దండం దశగుణం భవేత్- JUBV ప్రసాద్
ఈ పేజీ ని పంపండి

డీలాగా మొఖం పెట్టుకున్న శిష్యుడిని చూసి గురువుగారికి జాలి వేసింది.

"ఏం శిష్యా? ఏం జరిగింది?" అనునయం గా అడిగారు.

"ఏం చెప్పమంటారు గురువుగారూ.. పిల్లాడు అస్సలు సరిగా చదవటం లేదు. చెప్పిన మాటా వినటం లేదు. ఈ రోజు గట్టిగా తందామని ఆలోచిస్తున్నా" అన్నాడు దిగులుగా.

"నువ్వలా చెయ్యబోయే ముందర నేను చెప్పే కధలు విను" అంటూ గురువుగారు చెప్పసాగారు.

* * *

పంతొమ్మిది వందల నలభయ్యవ దశాబ్దం లో జరిగింది ఈ కధ..

వెంకట్రావు పిల్లి లా దొడ్డి గుమ్మం లోంచి ఇంట్లోకి వెళ్ళాడు చీకటి పడ్డాక. వాడి కోసం అక్కడే కాచుకుని ఉన్న వాడి నాయనమ్మ వాడిని లోపలికి తీసికెళ్ళి, ఎవరూ చూడకుండా అన్నం పెట్టింది. వాడు అన్నం తింటున్నంతసేపూ నీతి బోధలు చేస్తూనే ఉంది.

"ఎందుకురా మీ అమ్మా, నాన్నల మాట వినకుండా ఇలా చేస్తావు? వాళ్ళ చేత తిట్లు తినడం నీకేం బాగుంది? అందరు పిల్లల్లా ఉండకూడదురా?" అంటూ కూరన్నం లో ఇంకాస్త నెయ్యి వేసింది నాయనమ్మ.

"నీకర్థం కాదే నాయనమ్మా! ఆ స్కూలు లెక్కల మేష్టారిని చూస్తేనే నాకు భయం. తప్పొస్తే కొడతాడు. కొట్టిన కొద్దీ తప్పులొస్తాయి. ఇంక ఇంగ్లీషు మాష్టారి సంగతి చెప్పక్కర్లేదు. తప్పొస్తే చాలు చెయ్యి వెనక్కి తిప్పమని వేళ్ళ మీద కర్ర తో కొట్టేస్తాడు. ఆ వెధవ స్కూలికి నేనింక వెళ్ళనే" అన్నాడు వెంకట్రావు కూరన్నం మళ్ళీ కలుపుకుంటూ.

ఆ ముసలావిడకి ఏమనాలో తోచలేదు. ఆవిడెప్పుడన్నా స్కూలికెళితే గా జీవితం లో!

"కొట్టకుండా పిల్లలకి పాఠాలు చెప్పడం ఎప్పటికొస్తుందో వీళ్ళకి" అని నిట్టూర్చింది.

వెంకట్రావు అవడానికి పధ్నాలుగేళ్ళ కుర్రాడయినా, ఇంకా ఆరో క్లాసులోనే ఉన్నాడు. వాడికి సరిగా చదువంటలేదు. దానికి తోడు కొట్టే టీచర్లు. దాంతో స్కూలికెళ్ళడం మానేశాడు. పగలంతా ఊళ్ళో బలాదూరు తిరిగి, చీకటి పడ్డాక కొంప చేరుతాడు. నాయనమ్మ కి వాడంటే ప్రాణం. వాడినెలాగో కాపాడుకుంటూ వస్తోంది. వెంకట్రావు తండ్రి అంటే ఇంట్లో అందరికీ దడే.

* * *

తండ్రి పెద్దగా పెట్టిన కేకలు విని ఉలిక్కిపడి లేచాడు వెంకట్రావు నిద్ర.

కళ్ళు నలుపుకుంటూ సావిట్లోకి వచ్చాడు. అక్కడున్న ఇంగ్లీషు మాష్టారినీ, కోపంగా ఉన్న తండ్రినీ చూసాడు. వెంటనే గతుక్కుమన్నాడు. గుండెలు జారిపోయాయి.

"ఎన్నాళ్ళ నిండి జరుగుతోందిరా ఇది?" గట్టిగా కేకలేసాడు తండ్రి.

వెంకట్రావు మాట్లాడలేదు.

"ఇప్పటికి మూడు వారాలపైనే అయిందండీ స్కూలికి వచ్చి. మొదట్లో వంట్లో బాగుండలేదేమో అనుకున్నము. హెడ్మాష్టారు కనుక్కురమ్మంటే వచ్చాను" సాగదీస్తూ చెప్పాడు ఇంగ్లీషు మాష్టారు.

