"రోజులు మారాయి" (ఒంగోలు కధలు-10): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

"ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమములు..." అంటూ కవిత ధోరణి లో బావగాడు, "ఒకనాటి ఉద్యాన వనము, నేడు.." అంటూ సినిమా ఫక్కీ లో నీలిగాడు సారధిగాడు, "రోజులు మారిపోవట్లా, ఊళ్ళు మారిపోవా?" సాగదీసారు బోసుగారు, "ప్చ్! ఏదోలా ఉంది.." నసుగుతూనేను, ఇది మత్తెక్కించే మా ఒంగోలు కధలు కాదు, మతి పోగెట్టే మనోవ్యధలు.

* * *

ఆదివారం జూన్ 25:

స్థలం: విజయవాడ రైల్వే స్టేషన్
సమయం: పినాకిని ఎక్స్ ప్రెస్ బయలుదేరడానికి పట్టుమని పది నిమిషాలు మాత్రమే ఉంది (5:50am)

బావ (శివ) గాడు ఒకటవ నెంబర్ ప్లాట్ ఫారం మీద, లాబ్ లోంచి ప్రింట్స్ వస్తాయా, రావా అన్న మీమాంశ లో ఉన్న మసాలా సినిమా నిర్మాత లా హడావిడి గా తిరుగుతూ, నన్ను చూడగానే "ఏరా ఇంత లేట్ అయ్యిందేం?" అన్నాడు చిరాకుగా.

"రాత్రి అన్నవరం నుండి వచ్చేసరికి ఒంటిగంట అయ్యిందిరా, వెంటనే లేవలేక పోయను" నా సంజాయిషీ.

"సరే పద, ఇంకో రెండు నిమిషాల్లో బయలుదేరుతోంది, కాఫీ తెస్తా" అంటూ మాజీ నక్సలైట్ జనజీవన స్రవంతి లో కలిసిపోయినట్టు ఎక్కడో దూరిపోయాడు. వాడు ఇచ్చిన కాఫీ తాగుతూ తెచ్చిన ఈనాడు పేపర్ చూస్తూ కబుర్లలో పడ్డాం. ఈలోపే తెనాలి వచ్చింది. సారధి కీ, బోస్ కీ కాల్ చేసాం అటునుంచి బయలుదేరారా లేదా అని, వాళ్ళుండేది ఒంగోలు కి డెబ్బై కిలోమీటర్ల దూరం లో. సారధి వాళ్ళ ఆవిడ "రెడీ అవుతున్నాడు" అని చెప్పి, పలకరించి పెట్టేసారు.

* * *

స్థలం: కరవాడి స్టేషన్్
సమయం: ఒంగోలు కి పది నిమిషాల దూరం లో (7:55am)

కొందరికి అది చిరు సవ్వడి, ఎంతోమందికి అలజడి, ఫిజిక్స్ లో "ప్రకంపనాలు" అని వాడినట్టు గుర్తు, అవిగో అలాంటివే మొదలయ్యాయి. బావగాడేమో దక్షిణ మధ్య రైల్వే లో పాంట్రీ సర్వీస్ ల గొప్పతనాన్నీ, అందునా పినకిని లో వెజిటేరియన్ కట్ లెట్ ల స్పెషాలిటీ ని వివరిస్తూ లొట్టలేస్తున్నాడు వెండర్ కోసం.

* * *

స్థలం: మీరు ఊహించినదే్ ్
సమయం: కల్యాణి ఫాస్ట్ ఫుడ్స్ లో బ్రేక్ ఫాస్ట్ చెయ్యాల్సిన సమయం (8:15am)

శ్రీరామ్ గాడు ఎలాగూ ఉంటాడు ఫ్లాట్ ఫారం మీద అన్నది ఊహించినదే. సారధి గాడిని చూసేసరికి నోట మాట రాలా, డెబ్బై కిలోమీటర్లు, గంటా పది నిమిషాల్లో వచ్చిన వాడి వేగానికి, (55 mph మీద), "పక్కనున్న ఫార్మర్స్ మార్కెట్ కి 12 గంటలు డ్రైవ్ చేస్తారు ఈయన" అని దెప్పి పొడిచే మా ఆవిడ మాటలు గుర్తొచ్చాయి. గడ్డం నెరిసిన సారధి గాడిని చూస్తే వయసు, పొట్ట పెంచేసిన శ్రీ రామ్ గాడిని చూస్తే పెద్దరికం గుర్తొచ్చి, మనం ఇక సునీల్ టైపు "యూత్" అనిపించింది.

