|
నిన్న హైదరాబాద్ airport లోని డ్యూటీ ఫ్రీ షాప్ లో ఒక టీ షర్ట్ కనపడింది.. దాని మీద "I survived
the great Indian experience" అని రాసి ఉంది. అది చూడగానే నా పరిస్థితిలోని వాళ్ళకోసమే అలాంటి
టీ షర్ట్ ని ఎవరో సృష్టించారు అనిపించింది. దానికి కారణం ఉంది.
నా రాతలు మీకు కొత్త కాకపోతే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది నేను చేసే తింగరి పనులు, టిపికల్
ఎర్రర్స్.
ఇండియా ఫ్లైట్ ఇంక సాయంత్రం ఆరింటికి అనగా ఆ రోజు పొద్దుట నాలుగింటికి లేచి బేగ్ ని సర్దాను.
అన్నీ సరి చూసుకోవటం మనకి ఎప్పుడూ అలవాటు లేదు. సాధారణం గా పాస్ పోర్ట్ కి సంబంధించిన xerox
కాపీలు ఉన్నాయి అనిపించిన ఒక కవర్ ని కూడా బేగ్ లో పెట్టాను. అన్నీ గంట లో అయిపోయింది సర్దటం
అని నాకు నేనే భుజం తట్టేసుకొని, ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఆరింటిదాకా చేసే ఘనకార్యం ఏముంది
ఇంట్లో ఉండి అని.
"OCI స్టిక్కర్ లేదు పాస్ పోర్ట్ లో?" అడిగారు అక్కడి అధికారి.
"స్టిక్కర్ ఉన్న నా పాత పాస్ పోర్ట్ వర్షం నీళ్ళలో పడి తడిసిపోయింది. అందుకని, కెనడా లో కొత్త
పాస్ పోర్ట్ ఇచ్చారు. కొత్తదానిలో స్తిక్కర్ transfer చేసుకోవటం అవలేదు. క్రితం సారి ఇండియా
వచ్చినప్పుడు ఎవరూ అది అవసరం అని అడగలేదు" అతను అడిగిన వరుస ప్రశ్నలకి వరుస సమాధానాలు ఇచ్చాను.
"లేదు OCI కి ప్రూఫ్ ఆ స్టిక్కర్. మీ దగ్గర ఉన్న booklet కేవలం supporting document. స్టిక్కర్
లేకుండా దానికి విలువ లేదు" చెప్పి నన్ను లోపల తన పై అధికారి దగ్గరకి పంపించారు.
అక్కడ సెల్వ రాజు అనే అధికారి, మేము రోజుకి ఇలాంటి కేసులు నాలుగైదు చూస్తూ ఉంటాం అంటూ నన్ను
అక్కడ ఉన్న కుర్చీ లో కూర్చోమన్నారు. అక్కడ నోటీస్ బోర్డ్ లో ఉన్న ఒక circular చూపిస్తూ, తను
ప్రస్తుతం చేయబోయే కార్యక్రమం వివరించారు. నాకు మూడు లోజులకి టెంపరరీ లేండింగ్ పర్మిట్ ఇస్తారు.
ఆ రోజు భోగి, మర్నాడు సంక్రాంతి (శనివారం, ఆదివారం కూడా) కనుక హైదరాబదు లోని ఫారినర్లు
రిజిస్టర్ చేసుకోవలసిన FRR ఆఫీస్ సోమవారం వరకూ శలవు. సోమవారం, నాకు ప్రస్తుతం వాళ్ళు ఇవ్వబోయే
వీసా ఆఖరి రోజు. ఆ రోజు ఎలాగైనా వెళ్ళి అక్కడ మీ వీసా మీరు ఇండియా లో ఉండే మిగిలిన పది రోజలకీ
వీసా extend చేసుకోవాలి. అది చేసి, 28 న రిటర్న్ రోజుకి ఇండియా వదిలి వెళ్ళిపోవటానికి ఏమీ
అభ్యంతరం లేదు అని అక్కడ నుండి Exit Certificate / No Objection Certificate (NOC) ఒకటి
తెచ్చుకోవాలి. అది లేకుండా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే అరెస్ట్ చెయ్యచ్చు.
