"One-day" మా తరం!! - పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

అది డ్రెస్సింగ్ రూమ్.

"టీమ్ దండగ" కెప్టెన్, కోచ్ రేపు జరగబోయే కీలక మేచ్ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రేపు జరగబోయే మేచ్ లో ఫలితం ప్రతికూలమైతే, టోర్నీ నుండి నిష్క్రమించడం ఖాయం. వాతావరణం వేడెక్కి ఉంది.

"అయితే, టాస్ గెలిస్తే, బేటింగ్ తీసుకుంటానంటావ్, ఎందుకని?" అడిగాడు కోచ్.

"మొన్న ఓడిపోయిన మేచ్ లో ముందు ఫీల్డింగ్ తీసుకున్నాం కాబట్టి" చెప్పాడు వినమ్రం గా కెప్టెన్.

"అంతే కానీ, పిచ్ గురించి ఎలాంటి అంచనా వేయలేదన్నమాట" ఆరా తీసాడు ఆదుర్దాగా.

"స్పిన్ ని నమ్ముకుని సీరిస్, పిచ్ ని నమ్ముకుని మేచ్ లు గెలవడం మానేసి చాలా కాలమైంది" చెప్పాడు కెప్టెన్.

"మరి వాళ్ళు గెలిచి, బేటింగ్ తీసుకుంటేనో?" మార్చాడు తన ప్రశ్న ని కోచ్.

"మీకా భయమేమీ లేదు. వేసే వాడి చెయ్యి ని బట్టి, చూసే వాడి కళ్ళ ని బట్టి చెప్పగలను బొమ్మ పడుతుందో, బొరుసు పడుతుందో, టీమ్ లోకి రాక ముందు, మా ఊళ్ళో నేనే కింగ్ ని ఆ ఆట లో"

"అంటే, అన్నిటికీ ముందే సిద్ధమయ్యావన్న మాట" తల నిటారుగా ఊపుతూ గంభీరం గా చూసాడు కోచ్.

"ఒక్క గెలుపు కి తప్ప" చెప్పాడు చిన్నగా చెవి లో కెప్టెన్.

"సరే, టీమ్ ని సెలెక్ట్ చేద్దామా?" మాట మార్చాడు కెప్టెన్.

"ఈ సారి బఫూన్ బఠాని కి అవకాశం ఇద్దాం. నాకు అతన్ని all-rounder గా చూడాలని కోరిక" చెప్పాడు కోచ్.

"అంటే ఎవరిని తీసేద్దాం?" నొసలు చిట్లించాడు కెప్టెన్.

"ఏముందీ, ఓపెనర్ గా కొండవాగు నిలదొక్కుకోలేకపోతున్నాడు గా అతన్ని తీద్దాం" అన్నాడు.

"అతనికి already జుట్టు ఊడింది, ఇక జట్టు లోంచి కూడా ఊడకొడతారా? నేనొప్పుకోను" అరిచాడు కెప్టెన్.

"ఆఖరి 10 మేచ్ లలోను pavilion నుంచి గ్రౌండ్స్ కీ, గ్రౌండ్స్ నుండి pavilion కీ తిరగడానికి పట్టిన టైము ఎక్కువ క్రీజు లో ఉంది కాసేపే" అరిచాడు కోచ్.

"అతను ఉన్నాడని చెపితేనే చాలు, ఆ టీమ్ వాళ్ళు భయపడతారు. దానితో psychological గా వాళ్ళు సగం ఓడిపోయినట్లే."

"వాళ్ళు భయపడుతున్నారో, లేదో నాకు తెలియదు కానీ, ముందు మన టీమ్ లో సగం మందికి psychological effect. అన్న నడిచెల్తే మాస్, తిరిగొస్తే మటాష్ అంటూ మొన్నటి మేచ్ లో కొండవాగు బేటింగ్ కి వెడుతుంటే మీడియా వాళ్ళు, మన మెంబర్స్ గుసగుసలాడుకోవడం విన్నా" చెప్పాడు కోచ్.

