గజిబిజి జిలేబీ (ఒంగోలు కధలు-11): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

బాబాయిగాడు, బావగాడు, నేను గాంధీ రోడ్ లో జిలేబీ బండి కనిపిస్తే చాలు జేబులు తడుముకునేవాళ్ళం. మా గాంగ్ లో శ్రీ రామ్ గాడు "హవాలా" బాంక్ టైపు అయితే, మిగిలిన వాళ్ళంతా "దివాలా" బాంక్ టైపు. వాడి జేబుల్లో చెక్కులుంటే, మా జేబులకి చిల్లులుండేవి. శ్రీరామ్ గాడు మా "ఉత్తుత్తి" బాంక్ మెంబర్స్ కి జేబులకి చిల్లులు పోయి, చిల్లర వచ్చేవరకూ "ఏక్షన్" సినిమా లో ఫాక్షన్ లీడర్ ముఠా సభ్యులని చూసుకున్నంత శ్రద్ధ గా చూసేవాడు. జిలేబీ బండి తో అంత అనుబంధం ఏమీ లేదు అప్పటివరకూ. మరీ రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు తినేవాళ్ళం.

ఒక రోజు బావగాడు, నేను మెస్ లో కడుపునిండా మెక్కి ఇంటి దారి పట్టాం. బండి దగ్గరకి వచ్చేసరికి, వేడి వేడి గా వృత్తాకారం లో ఒళ్ళు నునుపెక్కి, కళ్ళు ఎరుపెక్కి, బెల్లం పాకం లో మరిగి, పళ్ళెం పైకి ఎగిరే ఆ జిలేబి చుట్టల్ని చూస్తూ లొట్టలు వెయ్యడం మొదలెట్టాం. "కన్నెపిల్లని చూసి కమల్ హాసన్ ఆగినట్టు", "కప్ప పిల్ల ని చూసి కట్లపాము ఆగినట్టు" ఆటోమేటిక్ గా ఆగిపోయాం. "బావా, జిలేబీలు గుబాళిస్తున్నాయి, వేసేద్దామా?" అన్నాడు వాడు కత్తి రామ్‌దాస్ లెవెల్ లో. "ఆఫర్ వస్తే చాలు లోఫర్ వేషమైనా వేసేస్తా" అని చూస్తున్న ఫ్లాప్ హీరో లా నేను "సై" అన్నా.

ఇక, జిలేబీ గజిబిజి మొదలైంది. చెరొకటీ తిన్నాం. జిలేబీ రాముడు ఊరుకోలా. బావగాడు పక్క వాళ్ళ ప్లేట్ల ఒంక పవిత్రం గానూ, నా ప్లేట్ లో చేయి పెట్టి అపవిత్రం గా అరకొర ముక్కలు తుంపి నోట్లో వేసుకోవడం చూసి, "ఏరా!, కడుపు చించుకుంటే పక్కోడి ప్లేట్ మీద పడుతుందంటరు, ఇలాగే ఇంకోటి చెప్తే పోలా?" అన్నా.

"నువ్వు యస్సంటే సింహమైపోతా, OS (oh! yes) అంటే నరసింహమైపోతా" అంటూ బాలకృష్ణ స్టయిల్ లో చుట్టలు చుట్టేయడానికి వెళ్ళాడు. లాండ్ మాఫియా వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్లేట్లు మార్చినట్టు, జిలేబీ ప్లేట్స్ మార్చుకుంటూ రుబ్బుడు కార్యక్రమం కొనసాగించాము కొంతసేపు. అలసిపోయిన ఆత్మారాముడు "ఆపండెహే ఇక" అని కసురుకునేదాకా.

"ఎనిమిది రూపాయలట్రా" చెప్పాడు బావగాడు చిన్నగా. "ఆహా అన్నా" కిల్లర్ పోస్టర్ ఒంక కసి గా చూసి (ఊహించినంత హిట్ అవ్వలేదని కోపం)

"ఇచ్చేస్తావా?" అన్నాడు KCR తెలంగాణా కావాలన్నంత ఈజీగా.

"ఏం నీ దగ్గర లేవా?" అన్నాను.

"ఉంటే చిన్న చుట్టలేం ఖర్మ పెద్ద చుట్టలే చెప్పేవాడ్ని కదా, ఏం నువ్వేమీ తేలేదా?" అన్నాడు.

"తేలేక కాదు, డబ్బులు లేక" అన్నా.

"ముంచావు కదురా బావా! నువ్వు యస్సన్నావంటే, నీ దగ్గర ఉన్నాయేమో అనుకున్నారా" అని వాడు, "నువ్వు OS అన్నావు కదా నువ్వు పే చేస్తావేమోలే అని తెగ మెక్కా" అని నేను.

ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. ఇంకాకటి దాకా బాలీవుడ్ నుండి వచ్చిన హీరోయిన్ లని చూసుకున్న ప్రొడ్యూసర్ లా కనిపించిన జిలేబీ బండి వాడు, ఇప్పుడు కంటికి ఖాన్ దాదా లా కనిపిస్తున్నాడు. కడుపు లో జిలేబీ లు కషాయం అయిపోయాయి. ఈడ్చి తంతే, ఇద్దరి దగ్గరా కలిపి మూడు రూయాయిలు లేవు. సమ్యుక్తం గా ప్రొడ్యూస్ చేసినా బడ్జెట్ సినిమా కూడా తియ్యలేని చితికిపోయిన నిర్మాతల పరిస్థితి లా అయిపోయింది మా పని.

"ఏం చేద్దాం?" అన్నాడు వాడు. "డబ్బులు లేవు, రేపిస్తాం" అని చెప్పడానికి నోరు రావడం లా అంతగా తెలిసిన వాడు కాకపోవడం చేత, "సార్! పకోడి గానీ, బజ్జీ గానీ వెయ్యమంటారా?" మిర్చి మీద ఉల్లిపాయ చల్లినట్టు షాప్ వాడు. ఇలా అడిగితే గానీ, వీళ్ళు నోరు తెరవరని అనుకున్నాడేమో.

ఇక లాభం లేదని బావ గాడు, "పర్స్ మర్చిపోయాం, వెళ్ళి తీసుకొస్తాం" అన్నాడు.

మేము స్టూడెంట్స్ లా కాక స్టువర్ట్ పురం దొంగల్లా కనిపించామో ఏమో, "అలా కాదు కానీ ఏదో ఒకటి పెట్టి పొండి ఇక్కడ" అన్నాడు.

ఒకటే సైకిల్ మీద వచ్చాం, అది ఇస్తే ఇంకోకళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకుని రావడానికి లేదు. "సరే, నేను ఉంటా ఇక్కడ, నువ్వెళ్ళి తీసుకురారా బాబాయ్ గాడి దగ్గరో, శ్రీ రామ్ దగ్గరో" అన్నాడు వాళ్ళ ఇద్దరి ఇళ్ళూ అక్కడకి దగ్గరే అవ్వడం చేత.

సరే, అని మొదట బాబాయ్ వాళ్ళా ఇంటికెళ్ళ. "లేడయ్యా, ఇంకా కాలేజ్ నుండి రాలా" అన్నారు వాళ్ళ అమ్మగారు. "అవునూ, నువ్వు కాలేజ్ నుండి వస్తూ నన్ను అడుగుతున్నావేంటీ?" అంటూ అనుమానం గా చూసారు (చా! ఇక్కడ స్టువర్ట్ పురం బతుకైపోయింది.)

"నాకు ప్రాక్టికల్స్ లేవండి. అందువల్ల ముందే వచ్చేసా" అని చెప్పి, సైకిల్ శ్రీ రామ్ గాడి ఇంటి మీదకి తిప్పా. అక్కడెంత పరాభవం జరుగుతుందో అని భయపడుతూనే.

"శ్రీ రామ్ వాళ్ళ బావ నెక్కించడానికి స్టేషన్ కి వెళ్ళాడయ్యా" అన్నారు వాళ్ళ అక్కయ్యగారు. ఈ ప్రహసనం లో ఓ అరగంట గడిచింది, అక్కడ వాడెన్ని తిప్పలు పడుతున్నాడో అనుకుంటూ, కుంటుకుంటూ, ఇక లాభం లేదని సైకిల్ నేరుగా మా రూమ్ వైపుకి తిప్పా.

అక్కడే తప్పా..

"మురుగ ఒకటి తలిస్తే, మెగాస్టార్ ఇంకోటి తలచాడని", స్పీడుగా వెడుతున్న నేను ఎదురుగా వస్తున్న ఒక గేదెల గుంపు ని చూసి తడబడటం, అవి నన్ను, నాలాగే వెనుక వస్తున్న "వాహన మూక" ని చూసి భయపడటం, అందరూ పొలోమని అదుపు తప్పి గోతిలో పడటం ఒకేసారి జరిగాయి.

"దీని జిమ్మడ!! ఒక్క జిలేబీ కోసం మొహం వాస్తే, గూబేంటీ ఇలా గులాబ్ జామ్" అయిపోయింది అని తిట్టుకుంటూ చూసేసరికి బావగాడి డొక్కు సైకిల్, పరమ చెత్త సైకిల్ లా తయారయ్యింది. ముందు చక్రం కదలనని మొరాయించింది పైన మడ్గార్ రేకు, టైరు ఇంచుమించు కలసిపోవటం తో.

"కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిందని", అసలే డబ్బులు లేక చస్తుంటే దీని రిపైర్ ఒకటి ఇప్పుడు. దాన్ని లాక్కుంటూ సైకిల్ రిపైర్ షాప్ కి పట్టుకెళ్ళా.

"ఉండు బాబూ, ఇప్పటికిప్పుడు అంటే కుదరదు అవతల చూడు ఒక దానికి over-oiling చెయ్యాలి, ఒకదానికి puncture వెయ్యాలి, ఇంకోదానికి bearings పోయాయి బాల్స్ వెయ్యాలి" అంటూ ఆయన టాస్క్ లిస్ట్ చదివాడు.

"పోనీ, అద్దె సైకిల్ ఏమన్నా ఉందా?" అన్నా ఆశ చావక. అన్నగారు సైకిల్ కి తెచ్చిన గుర్తింపు ఏమిటో అక్కడ తెలిసింది.

సరే, ఏం చేస్తాం అని కూలబడ్డా. సెల్ ఫోన్ ల యుగం కాదాయే, సందేశం చేరవేద్దామంటే. సరే, అని వాడికి బాగు చెయ్యమని చెప్పి "marathon 200 miles" మొదలెట్టా రూమ్ వైపుకి.

ఓ గంటకి పైగా గడిచింది .. హీరోయిన్ జెట్ రెడీ అయింది.

ఎదురుగా వస్తున్న RTC బస్ లని కూడ పట్టించుకోకుండా, దారి లో వస్తున్న గేదెల మందకి, మేకల సమూహాలకీ మాత్రం importance ఇస్తూ, బండి (సైకిల్) జిలేబీ బండి వైపు దూసుకుపోయింది.

అక్కడ బావ లేడు..

కట్ చేస్తే, ఓ గంట తర్వాత, మస్తాన్ టీ షాప్ లో బావ ని ఓదారుస్తూ మిగతా మిత్రబృందం, కాఫీ అంటే కొడతారేమో అని కలవరపడుతూ చతికిలపడిన నేను.

ఎంతకీ రాకపోయేసరికి, విసిగెత్తి బాబాయిగాడు ఇంటికి బయలుదేరాడట. వాడికి ఇవ్వడానికి ఏమీ లేక చేతికున్న HMT వాచ్ ఇచ్చి బయలుదేరాడుట. అది వాడికి వాళ్ళ నాన్నగారు ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు ఇచ్చిన బహుమతి అని చెపుతుండేవాడు. అలా తాకట్టు పెట్టి వస్తుంటే, NRI కొడుకు ని ఎయిర్ పోర్ట్ లో వదిలివస్తున్న తలితండ్రుల్లా కుమిలిపోయాడట.

"ఇంకాసేపు ఆగలేకపోయావు రానే వచ్చేవాడిని గదా" అంటే, చర్రున లేచాడు, "ఎంత సేపురా" అని, అవతల క్లాస్ మేట్స్ (అమ్మాయిలు) ఇద్దరు ఎదురుగుండా ఫాన్సీ స్టోర్స్ లోకి వెళ్ళారుట, వీడు తినకుండ బండి పక్కనే పొట్లాలు కట్టే వాడిలా నుంచుని ఉండటం తో అదోరకం గా చూసారట షాప్ లో ఉన్నంతసేపూ.

"తల కొట్టేసినట్టు అయ్యిందిరా, ఇంకెంత మంది తెలిసిన వాళ్ళు వస్తారో అని టెన్షన్ పడి చచ్చారా" అన్నాడు.

మొత్తానికి బాబాయి గాడు ఇంట్లో ఉండటం, డబ్బులు కట్టి HMT వెనక్కి తీసుకోవడం తో కధావేదిక మస్తాన్ షాప్ కి మారింది.

ఆ విధం గా జిలేబీ మాకు కొన్ని పాఠాలు నేర్పింది.

మొన్న ఒంగోలు ట్రిప్ లో అటువైపు నుండి వెడుతూ చూసాం.. అక్కడ బండి లేదు కానీ, జ్ఞాపకాలు మిగిలాయి. ఇప్పుడు బావ కూడ ఆ HMT వాచ్ పెట్టడం లేదు, జిలేబీ దెబ్బకి భయపడి కాదు, నాలుగైదు ఏళ్ళ క్రితం శిష్య పరమాణువులు వెళ్ళిపోతూ ఇచ్చిన "టైటాన్" ని మర్చిపోకుండా ఉంచుకోవాలని అది పెట్టుకుంటున్నాడు.

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.