రాసాను ప్రేమలేఖలెన్నో (ఒంగోలు కధలు-12): పార్థూ Back   Home 
రెండవ భాగం      ఈ పేజీ ని పంపండి

సారధిగాడికి "ప్రేమపావురాలు" సినిమా విపరీతం గా నచ్చేయ్యడం తో ప్రేమ లో పడిపోవాలని గట్టిగా తీర్మానించుకున్నాడు.

ఆ పిచ్చి ముదిరిన దగ్గర నుండీ వాడు స్వతహాగా వినే "లారీ డ్రైవర్", "రౌడీ గారి పెళ్ళాం", "బాబులుగాడి దెబ్బ" లాంటి చిత్రాలలోని పాటలు పక్కకు నెట్టి, సడెన్ గా టీ కొట్ల దగ్గర "సడక్", "దిల్ హై కే మాన్ తా నహీ", "ఆషికీ", "సాజన్" పాటలు పెట్టమని కడప కేంద్రం వాళ్ళని కోరినట్టు కోరుతుండేవాడు. "సర్లే అర గ్లాస్ టీ లు తాగినా, అరగంటకోసారి వచ్చే బేరం కదా" అని "ఏసేద్దం" అనేవాడు అంజిరెడ్డి.

ఇలా వాడి మానసిక పరిస్థితి అంత అంత మాత్రం గా ఉన్నప్పుడు వాళ్ళ కజిన్ పెళ్ళి కి వెళ్ళడం, అక్కడ మనోడికి కబూతర్ తో కాకపోయినా అంతే సైజ్ కోడిపెట్ట ని ఎత్తుకుని ఒక కనక మహలక్ష్మి వైట్ సల్వార్ లో కనపడటం తో, ఇక రాజశ్రీ వాళ్ళ సినిమా కి రెక్కలు వచ్చాయి. పెళ్ళి రెండు రోజుల్లో ఒకరోజు, మొత్తానికి ధైర్యం చేసి వీడు "హమ్ ఆప్ కే హై కౌన్" అంటూ కూపీ లాగి, కొంత కధ నడిపాడు.

అక్కడ నుండి మొదలైంది అసలు నస.

ఆ అమ్మాయి పేరు "వల్లి" అని తెలిసిన దగ్గర నుండీ, సడెన్ గా వీడు పూజించే టాప్ 3 దేవుళ్ళ లిస్ట్ లో సుబ్రమణ్యేశ్వర స్వామి కూడా వచ్చి చేరిపోయారు. (ఆయన భార్య పేరు కూడా అదేలెండి).

"ఎంతటి నవాబు అయిన carribow (coffee) బుట్ట లో పడితే గరీబు" అయినట్టు, అ అమ్మాయి ప్రేమ లో పడ్డ వీడు అలానే తయారయ్యాడు. "మా షోరూమ్ మహిళలకు మాత్రమే ప్రత్యేకం" అని ప్రింటెడ్ మెటీరియల్ లో ఉన్నా కూడా శ్రీ వల్లి టెక్స్ టైల్స్ లోనే పాంటు, షర్టు కొనడం, "అవి నెల్లూరు మొలకొలుకులు కాదురా" అని ఇంట్లో వాళ్ళు గోల పెట్టినా, "కామధేను-కల్పవల్లి" రైస్ ట్రేడర్స్ దగ్గరే బియ్యం బస్తాలు కొనేయ్యడం లాంటివి చేస్తుండేవాడు.

ఆ పిచ్చి అంతటి తో ఆగలా. వీళ్ళ కజిన్ షాప్ లో (గ్రాఫిక్స్ అండ్ లితో ప్రింటర్స్) పని చేసే సోదర కార్మికుడు పొరుగు రాష్ట్రం వాడు అయిఉండటం, అతని ద్వారా "వల్లి" అనే పేరు తో ఒక సినిమా రిలీజ్ అయింది అని, దానిలో ప్రతి పది నిమిషాలకి "వల్లి" జపం ఉంది అని తెలియడం తో, మోహన్ బాబు కి మైక్ దొరికినట్టు అయింది. వీడి విపరీత ప్రేమ కి బోర్డర్ లు ఆర్డర్ తప్పాయి. ఫలితం, సడన్ గా ఒంగోలు-చెన్నై ట్రైన్ లు ఊహించని రిజర్వేషన్స్ తో సామాన్య జనానికి బెర్త్ లు లేకుండా పోయాయి. ఆ సినిమా తెలుగు లోకి డబ్ అవుతోంది, "వల్లి" పేరు వంద సార్లు వినొచ్చు, మనూళ్ళోనే అని పార్టీ ఇచ్చాడు. "KS రామారావు ఒకటి తలిస్తే, KL నారాయణ ఇంకోటి తలచాడని, దాని పేరు వాడు expect చేసినట్టు కాకుండా, "విజయ" (ప్రియా రమన్ హీరోయిన్, రజనీ కాంత్ తీసారు తమిళం లో) అనే పేరు తో రావడం తో డబ్బింగ్ రైట్స్ తనే కొనేసి అయినా సరే, వల్లి పేరు పెట్టాలన్నంత హడావిడి చేసాడు.