"ఎన్నైనా చెప్పండి, అతను ఈ సారి నా నమ్మకాన్ని నిలబెడతాడు" చెప్పాడు కెప్టెన్.

"సరే, రాంభజన్ ని డ్రాప్ చేద్దాం, కనీసం భజన అయినా చేసుకుని బాగు పడతాడు"

"కుదరదు, లక్ష్మణుడిని ఎలాగూ ఎంపిక చెయ్యనివ్వలేదు మీరు, కనీసం రాముడు కూడా లేకపోతే ఎలా లంక మీద?" చెప్పాడు కెప్టెన్.

"అయితే, నీ quota 2 అయిపోయింది, మునాఫ్ టపేల్ విషయం లో నువ్వేమీ మాట్లాడినా పెడేల్ మని పగులుతుంది నీ బుర్ర వాడు నాకు McGrath లా కనిపిస్తాడు."

"కానీ వాడికి నా ఇష్టమొచ్చినప్పుడే ఇస్తా ఓవర్ లు" కందగడ్డ మొహం వేసుకుని చెప్పాడు కెప్టెన్.

"కౌరవ్ ఈ మధ్య నాతో బానే ఉంటున్నాడు. నిన్న లంచ్ దగ్గర కలసినప్పుడు చేపల పులుసు మొత్తం నాకే వేసాడు. వాడి చేత కూడా 2,3 ఓవర్ లు వేయించు"

అలా కాసేపు ఎవర్నుంచాలి, ఎవర్ని పంచాలి అనే దాని మీద మాటలాడుకుంటుండగా ఫిట్టింగ్ ఫికీ నుండి ఫోన్ వచ్చింది.

"ఈ సారి ఎవరికి పెట్టారు ఫిట్టింగ్?" అడిగాడు కోచ్.

"అది సరే, ఎవరి చేత వేయిస్తున్నావ్ ఫస్ట్ ఓవర్" అడిగాడు ఫిట్టింగ్ ఫికీ.

"మామూలే, ఖాన్ ఖతర్నాక్ వేస్తాడు" చెప్పాడు కెప్టెన్.

"కుదరదు, మార్చు, already అవతల customer కి వేరే విధం గా commit అయ్యాం, అజీర్తి నెగార్కర్ చేత వేయించు."

"ఎవడు వేసినా ఒకటే" గొణుక్కున్నాడు కోచ్ లోపల.

"ఏమన్నారు?" రెట్టించాడు ఫికీ.

"ఖాన్ అయితే నే నయం, నాలుగు పరుగులు ఎక్కువిస్తాడు, మనకే నాలుగు డబ్బులు మిగుల్తాయి కదా అంటున్నా" నసిగాడు కోచ్.

"ప్లాస్టర్-ప్లాస్టర్ ఏ డవున్ లో వస్తున్నాడు?" అడిగాడు ఫికీ.

"470 డవున్ - గుంతకల్లు - గుడ్లవల్లేరు passenger కి" పొరపాటున నోరు జారాడు రైల్వే లో రిటైర్ అయి టీమ్ లో జాయిన్ అయిన కోచ్.

"సారీ, 4th డవున్ లో పంపిద్దామని అనుకుంటున్నామండీ, మీరేమంటారు?" వినయం ప్రర్శించాడు మళ్ళీ.

"200 లోపు టార్గెట్ అయితే అలానే పంపించండి.. ఇంకా పెద్ద టార్గెట్ అయితే, ఎలాగూ అంతా 10,15 ఓవర్ ల లోనే రాక తప్పదు కదా, ఏ డవున్ వచ్చినా ఒకటే"

"మరి నవరాజ్ ని ఎప్పుడు పంపిస్తున్నారు?"

"మనం, నవరాజ్ గురించి రేట్ మాట్లాడుకోలేదు కదండీ, అందుకని మేము చెప్పం" అన్నారిద్దరూ ఒకేసారి.

"సరే, ట్రై చేసి వస్తా అవతల వైపు ఎంత పలుకుతారో ఈ వికెట్ కి" అంటూ మిగిలిన విషయాలు మాట్లాడి లేచిపోయాడు.