మా అక్క వాళ్ళు హైదరాబాదు లో ఉంటారు. కానీ సంక్రాంతి ని అందరం కాకినాడ లో జరుపుకోవాలని ప్లాన్
చేసుకున్నాం. నేను డైరెక్ట్ గా రాజమండ్రీ వచ్చేస్తాను. మీరు నా కోసం భోగి మిస్ కావద్దు. మీరు
వెళ్ళిపోండి అని నేనే వాళ్ళని వెళ్ళిపోమన్నా. ఇప్పుడు హైదరాబాద్ లో మా వాళ్ళు కూడా లేరు. ఏం
చేయాలి అని ఆలోచిస్తూనే, అతను ఇచ్చిన మూడు రోజుల వీసా తీసుకొని (రూ.2000-00) హైదరాబాదు FRR
ఆఫీస్ వివరాలు నోట్ చేసుకొని ఇదేమిటీ ఇలా మొదలైంది వెకేషన్ అని బెంగ పడుతూ డొమెస్టిక్ ఫ్లైట్
డిపార్చర్ దగ్గరకి వచ్చాను.
అక్కడ నుండి కాకినాడ ఫోన్ చేసి వాళ్ళకి వివరాలు చెప్పాను. అమ్మ కాకినాడ వచ్చేయి, రేపు (ఆదివారం)
సాయంత్రం ఏదో ఒక విధం గా బయలుదేరి సోమవారం పొద్దుటికల్లా హైదరాబాదు తిరిగి వెళ్ళచ్చు అని
అన్నారు. కానీ బావగారు బస్, ట్రైన్, ఫ్లైట్ టికెట్లు అన్నీ అయిపోయాయి. అవి దొరకకే, తాము కారు లో
కాకినాడ వచ్చామనీ, కనుక నన్ను హైదరాబాదు తీసుకురావటానికి తను మర్నాడు సాయంత్రం హైదరాబాదు తిరిగి
వచ్చేస్తానని చెప్పారు.
బావగారికి శలవులు దొరకటం అరుదు. అసలు ఇండియా లో ఉండటం అరుదు. రాకరాక పండగ కి అందరూ సరదాగా
గడుపుదామని కాకినాడ వచ్చారు. నా కోసం వెనక్కి వచ్చేస్తారు అంటే .. మనసు ఒప్పలేదు. నా గురించి
వాళ్ళ వెకేషన్ పాడు చేయటం నాకు నచ్చలేదు. కనుక, లేదు, నేను ఈ రెండు రోజులూ హైదరాబాదు లో
ఉండిపోతాను, సోమవారం పని అయ్యాక ఎలా వీలయితే అలాగ కాకినాడ వస్తాను అని చెప్పాను. అయితే, బేగంపేట
ఎయిర్ పోర్ట్ లో ఆ FRR ఆఫీస్ ఉంది కనుక, అక్కడ దగ్గర్లో ఏదైనా హోటల్ లో నన్ను బుక్ చేస్తాను
అన్నారు బావగారు అక్కడ వున్న మిగిలిన దూరపు బంధువులు, లేక ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటానికి నా
ఇబ్బంది చెప్పేసరికి. ఒక రెండు గంటల తర్జన భర్జనలు అయ్యాక అక్కడ Fortune Select Manohar లో
ఉండటానికి నిశ్చయమయింది. రూమ్ లోకి వెళ్ళగానే ఇంటికి కాల్ చేసి, వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్
ఇచ్చి, ఆరు గంటలపాటు నిద్ర పోయాను.
నిద్ర లేచి, హైదరాబాదు లోని నా దగ్గరి స్నేహితురాలిని facebook లో కాంటాక్ట్ చేసి కాస్త తిని
మళ్ళీ నిద్ర / TV / తిండి / నిద్ర రొటీన్ తో ఆ రోజు అంతా గడిపాను.
