జీవిత ఖైదీ: మొదటి భాగం - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి

రెండవ భాగం
పొద్దుట నుంచీ.. కాదు.. నిన్న రాత్రి రమణ ఆ విషయం చెప్పినప్పటి నుంచీ జానకి మనసు మనసు లో లేదు. ఏమి చేయటానికి తోచక కల్పించుకొని ఆ పనీ ఈ పనీ చేస్తోంది. చేతిలో వున్న జంతికల గొట్టాన్ని కసి గా నొక్కింది. చేతులు నొప్పి పెట్టేలా!

అంటే ఏమిటి రమణ ఉద్దేశం? ఎంత తేలిగ్గా అనేసాడు! "నన్ను నమ్ముకొని వచ్చింది. సరిత కి అన్యాయం చేయలేను!" అంటే? నా మాట ఏమిటీ?

కలలో అయినా కోరుకోనంత మంచి భర్త ని ఇచ్చినందుకు ఇంకా దేవుళ్ళ మొక్కులు కూడ తీర్చలేదు! ఇంతలో ఇదేమిటీ?

రమణ మంచి భర్తే అందులో అనుమానం లేదు. కానీ అతను.. వేరే కొత్తగా పెళ్ళయిన వాళ్ళ లాగ తనని ప్రేమలో ముంచకపోయినా తనని అర్థం చేసుకున్నవాడు. తన ఇష్టాయిష్టాలు తెలుసుకొని తనని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడు. తన అభిప్రాయాలకి విలువ ఇచ్చేవాడు. కానీ ఎప్పుడూ తనతో ప్రేమ ని వ్యక్తపరచటం, చిలిపి గా చనువు గా వుండటం లాంటివి చేయలేదు. తను కొంచెం నిరాశ పడినా అతనూ సిగ్గరి అని తెలియటం వలన పెద్దగా ఫీల్ అవలేదు. అతను నిన్న రాత్రి చెప్పినదాన్ని బట్టి తనని ఒక బాధ్యత గా తల్లి బలవంతం వలన పెళ్ళి చేసుకున్నాడు తప్ప ప్రేమతో, తనంటే ఇష్టం తో కాదు అన్నమాట! ఇది తెలిసాక తను అతనితో తన మిగిలిన జీవితం గడపగలదా?

* * *

రమణ తో జానకి పెళ్ళి అయి మూడు నెలలౌ అయింది.

వారం రోజుల క్రితం రమణ కొలిగ్ వినోద్ ఇంటికి భోజనానికి వెళ్ళినపుడు అతను అడిగాడు రమణ ని.. "మీ పెళ్ళి అయి 100 రోజులు అవుతోంది కదా ఏం చేస్తున్నారు?" అని.

"దానికి రమణ 100 రోజుల పండగ చేసుకోవటానికి ఇదేమన్నా సినిమానా?" అన్నాడు వేళాకోళం గా. కానీ దానికి జానకి చిన్నబుచ్చుకోవటం గమనించాడు. తన తప్పు తెలుసుకున్నట్టు మర్నాడు సాయంత్రం తను వచ్చేసరికి తయారుగా వుండమని చెప్పాడు.

"ఎందుకు?" అడిగింది జానకి.

"సాయంత్రం బజారుకి వెళదాం".

"దేనికి? నిన్న వినోద్ అన్నాడనా? ఇప్పుడు ఎందుకూ వద్దు." అంది బిడియం గా.

"అదేం లేదు. నీకో సర్ ప్రైస్." ఊరిస్తున్నట్టుగా అన్నాడు.

మరింకేమీ ఎదురు చెప్పలేదు. రమణ ఈ కొత్త రూపం కొత్తగా.. బాగుంది.

* * *

బజారుకి వెళ్ళటానికి తను చీర మార్చుకుంటోంది. రమణ ఆఫీస్ నుండి వచ్చి స్నానం చేస్తున్నాడు. ఇంతలో డోర్ బెల్ మ్రోగింది.

"ఇప్పుడెవరబ్బా.. సరిగ్గా సమయానికి?" అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.

బయట.. తన వయసే వుంటుంది. చేతిలో సూట్ కేస్ తో వుంది ఒక అమ్మాయి. "రమణ వున్నారా?" అని అడిగింది.

"ఆ వున్నారు. రండి. మీరూ...." ఏమి అడగాలో తెలియక మధ్యలోనే వాక్యాన్ని ఆపేసింది జానకి.

"నా పేరు సరిత. నేను రమణ తో కలిసి Z-Tech లో పని చేసాను." జానకి పూర్తి చేయని ప్రశ్నకి సమాధానం ఆమె ఇచ్చింది.

"ఆయన స్నానం చేస్తున్నారు. మీరు కూర్చోండి." ఆమెకి దారి ఇస్తూ పక్కకి తొలగింది.

