్టి ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి కావాలంటే" తప్పదు అన్నారు మిత్రత్రయం.

ఆ ముహూర్తం రానే వచ్చింది.

అంతా సజావుగానే జరిగింది లోపలకి ఎంటర్ అయ్యేవరకూ.. అక్కడే తన్నింది.

ప్రొజెక్టర్ సహకరించనందున పొరపాటున మేము దూరే సమయానికి ఇంకా లైట్స్ అవీ వేసే ఉన్నాయి. సినిమా నడవటంలా.. జనాలు కాళ్ళు బార్లా జాపుకుని కూర్చుని "ఒస్సో.. బుస్సూ.." అంటూ మూలుగుతున్నారు.

"రేయ్! కెమిస్ట్రీ లాబ్ అసిస్టెంట్ భద్రం రా.. ", "రేయ్! ఇటు చూడు, టైపు ఇనిస్టిట్యూట్ సత్యమూర్తి గారు కూడా ఉన్నారు రా", "తలలు దించడెహై.. పై row లో పక్క వాటా వాళ్ళ అబ్బాయి రామకృష్ణ ఉన్నాడు. దేశం లో ఉన్న పరిచయస్తులంతా అక్కడేదో అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబీషన్ జరుగుతుంటే వచ్చినట్టు వచ్చి తగలడ్డారు.

ముచ్చేమంటలు పొయ్యటం ప్రారంభించాయి. ఎప్పుడెప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తాడా అని మొక్కుతూ కూర్చున్నాము. ముందు ఖాళీ సీట్ లు, పక్క ఖాళీ సీట్ లు మమ్మల్ని మరింత భయపెట్టసాగాయి. తలుపు చప్పుడు అవితే చాలు, తాండ్రపాపారాయుడు కళ్ళ ముందు కనిపించినట్టు అయింది పరిస్థితి. తెలుసున్న వాళ్ళు రాకూడదని ఒక వేడుక, వచ్చినా ఈ పక్క సీట్ లోకి రాకూడదని మరో విన్నపాలు భగవంతుడికి. సామూహిక ప్రార్థనలు జరుగుతున్నాయి ఆందోళనలతో. అపరేటర్ అన్నయ్య కి దణ్ణాలు మొదలయ్యాయి తొందర గా లైట్లు ఆపి సినిమా వెయ్యమని.

మా టీమ్ కెప్టెన్ మాత్రం "పిల్ల సన్నాసులు, భయపడి చస్తున్నారు, ఇలాంటి సినిమాలు చూడాలి అంటే మనలా ఖలేజా ఉండాలి" అంటూ జిలేబీ తింటూ చక్కా కూర్చున్నాడు.

చిన్నగా ఆట మొదలయ్యింది.

ప్రేక్షకులు లీనమయి పోయారు, పక్కవాడి వైపు తల తిప్పితే ఏమి మిస్ అయిపోతామో అన్నంత నిఠారుగా కూర్చుని దీక్షగా చూడటం మొదలెట్టారు. ఆ అకుంఠిత దీక్ష, దక్షత చూస్తుంటే, తెర ఎక్కడ తగలబడిపోతుందో అనిపించక మానదు.

పిండ్రాప్ సైలెన్స్ ధియేటర్ అంతటా..

ఇంకా రక్తి కట్టించే సన్నివేశాలు రాలా. కొంత మందికి అయితే అనుమానం, అంత డబ్బెట్టి కొన్నాం టికెట్, అసలు వస్తాయా రావా అన్న బెంగ. ఇలాంటి సతమత వాతావరణం లో విపత్కర పరిస్థితులలో, ఆ సినిమా స్క్రీన్-ప్లే రచయిత ఎవడో కానీ సాగదీసుకుపోతున్నాడు సెంటిమెంట్ సిన్ లతో.

అదో గొప్ప కరుణరసాత్మక చిత్రం.. చిత్ర కళారాజం, గొప్ప కధాబలం, నటీ నటవర్గం కల చిత్రం. డైరెక్టర్ ఊహల కి మించిపోయి నటిస్తున్నాడు ప్రతి ఒక్కడు. కిక్కురుమనలేని పరిస్థితి ప్రతి ఒక్కడిదీ ధియేటర్ లో.

ఇది చాలదు అన్నట్టు మధ్య లో పవర్ పోయింది ఒక సారి, ఉదయం ఆట, పైగ ఉక్క, ధారాళమైన గాలి, వెలుతురు కోసం అన్ని తరగతుల ప్రేక్షకులు తలుపులు అన్నీ బార్లా తెరిచారు.

