మాకు శివ, కాలేజ్ కి "CI" మురళి! (ఒంగోలు కధలు - 1): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

అప్పుడు మనం ఒంగోలు లో B.Sc వెలగబెడుతున్నాం. మనం అంటే, నేను, మా మిత్రబృందం. నేను, మా బావగాడు (శివ), మా బాబాయి గాడు (కృష్ణమోహన్), పంతులు, శ్రీరామ్ బాగా దోస్తులం. మా బృందానికి అందరి కాలేజ్ బాచ్ ల లానే ఓ కొన్ని "స్టాండర్డ్" బుద్ధులు ఉండేవి. ఒకటే టీ ని ఇద్దరు లాగించడం, మన్మధుడు సినిమా లో త్రివిక్రం చెప్పినట్టు "లూనా" ఒకడు తెస్తే పెట్రోల్ ఇంకోడు పోయించడం, సెంట్రల్ కేఫ్ లో 2 ఇడ్లీ, 4 కప్పుల సాంబార్ సేవించడం వగైరా (సేవింగ్స్ కోసం).

వీటి తో పాటు, రికార్డ్స్ ఆఖరి నిమిషం వరకూ పూర్తి చెయ్యకపోవడం, రేపో, ఎల్లుండో ప్రాక్టికల్స్ ఉన్నాయి అనగా, డిపార్ట్ మెంట్ హెడ్ సంతకాలకి "చిరంజీవి కాల్ షీట్స్ కోసం విజయబాపినీడు తిరుగుతున్నట్టు" తిరగడం, ఎక్కడున్నాడా మహానుభావుడు అని!

అప్పట్లో ఒంగోలు కి మురళి అని ఒక CI వచ్చారు. మనోడు "అంకుశం లో రాజశేఖర్ టైపు" అని ఒకటీ రెండు సీన్లకే జనాలకి అర్థం అయింది. పైగా కొన్ని "గలాటా" సందర్భాలలో extra వేషాలేసిన కాలేజ్ స్టుడెంట్స్ ని బట్టలు ఊడదీయించి (మగ పిల్లలవే లెండి) క్రాఫింగులూ గట్రా చేయింది, రోడ్ల మీద నడిపించాడు. దానితో CI మురళి అంటే, "చంద్రముఖి లో జ్యోతిక" ని చూసినట్టు చూసేవాళ్ళు కుర్రకారంతా.

అప్పటివరకూ ఎవడూ విననటువంటి Anti-gunda squad (AGS) అని, "చిరంజీవి టాగూర్ లో ACF" లాంటికి ఒక దానిని సృష్టించి, భయపెట్టాడు కుర్రోళ్ళని. సెకండ్ షో సినిమా నుంచి వస్తున్నారు అంటే తప్పకుండా జేబుల్లో టికెట్ ముక్క లు పెట్టుకునే వాళ్ళం, లేదా పక్కటెముకలు విరిగిపోయేవి తేడాలొస్తే. అర్థరాత్రి ట్రైన్ దిగి వస్తున్నాం అంటే, సవాలక్ష ప్రశ్నలు వేసేవాళ్ళు!

అలా కుర్రకారు అంతా భయపడి చస్తూ దీనంగా హీనం గా బతుకుతున్న రోజులు అవి! అమ్మాయిలు మాత్రం "చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే సినిమా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ లా" గర్వం గా తలెత్తుకుని తిరుగుతుండేవాళ్ళు.

అలవాటు లో భాగం గా ఆ ఏడాది కూడా, మా బావ గాడు రేపు ప్రాక్టికల్స్ అనగా ఇవాళ మెస్ వాడికీ, టీ షాప్ "మస్తాన్" కీ ఇవ్వవలసిన బాకీలు అన్నీ పోగా మిగిలిన డబ్బులతో రికార్డ్ బుక్స్, స్కెచ్ పెన్నులూ, ఇంక్ డబ్బాలూ కొని రెడీ అయిపోయాడు HOD సంతకాలకి. నాతో సహా, మా మిగిలిన గాడిదలన్నీ అంతకు ముందే ఈ కార్యక్రమాన్ని "పొరపాటున" పూర్తి చేసి రావడం తో వీడు ఒక్కడే వెళ్ళక తప్పింది కాదు.

వాడు బయలుదేరే సమయానికి మేమంతా అంతకు ముందు రోజు "రవి శాస్త్రి" పునాది గట్టి గా ఉండటం కోసం క్రీజ్ వద్దే పాతుకుపోయి, ఆచి, తూచి ఆడుతూ చేసిన సెంచురీ కారణం గా ఇండియా ఓడిపోయిన క్రికెట్ మాచ్ తాలూకు విశ్లేషణ సాగిస్తున్నాం. వాడు "రేయ్ ఒక గంట లో వచ్చేస్తాను, అప్పుడు వెళ్దాం అందరం లంచ్ కి" అన్నాడు. "సర్లే రా" అని మేము మా పన్లో పడ్డాం.

అవి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న రోజులు కూడా. మధ్యహ్నం పన్నెండు అయింది. కాండిడేట్ రాలా! సర్లే, HOD కదా, దొరికుండడు సంతకాలకి అనుకున్నాం. రెండు అయింది, పత్తా లేడు. సెల్ ఫోన్ల ఎరా కాదాయే కనుక్కుందాం అంటే! పోనీ కాలేజ్ కి వెడతామా అంటే దూరం, పైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఒక పక్క పంతులు గాడి "ఉదర" విదారక గోల! (అదేనండీ అకలి), పాపం కాసేపు ఆలస్యం అయినా కూడా ఓర్చుకోలేడు బిడ్డ! "సర్లే, ఒక బాచ్ వెళ్ళిపోయింది మెస్ కి, నేనూ, బాబాయ్ గాడూ ఉంటాం శివ గాడి కోసం" అని చెప్పి వాళ్ళని పంపేసాం.

