మాట తప్పిన చౌర్యం - బ్రహ్మానందం గొర్తి
ఈ పేజీ ని పంపండి

పొద్దుగాలే లెగాలంటే యాదమ్మ కి భలే చిరాకు. పొద్దుగాలే లేచి "ఏం చెయ్యాలా?" అంటూ దెబ్బలాడేది యాదమ్మ తల్లి తో.

"ఎక్కడయినా కాస్త పనికి పోరాదంటే?" అని యాదమ్మ తల్లి అడిగితే, "ఒళ్ళూ నొప్పనో, కాలి నొప్పనో" తప్పించుకొనేది. "పనికి వెళ్ళవే" అని యాదమ్మ తల్లి మొత్తుకొనేది.

ఇవేం యాదమ్మ కి తలకెక్కేవి కాదు. పోనీ అ మాస్టారు దగ్గరకెళ్ళి ఓ నాలుగు ముక్కలు నేర్చుకుంటుందా అంటే అదీ లేదు. కొత్తలో వెళ్ళేది. చదువు మాట ఎలా వున్నా, యాదమ్మ మాట్లాడే భాష బాగుపడింది. యాస కొంత పోయింది. కొంతకాలం చదువుకెళ్ళి మానేసింది. రోజూ మద్దెనేళకి ఎట్టాగో కష్టపడి తెమిలేది. తెమిలి పనికి పోయేదా అంటే అదేమీలేదు, పనికి రాని పిల్లగాళ్ళతో గోళీలాడేది.

యాదమ్మ కి చేవాటు తనం జాస్తి. ఆట అయ్యేలోగా, నాలుగుపైగా గోళీలు నొక్కేసేది. పిల్లగాళ్ళెవరైనా రెట్టిస్తే నాకే ఎరుకలేదని బుకాయించేది. గట్టిగా గోల చేసేది. ఆడనుండి నేరుగా బజారికి పోయేది. ఎక్కడైనా చిన్నా చితకా దొంగతనాలు చేసేది. దొంగతనం చేయడం లో మాత్రం చానా తెలివిగా మసులుకొనేది. అమాయకం గా చూస్తూ ఎవరికీ అనుమానం రాకుండా కంటికి కనిపించేది నొక్కేసేది. ఈ చిల్లర దొంగతనాలంటే యాదమ్మ కి చానా ఇట్టం. పొద్దుపోయాక ఇంటికెళ్ళేది. ఎక్కడైనా గుంపుగా జనం పోగుబడితే చాలు, యాదమ్మ కి పండగే పండగ.. సందడే సందడి. ఎవ్వరికీ తెల్వకుండా ఆడాళ్ళ మెళ్ళో నగలు, మొగాళ్ళ జేబుల్లో పరసులు, వాళ్ళకేమాత్రం అనుమానం లేకుండా కొట్టేసేది. యాదమ్మ కి కూడా జనాన్ని చూస్తే వీరావేశం వస్తుంది, మన రాజకీయ నాయకులలాగ. అమ్మోరు పూసినట్లవుతుంది.

"యాంటే? ఈ కొత్త సరుకులెక్కడవని" యాదమ్మ తల్లి ప్రశ్నిస్తే, "ఓ, అదా, మాట్టారి గారమ్మాయి ఇచ్చిందనో, ప్రెసిడెంటుగారి ఇంట్లో ఇచ్చా" రనో బొంకేది.

యాదమ్మ తల్లికి తెల్సు, యాదమ్మ కి చేవాటుతనం ఉందని. ఏ అయ్య చేతిలోనో పెడితే, అన్నీ అయే సద్దుకుంటాయి, చిన్నతనం అని చూసీచూడనట్టు మెసిలేది. కానీ యాదమ్మ అలా అనుకునేది కాదు. వయసు పద్దెనిమిదేళ్ళు దాటినా, ఇంకా తను చిన్న పిల్ల అన్నట్టుగానే తిరిగేది పనంటే మా చికాకు, ఒళ్ళు బద్దకం చానా ఎక్కువ ఉంది. కానీ దొంగతనం చేయాలనుకుంటే, చెంగున లేచి లేడి పిల్ల ల పరిగెత్తుతాది. యాదమ్మ తల్లి ఆ ఇంటా, ఈ ఇంటా కూలినాలి చేసేది. తండ్రి యాదమ్మ చిన్నప్పుడే పోయాడు. అందుకే యాదమ్మ ని గట్టిగా నిలేసేవాళ్ళు లేరు.