కాసేపు ధియేటరు యాజమాన్యం జనరేటరు తో కుస్తీ పడ్డాక, మళ్ళీ మొదలయ్యింది ఆ ఆస్కర్ గహిత.

ఈసారి రచయిత కుటిల రాజకీయాలు, దేశం లో జరుగుతున్న అరాచకల మీద తన వెన్నుకున్న పవర్ చూపించడం మొదలెట్టాడు. ఒక తరగతి ప్రేక్షకులలో కోరిక నసిస్తే, ఇంకో తరగతి ప్రేక్షకుల లో ఓపిక నసించింది. ప్రచురణ సాధ్యం కాని పదజాలాన్ని ప్రయోగించడం మొదలెట్టారు టికెట్ కొన్నామనే కసి తో.

సరిగ్గా అదే సమయం లో కధ కు సంబంధం లేకుండా, కేసు కి సంబంధం లేని సాక్షి లా ఎక్కడ నుంచో వచ్చి తెర మీద పడిందో బొమ్మ. అప్పటికే పెద్ద నటినటవర్గం తో కన్ ఫ్యూజ్ అయిపోయిన మాకు సడెన్ గా ఈ కొత్త కేరెక్టర్లు చేసేసరికి రచయిత కధ ని ఎలా మలుపుతిప్పబోతున్నాడబ్బా అని అలోచిస్తూ కూర్చున్నాం.

జన ప్రవాహిని లో సందడి మొదలయ్యింది. ఇందాకా ఆపరేటర్ అన్నయ్య మీద కేకలు వేసిన జనం, ఇప్పుడు జేజేలు, జిందాబాద్ లు కొడుతూ ఈలలు వేస్తున్నారు. గట్టిగా నాలుగు సన్నివేశాలు మారాయో లేదో, తెర సడెన్ గా తెల్లగా అయిపోయింది. ఆపరేటర్ రూము లో డోర్ పెద్దగా చప్పుడైన శబ్దం. కొంత కలకలం మేడ మీద. క్రింద కళాభిమానుల గుసగుసలు.. ఈ ఉద్వేగ వాతావరణం లో ఎవడో పెట్టాడు పెద్దగా కేక "పోలీసోళ్ళు వచ్చారంట".

మాకు భలే ముచ్చటేసింది పోలీసులు కూడా పని మానుకుని వచ్చారంటే ఈ సినిమా లో తప్పక ఏదో విశేషం ఉండి తీరాలి అనిపించింది. రచయిత మీద నమ్మకం మరింత బలపడసాగింది.

వాళ్ళొచ్చింది చూడ్డానికి కాదురా, చావబాదడానికి అని దేశముదురు దానయ్య చెపితే కానీ అర్థం కాలా.

పక్కన చూస్తే శీను గాడు జంప్.. చీకట్లో ఎప్పుడు చెక్కేసాడో తెలియలా.

ముందు ఆహార పొట్లం తనకే అందాలని, వరదభాధితులు ఎలా పరిగెడతారో అప్పుడే నాకు మొదటిసారి గా అర్థమయింది.

లాటీలు, టోపీలు తలుపులు ముయ్యకముందే, జనం తోసుకుబయటపడ్డారు.

ఆ తోపులాట లో, తొక్కిసలాటలో, టైపు మాస్టారు, కుంగ్ ఫూ మాస్టారు అనే తేడా ఏమీ లేదు, ఆత్మ రక్షణార్థం ఒకళ్ళ మీంచి ఒకడు దాటుకు పోవాలన్న తాపత్రయమే.

అక్కడ పరిగెడితే, పక్కన హోటల్ దగ్గర కూలపడ్డాము.

తల ఎత్తుకుని దర్జాగా చూడాల్సిన సినిమాలు ఇలా తలదించుకుంటూ, నడుం వంచుకుంటూ (ఎవరికీ కనపడకుండా) చూడటమేమిటో అర్థం కాలా!

అది సహజం గా వచ్చిన బెరుకు వల్లో, ఇంట్లో వాళ్ళంటే భయం వల్లో, ఈ దెబ్బ తిని ఉండటం వల్లో తెలియదు కానీ ఇంత భయపడుతూ, తప్పు చేసామేమో అనే ఫీలింగు తో, ఆదుర్దాగా చూడాలా ఇలాంటి సినిమాలు అనిపించింది మిగతా నలుగురికీ.

ఆ అనుభవం పెద్ద పాఠమే నేర్పింది. పద్దతేమిటో చెప్పింది. అక్కడక్కడే ఒట్టేసుకున్నాం అట్టర్ ఫ్లాప్ అయినా సరే అచ్చ తెలుగు ఆంధ్రా సినిమలే చూద్దామని.

* * *

ఇది జరిగిన కాసేపటికి..