తల్లి వైపు జాలిగా చూసాడు వెంకట్రావు కాపాడమని. ఆ తల్లి కూడా ఓ మూర్ఖురాలు.

"మాకు తెలియకుండా ఇలా వెధవ తిరుగుళ్ళు తిరుగుతున్నావుట్రా?" అని తిట్టింది.

నాయనమ్మ ఎక్కడో వంటింట్లో ఉంది.

ధైర్యం చేసి, "ఆ వెధవ స్కూలికి నేనింక వెళ్ళను" అని చెప్పేసాడు వెంకట్రావు.

"ఉరుకుంటారేమండీ? రెండు తగిలించడి వెధవని" ఎగదోసాడు ఇంగ్లీషు మాష్టారు.

తండ్రి ఉగ్రం తో వెంకట్రావుని పెరట్లోకి ఊడ్చుకెళ్ళాడు. అక్కడ వాడిని చెట్టుకి కట్టేసి, చేంతాడు తీసుకుని కొట్టసాగాడు. వాడు పెట్టిన కేకలకి వాడి నాయనమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. కొడుకుని ఒక్క తోపు పక్కకి తోసి పిల్లాడిని దగ్గరకి తీసుకుంది.

ఆ రాత్రే వెంకట్రావు ఇంట్లోంచి పారిపోయి, దూరం గా ఉన్న వేరే ఊళ్ళోని హోటల్లో కప్పులు కడిగే పనికి చేరాడు.

* * *

పంతొమ్మిది వందల ఎనభయ్యవ దశాబ్దం లో జరిగింది ఈ కధ.

ఆ రోజు వినాయక చవితి.

ఆ ఊళ్ళో, ఆ నాలుగు సందులూ ఉన్న పేట కి బ్రాహ్మణవాడ అని పేరు. ఏ ఒక్క ఇంటివారూ ఆ పేట లో బ్రాహ్మణులు కాని వారికి ఇల్లు అద్దెకివ్వరు. ప్రతీ ఇంటి గుమ్మానికీ మామిడాకులు కట్టారు. గుమ్మాలకు పసుపు పూసి బొట్లు పెట్టారు. ఆ ఇళ్ళలో ఎవరు కొత్త బట్టలు కట్టుకోలేదు. పూజ అయి, భోజనాలు అయ్యాక కొత్తబట్టలు కట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్పడం వల్ల పిల్లలంతా కళ్ళల్లో ఆశలు నింపుకొని, పెద్దవాళ్ళు చెప్పినట్టు మడిబట్టలు కట్టుకొని, పూజ కోసం ఏర్పాట్లు, కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నారు. పెద్ద ఆడవాళ్ళు పెద్ద మడి కట్టుకుని ఉండ్రాళ్ళు, జిల్లేడు కాయలూ, ఇంకా చాలా రకాల వంటలతో సతమతమయిపోతూ ఉన్నారు. పెద్ద మగాళ్ళు పొద్దున్నించే కాఫీ దిక్కు లేకుండా, ఎప్పుడీ వంటలయి పూజలవుతాయా, ఇంత ఎంగిలి పడచ్చు అనుకుంటూ నీరసంగా పిల్లలకి పూజ ఏర్పాట్లలో సలహాలు ఇస్తున్నారు.

మొత్తానికి ఆ ఇళ్ళన్నీ పండగ సందడి లో మునిగిపోయాయి.

సూర్యం వాళ్ళ ఇంట్లో కూడా సందడి గానే ఉంది. కానీ అందరూ చాలా సీరియస్ గా గొడవలు పడుతుండటం వల్ల వచ్చిన సందడి మాత్రమే అది.

"చెప్పిన మాట వింటావా? వినవా?" గట్టిగా గద్దిస్తూ అడిగాడు సూర్యం తండ్రి.

సూర్యం మాట్లాడలేదు. సూర్యం తల్లి భయం భయం గా చుస్తోంది.

"మొక్క గా ఉన్నప్పుడే లొంగని వీడు, మానయ్యాక వంగుతాడా?" అంటూ దీర్ఘం తీసింది మేనత్త.

