ఆటాడుకుందాం రా.. - పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

మొన్నీ మధ్య ఒక మిత్రుడి ఇంట్లో "గృహ భోజనాలు" జరిగాయి. నాలుగు కుటుంబాలు కలవడం తో ఎప్పటిలా సినిమాలు చూడటమో, చీట్ల పేక ఆడటమో కాక కాస్త వెరైటీ గా గడుపుదాం అని శైలజ అనడం తో ఆలోచన లో పడ్డాం. పంచభూతాలనీ (TV, VCR, DVD, Audio, Internet) పట్టుకు బతుకుతున్న నాకూ చంద్ర కీ పాతాళం పగిలినట్టు, భూగోళం బెదిరినట్టు, ఖగోళం ఖంగారెత్తినట్టు అనిపించింది ఈ సలహా వినగానే.

చివరకి అనిత, శైలజ కలిసి శ్రీరామ్ సహాయం తో ఆట ప్రపోజ్ చేసారు. దాని పేరు "అసెంబ్లీ". శ్రీరామ్ లేచి దాని గురించి, దాన్ని ఆడే తీరు గురించీ "వజ్రోత్సవాల ఉపన్యాసం లో చిరంజీవి సగం అర్థమయ్యి, సగం అర్థం కానట్టు చెప్పినట్టు" వివరించి కూర్చున్నాడు. "మొదలుపెట్టండి మజా ఏమిటో మీకే తెలుస్తుంది" అన్నాడు.

"మజా దొరుకుతూనే ఉంది మార్కెట్ లో, ఫ్రూటీలు ఉంటే చూడు" అన్నాడు చంద్ర.

శైలజ కీ, విజయ్ కీ, మా ఆవిడ కీ, రాజేశ్వరి కీ అందరికీ ఉత్సాహమొచ్చేసింది. నేను, చంద్ర మాత్రం "ఏంటహై ఈ గోల సినిమాలు చూడ్డానికి లేకుండా" అని మనసు లో తిట్టుకుంటూ, మిడిల్ డ్రాప్ అవ్వాలంటే రూల్స్ ఏమిటో చెప్పాలని పట్టుపట్టాం.

ఆట మొదలయ్యింది..

టూకీ గా చెప్పాలంటే, ఎవరి జంటలు వాళ్ళవి. నాలుగు చీట్ల మీద నాలుగు టాపిక్ లు రాసి ఉంటాయి. (మనకి తెలియదు లోపల ఏమి రాసి ఉందో). చీటీ తీసిన జంట, టాపిక్ ఏమిటో చెప్పి, దాని మీద వాళ్ళ లోతయిన, ఖచ్చితమైన, నిజాయితీ తో కూడిన అభిప్రాయం చెప్పాలి. అప్పుడు అసలు "అసెంబ్లీ" మొదలవుతుంది. మిగిలిన జంటలు అంతా CPI, CPI(M), TDP(బాబు), TDP(LP), TDP (అన్న హరికృష్ణ) వగైరా అనమాట. అంటే, "ప్రతిపక్షాలు". కౌంటర్ అటాక్ చెయ్యాలి ఆ జంట ని. వాళ్ళ అభిప్రాయం విలువైనదేనా లేక "మోహన్ బాబు స్పీచ్ లా కాంట్రవర్షియలా" అనేది తేల్చాలి.

నాకెందుకో వెన్ను లో చలి మొదలైంది. (అసలే టెంపరేచర్స్ కూడా 0 లో ఉన్నాయేమో!), ఇది "వజ్రోత్సవాల కన్నా భయంకరమైన ఈవెంట్" లా అనిపించసాగింది. "అభిప్రాయాలని ఖండిస్తూ మాట్లాడాలా? అదీ ఓపెన్ గా, మొహం మీద, అయ్యే పనేనా? అయినా, ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో అని బెదిరిపోతూ చూసాం నేనూ, చంద్ర.

అనిత, విజయ్ ఆరాటపడిపోతూ తీసారు మొదటి చీటీ.

1. "ఇండియా లో సెటిల్ అవ్వాలా? అమెరికాలోనా?"