కుశల ప్రశ్నలూ, పలకరింపులూ, ఆలింగనాలు అయిన తరువాత శివ గాడు "కల్యాణి కి వెడదాం పదండో ఆకలేస్తోంది" అనడం తో ఒంగోలు రంగు బయటపడింది. పరుచూరి మాటల్లో చెప్పాలంటే ఒక గుండే బద్దలయ్యింది. దాసరి నోటితో అయితే, "హృదయం రెండు చెక్కలయింది, ఒక ముక్క కుడి వైపుకీ, ఇంకో చెక్క రెండో పక్కా పడిపోయింది", త్రివిక్రమ్ మాటల్లో తిక్క తిక్క గా చెప్పాలంటే, "తను గీసిన బొమ్మ తన ముందే చెరిపేస్తే వేసిన వాడికెలాఉంటుందో, తను తీసిన సినిమా తన ముందే ఎడిటర్ కోసేస్తే చేసినవాడికెలా ఉంటుందో" అలా అయింది మా పరిస్థితి.

* * *

మొదటి షాక్: కల్యాణి కనుమరుగు

"లేదురా, కల్యాణి ఫాస్ట్ ఫుడ్ ఎత్తేసారు, కాదు కాదు పడకొట్టేసారు. ఏవో గొడవలు జరిగి" అని శ్రీ రామ్ గాడు చెప్పడం తో, మొదటి ఓవర్, మొదటి బంతి కే వికెట్ పోగొట్టుకున్న ఇండియన్ టీమ్ లా అయిపోయింది మా పని.

నిజంగా పెద్ద షాక్. కప్ పైకి నురగలు కక్కుతూ పొర్లుకు వచ్చే ఆ కాఫీ కోసమే ఎన్నో ప్రభాత సమయాలు, అసుర సంధ్యవేళలూ అక్కడ గడిపింది. ఎన్ని తీపి గుర్తులు దానితో! ఎన్నో ఆలోచనలకి, వాదనలకీ అది పుట్టిల్లు.

"సారధి గాడి తొలిప్రేమ కి తుదిమెరుగులు దిద్దింది అక్కడే, డిగ్రీ అవగానే జాబ్ సంపాదించిన శ్రీ రామ్ గాడి తొలి పార్టీ అందులోనే, శశి తో ఇళయరాజా మీద సాయంత్రం ఇష్టాగోష్టి అక్కడే, M.Sc. నా, MCA నా అని తలలు బద్దలుకొట్టుకున్నది అక్కడే, చల్లని వేపచెట్టు నీడన, తెల్లటి పాలరాతి బెంచీల మీద కూర్చుని తాగిన ఆ 1/2 టీ లూ, తిన్న/ తినాలనిపించే స్ప్రింగ్ రోల్స్ గుర్తొచ్చి కాసేపు ఇబ్బంది పెట్టాయి.

చివరికి జయరామ్ సెంటర్ చేరుకుని "సెంట్రల్ కేఫ్" లో సెటిల్ అయ్యాం. తినడాలు అయిన తరువాత, ఇక నలుగురం నడక మొదలెట్టం లాయర్ పేట వైపు. నా camcorder కి పని పెట్టాను. సారధి గాడు, శ్రీ రామ్ గాడు బైక్ లు శ్రీ రామ్ వాళ్ళ ఇంట్లో పెట్టి వస్తాం ఎలాగూ నడకే కదా ఇక అని వెళ్ళారు. ఈ లోపు అప్పట్లో సైకిల్ మీద తిరిగిన సందులు, గొందులూ అన్నీ తియ్యడం మొదలెట్టను. పనిలో పని గా మా ఆవిడ ఒకటి రెండో తరగతులు చదివిన PVR బాలికల పాఠశాల, మా మామగారికి వారసత్వం గా సంక్రమించిన పురాతన ఇల్లు, మొదటి సంవత్సరం మేధ్స్ కి వెళ్ళిన రమణయ్య ట్యూషన్ అన్నీ కవర్ చేసాను.

ఈ లోపు వీళ్ళు రానే వచ్చారు. జమ్మి చెట్టు వీధి మీదుగా, రంగారాయుడి చెరువు చేసుకున్నాం. బాగా డెవలప్ చేసారు అప్పటి మీద. బోటింగ్ పెట్టారు కొత్తగా. ఈ పార్క్ లో టి.కృష్ణ తీసిన "నవబారతం", "భారతనారి", "రేపటి పౌరులు" సినిమా షూటింగ్ లు చూసిన రోజులు, ప్రభాకర రావు ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు టైము ఉంటే కూర్చుని చేసిన అల్లరి సన్నివేశాలు, రెండో సంవత్సరం లో క్లాస్ మేట్ మాధురి ఇక్కడే దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలూ గుర్తొచ్చాయి.