మళ్ళీ, ఈ కొత్త మార్పులతో ఆర్డర్ వేసుకుంటుండగా, ISD కాల్ వచ్చింది.

"హల్లో, ఎవరండీ లైన్ లో.." అరిచాడు కెప్టెన్.

"మేము.. గలత్ పవార్, మగ్ మోహన్ మాఫియా, బొంగు సర్కార్"

"చెప్పండి సార్" అలెర్ట్ అయ్యారు కెప్టెన్ / కోచ్.

ఓ పావు గంట తరువాత.. మళ్ళీ కొత్త ఆర్డర్ వేసుకుంటూ కుస్తీ పడ్డారు కోచ్, కెప్టెన్. అలా రేపటి మేచ్ కి టీమ్ దండగ రెడీ అయింది.

ఎవరిని పీకాలి, ఎవరిని నొక్కాలి అనే దానితోనే గడిచిపోయింది వాళ్ళకి ఆ రాత్రంతా, ప్రత్యర్థి టీమ్ ని ఎలా పడెయ్యాలి అని ఆలోచించడానికి తీరిక లేకుండా పోయింది ఇంటి సమస్యలతో.

ఇది ఇలా ఉంటే...

* * *

పక్క డ్రెస్సింగ్ రూమ్ లో...

"ఎప్పుడూ మేచ్ ముందు అవతలి టీమ్ వాళ్ళు ఆడి, అవుట్ అయిన గేమ్స్ తాలూకు కేసెట్స్ చూస్తూ, ప్లాన్ వేస్తుంటారు కదా, ఇలా ఏంటీ అంతా పక్కలు పరుచుకు పడుకుని పేకాట ఆడుకుంటున్నారు పెళ్ళిళ్ళ లో లా?" అడిగాడు విషయం తెలియని విశ్వనాధం.

"రేపటి మేచ్ టీమ్ దండగ తో కదా, ఆ అవసరమే లేదు" వక్కాణించాడు వాసు.

"ఏం ఎందుకని? వాళ్లంతా రికార్డ్ ల రారాజు లే కదా" మళ్ళీ అడిగాడు.

"కాసేపట్లో కోచ్, కెప్టెన్ వస్తారు, అప్పుడు నీకే తెలుస్తుంది చూస్తుండు" అని 3 ముక్కలాట లో మునిగి పోయారు.

కోచ్, కెప్టెన్ సంభాషణ ఇలా సాగింది.

"కౌరవ్ రంగోలి వికెట్ ఎలా తీద్దామని ప్లాన్ చేసారు?"

"మనం ఏం తియ్యక్కర్లేదు సార్, ఆయన వికెట్ ఆయనే ఇచ్చేస్తాడు టైటాన్ వాచ్ చూసుకుని"

"మరి ప్లాస్టర్ - మహా ప్లాస్టర్ సంగతి ఏమిటి?"

"అదీ అంతే సార్ ఇంచుమించుగా, మనమేమీ చెయ్యక్కర్లా ప్రత్యేకించి. వాళ్ళ మీడియా, మేనేజ్ మెంట్, ఆడియన్స్ ముందు రోజు చేసే హడావిడి చాలు మనోడు మెత్తపడిపోవడానికి. మనం జస్ట్ చూస్తూ ఉండటమే.

"మరి great wall గురించి ఏం ఆలోచించారు?"

"బహుశా మీకు తెలియదనుకుంటా వాళ్ళ బ్రిడ్జ్ లు, బిల్డింగ్ లూ ఎంత గట్టిగా ఉంటాయో, ఒక్క బాలు బలం గా వీచిన ఆ వాల్ పని అంతే. నాణ్యత కీ మన్నిక కీ పేరెన్నిక గన్నది అని చెపుతారు కానీ, ఈ మధ్య ఇసకెక్కువ కలుస్తోంది."

"సిక్సర్ల ధోభీ విషయం ఏమిటి? వాడు భలే ఉతుకుతాడట కదా?"