నాకు అర్థమయిపోయింది. ఇక ప్రతిపక్షాల అవసరమే లేదని. ఎందుకంటే, విజయ్ ఏమో ఇండియా లో వెళ్ళి స్థిరపడాలి అని ఎప్పుడూ చెపుతుంటాడు నాతో. అనిత కి అది ఇష్టం లేదు. చూద్దాం, ఏం చెపుతారా అని కూర్చున్నా. ఊహించినట్టు గానే, ఆవిడ "అమెరికా" అనడం, ప్రతిపక్షాలు వివరణ ఇవ్వాలని కోరడం తో ఆవిడ కబుర్లు మొదలెట్టారు. పాత పాటే, "అమెరికా లో అయితే, ఎంచక్కా Q లో నుంచో వచ్చు అని, అక్కడయితే, Q లు ఉండవ్ అనీ. D (కుమ్ముకోవడం) లే అని, అక్కడైతే పేపర్ దగ్గర నుండి ఫ్లైట్ వరకూ అంతా లేట్ అని, ఇక్కడైతే అంతా గ్రేట్ అనీ, ఇక్కడ పొల్యూషన్ కి సొల్యూషన్ లేదని, అక్కడ అలా ఉంటే రివల్యూషనే అని ఇలా మోసేసారు. ప్రతిపక్షాలు ఎప్పటి లానే, వివరణ ఇచ్చినా దాని మీద కాకుండా వాళ్ళకి తోచిన ప్రశ్నలు వేసి పరువు తియ్యటం మొదలెట్టారు. "మరి 30 ఏళ్ళు ఎలా ఉండగలిగారు అక్కడ?" అనే ప్రశ్న కి ఆవిడ కి తిక్కరేగి, "ఎవరు చెప్పారు 30 ఏళ్ళు అని, నాకు ఇంకా 26 ఏళ్ళే", అంటూ వాళ్ళ తలితండ్రులు మినిసిపల్ స్కూల్ మాస్టర్ ని బురిడీ కొట్టించి 3 ఏళ్ళు ముందు గానే ఒకటో తరగతి లో చేర్పించిన వైనం గురించి చెప్పడం మొదలెట్టారు. అసలు ప్రశ్న ఎటో కొట్టుకుపోయింది. నాకూ, చంద్ర కీ ఎప్పుడెప్పుడు "వాళ్ళిద్దరి వయసు పదహారే" పెట్టుకుని చూద్దామా అని తెగ ఉబలాటం గా ఉంది. మొత్తానికి, కొంత మంది సభ్యులు పోడియం వైపు దూసుకొని పోయి స్పీకర్ తో "మీకిచ్చిన గడువు తీరింది, ఇప్పుడు రెండో వాళ్ళకి అవకాశం ఇవ్వవలిసింది గా కోరుతున్నాం" అనడం తో శైలజ / శ్రీరామ్ లు రెండవ చీటీ తీసారు.

2. "ఒకళ్ళు చాలా, లేక ఇద్దరుండాలా పిల్లలు?"

వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు. ఇంకేమి చెపుతారు? ఆవిడ కార్పెట్ గుద్ది మరీ కన్ ఫర్మ్ చేసారు ఇద్దరు ఉండాల్సిందే అని, రెండో పిల్లాడిని ఏ కంఫర్టర్ లో పడుకోపెట్టానా అని ఖంగారు గా చూసుకుంటూ. "నా" అంటూ "మా" తరువాత దీనికంటూ ఉండేది వీడే అంటూ రెండు నిమిషాల్లో బ్లాక్ / వైట్ + సూపర్ స్టార్ కృష్ణ ట్రిపిల్ ఏక్షన్ మూవీ రక్తసంబంధం చూపించారు. ఆడవాళ్ళంతా "ఉండాల్సిందే, ఉండాల్సిందే.." అంటూ సడెన్ గా పార్టీలు మార్చేసిన MLA లా జంటలు నుండి విడిపోయి ఆవిడకి వత్తాసు పలకడం ప్రారంభించారు. "ఈ రోజుల్లో స్కూల్స్, కాలేజ్ ఫీ లు ఎలా ఉన్నాయ్.. ఇవతల IT కంపెనీ వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయి? ఈ రెంటికీ ఎక్కడైనా పొంతన ఉందా అధ్యక్షా? ఒక పక్క మండిపోతున్న ఇళ్ళ ధరలు, ఇంకో ప్రక్క సింగిల్ సంపాదన గాడివి నీకు డబల్ స్టోరీడ్ బిల్డింగ్ కావల్సి వచ్చిందా అంటూ బ్రోకర్ ల సూటిపోటీ మాటలు? ఇలాంటి పరిస్థితులలో ఇది సాధ్యమేనా అధ్యక్షా సన్నకారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి? Deck (powerpoint presentation) ఆడితేనే కాని డొక్కాడని పరిస్థితే? మరి ఇద్దరు పిల్లలు కావాలని కమాండ్ చెయ్యటం ఎంత వరకూ సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్షా. ఇలాంటి కన్నతండ్రి ల ఆవేదనని తెరకెక్కించే కృష్ణవంశీలే లేరా అని మా సంఘం అంతా ఆరాటంగా ఎదురుచుస్తోంది అధ్యక్షా! ఒక కన్నతండ్రికి, ఒక కన్న తల్లి మధ్య రగిల్చిన ఈ కుంపటి కి కట్టెపుల్లలు ఎవరు? ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళా? ఈ consulting కంపెనీ వాళ్ళా? ప్రోజెక్ట్ మధ్యలోనే స్క్రాప్ చేసే క్లయింట్సా? ఎవరు, ఎవరు.. అంటూ జస్టిస్ చౌదరి లెవల్ లో ఆవేశం గా అరచి, దోషులు ఎవరైనా సరే కఠినం గా శిక్షించాల్సిందే, సమాజానికి పట్టిన ఈ చీడ తొలగించాల్సిందే, Gromore భాస్వరం 16:12 వాడి అయినా సరే" అంటూ ఆవేశం గా కూలబడ్డాడు శ్రీరామ్. మేమంతా "మోహన్ బాబు ని సమర్థించిన విజయ చందర్" లా విజిల్స్ వేసాం. అలా అ ప్రశ్న కూడా కొంత నాని, సాగి, పక్క దోవ పట్టడం తో మూడవ చీటీ తీసే ముందు చిన్న కాఫీ బ్రేక్ ఇచ్చాం.

చంద్రమోహనూ, ప్రభా వచ్చారు చీటీ తియ్యడనికి. అదేనండీ.. "నేను - మా ఆవిడ".

3. "భార్య పిల్లల్ని చూసుకోవాలా? ఉద్యోగం చెయ్యాలా?"