యాదమ్మ గురించి తల్లి బెంగ పడి, హఠాత్తుగా ఓ రోజు పైలోకాలికెళ్ళి పోయింది. తల్లి పోయినప్పటినుండీ యాదమ్మ కి ఏమీ ఉబుసుపోలేదు. తల్లి పోయిందన్న బాధతో, పొద్దెక్కేవరకూ ఇంట్లోనే గడిపేది. గోళీలాటకి యెల్లడం మానుకుంది. యాదమ్మ తల్లి మిగిల్చిన కొంత డబ్బుతో కొద్ది దినాలు గడిచాయి. పనికి యెలితే కానీ బండి నడవదనిపించింది యాదమ్మ కి. కానీ యాదమ్మ చేవాటుతనం తెలిసి, ఎవరు రానిస్తారు? చచ్చిపోదామనుకుంది. చావడానికి కూడా సత్తా లేక ఒగ్గేసింది - ఆ ప్రయత్నం.

సరిగ్గా ఇలాంటప్పుడే, రిక్షా రాజయ్య తో పరిచయం పెరిగింది. రాజయ్య కి యాదమ్మ గురించి అంతా తెలుసు. తల్లి పోయాక వచ్చిపోయేవాడు. ముందాస్తుగా యాదమ్మ "ఏంది.. ఈడెవరు?" అనుకునేది. ఓ రోజు యాదమ్మ కి జొరం వస్తే, రాజయ్యే డాక్టరు కి చూపించి, సూది మందిప్పించాడు. ఆ రోజుకాడనుండి, యాదమ్మ కి రాజయ్యంటే కాసింత నమ్మకం, చనువు ఏర్పడింది. రోజులు గడుస్తున్నాయి, యాదమ్మ కి ఎక్కడా పని దొరకలేదు. దొరకలేదనే కన్నా, యాదమ్మే సరిగా యెతకలేదు. రాజయ్య సాయం చేయడానికి ప్రయత్నించాడు. అందరు యాదమ్మ దొంగబుద్ధి గురించే చెప్పారు.

రాజయ్య ఇదే విషయం యాదమ్మ చెవినేసాడు. "ఏందుకే, ఈ దొంగతనాలు? బుద్ధి గా ఉంటే, ఈ మగరాజయినా కాసింత పని ఇత్తాడు కదా? ఈ రకం గా ఉంటే, ఏ మగాడైనా మనువాడతాదా?"

"ఏం? ఎవడూ లేకపోతే నువు లేవా?" అని యాచికాలాడేది.

"నువ్విలా ఉంటే, నేనే కాదు, ఎవ్వడూ నిన్ను రానీయడు. ఏమే - యాది! ఈ చిల్లర దొంగతనాలు మాని బుద్ధిగా పని చేసుకోవచ్చుకదే? పై లోకాల్లో ఉన్న మీ యమ్మ కూడా సంతోసిస్తాది." నచ్చచెప్పడానికి ప్రయత్నించేవాడు రాజయ్య.

"నాకు మాత్రం మంచిగ పని చేసుకోవాలనుండదా, ఏం? ఏదైనా కొత్తది చూస్తే, చేతులు దురద పెట్టేస్తాయి. నాకు తెలీకుండానే, చటుక్కున లాగేస్తా! మానేస్తాలే, మెల్ల మెల్లగా!" గోముగా గారాలు పోయేది యాదమ్మ.

"ఎప్పుడోకాదే, ఈ దినం నుండే, కాదు కాదు, ఈ చణం నుండే నువ్వు మానేయాల! ఇంకెప్పుడైనా దొంగతనం చేస్తే చచ్చిన నా మీద ఒట్టే!"