"ఏంటి సార్, బట్టలా?"

"మొన్నటి మేచ్ లో బేటింగ్ కి వెడుతుంటే కోచ్ ముందే వాళ్ళ టీమ్ వాళ్ళు వెక్కిరిస్తున్నారు" క్రాఫు మీద ఉన్న శ్రద్ధ (కెరీర్) గ్రాఫ్ మీద పెట్టు కాస్త" అని

"బావుంది, మరి డాషింగ్ ఓపెనర్ సంగతి?"

"అతనికి ఈ మధ్య బేటింగ్ రాష్ అని కొత్త రకం రాష్ ప్రోబ్లెం వచ్చిందిట బాట్ ఎత్తడానికే భయపడుతున్నాడు. పైపెచ్చు క్రీజ్ దగ్గర గోతులెక్కువ చేస్తున్నాడు అని మొన్ననే వార్నింగ్ కూడా ఇచ్చారు కదా youcc వాళ్ళు.

"well boys, అయితే విజయం మీదే" భుజం తట్టి వెళ్ళిపోయాడు కోచ్.

* * *

మర్నాడు ఆట మొదలయ్యింది.

బొమ్మా - బొరుసూ వేసారు.. అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు టీమ్ దండగ కెప్టెన్. గ్రామీణ ఆటలే దేశానికి పట్టుకొమ్మలు అని మరోసారి నిరూపించాడు.

ఓపెనర్ లు గా ప్లాస్టర్ - ప్లాస్టర్, ఉప్మా ఊతప్పం వచ్చారు.

గ్రౌండ్ లోకి దిగిన వెంటనే ఊతప్పం నలువైపులా పరికించి చూసాడు, కురుక్షేత్రం లా కనపడింది out-field.

"పిచ్ మధ్య కి రమ్మన్నాడు non-striker ప్లాస్టర్ - ప్లాస్టర్ ని. ఇద్దరూ ఏదో సీరియస్ గా మాట్లాడుకోవడం మొదలెట్టారు.

వీళ్ళు మాట్లాడుకోవడం ఆపితే bowl చేద్దమని చూస్తున్నాడు వాసు మాయ్య. "కొంప తీసి నిన్న చెయ్యాల్సిన discussion / planning ఇప్పుడు గానీ పెట్టారా ఏమిటి?" అని బాలు గిల్లుకుంటూ నిలబడ్డాడు.

ఒక్కసారి గా బేట్ పక్కన పడేసి ఊతప్పం, ప్లాస్టర్ - మహా ప్లాస్టర్ ముందు మోకరిల్లాడు పిచ్ మధ్య లో 40 century లూ, 15 వేలకు పైగా పరుగులూ చేసిన ప్లాస్టర్ విశ్వరూపం అతనికి కనపడసాగింది.

"ఆడలేను గురువా! ముత్తయ్యలు, అత్తయ్యలూ, కుమార రత్నాలూ ఉన్న వీళ్ళ మీద ఎలా నా BDM బాట్ ఎత్తగలను?"

"నువ్వు మరీ over action చెయ్యకు, చెప్పు ఎంత పుచ్చుకున్నావ్?" అడిగాడు డబులు ప్లాస్టర్.

"అదేమీ లేదు" అన్నాడు ఆయాసం గా ఉప్మా ఊతప్పం.

"మరి ఈ గోలెందుకు, ఆడలేను అని చెప్పు? అయినా, ఆడేదీ, ఆడించేదీ, గెలిచేదీ, గెలిపించేదీ అంతా ఫిట్టింగ్ ఫికీ లే కదా, వాళ్ళు కాకపోతే కోచో కెప్టెనో! మిగతా 8 మంది మీ నిమిత్త మాతృలం. ఆడతా అనటనికి నువ్వెవడు, ఆడు అనటానికి నేనెవడిని. ఏదో కాసేపు ఇక్కడ గడిపేసి పో, పని అయిపోతుంది" ఉపయోగించాడు తన సుదీర్ఘ అనుభవాన్ని.

"ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారంటే, ఫోర్ ఎలా బాదాలో, సిక్స్ ఎలా బాదాలో చెపుతున్నట్టున్నాడు" కలవర పడ్డాడు కుమార కరకర.

ఈ లోపు డ్రెస్సింగ్ రూమ్ లో...

"కొండవాగు నువ్వు పాడ్ లు కట్టుకుని రెడీ గా ఉండు. next..." చెప్పాడు కెప్టెన్.

"అన్నా, పాడ్ లు ఉతకటానికేసా అన్నా.. లాండ్రీ వాడు ఇంకా కబురుపెట్టలా, తర్వాతెళ్తాలే అన్నా" చెప్పాడు తమ్ముడు.

"సరే, మరి ధోభీ వెడతాడా?" చూసాడు కెప్టెన్ కుర్చీ ఒంక.

"పక్క స్ట్రీట్ లో హెయిర్ డ్రై చేయించుకొస్తా అని వెళ్ళాడన్నా. ఈపాటికి వచ్చేస్తుండాలి" చెప్పాడు రాంభజన్.

విధిలేక తనే పాడ్ లు కట్టుకుని గోడ కు నిలబడ్డాడు "టీమ్ దండగ" కెప్టెన్.

మొత్తానికి అక్కడ పిచ్ లో డిస్కషన్ పూర్తి అయింది.

ఒకొక్క బంతి పడటం, బౌన్స్ అయిన email లా, బాట్లు భుజనేసుకుని వెనక్కి బయలుదేరడం మొదలయ్యింది.

ఎవరూ తమ సూట్ కేసు లు ఎత్తుకుపోతున్నారో అన్నంత ఖంగారు, ఒకటే డ్రెస్సింగ్ రూమ్ వైపు కి batsmen ఒకొక్కరు.

అంతా అవతల టీమ్ అనుకున్నట్టే జరిగింది..

"టీమ్ దండగ" ఓడిపోయింది.

కెప్టెన్ ఎప్పటి లాగానే చెప్పుకుపోతున్నాడు మైక్ ముందు "తన పిల్లలు సరిగ్గా ఆడలేదని, చెప్పిన మాట అస్సలు వినలేదనీ, డ్రింక్స్ టైము లో chocolate ల మీద చూపెట్టిన శ్రద్ధ, వికెట్ ల మీద పెట్టలేదనీ, 3 స్లిప్ లు పెట్టినా కేచ్ లు ఎందుకు స్లిప్ అయ్యాయో అర్థం కాలేదనీ, extra effort పెట్టండ్రా అంటే extra లు ఎక్కువ ఇచ్చారనీ, బేట్స్ మెన్ పూర్తిగా విఫలం చెందారనీ, సింగిల్స్ ఎక్కువ కనపడాలి అంటే అంతా 1 కి అవుటయి వచ్చారనీ, వాళ్ళని అవమానపరచామని, వీళ్ళని నిరాశపరచామనీ, ఇంకొకళ్ళ ని బాధ పెట్టామనీ.." ఏవేవో చెప్పుకుపోయాడు.

ఇక్కడ..

అభిమానుల గుండె బ్రద్దలయ్యింది! ఆక్రోశం తో అవని భగ్గుమంది ఆటగాళ్ళ మితి మీరిన విశ్వాసం, ఆలసత్వం తో కీర్తి పతాకం వెలవెల పోతే, మితి మీరిన అభిమానం వెర్రి తలలు వేసింది. వికృత చేష్టలతో విలయతాండవం చేసింది.

కన్నవాళ్ళు, కట్టుకున్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళూ, తల్లడిల్లిపోయేలా చేసింది.

100 స్కామ్ లో కనిపించని కాలుష్యం, నేతల కోతులకి "ఒక్క రోజు" లో కనపడటం విడ్డూరం!

అలా గల్లి నుండి డిల్లీ దాకా జనవాహిని లో అందరి నోటా వింపించే గీతం అది..

ఆ శక్తే

"one-day" మాతరం!!!

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.