అంటే, మొగుడ్ని గాలికొదిలేస్తారా? ఎవడ్రా, ఎప్పుడో కన్నాంబ, కాంచనమాల కాలం నాటి టాపిక్ లు రాసింది?" అంటూ ప్రక్క నుండి చంద్ర పైకి లేచాడు. మా ఆవిడ ఇప్పటికే దెప్పుతుంటుంది ఉద్యోగం సరిగ్గా చెయ్యనివ్వలేదు అని. అందుకే ముందు గా అవకాశం ఆవిడకే ఇచ్చాను. ఇక ఆవిడ, "ఆడదానికి 100 మార్కులు ఎలా వస్తాయి" అనే లాజిక్ దగ్గర నుండి, ఆడది అంతరిక్షం వరకూ వెళ్ళి ఎలాంటి సాహసాలు చేసింది, ఆడదే ఆధారం సినిమా నుండి అమ్మ రాజీనామా వరకూ ఆపకుండా స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని వివరించి, స్త్రీ అంటే "సిరివెన్నెల" లో సుచిత్ర సేన్ లానో, "రక్షకుడు" లో సుస్మితా సేన్ లా కాక, "శంకరాభరణం" లో రాజ్యలక్ష్మి లా ఉంటూనే, "స్వాతి" లో సుహాసిని లా, "మౌనపోరాటం" లో యమున లా, ధైర్యం గా ఉంటూ, "ఒసేయ్! రాములమ్మ" లో విజయశాంతి లా విజృంభించాలి అని ఉదాహరణలు ఇస్తూ ఉద్యోగం అవసరం అని తేల్చి చెప్పింది. జనాలు అంతా స్లో మోషన్ లో తలలు నా వైపు తిప్పి, నేనేదో స్త్రీ స్వేచ్చ హక్కుల్ని కాలరాస్తున్న కాళేశ్వర రావు లా, నా వైపు క్రూరం గా, కొంత మంది అసహ్యం గా చూడటం మొదలెట్టారు. ఇదేం గోలరా నాయనా, హేపీ గా సినిమాలు చూసుకునే వాడ్ని తీసుకొచ్చి ఇలా బాదుతున్నారు అని ఈ ప్లాన్ ఇచ్చిన శైలజ, శ్రీ రామ్ ల వంక కసి గా చూసాను. వివరణ ఇవ్వాల్సిందే అని ప్రతిపక్షాలు కోరడం తో, "ఉద్యోగం చెయ్యమనే చెప్పాను స్వామీ.. కాకపోతే నేనే resume ప్రిపేర్ చెయ్యాలిట, నేనే interview లు ఫోన్ లో అటెండ్ అవ్వాలంట, నేనే ఆఫీస్ వర్క్ కూడా చేసిపెట్టాలంట, ఇంక అంత దానికి ఆఫీస్ దాకా ఎందుకులే వెళ్ళడం అని సర్ది చెప్పా". "ఇది బాలచందర్ చెప్పిన దానికన్నా పచ్చి అబద్ధం, నేను అలా అనలేదు, ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళను టెస్టింగ్ సైడ్ వెడతా training ఇప్పించండి అంటే, మనమేంటీ, మన వంశమేంటీ, వాడెవడో డెవలప్ చేసినది నువ్వు టెస్ట్ చెయ్యటమేమిటి, కావల్సొస్తే, టెల్లర్ కింద వెళ్ళు టెండర్ పెట్టను అని అంది మీరు కాదూ?" అంటూ మా ఆవిడ. "నేను అసలు పెళ్ళి చూపుల్లోనే చెప్పానండీ, నువ్వు MCA, ఒక వేళ నేను ఉద్యోగం వద్దులే అంటే మీ రియాక్షన్ అని. మీరేమి చెప్తే అదే ఇష్టం అంటూ పళ్ళు పట పాటా కొరుకుతూ చెప్పింది నువ్వు కాదూ?" అనే లోగా, "ఇంతకీ విషయం తేల్చలా" అని శైలజ అనడం తో, "ఇందులో యూనివర్శల్ లాజిక్ ఏమీ లేదు. ఎవరి priorities ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. పిల్లలు వచ్చిన తరువాత ఉద్యోగం వద్దనుకున్నాం, మనేసాం ఇద్దరూ కూలబడుక్కుని. మళ్ళీ అవసరమైనప్పుడు చేద్దాం అనుకున్నాం. ఆ అనవసరం ఇక వచ్చేలా ఉంది, అలోచిస్తున్నాం" అని చెప్పడం తో ఆ అంకం అక్కడికి ముగిసింది.

4. "మీ దృష్టి లో ఆదర్శ జంట ఎవరు? ఎలా ఉండాలి?"