బాత్ రూం తలుపు మీద చిన్నగా తట్టి చెప్పింది. "సరిత గారట! వచ్చారు. త్వరగా రండి." అని.

ఎప్పుడూ అరగంట కి తక్కువ చేయని స్నానం అయిదు నిముషాలలో ముగించి బయటకి వచ్చాడు అలా తువ్వాలు తోనే హాల్ లోకి వెళ్ళబోయి, అంతలోనే "చా.." అనుకొంటూ బెడ్ రూం లోకి వెళ్ళి బట్టలు వేసుకొని, ఖంగారుగా వచ్చాడు. "జానకీ.. సరిత Z-Tech లో నా సీనియర్. సరితా.. తిను జానకి.. నా భార్య." పరిచయాలు చేసాడు.

"మీరు ఇంకా అక్కడే చేస్తున్నారా?" అడిగింది జానకి.

"లేదు. నా తరువాత తను కూడా అక్కడ మానేసింది. వాళ్ళాయన గ్రాఫిక్ డిజైన్ కంపెనీ లోనే పని చేస్తోంది తను ఇప్పుడు." సమాధానం చెప్పాడు రమణ.

"నేను, రమణా చాలా ప్రోజెక్ట్ లకి కలసి పని చేసాము." చెప్పింది సరిత.

మొదటసారి రమణ మాటల్లో, చేతల్లో ఒక రకమైన excitement ని చూసి అనుకుంది జానకి "ఎవరబ్బా ఈమె? ఇంత ఖంగారు పడిపోతున్నారు!?" అని.

ఆమె చిన్నగా ఏదో చెపుతోంది. రమణ లోపలికి వచ్చి అన్నాడు "జానకీ నువ్వు వెళ్ళు బజారుకి. నీ కార్డ్ తో పేచేసేయి."

"పర్లేదు లెండి. మరోసారి వెళదాం లెండి." నిరాశ పైకి కనపడనీయకుండా అంది.

"లేదు, నేను సరితా కొంచెం పని వుంది బయటకి వెళ్ళుతున్నాం. నువ్వు వెళ్ళు. మేము వచ్చేసరికి నీకు ఆలశ్యం అవుతుందేమో. మళ్ళి మనకి వచ్చే వారం వరకూ వెళ్ళటం కుదరదు."

"పర్లేదు. నేను ఒక్కదానిని వెళ్ళను." ఒక రకమైన స్థిరత్వం ధ్వనిస్తూ అంది జానకి.

"సరే అయితే. నువ్వు భోజనం చేసేయి. మా గురించి వెయిట్ చేయకు." షూస్ వేసుకుంటూ అన్నాడు.

* * *

పది గంటలయినా వాళ్ళు రాకపోయేసరికి అన్నీ టేబుల్ మీద సర్ది, ఆమె కోసం గెస్ట్ బెడ్ రూం మంచం మీద షీట్ మార్చి పడుకుంది అభోజనం గా. వాళ్ళు వచ్చేసరికి దాదాపు పదకొండు గంటలు అయింది.

"కాళ్ళు చేతులూ కడుగుకొని రండి. వడ్డించేస్తాను." అంది బట్టలు మార్చుకోవటానికి బెడ్ రూం లోకి వచ్చిన రమణ తో.

"లేదు జానకీ.. మేము బయట తినేసాము. సరిత ఏమీ తినలేదని చెప్తే టిఫిన్ చేసాము. ఇంక ఆకలి లేదు. తను కూడా ఆకలి లేదు అంది. కొంచెం ఒళ్ళు నొప్పులూ జ్వరం వచ్చేట్టు వుంది అంటోంది. నువ్వు తిన్నావా?"

"లేదు." ముభావం గా జవాబిచ్చింది.

"తినేయమన్నాను కదా? మరి లే.. లేచి తినేసేయి.. చాలా ఆలస్యం అయిపోయింది." దగ్గరకి వస్తూ అన్నాడు.

"ఆకలి లేదు. కొంచెం తలనొప్పి కూడా వుంది."

"సరే అయితే. పడుకో. టాబ్లెట్ తెచ్చివ్వనా? టేబుల్ మీద అన్నీ నేను సర్దేస్తాను లే. పాలు ఏమన్నా తాగావా? తీసుకురానా?" తన జవాబు మరి విన్నడో వినాలనుకోలేదో.. ఆ ప్రశ్న అడుగుతూ బయటకి వెళ్ళిపోయాడు. అయినా అతనికి వినపడేలా జవాబు ఇచ్చింది. "ఆకలి వేస్తే లేచి తాగుతాను లెండి." కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీరు అతను తిరిగి వస్తే అతని కంట పడకూడదు అని లైటు తీసేసింది.