ఆదివారం నిద్ర లేచేసరికి పొద్దుట అయిదు. నేను కాంటాక్ట్ చేసిన ఫ్రెండ్స్ నుండి ఎవరి నుండీ జవాబు
రాలేదు. రోజంతా హోటల్ లో ఉంటే ఆలోచనలతో బుర్ర వేడెక్కి పోతుంది. సరే, రామోజీ ఫిల్మ్ సిటీ ఎప్పటి
నుంచో చూద్దామని అనుకుంటున్నా. అనుకోకుండా వచ్చిన అవకాశం, ఉపయోగించుకోవాలి అని ఏడింటికల్లా
బయలుదేరి రామోజి ఫిల్మ్ సిటీ కి వెళ్ళాను. అక్కడ స్పెషల్ టూర్ పేకేజి విలువ రూ.1200-00 బస్ లో
నాతో పాటు ఇంకో పదిహేను మంది దాకా ఉన్నారు. మా బస్ లో ఉన్న గైడ్ మమ్మల్ని అక్కడ చూడవలసిన
ప్రదేశాలు అన్నీ తిప్పి నాలుగింటికి తిరిగి మమ్మల్ని ఎంట్రన్స్ దగ్గర అదే బస్ లో దింపుతారు. ఆ
రోజు Movie Magic అనేది టెక్నికల్ డిఫికల్టీస్ కారణం గా రెండు సార్లు వెళ్ళాల్సి వచ్చింది. మా
గైడ్ వాక్చాతుర్యం వలన ఆ రోజు ఆహ్లాదకరం గా గడిచింది. నా వీసా బాధలు అసలు గుర్తు లేవు ఆరు గాంటల
ప్రాంతం లో తిరిగి హోటల్ కి వచ్చేదాకా. హోటల్ కి వచ్చేసరికి రిసెప్షన్ లో అమ్మాయి మీ గురించి
చాలా ఫోన్ లు వచ్చాయి. మీ అమ్మగారు మీరు ఎక్కడకి వెళ్ళారో అని చాలా ఖంగారు పడుతున్నారు. వెంటనే
కాల్ చెయ్యమన్నారు అని చెప్పారు. అప్పుడు గుర్తు వచ్చింది నేను ఆ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ కి
వెళ్తున్నట్టు పొద్దుట వెళ్ళే హడావిడి లో అమ్మ కి చెప్పలేదని. వాళ్ళకి కాల్ చేసి, నేను బానే
ఉన్నాను అని భరోసా కలిగించి, ఇంకా ఇక్కడ US నుండి వచ్చిన కాల్స్ రిటర్న్ చేసి, టైమ్ చూసేసరికి
అర్థ రాత్రి అయింది దాదాపు. అప్పుడు ఆకలి అనిపించి క్రింద ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళేసరికి
అక్కడ ఉన్న డోర్ మాన్ అప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చినంత సంతోషం గా లోపలికి ఆహ్వానించారు.
నేను టైమ్ సెన్స్ లేకుండా, నా సెల్ లో SUDOKU ఆడుతూ భోజనం కెలుకుతుంటే విసుగొచ్చి కాబోలు అక్కడ
మేనేజర్ మేడమ్, మేము క్లోజ్ చేసే టైము అయింది, మీకు ఇంకా ఏమన్నా కావాలా? అని అడిగారు. అప్పుడు
టైము చూస్తే రాత్రి పన్నెండున్నర! త్వర త్వరగా కానిచ్చి రూమ్ కి వచ్చి మర్నాడు FRR ఆఫీస్ లో ఏం
డ్రామా జరుగుతుందో అని ఆలోచిస్తూ నిద్ర పోయే ప్రయత్నం చేసాను.