"నరసింహనాయుడు లో బాలకృష్ణ, జయప్రకాష్ రెడ్డి" అంటూ చమత్కారం తో స్టార్ట్ చేసాడు చంద్ర. "సినిమాలు ఆపి సీన్ లోకి రండి" అని అనిత అనడం తో, రాజేశ్వరి చెప్పారు"ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ.." అనేలోగా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి, "అర్థం చేసుకోవడం అంటే?" అంటూ. "అర్థం చేసుకోవడం అంటే.. అని ఆవిడ నాన్చుతుంటే చంద్ర అన్నాడు "ఒకళ్ళు యస్ అంటే, రెండో వాళ్ళు నో అనకుండా ఉంటే చాలు ఆ జంట ఆదర్శ జంట అయిపోతుంది". "అయితే, పురాణాల లోనో, పూర్వ కాలం లోనో తప్ప, ఆదర్శ జంటలు ఉండవంటావ్?" అంటూ చురకంటించాడు విజయ్. "ఎందుకు లేరు, నాగార్జున చేసే పనులకి అమల అడ్డం పడుతోందా? ఐశ్వర్య తో అడ్జస్ట్ అయి అభిషేక్ లేడా?" అంటూ లాజిక్ లు లాగాడు శ్రీరామ్, "మీరు లేచి కాఫీలు కలుపుకురండి, ఈ సారి నేను లేవను" అని వాళ్ళావిడ ఇంకాస్త తీవ్రస్థాయి లో గొంతు పెంచి చెప్పడం తో శ్రీ రామ్ లేచాడు. "చూసారా! ఇంత కన్న ఆదర్శవంతమైన జంట ఎవరున్నారు చెప్పండి, మహానుభావుడు కాఫీ తెమ్మంటే, బ్రూ కాఫీ నా, ఫిల్టర్ కాఫీనా, వేడి కాఫీ నా, కోల్డ్ కాఫీనా, బ్లాక్ కాఫీ నా, క్రీమ్ కాఫీ నా అని యక్ష్య ప్రశ్నలు వెయ్యకుండా భార్య మనోభావాలను అర్థం చేసుకున్న మహా పురుషుడు" అంటూ చంద్ర పక్క దోవ పట్టించాడు. "ఆయన మొహం, ఇప్పుడూ కిచెన్ లోకెళ్ళి కప్పులెక్కడ పెట్టావ్, కాఫీ పౌడర్ ఎక్కడ పెట్టావ్ అంటూ వంద సార్లు లేపుతారు చూడండి పెట్టే రెండు చుక్కల కాఫీకి" అంటూ ఆవిడ వివరణ ఇవ్వడం తో, ప్రతిపక్షాలు అర్థమయిపోయిందోచ్ ఇంతకీ మీ సంగతేమిటి? అంటూ చంద్ర రాజేశ్వరి వైపు తిరిగారు. "ఏముందీ! మా మధ్య ఇలాంటి కాఫీ గొడవలేమీ లేవు. మావి అన్నీ టీ కప్ లో తుఫానులే" అని రాజేశ్వరి అంటే, "సూప్ బౌల్ లో సునామీలేమీ కాదు" కౌంటర్ వేసాడు శ్రీ రామ్. "మా పెళ్ళి లో మా వాళ్ళు పది కి తగ్గేది లేదు అన్నప్పుడు, వాళ్ళ వాళ్ళు ఎనిమిది కన్నా ఇచ్చుకోలేం అంటే, పిల్ల నచ్చింది, చేయించండి ఇక కన్యాదానం అని తొమ్మిది దగ్గర బేరం కుదిర్చా, తను కూడా నాన్నా ఈ అబ్బాయి చాలా మంచోడు, ఇంతకు ముందు వాళ్ళలా నీకు .Net వచ్చా? Sun Certification ఉందా? లాంటివి కాక, మీకు ఒకో సినిమా ఒకటి కన్నా ఎక్కువ సార్లు చూసే ఓపికుందా, ఆపకుండా ఆరు షో లు చూడగలరా లాంటి ఈజీ ప్రశ్నలే వేసాడు, ఒకటి దగ్గర గొడవెందుకు లెండి, ఇచ్చేద్దాం అంది, ఏం, అది ఆదర్శం కాదా?" అన్నాడు చంద్ర. "కితకితలేం కాదు" నవ్వి చెప్పాడు శ్రీ రామ్. ఇక ఆదర్శ జంటలు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎవరికి వాళ్ళు ఏవో చెప్పుకొచ్చారు. తిక్కరేగిన చంద్ర మధ్య లో ఒక సారి ఆదర్శ జంట అంటే, ఆదర్శ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంటర్ చదివే జంటలు" అనడం తో అలా ఆ అంశం కూడా అభాసుపాలయ్యింది మన అసెంబ్లో లో మాదిరే.

అలా సభ్యులు కొట్టుకుని అలసిపోవడం తో ఆట అక్కడ తో ఆగిపోయింది.

కార్ లో కొంప కొస్తుంటే మా ఆవిడ అంది "అంత సేపు ఆడాము, ఎవరికి తోచినది వాళ్ళు చెప్పారు, పైగా లోపల ఒకటి పెట్టుకుని, బయటకొకటి మాట్లాడినట్టుంది, ఎంతకీ ఎవ్వరూ ఏమీ తేల్చలేదు, ఇంతకీ మనం సాధించింది ఏమిటి?"

"అసెంబ్లో లో అంతే.. అసెంబ్లీ లో అంతే.." అన్నా రౌడీ అల్లుడు లో స్వర్గీయ అల్లు ని గుర్తు చేసుకుని.

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.