రెండు నిమిషాల్లో తిరిగి లోపలికి వచ్చి పక్కన పడుకున్నాడు.

మంచం మీద ఒత్తిడి కి కొంచెం అటూ ఇటూ కదిలిన జానకి ఇంకా మెళకువగానే వుందని గ్రహించి అన్నాడు.. "సరిత కొన్నాళ్ళు మన ఇంటి లోనే వుంటుంది."

ఆమె ఎవరు? తమ ఇంట్లో ఎందుకు వుంటుంది? తమ ఇంటికి వచ్చి వుండేంత ఏమిటీ వాళ్ళ పరిచయం? ఆలోచనలతో నిజం గానే తలనొప్పి వచ్చింది జానకి కి.

* * *

"పోనీ నేను శలవ పెట్టనా?" రమణ బాక్స్ సర్దుతూ అడిగింది జానకి.

"ఒద్దులే. నేను వీలయితే ఇవాళ కొంచెం త్వరగా వచ్చేస్తాను." టై కట్టుకుంటూ అన్నాడు రమణ.

తమ పెళ్ళయిన ఇన్నాళ్ళలో కనీసం ఒక్కరోజు.. తన పుట్టినరోజు నాడు కూడా త్వరగా రాలేదు. అప్రయత్నం గానే గుర్తొచ్చింది జానకి కి.

* * *

సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి రమణ, సరిత ఇద్దరూ హాల్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. "తను ఏమయినా తిన్నారా?" అడిగింది రమణ ని. "ఎట్లా వుంది మీ జ్వరం?" అని సరిత ని పలకరించింది.

"బాగానే వుంది." నవ్వుతూ జవాబిచ్చారు ఆమె. బాగా ఏడ్చినట్టు ఆమె కళ్ళు ఎఋఋఅగా వాచి వున్నాయి.

"డాక్టర్ దగ్గరకి వెళ్ళారా?" అడిగింది.

"అబ్బా.. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ఉన్నారు కదా!? టాబ్లెట్ వేసుకున్నాను కదా.. తగ్గిపోతుంది." డిస్మిసీవ్ గా అంది సరిత.

వంట త్వరత్వరగా పూర్తి చేసి సరిత చేత బలవంతం గానే తినిపించారు ఇద్దరూ. సరిత పడుకున్న కొద్ది సేపటికి ఆమె గది లో మంచినీళ్ళు పెట్టలేదని గుర్తు వచ్చి జానకి మంచి నీళ్ళు తీసుకుని వెళ్ళింది. అప్పటికే మంచి నిద్ర లో వుంది సరిత. లేఇటు ఆర్పటం మర్చిపోయారో లేక లైటు తో పడుకోవటం అలవాటో! బాగా ఏడ్చినట్టు ఆమె బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపించాయి.

"పాపం ఏం కష్టం వచ్చిందో!?" అనుకుంది జాలిగా ఎక్కడో పక్కకి తిరుగుతున్న ఫాన్ ని ఆమెకి తగిలేట్టు తిప్పుతూ.

జానకి కోసం ఎదురు చూస్తున్న రమణ బెడ్ రూం లోకి తను రాగానే అన్నాడు. "నీకు సరిత గురించి చాలా అనుమానాలు ఉండి వుంటాయి. అన్నీ నీకు వివరం గా చెప్తాను. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్." తను చెప్పేది అయిపోయినట్టు అటు వైపు తిరిగి పడుకున్నాడు.

జానకి కూడా మౌనం గా రాని నిద్ర ని ఆహ్వానించింది.

* * *

నేను నా కెరీర్ ని Z-Tech లో ప్రొగ్రామర్ గా మొదలు పెట్టాను. అక్కడ సరిత అప్పటికే గ్రాఫిక్ డిజైనర్ గా ఎస్టాబ్లిష్ అయింది. మేమిద్దరం మొదటి సారి చేసిన ప్రోజెక్ట్ చాలా మంచిది. సరిత, నేను చాలా విషయాలలో వాదించుకునేవాళ్ళం. ఆమె నా నిర్ణయాలని తప్పని చాలా సార్లు చెప్పటం, నేను ఏది ఎలా చేయాలో చెప్పటం నా ఈగో ని చాలా సార్లు దెబ్బ తీసింది. కానీ చాలా సార్లు ఆమె అభిప్రాయాలనే మా టీం గౌరవించేది. ఈ విషయం లో నేను ఇంకా కొంచెం ప్రొఫెషనల్ గా ఎదగాలని తెలుసు. అయినా కెరీర్ మొదట్లోనే అమ్మాయి చేతిలో ఓడిపోయినట్టు ఫీల్ అయేవాడీని. మా ప్రోజెక్ట్ వలన మా కంపెనీ కి మంచి పేరు వచ్చింది. దానితో తరువాత మేమిద్దరం కలిసి చాలా ప్రోజెక్ట్ లు చేసాము. ఆమె లోని ఎన్నో విషయాలు నన్ను అబ్బురపరిచేవి. ఆమె చెప్తున్నప్పుడు చెత్త గా అనిపించిన అయిడియాలే పూర్తి అయ్యాక అద్భుతం గా అనిపించేవి. చిన్న చిన్న పాయింట్ లు కూడా అశ్రద్ధ చేయకుండా నిశితంగా గమనిస్తూ పూర్తి గా perfect గా తీర్చిదిద్దేది. మమ్మల్ని కూడా అలా expect చేసు తను satisfy అయేదాకా ఒదిలేది కాదు.