* * *

స్థలం: షిరిడీ సాయిబాబా గుడి, లాయర్ పేట్
సమయం: మస్తాన్ షాప్ లో ఎప్పుడెప్పుడు టీ తాగుదామా అని చూస్తున్నవేళ

దర్శనం చేసుకుని బయటకు వచ్చి, గుడికి వెనుక వైపున నేను మొదటి సంవత్సరం లో ఉన్న గది, రామసుబ్బయ్య ట్యూషన్ తీద్దామని వెళ్ళాం. పక్కనే ఉన్న ఓరియంటల్ స్కూల్ కూడా కాలప్రవాహం లో కొట్టుకుపోయింది. ఉదయాన్నే ఆ స్కూల్ నుండి వినిపించే సంస్కృతం పాఠాలు, శ్లోకాలూ కార్పొరేట్ సంస్కృతి లో కొట్టుకుపోయాయట! మా ఇంటి ఓనర్ బాగా మార్చేసాడు ఇంటి స్వరూపాన్ని. రెండు సైకిళ్ళు పెట్టడానికే చోటు ఉండేది కాదు (నేను, దూద్ పేడా శీను గాడు కొట్టుకునే వాళ్ళం, నాది కొత్తది నేనే లోపల పెట్టుకుంటా అని) ఇప్పుడు రెండు మూడు స్కూటర్లు కనిపిస్తున్నాయి, షాప్ పెట్టాడు ముందు. వాళ్ళ కోడలు అనుకుంటా షాప్ లో ఉంది. రామసుబ్బయ్య ట్యూషన్ కూడా రూపురేఖలు మారిపోయాయి. మూడంతస్థుల భవంతి వెలిసింది. మేము కూర్చుని లెక్కలు నేర్చుకున్న పూరిపాక కళ్ళ ముందు కనపడింది ఒక్క సారి!

క్లాస్ మేట్, తెలుగు మీడియం నాగలక్ష్మి, నడుచుకుంటూ వస్తుంటే, లోపలకి వెళ్ళే దాకా పురుష పుంగవులు అంతా బయటే ఏడ్చే వాళ్ళు. అయన లోపల లెక్కలు చెప్పడం మొదలుపెట్టినా. కరవాడి వెంకటేశ్వర్లు ఇంటి మీదుగా ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్ కి వచ్చాం.

* * *

ఇక్కడే.. రెండో షాక్: మస్తాన్ టీ షాప్ మాయం!!

అపార్ట్ మెంట్స్ కట్టడం కోసం అక్కడ జరిగిన రోడ్ విస్తరణ లో భాగం గా మస్తాన్ ఫేమిలీ తో సహా తను ఉంటున్న కాకా హోటల్ ఎత్తేసి, కర్నూల్ రోడ్ వైపు వెళ్ళిపోయాడు అని చెప్పారు. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా గాంగ్ ని మిత్ర్ల్లా చూసుకున్న వాళ్ళ కుటుంబాన్ని కలవలేకపోయినందుకు అదో బాధ. రాత్రి తొమ్మిదిన్నర - పది మధ్య లో ఫస్ట్ షో నుండి వచ్చిన తరువాత టీ కావాలని వెళ్ళినప్పుడు కూడా, పడుకోబోతున్న ఆవిడని లేపో, లేదా తనో విసుక్కోకుండా, గిన్నెలు కడిగి లోపల పెట్టేసినా, తీయించి టీ పెట్టించేవాడు. ఖురన్ లో కృతజ్ఞత అన్నది మహమద్ ప్రవక్త ఎలా నిర్వచించాడో తెలియదు కానీ అలా అతనికి చెప్పాలని కోరిక. కలవడమే కుదరలా!

ఇక, బావగాడి రూమ్ వైపు వెళ్ళాం. వాడు తలుపు ముందు నిలబడి పోజులు ఇచ్చాడు. లోపల నుంచి ఎవరైనా వచ్చి అడిగితే బాగుండదేమో రా అంటే వినలా. దారిన పోయే వాళ్ళంతా మమ్మల్ని వింతగా చూడటం. camcorder మీద కొన్ని జోకులు పేలాయి. మనం ఇలాగే ఇంకో గంట తిరిగితే కలెక్టర్ కి కబురెళుతుంది. "ఒంగోలు లో రెక్కి నిర్వహిస్తున్న నలుగురు మావోయిస్టు" అని ఒకటి, "ఒంగోలు లో రోడ్ మీద అవినీతి కార్యక్రమాలని పట్టపగలే బట్టబయలు చేస్తున్న TV-9 బృందం" అని ఇంకోటి ఇలా.