మధ్యాహ్నం మూడు అయింది. అయినా రాలా!

ఈ లోపు తలుపు చప్పుడయింది. "హమ్మయ్యా! వచ్చాడు ఇప్పటికి!" అనుకున్నాం. తీసి చూస్తే, "సనత్" అని ఇంకో క్లాస్ మేట్ గాడు. వచ్చి చాప మీద కూర్చుని, ఆయాసం తో "రేయ్! శివ గాడిని జైల్లో పెట్టారు" అన్నాడు. "నేను మా మావయ్య తో పనుండి వన్ టవున్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళా. వాడు అక్కడ సెల్ లో ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు వాడితో. ఏమైంది?" అని ఓ ప్రశ్న వేసాడు.

మాకు షాకు! "శివ" సినిమా పదకొండు సార్లు చూసిన ప్రభావమో, ఏమో, అంతే, ఆవేశం గా లేచాం "పదండ్రా" అంటూ.

ఈ లోపు "అంకుశం" లో రాజశేఖర్, CI మురళీ ఒకేసారి కనిపించారు కళ్ళ ముందు రౌద్రావతారం లో. ఆవేశం కాస్తా చల్లపడిపోయింది "ప్రత్యేక తెలంగాణా" ఉద్యమం లా.

పిల్లగాళ్ళం, పలుకుబడి లేనోళ్ళం. ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి అని, ముందు మస్తాన్ టీ షాపు కెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాం (మేము సహజం గా ఏ సినిమాకి వెళ్ళాలి, ఇవాళ ఫిజిక్స్ ట్యూషన్ కి వెళ్ళాలా, వద్దా లాంటి పవిత్రమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు, మస్తాన్ టీ సెంటర్ లో కూర్చుని తీసుకునేవాళ్ళం) ఈ లోపు మెస్ లో తెగ మెక్కి తిన్న సోమాలియా అకలి శరణార్థుల బేచ్ కూడా వచ్చారు. ఎవడికి చెప్పాలా, ఎవడ్ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళలా అన్న దాని మీద ఓ గంట, గంటన్నర డిస్కషన్ జరిగిన తరువాత, శివ గాడికి క్లోజ్ అయిన "మేధ్స్" లెక్చరర్ కి చెప్పడం మంచిది అని బయలుదేరాం.

ఈ లోపు సందు చివర లో "Hero jet" సైకిల్ మీద వస్తూ కనిపించాడు మన హీరో!

ఓ సింగిల్ టీ తాగి, (అలసిపోయాడు కదా అని ఫుల్ టీ వాడికే) స్టోరీ చెప్పాడు. చెప్పాను కదా, కాలేజ్ లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అని. CI మురళి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారుట కాపీలు జరగకూడదు అని. అందువల్ల కాలేజ్ చుట్టూ ఓ రెండు పెట్రోలింగ్ వాన్లూ, అక్కడక్కడ మఫ్టీ లో AGS వాళ్ళూ ఉన్నారుట. కాలేజ్ లో పని వున్న వాళ్ళ కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసారుట, నోటీస్ కూడా పెట్టారుట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర "మరి చూడలేదా!?" అంటే, "మనమెప్పుడూ వెళ్ళేది వెనుక నుంచే కదరా, అందుకని కనపడలా" అన్నాడు (నిజమే, షార్ట్ కట్ అని మేము వెనుక ఫెన్సింగ్ తీసేసిన చోట నుండి వచ్చేస్తాం సహజం గా)

అలా వెడుతుంటే, ఈ లోపు అక్కడ కొంత మంది కాపీలు అవీ విసరడం, కిటికీ, దగ్గరికి వెళ్ళి ఆన్సర్ పేపర్లు తీసుకుని, రాసి పైకి పంపడం లాంటివి చేస్తున్నారని తెలియడం తో AGS వాళ్ళు వచ్చేసి క్షణం లో అందరినీ వాన్ ఎక్కించేసారట. "ఏరా మరి చెప్పలేదా నువ్వు సంతకలకి వచ్చా అని, రికార్డ్స్ చూపించకపోయావా?" అంటే, "అదీ అయింది, ఇదో అయిడియానా లోపలకి వెళ్ళీ కాపీలు అందించడానికి?" అని తోసేసారుట వినిపించుకోకుండా!

"సాయంత్రం వరకూ ఉంచి, భయపెట్టి వదిలేసారు!" అన్నాడు నిట్టూరుస్తూ. మాచేత శివ అనీ, బావా అని పిలవబడే వాడు, ఆ రోజు నుండీ, మా క్లాస్ మొత్తానికి మాత్రం "CI మురళి" అయి కూర్చున్నాడు. "ఏరా CI మురళీ" అనేవాళ్ళు.

ఇప్పటికీ మా బేచ్ మేట్స్ ఎక్కడైనా కలిస్తే, వీడి గురించి అడిగేప్పుడు CI మురళి ఇప్పుడు ఏ స్టేషన్ లో (ఏ ఊర్లో) ఉన్నాడు?" అని అడుగుతారు. ఇప్పుడు వాడు విజయవాడ లో పేరుమోసిన రెసిడెన్షియల్ కాలేజ్ లో మేధమేటిక్స్ విభాగం లో సీనియర్ లెక్చరర్.

మరి కొన్ని ఒంగోలు కబుర్లు, మరెప్పుడైనా.

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.