* * *
FRR ఆఫీస్ పాత (బేగం పేట) ఎయిర్ పోర్ట్ లో ఉంది. ఒకప్పుడు మహేష్ కొత్త సినిమా మాదిరి కళ కళలాడిన
ఆ బేగం పేట ఎయిర్ పోర్ట్ పరిసరాలు కొత్త శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కారణం గా ప్రస్తుతం 50 వ రోజు
దాకా అయినా ఎలాగోలా నడిపించాలి అన్నట్టు కేవలం 15 మంది ప్రేక్షకులతో రామరాజ్యం సినిమా
ఆడిస్తున్న మా కాకినాడ కమల్-వీర్ ధియేటర్ లా ఉంది. ప్రస్తుతం ఆ రోడ్ లో జాగ్గర్స్, వాకర్స్
ఉన్నారు అంతే. జనాలు అసలు రోడ్ పక్కన నడవాలి లేకపోతే హైదరాబాదు ఆటో వాళ్ళో వాళ్ళకన్నా భయంకరమైన
కారు ఆసామీలో వచ్చి గుద్దేస్తారు అనే భయం లేకుండా రోడ్ నడిబొడ్డున సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ
మరీ వెళ్తున్నారు ఉన్న ఆ ఒకటీ అరా జనాలు కూడా. ఆ ఆఫీస్ లో నేను వెళ్ళేసరికే అక్కడ ఇద్దరు చైనీస్
స్టూడెంట్లు, ఒక టాంజానియా పెద్ద మనిషీ చేతిలో thick ఫైల్స్ పట్టుకుని ఉన్నారు. అక్కడ ఉన్న
సెక్యూరిటీ గార్డ్ ని అడిగితే, ఆఫీస్ వాళ్ళు తొమ్మిదిన్నర - పది మధ్య లో వస్తారనీ, అంతవరకూ
అక్కడ కుర్చీ లో కూర్చోమనీ చెప్పారు. బయట ఉన్న వాళ్ళని అడిగాను.. పేపర్ వర్క్ కి ఎన్ని ఫోటోలు
కావాలి అని. మూడు అని ఒక అబ్బాయి చెప్పారు. పొద్దుట ఈ ఆఫీస్ కి వచ్చే ముందు online వెళ్ళి ఈ
ఫారినర్ రిజిస్ట్రేషన్ ప్రోసెస్ ఏమిటో చూసాను. proof of residence అన్నారు. అది ఈ రోజు కాకినాడ
నుండి ఎలా తేవాలా అని ఒక బెంగ ఎక్కడో తొలుస్తోంది. పాస్ పోర్ట్ కాపీలు ముందు రోజు హోటల్
రిసెప్షన్ లో అడిగితే, ఆదివారం కదా బయట అన్నీ మూసేసి ఉంటారు, పైగా ఇవాళ సంక్రాంతి కూడా కదా
అన్నారు. మరి మీ బిజినెస్ సెంటర్ లో కాపీ మిషన్ ఉందా అని అడిగాను. ఉంది కానీ కొంచెం ఎక్కువ
ఖర్చు అవుతుంది అన్నారు ఆ అబ్బాయి. ఎంత ఎక్కువ ఏమిటీ అని అడిగాను. కాపీ కి రూ.5-00 (బయట అయితే,
కాపీ కి రూ.1-00) అని చెప్పారు. సరే, చేసేది ఏముంది అని ఆ రేటు ఇచ్చి కావలసిన, నా దగ్గర ఉన్న
డాక్యుమెంట్ల కాపీలు తీసుకున్నాను.
అక్కడ వాళ్ళు కాపీలు మేము తీస్తాం మీ పాస్ పోర్ట్ మాకు ఇచ్చి వెళ్ళండి అన్నారు. నేను ఖచ్చితం
గా, ఏమీ అనుకోకండి. నా పాస్ పోర్ట్ ఇంకొకళ్ళకి నేను ఇవ్వను. కావాలంటే మీరే కాపీ తీయండి. కానీ
నేను పక్కన ఉండాల్సిందే అన్నాను. అక్కడ ఉన్న ప్రతీ వ్యక్తీ నా పాస్ పోర్ట్ తీసుకొని అందులోకి
తొంగి చూడటం చాలా చిరాకు వేసింది. అది టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. మనది, వేరే వాళ్ళది అనే తేడా
లేదు. మన చేతికి వచ్చిన ప్రతీదీ మనం చూడచ్చు అనే అతి చొరవ! వాళ్ళు అది దురుద్దేశం తో చేసి
ఉండకపోవచ్చు, కేవలం ఆ boundaries మీద అవగాహన లేకపోవటమే అవచ్చు.