చివరికి శ్రీ రామ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము రిఫ్రెష్ అవ్వటానికి. అప్పటికి సమయం మిట్టమధ్యాహ్నం పన్నెండు.

* * *

బోస్ బస్ స్టాండ్ నుండి కాల్ చేసారు, ఇప్పుడే వచ్చాను వచ్చి పిక్ చేసుకోండి అని, సారధి గాడిని పంపాము. ఆయన వచ్చి రొటీన్ కబుర్లు అయిన తరువాత లంచ్ కి హోటల్ మౌర్య కి అని బయలుదేరాం బస్ స్టాండ్ మీదుగా రికార్డ్ చేస్తూ "ఆర్య భవన్" మెస్, "తులసీ రామ్" ధియేటర్ లు చూడగానే "నిర్ణయం" సినిమా గుర్తొచ్చింది. ప్రస్తుతం "బంగారం" నడుస్తోంది. ఎప్పుడూ మౌర్య అయినా, ఇంకేదైనా ప్రయత్నిద్దాం అని బావ అనడం తో, పక్కనే రమ్య అనే కొత్త రెస్టారెంట్ లోకి లాక్కెళ్ళాడు శ్రీ రామ్.

*** భోజన విరమం ***

తరువాత మూడో షాక్: శర్మ కాలేజ్ ఖర్మ ఇలా కాలింది.

మేము చదివిన C.S.R. శర్మ కాలేజ్ చూడటానికి వెళ్ళాం. అదే కాంటీన్, అదే సైకిల్ స్టాండ్, అవే బిల్డింగ్స్, అవే బెంచ్ లు. ఏమీ మారలా. పైపెచ్చు, ఒకప్పుడు జిల్లా లో నెంబర్ వన్ గా ఉన్న కాలేజ్, మా అప్పుడు Xth లో 400 పైన దాటితే గానీ ఇంటర్ లో సీట్ దొరకని కాలేజ్, ఈ రోజు విద్యార్థులు లేని దుస్తితి కి చేరుకుని, ఇవాళో రేపో మూసివేత కు సిద్ధం గా ఉంది అని శ్రీ రామ్ చెప్పినప్పుడు ఇంకోరకం బాధ. శశి, శేఖర్ వాళ్ళు HAM రేడియో లో ఇవాళ కమల్ హాసన్ తో మాట్లాడాం, కృష్ణమాచార్య శ్రీకాంత్ తో మాట్లాడాం అని చెపుతుండే ఆ వైర్ లెస్ స్టేషన్ రూమ్ ని పూర్తిగా కొట్టేసారు బొటానికల్ గార్డెన్ నుండి గేదెలూ, ఎద్దులూ బయటకొస్తున్నాయి (అవి కూడా వీడియా తీసానని, మా మావగారు, అత్తగారు ఒకటే నవ్వు). అలా కరిగిపోయింది ఆ కల! ఏదో, రెండో సంవత్సరం క్లాస్ రూమ్ లో కూర్చుని వీడియోలూ, ఫోటోలూ దిగి తృప్తి పడ్డాం. అటు ఉండి నేరుగా ప్రకాశం భవన్, చర్చ్ మీదుగా ట్రంక్ రోడ్ ఎక్కాం. ఇంతలో మరో చిన్న షాక్ - కొచ్చిన్ కేఫ్ కనపడలా. ఏంట్రా లేపేసారా అంటే, లేదు కూల్చేసారు అన్నాడు శ్రీ రామ్ గాడు.

విజయవాడ కి హోటల్ మమత, నెల్లూరు కి కోమల్ విలాస్, తిరుపతి కి భీమాస్ ఎలానో, ఒంగోలు కి ఇది అలాంటిది. అంత పురాతనమైనది. లతీఫ్ రికార్డింగ్ సెంటర్ కూడా లేచిపోయింది అన్నప్పుడు, ఆ బాధ తీరే వేరు. ఎంత గొప్ప కలెక్షన్ ఉండేది! ఇళయరాజా వి LP రూపం లో. ఎన్నెన్ని కంబినేషన్ కేసెట్లు రికార్డ్ చేయించేవాళ్ళమో గురువుగారివి! అర్థరాత్రి రికార్డింగ్ చేయటం అతనికి అలవాటు. సెకండ్ షో అయిన తరువాత వెళ్ళి కేసెట్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళం పాటల లిస్ట్ రాసి.