ఆ మేనత్త మొగుడు పోవటం వల్ల సూర్యం పుట్టక ముందర నుంచే తమ్ముడి పంచన చేరి బ్రతుకు వెళ్ళబుచ్చుతోంది. ఆడపడుచు మాటలకి సూర్యం తల్లికి కష్టం వేసింది. గొడ్రాలికేం తెలుస్తుంది పిల్లల కష్టం అని అనుకుంది ఆవిడ. ఏమీ మాట్లాడకుండా తన మనసులోనే ఇష్టదైవాలని ప్రార్థించుకుంటోంది. ఆవిడకీ సూర్యం తండ్రి అంటే భయమే మరి!

ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలంటే ఇంతకు ముందర కొన్ని నెలలుగా జరుగుతోన్న విషయాలని తెలుసుకోవాలి ముందర.

సూర్యం చిన్నప్పటినుంచీ తల్లి, తండ్రి, మేనత్తల దగ్గర నుంచి నేర్చుకున్న భక్తి తో పెరిగాడు. సూర్యం అన్నయ్య కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచేవాడు. సూర్యం తండ్రి ఆ ఊరికి కరణం. అతని భక్తినిష్టలకి ఆ బ్రాహ్మణవాడలో ఎంతో గౌరవం దొరుకుతూ ఉంటుంది. సూర్యం రోజూ పొద్దున్నే లేచి, స్నానం చేసి హనుమాన్ చాలీసా చదవనిదే పాలు కూడా తాగేవాడు కాదు. తల్లికి జాలేసి, "పోనీ, పాలు తాగి పారాయణం చేసుకోకూడదురా" అనేది తన ఆడపడుచు వినకుండా.

భక్తి లో సూర్యం తల్లి కన్నా రెండాకులు ఎక్కువే చదివాడు. ససేమీరా కాదని, తన భక్తిని నిరూపించుకుంటూ ఉండేవాడు.

సూర్యం ఒకసారి ఇండియా వాళ్ళు వేరే దేశం తో క్రికెట్ ఆడుతున్నప్పుడు, వాళ్ళు నెగ్గాలని దేముడి గదిలో దీపం వెలిగించి, ఒక గంట సేపు ఒంటికాలి మీద నుంచుని దేముడికి ప్రార్థించాడు. అయినా ఇండియా వాళ్ళు ఆ క్రికెట్ మేచ్ లో ఓడిపోయారు. అప్పుడు కూడ పొద్దున్న స్నానం చేసి, హనుమాన్ చాలీసా చదివి, పాలు తాగాక ఒంటికాలి తపస్సు చేయటం వల్ల తన తపస్సు ఫలించలేదని నమ్మాడు. మరేం చేస్తాడు? ఇండియా వాళ్ళు ఓడిపోతారేమో అన్న దిగులు ఆ కార్యక్రమాలన్నీ అయ్యాక కలిగింది. మర్నాటి వరకూ తపస్సు ని వాయిదా వేస్తే, క్రికెట్ ఆట ఆరోజే అయిపోతుంది కదా!

అలా పెరిగిన సూర్యం లో నెమ్మదిగా మార్పులు రాసాగాయి. దానికి కారణం వాళ్ళ సైన్స్ మాష్టారు. సూర్యం తొమ్మిదవ తగగతిలోకి వచ్చేటప్పటికి ఆ స్కూలికి ఒక కొత్త సైన్స్ మాష్టారు వచ్చారు. ఆయనకి కమ్యూనిష్టు భావాలు కొద్దిగా ఉన్నాయి. దానితో నాస్తికత్వాన్ని నేర్చుకుని, పిల్లలకి సైన్సు పాఠాలతో పాటు హేతువాదం కూడా నేర్పించసాగారు.

అ సైన్సు మాష్టారి బోధనలతో సూర్యానికున్న మూఢనమ్మకాలు సడలసాగాయి. ఆయన బోధనలకి బ్రాహ్మణవాడ లో ఉన్న కొందరు ఘనాపాఠీ పండితులు పళ్ళు కొరుక్కున్నారు కానీ, ఏమీ చెయ్యలేకపోయారు. ఆ మేష్టారు నేర్పించే సైన్స్ సబ్జెక్టు ఆయనకి ఒక కవచం గా నిలిచింది.

అప్పటినించీ సూర్యం తన తండ్రి తో వాదనలు వేసుకోవటం మొదలుపెట్టాడు. తండ్రి దైవత్వానికి సంబంధించిన విషయం ఏం చెప్పినా ఎదురు ప్రశ్నలు వేసేవాడు. తండ్రి కొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోయేవాడు. "నువ్వే పెద్దయితే అర్థం చేసుకుంటావులే" అని ఊరుకునేవాడు అప్పటికి.