"ఉత్తదేనట్రా, ఇప్పుడే కనుక్కున్నా, పోలీసులు కాదట, అందరూ లోపలికెడుతున్నారు పదండి, ఇంతకీ రమేష్ గాడు ఏడీ?" అంటూ వెనుకనుండి వచ్చి చెయ్యేసాడు శీనుగాడు.

"అలాగే వెడదాం, కాసేపాగు, మీ నాన్నగార్ని పిలుచుకురావడానికెళ్ళాడు వాడు" చెప్పాడు దూద్ పేడా శీను గాడు వెటకారం గా.

ఇది జరిగిన కొన్నేళ్ళకి..

మూడేళ్ళ తరువాత తొలిసారిగా ఇండియా వెడుతున్నా..

"ఏం తేన్రా?" అని ఫోన్ లు చేసినప్పుడు అడిగితే,

"నాకు డిజిటల్ డైరీ కావాలి, ఫలానా బ్రాండ్ సిగరెట్లు కావాలి, నాకు aiwa వాక్ మన్ కావాలి, seiko వాచ్ కావాలి" అని ఇలా అడిగారు అందరూ. వాడిని అడిగా అలానే, "అక్కడ అవేవో మేగజైన్స్ అమ్ముతారుట కదా, బట్టలు.."

"పురుషులలో పుణ్యపురుషులు వేరూ, కలి పురుషులలో ఆకలి పురుషులు వేరు".."రెండు జెళ్ళ సీత" లో పాట గుర్తొచ్చింది ఎందుకో..

* * *

ఒక్క క్షణం ఆగండి..

ఈ కధ నేను ఇక్కడితో ఆపేయ్యొచ్చు. అలా చేస్తే సిసలైన వ్యక్తిత్వాన్ని చెప్పి, వాడి అసలైన వ్యక్తిత్వాన్ని దాచి ద్రోహం చేసినట్టు అవుతుంది.

తను కోల్పోతోందేమిటో త్వరగానే గ్రహించడం, తప్పటడుగులనే, మెప్పుటడుగుల గా మార్చుకోవడం కొద్దిమందికే సాధ్యమవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో వాడు ఒకడు.

ఆ క్షణమే "పండిత పుత్రుడు పరమశుంఠ కానక్కరలేదు" అన్న దిశ గా అడుగులు పడటం ప్రారంభించాయి. "ఇంతటి తో అయ్యో అంతా అయిపోయిందే" అని వాడు అనుకోలేదు. (మధ్యలో రెండు ఏళ్ళు చదువు ఆగిపోతే), తన తోటి వాళ్ళే తనకి సీనియర్స్ అయినా వెనుకంజ వేయలేదు. ఎలా ఎదగాలా అని మాత్రమే ఆలోచించాడు.

ఫలితమే KITS లో M.Sc (Maths) గోల్డ్ మెడల్ సంపాదించి, బేంక్ రీజనల్ ఆఫీస్ లో ఆపరేషన్స్ హెడ్ గా ఎదిగాడు అతి త్వరలోనే.

"ఏం! అంత కష్టమా ఏమిటి ప్రోగ్రామింగ్ చేయటం, అంటూ after hours లో కంప్యూటర్ తో కుస్తీ పట్టి సర్టిఫికేషన్స్ చేసిన దేశముదురు గాడు.

మంచినీళ్ళు తాగినంత తేలిక అని ధైర్యం చెప్పి, నేను వెళ్ళలేకపోయాను IT లోకి. కనీసం నువ్వైనా వెళ్ళాలి అని పట్టుదల తో భార్య ని M.Sc (IT) చేయించి, ఉద్యోగం తెప్పించి పెట్టాడు.

ఇవన్నీ ఒక ఎత్తు, పుట్టిన తన బిడ్డ ని చూసుకోవడానికి అత్తగారింటికి వెడుతున్న తన అన్నయ్య ని హైవే మీద లారీ గుద్దేసి చంపేస్తే, అలా దిక్కులేకుండా అయిపోయిన ఆ కుటుంబానికి పెద్ద కొడుకు పోయిన పుట్టెడు శోకం లో తమ ఆరోగ్యం దిగజార్చుకున్న తలితండ్రులు కోసం ఇంటికి పెద్ద దిక్కు గా నిలవడం కోసం అన్నీ ఒదులుకుని (ప్రమోషన్, భార్య జాబ్, మెట్రో జీవితం etc) తన వారి కి తోడు గా నిలవడం కోసం తమ భవిష్యత్ నే తిరిగి మార్చుకున్నాడు.

వాడు.. మా దేశ ముదురుగాడు, మా శీనుగాడు.

పార్థూ.

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.