కలిసి పని చేస్తున్నప్పుడు ఇద్దరం ఎక్కువ కలసి గడిపేవాళ్ళం. మిగిలిన టీం మెంబర్లు వున్నా మేమిద్దరం ఎక్కువ దగ్గర అయ్యాం. ఒక రోజు తను చెప్పింది. తన పెళ్ళి కుదిరింది.. అతను కూడా తన ఫీల్డ్ లోనే వున్నాడట. అతనికి స్వంత కంపెనీ వుందట. ఈమె కూడా ఇక్కడ ఉద్యోగం మానేసి అందులో చేరుతుందట.

నా మనసంతా అదోలా అయిపోయింది. మొదట తనని మిస్ అవుతాను ఒక కొలీగ్ గా అనుకున్నాను. కానీ ఇంకా ఎక్కువే ఆమెని మిస్ అవుతానని కొద్ది గంటలలోనే తెలుసుకున్నాను. ఆమె నాకు ఒక కొలీగ్ కన్నా చాలా ఎక్కువే అని తెలుసుకుని, చాలా ఇబ్బంది పడ్డాను. నా మనసు కోరుతున్నదానిని అర్థం చేసుకొని!

నేను నా కెరీర్ స్టార్టింగ్ పాయింట్ లో వున్నాను. ఆమె నా కన్నా మంచి పొజిషన్ లో వుంది. అంత కన్నా ముఖ్యం గా నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోలేను. సరిగ్గా సెటిల్ అవకుండా! ఆమె పెళ్ళి చేసుకుంటున్న అతను నా కన్నా మంచి పొజిషన్ లో వున్నాడు.

ఇన్ని ఆలోచించి నా మనసు ని కంట్రోల్ చేసుకోవటం మినహా వేరే దారి లేదనుకున్నాను. నేను నా మనసు తో ఒక యుద్ధమే చేసాను. కానీ సరిత తో కలిసి రోజుకి అయిదు గంటల దగ్గరకి గడుపుతూ నన్ను నేను సంభాళించుకోవటం కష్టం అని తెలుసుకొని నన్ను వేరే టీం లోకి మార్చమని మా బాస్ ని అడిగాను. అది తెలిసి నాతో దెబ్బలాడటానికి వచ్చింది సరిత.

ఎందుకు చెప్పానో.. చెప్పాను. "అవును నువ్వు దూరం అవుతావని తెలిసీ నీతో కలిసి పని చేసి, మళ్ళీ నువ్వు రేపు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే బాధ పడటం ఎందుకూ ఇన్ని బాధలు? అందుకే ఇప్పటినుండీ దూరం గా వుండి లేని పోని ఆశలు పెట్టుకోకుండా పని చేసుకుందామని టీం మార్పించుకున్నాను."

ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కానీ వెంటనే అనిపించింది. "చా.. అనవసరం గా బయట పడిపోయాను. రేపటి నుంచీ ఇంక తన మొఖం కూడా చూపించదేమో!?"

మర్నాడు సరిత కాంటీన్ లో నా దగ్గరకి వచ్చింది. "నేను ఈ పెళ్ళి చేసుకోలేను రమణా.. నీకు నేను అంటే ఇంటరెస్ట్ లేదేమో అని పెళ్ళికి ఒప్పుకున్నాను. నీకు కూడా నేనంటే ఇష్టమని తెలిసాక ఇంక ఈ పెళ్ళి ఎలా చేసుకోను?"

ఆమెకి నచ్చచెప్పటం నా ఒంతు అయింది. పెళ్ళికి ఏమో ఇంట్లో అన్ని ఎర్పాట్లూ పూర్తి చేసుకున్నాక ఇలా చేయకూడదు. అయినా నేను పెళ్ళి అప్పుడే చేసుకోలేను. నా కోసం నిన్ను రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయమనలేను. ప్రాక్టికల్ గా ఆలోచించు అని ఆమెకి నచ్చ చెప్పచూసాను.
రెండవ భాగం

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.