సూర్యానికీ కొత్త జ్ఞానం కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

ఒక రోజు నుంచీ హనుమాన్ చాలీసా చదవటం మానేసాడు. తండి అది గమనించినా ఊరుకున్నాడు కుర్రతనం కొన్నాళ్ళకి పోతుందని. కానీ అ కుర్రతనం పెరగసాగింది.

ఆ వినాయకచవితినాడు సూర్యం పూజ చేయనని ఎదురు తిరిగాడు. ఆ సందర్భం లో జరుగుతున్న గొడవ అది.

"ఎందుకు పూజ చెయ్యవు?" తండ్రి సామరస్యం గా అడిగాడు.

"నాకు దేముడి మీద నమ్మకం పోయింది. నేను పూజ చెయ్యను" అదే సమాధానం మాట మాటకీ.

తండ్రికేం చెయ్యాలో పాలు పోలేదు. పధ్నలుగేళ్ళ కుర్రాడు తండ్రి గంభీర గొంతుకి భయపడటం లేదు.

"పోనీ ఒక దణ్ణం పెట్టి ఊరుకో ఈ సారికి" అంది తల్లి భయపడుతూనే.

సూర్యం మాట్టాడలేదు.

తండ్రికి అది కాస్త సబబుగానే తోచింది. పిల్లాడి చేత అలా చేయిస్తే అప్పటికి ఆ గొడవ ముగుస్తుందని లోలోపల సంతోషించాడు.

కానీ బయటకి గంభీరం గా "వాణ్ణి అదేదో చేసి తగలడమను" అన్నాడు విసుగ్గా.

సూర్యం అడ్డం గా తలూపాడు.

"వాడలా మొండికెత్తుతుంటే అంత చేతకాని వాడిలా ఊరుకుంటావేమిట్రా? ఈ అగ్రహారం లో ఎలా బుర్రెత్తుకుని తిరుగుతావు ఇంక? నలుగురూ నోట్లో ఇంత గడ్డి పెడతారు ఇకనించీ. వెధవని నాలుగు తన్ను. అప్పటికి బుద్ధి వస్తుంది." అని ఎగదోస్తూ కేకలు పెట్టింది మేనత్త.

అంతే! సూర్యం తండ్రి అహం దెబ్బ తింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు.

సూర్యాన్ని అక్కడున్న స్థంభానికి కట్టేసాడు. లోపల్నించి బెల్టు పట్టుకొచ్చాడు.

"ఆఖరి సారిగా అడుగుతున్నాను. దేముడికి దణ్ణం పెడతావా, పెట్టవా?" గర్జిస్తూ భయపెట్టాడు.

"నన్ను కొట్టినా సరే, నేను ఆ పని చెయ్యను" మొండిగా అన్నాడు సూర్యం.

వెంటనే రెండు బెల్టు దెబ్బలు పడ్డాయి సూర్యం ఒంటి మీద. సూర్యం కెవ్వున అరిచాడు.

సూర్యం తల్లి ఇంక ఓర్చుకోలేక, వెళ్ళి భర్త చేతుల్లోంచి బెల్టు లాగేసుకుంది. సూర్యం తండ్రి మాట్టాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు.

"నీ మడి మైల పడిందిప్పుడు" కోపం గా అంది ఆడపడుచు.

"అయితే అయిందిలెండి. మళ్ళీ తలస్ననం చేసి వేరే మడిబట్ట కట్టుకుంటను" అంటూ పిల్లాడిని దగ్గరకి తీసుకుంది.

ఆ సంఘటన తో సూర్యం ఇంకా ఎదురు తిరిగి నాస్తికత్వం పుస్తకాలు ఇంటికి తెచ్చుకోవటం మొదలుపెట్టాడు.

* * *

రెండువేల దశాబ్దం లో జరిగింది ఈ కధ.

సహజ ని అ రెసిడెన్షియల్ స్కూలు దగ్గర వదిలి వస్తుంటే తలితండ్రులిద్దరికీ ఏడుపు ఆగలేదు.

"అమ్మా, అమ్మా! నన్నూ నీతో తీసుకెళ్ళమ్మా. ఇక్కడ వదలొద్దమ్మా" అని ఏడిచింది ఏడేళ్ళ సహజ.

తలితండ్రులిద్దరి హృదయాలూ మళ్ళీ చెరువులయ్యాయి. అయినా గుండెని దిటవు పరచుకుని, పిల్లని హోస్టల్ వార్డెన్ కి అప్పచెప్పి ఇంటికెళ్ళిపోయారు.

