|
|
| ఈ పేజీ ని పంపండి |
టైటిలు చూస్తే మనకి బోలెడంత ఖుషీ అనిపిస్తుంది. సినిమా చూస్తే కూసంత కసి పుడుతుంది.
మంచి ఎంటర్ టైనర్ గా మిగిలిపోవాల్సిన సినిమా మధ్యలో ఎందుకు కమిలిపోయింది అనిపిస్తుంది.
త్రివిక్రముడి కూతలు బావున్నాయ్ అనిపించినా, చేతల తో వాతలు పెట్టడం బాధిస్తుంది.
ఇది స్థూలం గా గీత ఆర్ట్స్ మన చేత చేయిద్దామనుకున్న "జల్సా.." .
సంజయ్ సాహూ అనే వ్యక్తి ఎలాంటివాడో, వెనుకనుండి ఎవడో మనకి చెప్పటం తో సినిమా మొదలవుతుంది.
పలు కారణాల చేత చిన్నప్పుడు చదువుకోలేక పోవడం తో, సాహూ, యాహూ అంటూ, పెద్దయ్యాక ఎడాపెడా PG లు చేసేస్తూ, హీరొయిన్ చేత చప్పట్లు కొట్టించుకుంటుంటాడు. అలా చప్పట్లతో మొదలయిన వారి ప్రేమ త్వరలోనే ఇక్కట్లలో
పడుతుంది, కమలిని నాన్న ప్రకాష్ రాజ్ వల్ల. త్రివిక్రం మార్కు లాజిక్ లతో, సంభాషణలతో, సంజయ్ సాహూ, ప్రేక్షక హౄదయాలు గెలుచుకుంటాడు కాని, ప్రకాష్ రాజ్ మనసు గెలుచుకోలేకపోతాడు. లవ్ ఫెయిల్ అయిన బాధలో ఇంక ఎక్కువ తాగుతూ, అవేవో మరికొన్ని PG లు చేస్తూ జల్సా చేసికుంటుంటాడు సాహూ. అలాంటి పరిస్థితులలో తారసపడుతుంది "బాగి" అనే భాగ్యమతి. ఈమె మతిలేనితనాని కి, పని లేని సునీల్ అన్నయ్య తొందరపాటు తోడవ్వటం తో పలు సీన్ లు పడిపడి నవ్వేలా చేస్తాయ్. ప్రేక్షకుడు జల్సా చేసేది సరిగ్గా ఇక్కడే. అలా ఆహ్లాదంగా ఖుషీ చేసికుంటున్న ప్రేక్షకుల పాలిట, "TV9 ఫ్లాష్ న్యూస్ ల" ఫ్లాష్ బ్యాక్ మొదలై కొంత గందరగోళం సౄష్టిస్తుంది.
సడన్ గా సాహూ కష్టాల కొలిమి కి నిప్పెట్టడం తో ప్రేక్షకుడి కి వేడెక్కి పోతుంది. "నేనంటే ఇప్పుడు జల్సా చేస్తున్నాను కాని, కష్టాలు అంటే మీకేం తెలుసురా?" అంటూ చిట్టా విప్పుతాడు. తాను ఎలాంటి పరిస్థితులలో దళం లోకి వెళ్ళవలసి వచ్చింది చెపుతాడు. పొనీ వెళ్ళిన వాడు అందులోనైనా స్థిరంగా వున్నాడా? అంటే అదీ లేదు, అక్కడ అడవిలో ఇరుక్కుపోతె, ఇక్కడ సిటీ లో జల్సా ఎవడు చేస్తాడు? కనుక మళ్ళీ త్రివిక్రం తన మార్కు లాజిక్ బయటకి తీసి, సాహూ చేత అన్నల కి, కూంబింగ్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కీ, మరోకటి మంత్రి మల్లిఖార్జున కీ వివరించి సాహూ కి పునరావాసం కలుగజేస్తాడు. మళ్ళీ ఇంకో రౌండ్ జల్సా షురూ అవుతుంది. ఈ సారి బరి లోకి బ్రమ్హానందం ని కూడ దింపుతారు, మళ్ళీ మాటలమాంత్రికుడు త్రివిక్రం కాసేపు కామెడీ మాజిక్ చేస్తాడు అక్కడక్కడ. మధ్యమధ్య దేవిశ్రీ హుషారు కలిగిస్తాడు. ఇంతకీ జల్సా చెయ్యటమేనా హీరో చెయ్యల్సినవి ఇంకేమన్న వున్నాయా? అని ప్రేక్షకుడు కలవరపడుతున్న టైం లో, బాగి, సాహూ ల మధ్య చిచ్చు రేపి కాసేపు, శివాజి ఎంట్రీ తో ఈర్ష్య, అసూయాద్వేషాలు లాంటి రొటీను పోకడలు పొయిన తర్వాత, ఇహ లాభం లేదని అసలు విలన్ ని దించుతారు. ఇతనికి, సాహూ కి మధ్య జరిగే కొన్ని అతిలాగుడు, అతివాగుడు సంఘటనలతో క్లైమాక్స్ రావడం, కామెడీ తో మొదలెట్టా కాబట్టి కామెడీ తోనే ముగించాలనుకున్న దర్శకుడి కోరిక నెరవేరడం తో, ప్రేక్షకుడి కి జల్సా మాట ఎటున్న "జల్దీ" గా అయినందుకు మాత్రం సంతోషిస్తాడు.
పవన్ మాత్రం రెచ్చిపోయాడు. ఫాన్స్ కి ఖుషీ యే. చాలరోజుల తర్వాత ఆరోగ్యం గా, ఆహ్లాదం గా, ఉల్లాసం గా, ఉత్సాహం గా కనిపించాడు. త్రివిక్రం స్టయిల్ కి సెట్ అయ్యాడు. కామెడీ నడిపించినంత సేపు ఈ జోడీ ఇరగదీశారు. ముఖ్యం గా TV9 స్పందన మీద, ప్రకాష్ రాజ్ "ఏరా! అక్కని ప్రేమించి, చెల్లినీ ప్రేమించడాని కి సిగ్గు లేదురా? అన్నప్పుడు, "సిగ్గు లేక కాదంకుల్ information లేక " అని కవరింగు ఇచ్చుకునే సన్నివేశం, "పెళ్ళి కి పిలవలేదు గా మరి ఎందుకొచ్చావ్?" అంటే, "భోజనాలు బాగున్నయ్ అని బయట టాకొచ్చింది అంకుల్ అందుకని" అని రిప్లయ్ ఇచ్చినప్పుడు, ఇలా చాలనే వున్నాయ్. పాటల్లో మాత్రం ఇద్దరు పెద్ద శ్రద్ధ పెట్టలా! దేవి ఇచ్చిన వేదిక ని సరిగ్గా వాడుకోలేకపోయారు. మరి ఎవరి తొందరపాటో తెలియదుకాని, ఫైట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేసి ప్రేక్షక ప్రాణాలు తోడేశారు. త్రివిక్రం రీళ్ళని పొదుపుగా వాడుకోవడం నేర్చుకోవాలి (గత సినిమాల లోను ఇదే తప్పు చేశాడు). ద్వితీయ భాగం లో శ్రద్ద వహించినట్లయి తే, అద్వితీయమైన ఫామిలీ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయేది. బ్రహ్మానందం గురించి రివ్యూ లు బాగ వచ్చాయ్ కాని, సునీల్-ధర్మవరపు ల కాంబినేషన్ సీన్ లు ముందు అతని పాత్ర ని అంతగా తోమలా, కాబట్టి మెరవలా. మిగిలన అందరు షరా మామూలే. తప్పక మెచ్చుకోవాల్సిన అన్శం ఇంకోటి వుంది, మహేష్ లాంటి సూపర్ స్టార్ తెర వెనుక నుండి తన మాటల తో కధ ని ముందు నడిపించడం.
వీటన్నింటినీ రంగరిస్తే...., "జనరంజకం" అని గట్టిగా చెప్పుకోడానికి జస్ట్ జానెడు దూరం లో జామ్మ్ అయిపోయిన చిత్రం.. "జల్సా"
పార్ధూ
|
|