"ఒట్టెందుకు, మానేస్తాలే. అయినా, మానేస్తే, నువ్వు మనువాడతావా ఏంటి?"

"నువ్వు నిజంగా దొంగతనాలు మానేస్తే, సత్తెపెమాణికంగా నిన్ను మనువాడతా! మరల ఆ దొంగతనాల జోలికి పోనని నా మీద ఒట్టేసి చెప్పు!" రాజయ్య గట్టిగా చెప్పాడు.

యాదమ్మ ఆ మాటలకి సంతోసం గా అరిచింది. ఇది కలా నిజమా అన్నట్టు చూసింది. ఎవరూ లేని జీవితానికి తోడు దొరికినందుకు ఆనందించింది. ఆ రోజు నుండి దొంగతనాలు మానేయాలని ఒట్టు పెట్టుకుంది. రాజయ్య మీద ఒట్టేసి మరీ చెప్పింది, "దొంగతనాలు మానుకుంటా" అని.

ఆ తరువాత నుండి, యాదమ్మ రాజయ్యకి వచ్చీరాని వంట తో వండి పెట్టేది. మొదట్లో కట్టం గా ఉన్న, రాను రాను యాదమ్మ వంట కి అలవాటు పడ్డాడు. రోజూ రాజయ్య రిచ్చానడిపి కొంత ఇంటి కర్చు కని యాదమ్మ కిచ్చేవాడు. యాదమ్మ ని వచ్చే మాగమాసం లో మనువాడతానన్నాడు. మెల్లగా యాదమ్మ రాజయ్య ఇంటికి మకాం మార్చేసింది. ఓ రోజు, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. బజారుకని యాదమ్మ సంచీ తో బయల్దేరింది. ముందాస్తుగా కూరలు కొంది, కొద్దిగా చేపలు తినాలనిపించి, పాత బజార్ వైపుగా చేపల బజారుకెల్లింది. బజారు చేరుతుండగా అక్కడ ఓ పెద్ద గుంపు అక్కడ యాక్సిడెంటు జరిగింది. జనం గుమిగూడారు. ఆడా, మగా జనం తోసుకుంటూ ముందుకెళ్ళి చూస్తున్నారు. యాదమ్మ కి జనాన్ని చూడగానే, చేతులు దురద పెట్టాయి. ఇదే అదని, నాలుగైదు నొక్కేయచ్చు అనుకుంది. కనీ రాజయ్య కిచ్చిన మాట గురుతుకొచ్చింది. ఇదే ఆకరుసారి. ఇంకెప్పుడూ చెయ్యనని రాజయ్యని బతిమాలచ్చనుకుంది. అంతే, ఇవ్వరికీ తెలియకుండా నాలుగైదు బంగారు గొలుసులు ఆడాళ్ళ మెళ్ళో నుండి చరుక్కున లాగేసింది. అంతే కాదు, ఓ రెండు మూడు పరసులు కొట్టేసింది.

యాదమ్మ ఆనందానికి అంత్ లేదు. ఇంతగా తనెప్పుడూ దొంగతనం చేయలేదు. ఈ రోజు వేలావిశేషం అటువంటీంది. యాదమ్మ కి ఇన్ని బంగారు నగలు దొంగతనం చేయడం ఇదే మొదటిసారి. దొబ్బినవన్నీ సంచీ లో వేసింది. దూరం గా పోలీసుని చూసేసరికి యాదమ్మ కి కొంచెం భయమేసింది. ఇంక చాలు అనుకుంటూ, ఆ గుంపు లోంచి తోసుకుంటూ బయటకొస్తూ ఒక్క సారి తలతిప్పి చూసి అవాక్కయి, నోట మాట లేదు.. రక్తపు మడుగు లో రాజయ్య.. దూరం గా అతని రిచ్చా పిప్పై పడున్నాయి. యాదమ్మ చేయి పట్టు సడలితే, రాజయ్య కి చేసిన ఒట్టు రాజయ్య నే పట్టుకుపోయింది.

* * End * *

మీ సలహాలు, అభిప్రాయాలూ రచయిత బ్రహ్మానందం గొర్తి కి తెలియచేయండి.