సహజ తలితండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తారు. సహజ పుట్టిన తర్వాత చేసిన ఆపరేషను వల్ల మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది. దాంతో వాళ్ళిద్దరి పంచప్రాణాలూ సహజ మీదే పెట్టుకుని ప్రేమగా పెంచుకొస్తూ ఉన్నారు.

పిల్లని LKG లో చేర్పించినప్పటి నించీ వాళ్ళకి పిల్ల పెద్ద చదువుల మీద దిగులు పెరిగిపోయింది. అప్పటినించీ ఒక పక్క డబ్బు దాస్తూ ఇంకో పక్క పేరు పొందిన స్కూళ్ళ గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ పిల్ల ఎలాగన్నా కలెక్టరో, డాక్టరో అయిపోవాలని వాళ్ళ తహ తహ.

"మా పిల్ల మాలాగ గుమాస్తా ఉద్యోగం చెయ్యకూడదమ్మా" అని అందరికీ చెప్పుకునేవారు.

మిగిలిన విషయాల్లో పిల్లనెంత ప్రేమగా చూసుకున్న, చదువు విషయం వచ్చేసరికి చాలా కఠినం గా ఉండేవారు. సహజ కూడా తలితండ్రుల మనసు అర్థం చేసుకుంది. వాళ్ళని సంతృప్తి పరచడానికే ప్రయత్నిస్తూ ఉండేది.

ఆ రోజుల్లో విన్నారు ఈ రెసిడెన్షియల్ స్కూలు గొప్ప గురించి. అందులో పిల్లని చేర్పిస్తే ఇంక పిల్ల చదువు సంగతి మర్చిపోవచ్చట. డబ్బు కూడా ఎక్కువే తీసుకుంటారుట. తమ ఖర్చులన్నీ తగ్గించుకుని పిల్లని ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు. పిల్ల కూడా ఆ స్కూలు గొప్ప గురించి విని ఒప్పుకుంది. తలితండ్రులని వదిలి ఉండటమే కష్టం అయిపోయింది సహజకి.

ఒక వారం రోజులు గడిచాయి.

ఆ రాత్రి పది గంటలకి వచ్చిందా కబురు ఆ తలితండ్రులకి పోలీస్ స్టేషన్ నుంచి. గబగబా అదురుతున్న గుండెలతో ఆటో చేసుకుని, ఒక గంట ప్రయాణం చేసి ఆ పోలీస్ స్టేషన్ చేరారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి అసలు సంగతి.

ఆ రోజు సహజ క్లాసుకి హోం వర్క్ చేసుకుని రాలేదుట. ఎందుకని టీచరడిగితే మాట్టాడలేదుట. అప్పటికీ పక్క పిల్లలు రాత్రంతా అమ్మా నాన్నల కోసం ఏడిచిందని చెప్పారుట. అయినా టీచరు సహజకి శిక్షగా కాలికి సంకెళ్ళు వేసి అక్కడున్న బల్లకి తగిలించి, స్కూలు అయిపోయాక వెళ్ళిపోయాడుట. సహజ ఎలాగో బల్లకున్న సంకెళ్ళని ఒదిలించుకుని, కాలికున్న సంకెళ్ళని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చిందట. దారిన పోయే వాళ్ళు ఆ పిల్ల ని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారుట.

పోలీసులు లోపలినుంచి సహజ ని తీసుకురాగానే, సహజ తల్లి ని హత్తుకుపోయి బట్టలు తడిపేసింది.

అప్పటినుంచీ సహజ రోజూ నిద్ర లో బట్టలు తడపసాగింది.

* * *

ఈ కధలు చెప్పి, ఆయాసం తీర్చుకోవడానికి ఆగారు గురువుగారు.

"అదేమిటీ గురువుగారూ, అలా అంటారు? మన పెద్దలు సంస్కృతం లో "దండం దశగుణం భవేత్" అని చెప్పారుగదా. అది తప్పంటారా ఇప్పుడు?" అయోమయం గా అడిగాడు శిష్యుడు.

"పూర్వం ఆకాల, మాన పరిస్థితులని బట్టి ఏదో సంస్కృతం లో చెప్పినంత మాత్రాన అది సరవుతుందా నాయనా? బుద్ధి తెచ్చుకుని మాట్లాడు" అని మందలించారు గురువుగారు.

శిష్యుడు సాలోచన గా తల పంకించాడు.

* * End * *

మీ సలహాలు, అభిప్రాయాలూ రచయిత JUBV ప్రసాద్ కి తెలియచేయండి.