అలా పిచ్చి ముదిరి పాకాన పడటం తో, వచ్చింది ఈ ఆలోచన... ప్రేమలేఖ రాసి పంపాలని!

మా బృందం అంతా చర్చలలో కూర్చున్నాం. పెద్దాయన కదా అని ముందు బోసు గారిని అడిగాడు.

"ఎన్ని సెంటర్స్ లో "అగ్ని" సినిమా ఆరవ రోజే లేపారో అడుగు, ఆపకుండా చెపుతా, ఇలాంటివి నాకు తెలియదు, నన్ను ఒదిలేయి" అన్నాడాయన సిగరెట్ ని సింగారిస్తూ.

సత్తి (సతీష్) గాడేమో వీడ్ని ఆటపట్టిద్దామన్నట్టు గా, "అరేయ్! నా దగ్గర అద్భుతమైన మేటర్ ఉందిరా" అని ఉడికించడం మొదలెట్టాడు.

"వల్లి!!"

నేను, ప్రేమ అనే స్వచ్చమైన, పాలరాతి గోడ మీద పాకే బల్లి ని
నువ్వు 4 కోళ్ళ నవ్వారు మంచం అయితే అంచుల్లో వేలాడే నల్లినిి
నువ్వు 3 కోళ్ళ వెండి కంచం అయితే నంచుకునే ఉల్లినిి
నువ్వు 2 కాళ్ళ పిల్లివయితే వెంటపడే బుల్లి లల్లిని.

రెచ్చిపోయిన సారధి గాడిని, చిచ్చుకొడుతూ, హరికిషోర్ గాడు అన్నాడు "రేయ్! కొద్దో గొప్పో మన గాంగ్ లో కధలు-కవితలూ అంటూ ప్రాణాలు తోడేది వీడే కాబట్టి, వీడు రాస్తాడు రా" అని నా వైపు చూపించాడు. నేను అప్పుడే రచనారంగం లో పెన్సిల్ కి ముక్కు చెక్కుతున్నవాడిని, శ్రీ లక్ష్మి "రెండు రెళ్ళారు" టైపు కవితలు రాయడం కూడా ఇంకా పూర్తిగా పూర్తి గా రాని వాడిని. అదే గుర్తు చేసాను వాళ్ళకి.

"కళ్ళ ముందు ఇప్పుడే కదలాడింది, కళ్ళు విప్పి చూసేలోగా కనుమరుగయ్యింది" అని ఒకసారి కవిత చెపుతుంటే మీరే కదరా "అప్పుడు కరెంట్ పోయుంటుంది లేరా" అన్నారు బజ్జీలు నములుతూ. ఇంకోసారి, "ఆకాశం లో అరుణుడు అలిగాడని, వరుణుడు ఉరిమాడనీ, నేలతల్లి నిందించగలదా? కొడుకులు అరిచారని, కోడళ్ళు కసిరారనీ, కన్నతల్లి ఖండించగలదా?" అని ప్రశ్నిస్తే, "కన్నతల్లి మాట ఏమో గానీ, మేము మాత్రం కాళ్ళు ఇరగ్గొట్టడం ఖాయం" అని వార్నింగ్ ఇచ్చింది మీరు కాదూ, అప్పుడే మర్చిపోయారా?" అన్నా.

"అది అప్పుడురా.. ఇప్పుడు అవసరం అలాంటిది. వాడికా, వాక్యానికీ, కావ్యానికీ తేడాఏ తెలియదు ఏం రాస్తాడు చెప్పు. నువ్వే ఎలాగోలా సర్దుకుపోవాలి" అన్నాడు.

నిజం చెప్పొద్దూ సినిమా flyers కి మేటర్ రాయడమే కానీ, లవర్స్ కి లెటర్స్ రాసిచ్చే సత్తా నాలో కూడా లేదు. అదే చెప్పా. "ఏం పర్లేదు సుందరాకాండ సినిమా ఎన్ని సార్లు చూడలా మనం, అందులో బ్రహ్మం బాబాయ్ ఏం చేసాడమ్మా?" అన్నాడు.

"అటూ ఇటూ అయితే అరణ్యకాండ అయిపోతుందేమోరా మనకి" అన్నా భయపడుతూ.

"మనమేమన్నా పుట్టు మచ్చ లూ, పురుడు పోసిన హాస్పిటల్స్ వివరాలు దగ్గర నుండి ఇస్తామా ఏమిటి అందులో దొరికిపోవడానికి, నువ్వు మేటర్ రాయి, మిగతాది నేను చూసుకుంటా" అన్నాడు హరి గాడు.

ఆ విధం గా, సారధి గాడి ప్రేమ కొట్టం లో నాకు పలుపు తాడు కట్టి పడేసారు.

నేనేమి రాసానో, ఆ పిల్ల ఏం చదివిందో, తరువాత ఏమైందో తెలియాలంటే, ఆ పలుపుతాడు విప్పాల్సిందే వచ్చే వారం...

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.