FRR ఆఫీస్ నుండి బయటకి వచ్చి, అక్కడ ఉన్న ఫోటో స్టూడియో లో రెండు నిమిషాల్లో పాస్ పోర్ట్ ఫోటో
లు తీసుకొని మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాను. వెళ్ళేసరికి అందరూ వచ్చారు. అక్కడ ఉన్న information బూత్
లో వెళ్ళి నా కధ చెప్పాను. అక్కడి వ్యక్తి తనకి తెలుగు రాదని నన్ను మధ్య లో ఆపారు. మళ్ళీ కధ
ఆంగ్లం లో చెప్పాను. రెండో సారి కధ చెప్పతుంటే నాకొచ్చిన కష్టాలకి కొంచెం ఎక్కువే బాధ వేసి
గొంతు జీర బోయింది. అది ఆయన విని, నేను బాధ పడటం చూసి ధైర్యం చెప్పారు. "మీ లాంటి వాళ్ళు ఈ మధ్య
చాలానే వస్తున్నారు. ఆ స్టిక్కర్ లేకపోతే రానివ్వటం లేదు గత రెండు మూడు వారాల నుండి." అని
చెప్పి, ఒక చిన్న చెక్ లిస్ట్ ఇచ్చారు. పాస్ పోర్ట్ కాపీ, మూడు ఫోటోలు, హైదరాబాదు లో ప్రూఫ్ ఆఫ్
రెసిడెన్స్.. ఆయన ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అనగానే చెప్పాను.. నేను ఉండేది కాకినాడ లో. కనుక,
హైదరాబాదు లో ఎవరూ లేరు ప్రస్తుతం అని. మీరు మరి ఎక్కడ ఉన్నారు? అడిగారు. హోటల్ లో అని
చెప్పాను. జనవరి 28- మీ రైటర్న్ జర్నీ దాకా మీరు ఎక్కడ ఉంటున్నారు అనే ప్రూఫ్ కావాలి. ఎవరైనా
ఫ్రెండ్స్ లేరా, ఈ రెండు వారాలు మీరు తమ దగ్గర ఉంటున్నారు అని అఫిడఫిట్ ఇవ్వడానికి? అడిగారు.
ఉన్నారు కానీ, నేను హైదరాబాదు లో ఉండను. వాళ్ళు అలా అఫిడఫిట్ ఇవ్వడం వాళ్ళకీ నాకూ కూడా రిస్కీ
కదా? అడిగాను.
టెక్నికల్ గా అది లీగల్ కాదు. కానీ, లీగల్ గా వెళ్ళాలంటే, మీరు కాకినాడ లో SP ఆఫీస్ కి వెళ్ళి,
అక్కడ వాళ్ళ దగ్గర ఇవాళ సాయంత్రం లోపల రిజిస్టర్ చేసుకోవాలి, 28 వ తారీఖున మీరు ఇండియా వదిలి
వెళ్ళడానికి ఏ అభ్యంతరం లేదని No Objection Certificate (NOC) / Exit Certificate తెచ్చుకోవాలి.
మీరు US వెళ్ళిన వెంటనే, మీ కొత్త పాస్ పోర్ట్ లో OCI స్టిక్కర్ వేయించుకోవాలి. చెప్పారు. అది
చెప్పి.. కానీ.. పోలీస్ ల తో పని అంటే... అంటూ జాలి గా నా మొఖం చూసారు.
నాకు ఆ జాలి చూపులకి అర్థం అప్పుడు తెలియలేదు. ముందున్న ముసళ్ళ పండగ గురించి కొంచెం అయినా అంచనా
లేకుండా, కాకినాడ వెళ్ళిపోవచ్చు అయితే ఇవాళ అని అతను చెప్పిన Best of Luck ని అయినా సరిగా
రిజిస్టర్ చేసుకోకుండా హోటల్ కి పరిగెత్తాను. మరొక రెండు గంటల్లో రాజమండ్రీ వెళ్ళే ఫ్లైట్ లో
టికెట్ దొరకటం, హోటల్ ఖాళీ చేసి, ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాను. అక్కడ Spicejet కౌంటర్ లో అబ్బాయి
నన్ను చూసి, మీ వీసా ప్రోబ్లెం సాల్వ్ అయిందా అని అడిగారు. రెండ్రోజుల క్రితం, నా రాజమండ్రీ
ఫ్లైట్ కేన్సిల్ చేయటం ఆ అబ్బాయే చూసారు. లేదు.. కధ కాకినాడ కి మారబోతోంది అని అతనికి చెప్పి
ఫ్లైట్ బోర్డింగ్ పాస్ తీసుకున్నాను.
|