ఒకొక్క అడుగు ముందుకు పడుతుంటే, ఒకొక్క దెబ్బ మనసు మీద! అశోకుడికి కళింగ యుద్ధం లో కలిగిన వేదనలాంటింది.

* * *

నాలుగో షాక్: విజయ దుర్గా ధియేటర్ విపరీతం.

అప్పట్లో, కొత్తగా కట్టిన ధియేటర్లలో అది ఒకటి. ఎలాంటి సినిమాలు ఆడాయి? స్వాతి ముత్యం, శివ, ప్రేమపావురాలు.. శివ పదమూడు సార్లు చూసిన ధియేటర్ అది. ప్రేమ పావురాలు కి పదహారేళ్ళ ప్రాయం పరుగులెట్టించిన ధియేటర్ అది. క్షణక్షణం కి రామ్‌గోపాల్ వర్మ స్వయం గా వచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ చూసుకున్న ధియేటర్ అది, (అదే సినిమా కోసం శ్రీ రామ్ పుట్టిన రోజు నాడు నేను చేసిన అవకతవక పని ఒంగోలు కధలు - 2 లో చదవండి) మైకేల్ మదన కామ రాజు కి శశి, శేఖర్ & వాళ్ళ ఫ్రెండ్స్ బెనిఫిట్ షో కి చేసిన సందడి అందులోనే. "కిల్లర్" రిలీజ్ ముందు రోజు జనవరి 10, 1992 గుంటూరు డిస్ట్రిబ్యూటర్ నరసరెడ్డి (భాగ్యలక్ష్మి ఫిల్ంస్, నాగార్జున తో గీతాంజలి తీసారు, ఇంకా చాలా మణి రత్నం చిత్రాలు డబ్ చేసారు) నుండి ఫోన్ వచ్చింది, ప్రీవ్యూ చూసడటం, మరో "శివ" ట అన్న టాక్ స్ప్రెడ్ అయి ఫాన్స్ చేసిన సందడి అక్కడే, ఇలా ఎన్నో!

ఖాళీ స్థలం మిగిలింది. పెరిగిపోయిన మొక్కలు, తరిగిపోయిన గుర్తులు...

అసలు ఆనవాళ్ళు కూడా లేనంతగా చదునైపోయింది, తెర మరుగైపోయింది. ఇక, ఓపిక నశించింది. ఇంకెన్ని ధారుణాలు చూడాల్సి వస్తుందో అనిపించింది. శివ గాడు వాళ్ళ మావగారింటికి వెళ్ళొస్తా అనడం తో మేము "ఊర్వశి" కి వెళ్ళి కూర్చున్నాం టి- బ్రేక్ కి. ఒక్కొక్కళ్ళ కష్టాలు, సుఖాలు, జీవితాలు ఎలా వున్నాయో సంభాషించాం. ఎప్పుడు పూర్తిగా తిరిగి వస్తున్నావు అనే ప్రశ్నకి తడుముకోవాల్సి వచ్చింది. హరికిషోర్ గాడిని, బాబాయ్ గాడినీ కలవలేకపోయాం అనుకున్నం. బాబాయ్ గాడు, వాళ్ళ కుటుంబం యాభై ఏళ్ళ తరువాత సొంత ఊరు ని వదిలిపెట్టి వెళ్లవలసి వచ్చినందుకు ఎంత బాధపడిందీ శ్రీ రామ్ గాడు చెప్పటం తో చివుక్కుమంది. ఒకప్పుడు ఏరా బాబాయ్, శివ గాడి దగ్గరకి వెళ్ళొచ్చు కదరా అదే కాలేజ్ కి అంటే, లేదురా అమ్మ, నాన్నా కి ఇష్టం లేదు ఒంగోలు వదలడం అనేవాడు, కానీ ఇప్పటి వాడి కుటుంబ పరిస్థితి కి ఇక తప్పలేదు అని తెలిసినప్పుడు అయ్యో అనుకున్నాం (వాడ్ని తిరుపతి ట్రిప్ లో అక్కడ కలిసాను లెండి)

* * *

స్థలం: ఒంగోలు రైల్వే స్టేషన్్
సమయం: బరువెక్కిన హృదయాలతో తిరిగి వెడుతున్న వేళ (6:30pm)

"ఇంకొక్క సారి మళ్ళీ కాఫీలు వీడుకోలు సందర్భం గా" అని బోసు గారు అనడం తో, సారధి గాడు సిగరెట్ ముట్టించాడు. ఎవరి లోనూ ఉత్సాహం లేదు, ఏదో నిర్లిప్తత. బహుశా అది అప్పటి వరకూ తిన్న షాకుల వల్ల కలిగినదో లేక మళ్ళీ ఎప్పటికి ఇలా కలుస్తామో అందరం అనే ఆలోచన వల్ల వచ్చిందో! "మరి కొద్ది నిమిషములలో చెన్నై నుండి విజయవాడ వెళ్ళు పినాకినీ ఎక్స్ ప్రెస్ ఒకటవ నెంబరు ఫ్లాట్ ఫారం మీదకు వచ్చుటకు సిద్ధం గా ఉంది, కృపయా ధ్యాన్ దే.." ఎనౌన్సర్ గొంతు ఆహ్లాదకరం గానే ఉంది. మాకే అదోలా ఉంది. రైల్వే రక్షక దళం కార్యలయం ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నాం. మాటలు అయిపోయాయి, గుర్తు చేసుకోవడాలు అయిపోయాయి. జీవం లేని నవ్వులూ, మౌనం లాంటి మాటలే మిగిలాయి.

దూరం గా మలుపు లో తిరుగుతూ కనపడింది పినకిని. చెయ్యి మెత్తగా నొక్కి వదిలాడు సారధి కళ్ళ లో చూసే ధైర్యం లేక, వాడి మొహం లో భావాలు నాకు బరువుగా అనిపించసాగాయి. "ఇలా మూడు, నాలుగు ఏళ్లకు ఒకసారి, మహా అయితే ఇంకో అయిదారు సార్లు కలుస్తామేమో రా లైఫ్ లో" అన్నాదు, అందరికీ అక్కడ లైఫ్ ఇంతే అని తెలుసు, కానీ రియాలిటీ ని ఫేస్ చెయ్యలేకపోయారు ఆ నాలుగు క్షణలు.. "వీలుంటే మళ్ళీ రారా వెళ్ళే లోపు" శ్రీ రామ్ గాడు నడుము చుట్టు చెయ్యేసి. "US వెళ్ళిన తరువాత కాల్ చెయ్యండి" బోస్ గారు, "బావా, ఇక పద, మన బండి వచ్చింది, సభ కు నమస్కారం.." అన్నాడు శివ గాడు శంకరాభరణం లో శంకరసాస్త్రి లా వాతావరణం తేలిక చేద్దామని. కళ్ళకి కనపడేంత వరకూ తలుపు దగ్గర నిలబడి మేమూ, ఫ్లాట్ ఫారం అంచున వేగం గా నడుస్తూ వాళ్ళూ పడ్డ ఆరాటం లో తెలియకుండనే ట్రైన్ ఊరు దాటిపోయింది, ఆరుబయట చీకటి ఆవరించింది.

* * *

ఉపసంహారం:

మీరూ నాలాగ ఊళ్ళ కోసం, రాళ్ళ కోసం రప్పల కోసం ఏడ్చే రకమైతే, మీ ఊరు రూపురేఖ, తీరూ, తెన్నూ, హంగూ, పొంగూ మారకముందే మీతో అనుబంధం పెంచుకున్న ఆస్థులు ఆవిరైపోకముందే, మేలుకోండి. లేద మీ ముందే అవి కరిగిపోతాయి, మాలాగే వ్యధలు మిగిలిపోతాయి. నేను తిరిగిన ప్రతి చోటూ నా దగ్గర భద్రపరుచుకోవాలి, భవిష్యత్తు లో అ జ్ఞాపకాలు తడిమి చూసుకోవాలన్న కోరిక చూసుకోవాలన్న కోరిక పూర్తిగా తీరకుండనే అయిపోయింది నేనెంతో ఇష్టపడే ఒంగోలు విషయం లో.

నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడే రికార్డ్ చేసుంటే బావుండేది రా అన్నాను వాడితో కొంచెం బాధగా. వాడు దానికి "చేతి లో camcorder ఉంది కానీ, రికార్డ్ చెయ్యడానికే అక్కడ ఊరు లేదంటావ్" అన్నాడు చలాగ్గా పినాకినీ పాంట్రీ వాడు ఇచ్చిన వెజీ కట్ల్ట్ నమిలి మింగేస్తూ...

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.